సౌందర్య లహరి-వజ్ర ప్రాకారము
పరమ పావనమైన నీ పాదరజ కణము
పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము
లేశపు మాత్రపు కరుణ విశేష అనుగ్రహముగాగ
అమ్మను సేవించుచున్న అదృష్టశాలులెందరో
వికచాంబోరుహ నయనములకు కాటుకనందించుచున్నారు
ప్రస్తుతులతో తల్లికిసుగంధ కస్తురినలదుచున్నారు
దీవెనల బలముతో వీవనలు వీచుచున్నారు
పెద్ద సౌభాగ్యమంటు అద్దమునుచూపుచున్నారు
పాద సంవాహనముతో పావనమగుచున్న,ఆ అద్భుత
వజ్ర ప్రాకారములో మహారాజ్ఞిని కొలుచుచున్న వేళ
నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
మానస విహారి ! ఓ సౌందర్య లహరి.
అత్యంతవైభవోపేతమైన మణిభవనములు,వాని ముందు ఎన్నో కోట్ల మైళ్ళ దూరమువరకు గల అసంఖ్యాక అశ్వములు-గజములు-రథములు-వాహనములు కొలువుతీరిన అమ్మవారి సైరంధ్రీ జనము
(అమ్మను అలంకరించు చెలికత్తెలు-పరిచారికలు అనలేము)వారి పూర్వ జన్మపుణ్యఫలముగా అపూర్వ సేవాసౌభాగ్యమును పొందియున్నారు.కొందరు సత్వ-రజో-తమోరూపముకన్ను అని చర్చించుకొనుచు చల్లనికాటుకను తయారుచేసి,అమ్మవారికి అందించుచున్నారు.సాక్షాత్తుచంద్రుని కన్నుయందు నిలుపుకొనిన తల్లికి చల్లదనమునకై కాటుకను తయారుచేసి అందించుట వారిభక్తితత్త్వమును చాటుచున్నది.మరికొందరు విశాలఫాలభాగమున శోభాయమాన కస్తురిని అలదుచున్నారు.కస్తురి మృగపుణ్యమేమో తల్లి నుదుటను తాను సుగంధముగా ప్రకాశించుతోంది.కొందరు పట్టుచీరలను-కంచుకములనునేసి పట్టరాని సంతోషముతో తల్లికి చుట్టబెట్టుచున్నారు.ఆభరణములతో,అందమైన సుగంధద్రవ్య భరిణెలతో ,మువ్వలతో,అలంకరణలను అర్చనకు ఆత్రుతగా నున్నారు.మరికొందరు తల్లికి రకరకములైన (తాటాకు-తామరాకు-వింజామర) విసనకర్రలతో వీచుచున్నారు.చమరీమృగమా ధన్యతనొందితవి వింజామరగా పరిణితినొంది.
అమ్మ పరిచర్యలకై వజ్రప్రాకారములోని వ్రజముతో పాటు నేను తల్లిని సేవించుచున్నసమయమున,చెంతనే నున్న నా చేతిని విడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు.