పత్రం,పుష్పం,ఫలం,తోయం
1.నాగుల తలలూగించే నారద తుంబుర గానమునకు
నాగవల్లి పత్రములో ముత్యము కస్తురి నుంచి
వీనుల విందు చేయమని వినతి పత్రముతో నే వస్తే
నీ ప్రశంసాపత్రములు వినయముగా నన్ను పలుకరించె
................
2.శారదా లబ్ధమైన శ్లాఘనీయ శబ్దమునకు
శబ్ద,స్పర్స,రూప,గంధ,రస సంపత్తి పూల నుంచి
మంగళకర గళమునకు కైదండలు నే వేయ వస్తే
నీ పద్మములు మృదు సంభాషణలుగా నన్ను పలుకరించె
..........................
3.ప్రతిఫలమును కోరని పండిత ఆరాధ్యునకు
ప్రతి,ఫలము దోరగ పండిన మధురిమలనుంచి
ఈప్సిత ఫలమునకై తపస్సులా నే వస్తే
నీ పండిన సంస్కారము పండుగగా నన్ను పలుకరించింది
.ఆప్తుడైన సప్తస్వర సంధాన కర్తకు
సప్తసాగరాలను తోయముగా ఊహించి
అర్ఘ్య,పాద్య రూపాలని మూర్ఖతతో నేను వస్తే
నీ తోటివారిపై కరుణ తోయదమై నన్ను పలుకరించె
.............................. .
5.స్వచ్చందపు రూపమైన స్వచ్చత రాయబారమునకు
ప్రచ్చన్నతలోనున్న ఉచ్చత్వమును గమనించి
ముందు వెనుక చూడలేని మందమతిగ నేను వస్తే
నీ నందుల సందోహము ఆనందముగా నన్ను పలుకరించె
...............
మనిషిగ నే వచ్చి ఓ మనీషిని దర్శించా
రాగము వినదలచి వచ్చి జీవనరాగమునే తెలుసుకున్నా
వినవలసినది పదనిసలు మాత్రమే కాదని,పరిణితి చెందుటకు పదమని
ప్రగతి పథము ఆశిస్తా,ప్రతి గతిలో శ్వాసిస్తా.
No comments:
Post a Comment