Friday, July 14, 2017

SRI TANIKELLA DASABHARANI-2.

శ్రీ తనికెళ్ళ భరణిగారికి నమస్కృతులతో.
నీలోన శివుడు గలడు-----దాగి
నెనరు దీవించగలడు.
1."ఎందరో మహానుభావులు" నిన్ను, అందరిలో ఒకరిగా
అందించాడు వందనీయ రామలింగేశ్వరుడు.
2."నక్షత్రము" నీవని,"నక్షత్ర దర్శనము"ను చేయిస్తావని
"దశ భరణి" అని నామకరణమును చేశాడు ఆ నాగాభరణుడు.
3.మిక్కుటమగు ప్రేమతో చిక్కులను విడదీస్తు
"కుక్కుటేశ్వరుడు" దాగి "కొక్కొరోకో" అన్నాడు.
4."శ్రీ రాళ్ళబండి" రూపములో రాళ్ళుతాకు బాట అను
"గ్రహణము" విడిపించాడు అనుగ్రహము కలవాడు.
5."స్త్రీ దుస్తుల దర్జీ" గా "పరికిణి" నువు కుడుతున్నప్పుడు
సున్నితపు సూదియైనాడు ఆ బూదిపూతలవాడు.
6."శివ" అని వినబడగానే శుభములు అందించుటకు
ఘంటము తాను ఐనాడు కంట మంటలున్నవాడు.
7."అర్థనారీశ్వరపు ఒద్దిక" అను "మిథునము" నకు
తోడై నడిపించాడు నిన్ను ఆ మూడుకన్నుల వాడు.
8."గార్దభ అండమును"కోరు మాయను మర్దింపచేసి
ఆర్ద్రత నిలిపాడు నీలో "ఆట కదరా శివా" అని అంటూ
9."యాస" ఉన్న బాసలో "శభాష్ శంకరా" అనబడ్తివి
నీ రంధిని మార్చేసిండు గమ్మున ఆ నిధనపతి.
10."చల్ చల్ గుర్రం" అనే చంచలమైన మనసుకు
మంచి బాట వేస్తున్నడు ఆ మంచుకొండ దేవుడు.
11.పసిడి మనసు, పసివయసులోనే ముసలివైన నీతో
"త్వమేవాహం" అంటున్నాడురా ఓ తనికెళ్ళ భరణి.
12.కామేశ్వరి పతి వాడు,కామితార్థమీయ గలడు
కదలకుండ ఉంటాడు కరుణను కురిపిస్తాడు.
శతమానం భవతి- శుభం భూయాత్.. ****

SREE TANIKELLA DASA BHARANI.-1

  విశిష్ట వినయ విద్వత్తుకు మోకరిల్లుతూ
  *******************************
నిత్య కళ్యాణమైన
ఆ,సత్యలోకమునందు
దివ్యసుతుని కోరె వాణి
చతురతతో చతుర్ముఖుడు చేసినాడు వీణ్ణి
........................
గణనాథుని కనికట్టుతో
ఘనత కట్టబెట్టగా
సరసిజాక్షి,సరస్వతి
సరసను కూర్చుండబెట్టుకుని
సారస్వతామృతమును వరుసగ తినబెట్టెనేమొ
..............
ఆనందపు ఆలినిగని,సుతు
దరిచేరె, విరించి నాడు
గారపు ఆలింగనతో
వేదసారము గ్రహియించె వీడు
..........
అపహరణము నేరమనుచు
మందలించె అమ్మ నాడు
భవతరణము అనుచు *మాటల నాంది*
వేసినాడు నాడే చూడు.
..........
వీని కులుకు పలుకు నేర్వ తన
చిలుకనంపె చదువులమ్మ,దాని
*అభినయనము*ను దోచె
వినయముగా...ఒద్దికగా
..........
వల్లమాలిన వలపుతో నీ
నీ దరిచేరింది వాణి వల్లకి
నిను గెలుచుట వల్లకాక,మోసింది
నీ సాహిత్యపు పల్లకి
...........
క్షీర,నీర నీతి చేరిన ఆ హంసను
ఏమార్చి నీ ప్రశంసగా మార్చావు
..............
నీ అల్లరి భరించలేక నిను
చల్లని కొండకు పంపగా
*శభాష్..శంకరా*అని ఆనందివై
ఆ నందిని ఏమార్చావు
........
గురుతెరిగి గరుడుడు రయముగా
పరుగులిడె
.......
ఇవి..నీ..లిపి..పరిహాసములా
చిలిపి దరహాసములా
రమణీయ కవీంద్ర
తనికెళ్ల భరణీంద్ర
............
ఈ అమృతానంద విభావరి
కొనసాగనీ మరీ..మరీ

SREEPATI PANDITAARAADHYULA BAALASUBRAHMANYAM GARU.

                  మంగళం మహత్
                  *******************
 హాయి హాయి హాయి వెన్నెలమ్మ హాయి హాయి హాయి హాయి
 తీయ తీయనైన పాటపాడనీయి బాధపోయి రానీ హాయి
    అంటున్న గాన గంధర్వుని జన్మదినం మనకు సుదినము,

  బాలుగారు బహుశా....
.
  శకుంతములు నేర్పాయి సుస్వరములు శుభాంగికి
 మీ ఆలాపన ప్రారంభం ..ఆ  గర్భగుడిలో

 హరికథలు అందించినవో సుధలను ఆ.సాంబునికి
 మీ సాధన సాకారం ..ఆ  మాధవ మాసములో

 సీమంతపు ఆశీసులు మంత్రించినవో శిశువుని
 మీ గాత్రపు సొబగులు ఆ  నాడుల సవరింపులో

 జననపు జవ్వాజులు పంచమస్వర కోకిలకి
 మీ స్వరముల సరిగమలు  ఆ  ఆమని రాకలో

 నామకరణ శ్రీకరములు నారద తుంబుర పాటకి
 మీ ఉంగాల రాగములు ఆ నాదోపాసనలో

 అన్నప్రాసపు జన్నముల పున్నెములు శిక్షణకి
 మీ బహుముఖ ప్రజ్ఞాపాటవము ఆ  అమృతోత్సవములో

 అక్షరాభ్యాసపు లక్షణపు అక్షింతలు దక్షతకి
 మీ పండితారాధ్య పట్టాలు ఆ స్నాతకోత్సవములో

 అర్థాంగి కుటుంబము ఆసరగ యజమానికి
 మీ ఆత్మీయపు ఆస్తులు ఆ గృహస్థాశ్రమములో

 అభ్యాసపు స్వరవరములు అహర్నిశల శ్రామికునికి
 మీవైన ప్రశంసలు ఆ అభిమాన నందనములో

 అభిననల అలరింపులు అల్లరి తాతయ్యకి
 జిలిబిలి మనవళ్ళ,మనవరాళ్ళ  ఆ సుతిమెత్తని ఉయ్యాలలో

 ఆయురారోగ్యములు,అష్టైశ్వర్యములు అనుగమించని
 మీ ఆనంద జీవితాన  ఆ ఆదిదంపతుల అవలోకనములో....వినబడనీ
 .........
" శతమానం భవతి..శతాయుష్ పురుషస్య వేంద్రియే ప్రతితిష్ఠతి."

.

SREEPATI PANDITAARAADHYULA BAALASUBRAHMANYAM GAARU-2

 పత్రం,పుష్పం,ఫలం,తోయం
*********************************
1.నాగుల తలలూగించే నారద తుంబుర గానమునకు
  నాగవల్లి పత్రములో ముత్యము కస్తురి నుంచి
  వీనుల విందు చేయమని వినతి పత్రముతో నే వస్తే
  నీ ప్రశంసాపత్రములు వినయముగా నన్ను పలుకరించె
................
2.శారదా లబ్ధమైన శ్లాఘనీయ శబ్దమునకు
  శబ్ద,స్పర్స,రూప,గంధ,రస సంపత్తి పూల నుంచి
  మంగళకర గళమునకు కైదండలు నే వేయ వస్తే
  నీ పద్మములు మృదు సంభాషణలుగా నన్ను పలుకరించె
..........................
3.ప్రతిఫలమును కోరని పండిత ఆరాధ్యునకు
  ప్రతి,ఫలము  దోరగ పండిన మధురిమలనుంచి
  ఈప్సిత ఫలమునకై తపస్సులా నే వస్తే
  నీ పండిన సంస్కారము పండుగగా నన్ను పలుకరించింది

  .ఆప్తుడైన  సప్తస్వర సంధాన కర్తకు 
  సప్తసాగరాలను తోయముగా ఊహించి
  అర్ఘ్య,పాద్య రూపాలని మూర్ఖతతో నేను వస్తే
  నీ తోటివారిపై కరుణ తోయదమై నన్ను పలుకరించె
...............................
5.స్వచ్చందపు రూపమైన స్వచ్చత రాయబారమునకు
  ప్రచ్చన్నతలోనున్న ఉచ్చత్వమును గమనించి
  ముందు వెనుక చూడలేని  మందమతిగ నేను వస్తే
  నీ నందుల సందోహము ఆనందముగా నన్ను పలుకరించె
...............
 మనిషిగ నే వచ్చి ఓ మనీషిని దర్శించా
 రాగము వినదలచి వచ్చి జీవనరాగమునే తెలుసుకున్నా

 వినవలసినది పదనిసలు  మాత్రమే కాదని,పరిణితి చెందుటకు పదమని
 ప్రగతి పథము ఆశిస్తా,ప్రతి గతిలో శ్వాసిస్తా.

SREEPATI PANDITAARAADHYULA BALASUBRAHMANYAM GARU-1

చంద్రునికో నూలుపోగు.
శ్రీవాణి ముద్దుబిడ్డ చిరంజీవ శ్రీపతి
ప్రణవనాద ఉద్దండ సుఖీభవ పండిత
స రి గ మ ప ద ని అను సప్తస్వర ఆరాధ్యుల
శకుంతల- సాంబమూర్తి దంపతుల గారాబాల
సుస్వరాల-శుభగుణాల సుపుత్రా! సుబ్రహ్మణ్యం
జయీభవ!!!! విజయీభవ!!!
ఆజానుబాహువుల అతిశయమెరుగని రూపం
ఆ నారద-తుంబురుల సంగీతపు ప్రతిరూపం
ఆ గళము స్వరములతో గారడీలు చేస్తుంటే
నమ్మరుకాని అది అమ్మచేతి గోరుముద్ద
ఆ పలుకులు బహుముఖముల గమ్మత్తులుచేస్తుంటే
అచ్చంగా నాన్నవీపుమీద చేయు సవారీ
నవరస నవోన్మేష నటనను కనపరుస్తుంటే
చెంగు-చెంగు ఎగురుచున్న తువ్వాయి గంటలు
కొప్పరపు కవులను మెప్పించిన వివరణలు
చప్పుడుగాకుండా చప్పరించు పిప్పర్మెంట్లు
అర్థశతాబ్దపు పాటల ప్రపంచ ప్రస్థానము
జైత్రయాత్ర ఎగరేసిన జాతీయ పతాకము
శతవసంత మూర్తిమత్వ సినిమా పురస్కారము
శతమానం భవతి అను శుభ ఆశీర్వచనము
ముందు-ముందు రాబోవు సందడి సందర్భములు
మా అందరిని ఊరించే చెట్టుమీది దోరపండ్లు
మీ విజయకీర్తి కేతనము వినువీధిని ముద్దాడుతుంటే
మీ వినయమూర్తి తొణకని నిండుకుండై నేలను ముద్దాడుతోంది
"చంద్రునికో నూలుపోగు-మన బాలుగారు సిరుల తులతూగు.""
పుట్టినరోజు శుభాకాంక్షలు

TANOTU NAH SIVAH SIVAM-12

    తనోతు నః శివః శివం-12   *****************   "  వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే      జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...