" జానక్యా: కమలా మలాంజలి పుటే యా: పద్మరాగయితా:
న్యస్తా రాఘవ మస్తకేచ విలసత్ కుంద ప్రసునాయితా:
స్రస్తా: శ్యామల కాయకాంతి కలితా: యాఇంద్ర నీలాయితా:
ముక్తాస్థాం శుభదాం భవంతు భవతాం "శ్రీరామ వైవాహికాం"
రారా మాఇంటి దాక ! సీతారామా
**********************************
స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధి నామ సంవత్సర
చైత్ర శుద్ధ నవమి, బుధ వారము 177_04-2024,
ఉదయము గంటలు 11-30 నిమిషాలకు,
ఆశ్లేష నక్షత్ర యుక్త
మిథున లగ్న పుష్కరాంశ
సుముహూర్తమున
యస్.బి.ఐ కాలనీ - కొత్తపేట్ లో
భక్తాగ్రేసరులచే
లోక కళ్యాణా రార్థము దిగ్విజయముగా /కన్నులపందుగగా జరుగుచున్న,
శ్రీ సీతారామ కళ్యాణములో
**************************
తరియిస్తున్నాడు భద్రుడు తాను పెళ్ళివేదికగా
జటాయువు వేస్తున్నది పందిరి ఆకాశమంత
వసతులు చూస్తున్నాడు స్వయముగా వాల్మీకి
అతిథులను స్వాగతిస్తున్నాడు ఆదరముతో సుగ్రీవుడు
కుశలము అడుగుతున్నాడు మర్యాదగ కుబేరుడు
ఇంతలో
మంగళ హారతినిస్తూ, మంగళ స్నానాలకై
పదపదమని వారిని పంపింది పరవళ్ళ గోదావరి
"మగపెళ్ళివారము మేము" అంటూ అహల్య
పరమ పావనపాదము అనుచు పారాణిని అద్దింది
రఘువంశ తిలకుడు అని కళ్యాణ తిలకమును దిద్దింది
రామచంద్రుడీతడని బుగ్గ చుక్క పెట్టింది
అంతలో
"ఆడ పెళ్ళివారము మేము" అంటూ మొల్ల
వేదవతి పాదము అని పారాణిని అద్దింది
పతివ్రతా తిలకము అని కళ్యాణ తిలకమును దిద్దింది
చక్కని చుక్క సీత అని బుగ్గ చుక్క పెట్టింది.
ఆహా.... ఏమి మా భాగ్యము
**********************
" ఎదురుబొదురు వధూవరులు ముగ్ధ మనోహరము
తెరసెల్ల మధ్యనుంది చెరొక అర్థ భాగము."
ప్రవర చదువుతున్నారు వశిన్యాది దేవతలు
ప్రమదమందుచున్నారు పరమాత్ముని భక్తులు.
వివాహ వేడుకలను వివరించుచున్నారు విశ్వనాథ
ఎన్నిసార్లు వినియున్నా తనివితీరని కథ.
" మాంగల్యం తంతు నానేనా-లోక కళ్యాణ హేతునా"
పట్టరాని సంతోషము మ్రోగించె గట్టిమేళము
రాముడు కట్టిన సూత్రముతో మెరిసినది సీత గళము
తలపై పట్టు వస్త్రములతో, ముత్యాల తలంబ్రాలతో
తరలి వస్తున్నారు తానీషా వారసులు.
సుమశరుని జనకునకు సుదతి సీతమ్మకు
శుభాకాంక్షలై కురిసెను సౌగంధిక సుమములు.
వానతోడు తెచ్చుకున్న హరివిల్లు తళుకులుగా
హర్షాతిరేకముగా విరబూసెను తలంబ్రాలు.
"ఒకే మాట, ఒకే బాణం ఒకే పత్ని" రామునకు అని
మురిసిపోతున్నారు ముందు వరుసలోని వారు.
ఒడ్డుకు చేర్చు దేవుడని తెడ్డుతో నున్న గుహుడు
వెంట వెంట కదలాడే బంటురీతి హనుమంతుడు
నారాయణుడితడంటు నారదునితో విభీషణుడు
ఆశీర్వచనము చేస్తూ ఆ విశ్వామిత్రుడు
దండము పెట్టేనురా కోదండపాణి చూడరా అని అండజుడు
సీతమ్మకు చింతాకు పతకమునిస్తూ రామదాసు
మా జానకిని చెట్టపట్టగానే మహరాజు వైతివని మేలమాడు
త్యాగరాజు.
సీతా రాముల పెళ్ళంట- అంగరంగ వైభోగంగా
చూసిన వారికి పుణ్యాలు అంటూ అందరూ
తమని తాము మరచిపోతుంటే,
"శ్రీరామ "అను చిలుక సేసలు అందిస్తోంది
పందిరిలో పరుగిడుతూ సందడిగ బుడత ఉడుత
అక్షింతలు అందరి తలలపై వేసుకోమంటున్నది.
పానకమును అందిస్తున్నారు సనక సనందనాది మునులు
ప్రసాదము అని వడపప్పును పంచిపెడుతున్నారు
చూడ చక్కని జంట అని చూపు తిప్పుకోలేక పోతున్నామన్న
మాటలు వినబడి
" వారికి దిష్టి తగులుతుందేమోనని"
సూక్ష్మ బుద్ధితో వెంటనే అదిగో అటు చూడండిరా
సీతా రాములు
అలిసిపోయి ఉన్నారని వారికి ఆకలి అవుతున్నదని
పండ్లను తినిపిస్తున్నది పండు ముసలి ఆ శబరి.
శబరిలాగ మారి మనము శరణువేడుకొందామా
ఆ సీతా రాములను,
"రారా మాఇంటిదాకా"- అని త్రికరణముల శుద్దిగా.
శ్రీ రామరక్ష సర్వజగద్రక్ష