కేరళ(లో)కేరింతలు మొదటి భాగము
పంచామృత ధారలలో,పంచభూత సంగమములో, పంచేంద్రియ పరిష్వంగమును
అనుభవించిన వారిదే భాగ్యము.చూడని వారికి సున్నాలు కాకూడదనే నా ఈ చిన్ని ప్రయత్నము."సర్వేంద్రియాణాం నయనం ప్రధానం".దాని వినయమేగా నాకందించ గలిగినది సౌందర్య నిధానము."కన కన రుచి(కాంతి)రా అన్నట్లు అన్నివయసుల వారి మనసులను కొల్లగొట్టినది కేరళ కుట్టి.
అమ్మా అవనీ నేలతల్లీ అని ఎన్నిసార్లు పిలిచినా తనివితీరదెందుకో..
బాపూ గీతలా బాపురే అనిపించే మెలికల కులుకులతో,బండరాయిని కాను నేను,నిండుమనసున్న నీ అండను అనిపించే ఘాట్రోడ్లు కంటికి ఇంపుగా వంపులతో మురిపిస్తుంటే,చిరుగాలుల సవ్వడులు వీనులకు విందును చేస్తూ పయనిస్తున్నప్పుడు ఆనందడోలికలను ఊగిస్తుంటే,లెక్కలేనన్ని సుందర పుష్పాల సువాసనలతో పిలాగాలి తెమ్మెరలు అల్లరిచేస్తుంటే చర్మము తన ధర్మముగా నిక్కపొడిచి చూస్తుంటే,ముక్కు మనమదిలో పదిలముగా చెక్కుతోంది.చిన్నబుచ్చుకుందపు డు చిత్రాల నాలుక (నాలుగు) తనను వెనుకకు పడేసి గోలచేస్తున్నయని.అది గుర్తించిన ఆ నేల "నాలుకా నీకు నాపై అలుకా"వద్దమ్మా అంటూ "ఆచార్య దేవో భవ"అంటూ అక్షరాస్యతను సాధించిన నేర్పుతోనే
"అతిధి దేవో భవ" అంటూ అమృత భాండమై,నాలుకను పంచేంద్రియ ఏలికను చేసింది అబ్బురపు కొబ్బరిబోండం.
పంచేంద్రియములతో పాటు పరవళ్ళ పరుగు కొనసాగుతుంది.