Wednesday, February 28, 2018

SAUNDARYA LAHARI-23

 స్మరణ భక్తి

 పరమపావనమైన  నీ పాదరజకణము
 పతిత పాలకమైన  పరమాత్మ స్వరూపము

 చపలత్వముతో ఎగురుచున్న చేపవంటి నన్ను చూస్తూ
 కపటత్వముతో మింగనున్న  కొంగనుండి రక్షిస్తూ

 తప్పుడు పనులనే మునుగుతున్న ఉప్పెనలో నన్ను చూస్తూ
 చెప్పరాని దయతో తేలుతున్న  తెప్పవేసి  రక్షిస్తూ

 పాతాళములోని సుడిగుండములో  నన్ను చూస్తూ
 మాతవై  పడనీయక పైకిలాగి  రక్షిస్తూ

 వీక్షణమాత్రమైన పాదధూళి విస్తారణ కరుణగా
 విస్మయ పరచుచు నాలో  స్మరణభక్తియైన వేళ

 నీ మ్రోలనే  నున్న  నా కేలు విడనాడకమ్మా,నా
 మానస విహారి  ఓ సౌందర్య లహరి.

" ప్రాతః స్మరామి లలితావదనారవిందం
 బింబాధరం పృథులమౌక్తికశోభినాసమ్ |
 ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యం
 మందస్మితం మృగమదోజ్జ్వలఫాలదేశమ్"
  ఆది శంకరాచార్య స్మరణభక్తి కనక ధారలనే వర్షించి అమ్మ దయను అనుభూతిగ మలిచినది.నిరాటంక-నిశ్చల-నిర్విరామ భగవత్ తపనయే,ఎప్పుడు తల్లి దర్శన-సంభాషణ-అనుగ్రహ రసానుభూతిలో మునకలు వేయుచుండుటయే స్మరణము.ఒక విధముగా ఇది అనుభవము యొక్క అనుభూతిగా అనవరతము అనందడోలికలను ఊగుతుంటుంది.

  " అడిగో రామయ్య నా ఆ అడుగులు నా తండ్రివి-ఇదిగో శబరి-శబరి వస్తున్నానంటున్నవి"స్మరణ బత్తికి పరాకాష్ఠ.పామరతగా పైకి తోచినను పండిన భక్తి కదా!

    మందార మకరంద మరందమును గ్రోలించిన ప్రహ్లాదునిది చిరస్మరణీయ భక్తి. సర్వకాల సర్వావస్థలలో సహచరించుచు,సత్వగుణ శోభితమై, సదాశివ స్వరూపిణిని రూప స్మరణము-భావ స్మరణము-తాదాత్మ్య స్మరణముతో తల్లిని సేవించుబారిని బ్రోచు సమయమున,చెంతనే నున్న నా చేతిని విడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు.   

SAUNDARYA LAHARI-22

కీర్తనము

 పరమ పావనమైన నీ  పాదరజకణము
 పతిత పాలకమైన  పరమాత్మ స్వరూపము

 పనులను చేయించుటకు పగటిపూట సూర్యునిగా
 అలసట తొలగించుటకు అమృతమూర్తి చంద్రునిగా

 ఆహారము అందించే ఆదిత్యుని రూపుగా
 ఆ జోలను తేలించే ఆ చంద్రుని చూపుగా

 కలతలు కనపడనీయని కాళికా రూపుగా
 మమతలు కరువు కానీయని మా తల్లి గౌరిగా

 అనవరతము ఏమరక అవనిలో అలరారుతున్న
 సూర్య-చంద్ర ప్రవర్తనలు సంకీర్తనములగు వేళ

 నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
 నా  మానస విహారి ఓ సౌందర్య లహరి.


 "రమా వాణి సంసేవిత సకలే
  రాజరాజెశ్వరి రామ సహోదరి"
  భగవంతుని గుణగణములను యశోపూర్వకముగా గానముచేయుట సంకీర్తనము/కీర్తనా భక్తి.వశిన్యాది దేవతల అనుగ్రహముతోనే కీర్తనము సాధ్యమగును.

  అమృత,ఆకర్షిణి,ఇంద్రాణి,ఈశాని,ఉషకేశి,ఊర్థ్వ,ఋద్ధిద,ౠకార,ఌకార,ఌఊకార ,ఏకపద,ఐశ్వర్య,అంబిక,అక్షర అను అమ్మ శక్తులు పదహారు రేకుల "విశుద్ధి చక్రము" యై కంఠమునందు,తక్కిన అక్షరములు వివిధచక్రములుగా ,అక్షర లక్షణములుగా భాసించుచున్నవి 

 ఉచ్చారణ విధానమును పరిశీలించినపుడు అక్షరములు హ్రస్వ-దీర్ఘ-ప్లుతములుగాను,తిరిగి ఒక్కొక్కటి,ఉదాత్త-అనుదాత్త-స్వరముగాను తొమ్మిది విధములుగా మారుతాయి.ఈ తొమ్మిది విధముల ఉచ్చారణ అను నాసికముగాను,నిరను నాసికముగాను (ముక్కు సహాయముతో-ముక్కు సాయములేకుండా) పలుకుచుండుట వలన తొమ్మిదిని రెండు తో హెచ్చవేసిన పద్దెనిమిది విధానములే అష్టాదశ శక్తిపీఠములు.(వివరించిన శ్రీ సామవేదము వారికి పాదాభివందనములు.)

   నారదుడు-తుంబురుడు,త్యాగయ్య,ముత్తుస్వాము దీక్షితారు,శ్రీ శ్యామ శాస్త్రి ఇలాఎందరో మహానుభావులు సంకీర్తనా భక్తులుగా చిరస్మరణీయులైనారు.

   తల్లి లక్ష్మి-సరస్వతులు స్తుతించుచుండగా విరాజిల్లుచున్నది.వారు రామ సహోదరి అని కీర్తించుచున్నారు.అంత ఉత్తమమైనదా రామ అను శబ్దము అను సందేహము వస్తే అవుననే అనాలి."రమయాతీత ఇతి రామః" అన్నారు పెద్దలు.రమింపచేయునది రామ అను పవిత్ర నామము.అదే లక్షణముతో తల్లి రాజరాజేశ్వరి " నామ పారాయణ ప్రీత్య" గా భాసిల్లుచున్నది.నామమును కీర్తించుటలో ఇక్కడ ప్రీత్ ఎవరికి కలుగుతోంది? మనకా లేక అమ్మకా? మొదట మనము అమ్మకు అనుకొంటూ క్రమేణా మనమే నామస్మరణలో ప్రీతిని ఆస్వాదించగలుగుతాము.అంతటి దయను వర్షించునది అమ్మ అని కీర్తించుచున్న భక్తులను అమ్మ అనుగ్రహించుచున్న సమయమున,చెంతనే నున్న నా చేతిని విడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు.   

SAUNDARYA LAHARI-21



  పరమ పావనమైన  నీ పాదరజ కణము
  పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము

 ముల్లోకములు నిన్నుముదముతో నుతియింప
 శుకములు పరుగిడుచున్నవి స్తుతులను వినిపించగ

 ప్రియముగ విని తాముయు పులకించవలెనని
 తరియించగలమని కర్ణముల తాటంకములు ఆడె

 ఆ కర్ణాంత నయనములు ఆ దారినే సాగగా
 అటు-ఇటు పోలేని అసహాయపు నయనము

 అందపు కెందామరాయె  చేరి నీ అనునయము
 హర్షాతిరేకముతో శ్రవణ భక్తియైన వేళ

 నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
 మానస విహారి! ఓ సౌందర్య లహరి.

 తను హృద్భాషలసఖ్యమున్, శ్రవణమున్, దాసత్వమున్, వందనా
ర్చనముల్, సేవయు, నాత్మలో నెఱుకయున్, సంకీర్తనల్, చింతనం
బను నీ తొమ్మిది భక్తిమార్గంబుల సర్వాత్ముడైన హరిన్ నమ్మి స
జ్జనుడై యుండుట భద్రమంచు దలతున్ సత్యంబు దైత్యోత్తమా!

అనగా భగవంతుని పూజింపడానికి అనేక విధాలైన మార్గాలున్నాయి.వాటిలోని శ్రవణభక్తి అనగా, మనదశ ఇంద్రియములోని చెవి ప్రధానముగా సహాయపడుతుంది."విష్ణునాకర్ణించు వీనులు వీనులు అని పోతనకవి చెవులు దైవ సంబంధమైన కథలను వినుట వలన ధన్యమవునన్నారు.వినవలెన్న వాకును అనుగ్రహించుటకు  మరొక ఇంద్రియమైన నాలుక సహకరించవలెను.వాక్కు-శ్రవణము పరస్పర ఆధారములై పరమేశ్వరిని సేవిస్తాయి.ఇదేవిధముగ దృశ్యము-నయనము,చర్మము-స్పర్శ,పరిమళము-నాసిక,ఆహారము-జిహ్వ పరస్పరము సహకరించుకొనుట మనకు తెలిసిన విషయమే.శ్రవణములో వాయువు కూడ ప్రధాన
వాహకముగా మారి,శబ్దమును వాయుతరంగములుగా తిరిగి శబ్ద తరంగములుగా సహాయము చేస్తుంటుంది.శ్రవణము వలనననే .పరిక్షిన్మహారాజు శుకయోగిచే వివరించబడిన శ్రీమద్భాగవత కథవలన ,కృతకృత్యుడైనాడట.

   అమ్మ మహిమలు అద్భుతకథలుగా ప్రతినోట ప్రణవమై వినబడుచుండగా అమ్మకు ఆ విషయమును తెలియచేయుటకు చిలుకలు కులుకులతో వస్తుండగా,అమ్మ చెవికి ధరించిన కుండలములు తామును వినిసంతసించవచ్చని పరవశమున కదులుతున్నవట.కుండలముల కులుకులను చూసిన అమ్మ రెండు నయనములు ( ఆ కర్ణాంతములు) చెవుల వరకు వ్యాపించసాగినవట.కాని మూసి ఉంచిన మూడోకన్ను,అటుఇటు కదలలేక స్తుతులను వినలేనన్న దిగులుతో నుండగా,అమ్మ అనునయముతో ,సంతసమున ఎర్రకలువగా వెల్లివిరియుచున్న సమయమున ,చెంతనే నున్న  నా చేతిని విడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు.(శ్రవణమునకై తహతహ లాడిన తల్లి త్రినయనము మనలను కాపాడు గాక)
  . 
  

SAUNDARYA LAHARI-20

  సౌందర్య లహరి-20

  పరమపావనమైన  నీ పాదరజకణము
  పతిత పాలకమైన  పరమాత్మ స్వరూపము

  బ్రహ్మాది దేవతలు బహువిధముల భజియింతురు
  ఋషి పుంగవులు నీ కృపకై తపియింతురు

  ముని గణములు అగణిత గుణగణములు కీర్తింతురు
  భాగవతోత్తములు పరవశించి నర్తింతురు

  సిద్ధ పురుషులు రససిద్ధిలో తేలియాడెదరు
  ఇష్టి చేయుచు కొందరు ,ఇష్టాగోష్టితో కొందరు

  ప్రవచనములతో కొందరు పరవశమగుచుందురు
  భగవతత్త్వము  బహువిధ భక్తోపచారములగు వేళ

  నీమ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
  మానస విహారి !ఓ సౌందర్యలహరి.

   భగవత్వము/భగవతత్త్వమునందు కల ఆసక్తిభక్తి అనబడును.అజరామరము,యశము,భోగము,అనురాగము,ఆశ్రిత రక్షణము నిర్గుణము,నిష్కళంకము మొదలగు శుభగుణములు కలది. స్వ్యంప్రకటితమగు భగవతత్త్వము స్వధర్మాచరణుల సాగ్త్యముగా మారుతుంది.స్వ-పర  విభేదములు లేని ఆత్మానంద స్థితికి ఆలవాలమవుతుంది.మననము చేయువారు మునులు.దర్శనము చేయగలవారు ఋషులు.పరబ్రహ్మము గురించి ఆనందానుభూతిలో మమేకమగువారు రస సిద్ధులు.సిద్ధించిన అనుగ్రహము కలవారు.కొందరు యాగములు(ఇష్టి) చేయుచు,మరికొందరు మంచిమాటలు ముచ్చటిస్తు,మరి కొందరు పామరులు సైతము పరమాత్మను తెలుసుకొనగల విధముగా ప్రవచనములను చేయుచు తమకు నచ్చినరీతిలో భక్తులుగా భగవతికి దగ్గరగా ఉండగలుగుతున్న సమయమున చెంతనే నున్న నా చేతిని విడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు.

  (భగవంతుని పొందడానికి భాగవతంలో నవవిధభక్తులు అనగా 9 రకాలైన భక్తి మార్గాలు చెప్పబడినాయి. ఇందుకు ప్రామాణిక శ్లోకం భాగవతంలోని ప్రహ్లాద చరిత్ర ఘట్టంలో ఉంది. ఆ శ్లోకం:

శ్రవణం కీర్తనం విష్ణోః
స్మరణం పాద సేవనం
అర్చనం వందనం దాస్యం
సఖ్యమాత్మ నివేదనం)

   జగజ్జనని దయతో  వాని గురించి తెలుసుకొనుటకు ప్రయత్నిద్దాము.

SSUNDSRYS LSHSRI-19

సౌందర్య లహరి-19
పరమ పావనమైన నీ పాదరజ కణము
పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము
నామది కొండకోనయైన వేళ గిరిజాదేవిగ
సంసారసాగరమున మునిగిన సాగరకన్యకగ
పెద్దయుద్ధ సమయమున కాళికా మాతగ
భయభ్రాంతమైనవేళ వారాహిదేవిగా
విచారములు తొలగించగ వైష్ణవి మాతగ
శత్రుసమాగమ వేళ ఆనందభైరవిగ
సర్వకాల సర్వ అవస్థల యందు సత్ చిత్ రూపిణిగా
సర్వ వ్యాపకత్వము సర్వ శక్త్యోపచారములైన వేళ
నీ మ్రోలనే నున్న నాకేలు విడనాడకమ్మా,నా
మానస విహారి ఓ సౌందర్య లహరి.
" నీ దరినున్న తొలగు భయాలు-నీ దయలున్న కలుగు జయాలు"
శక్తి స్థూల సూక్ష్మములుగా సమయానుసారముగా సకల్ శాంతి సౌఖ్యములను ప్రసాదిస్తు జగతిని పరిపాలిస్తు ఉంటుంది.అమ్మకు సమీపముగ (ఉప-సమీపము-చారము-చరించగలిగే సౌభాగ్యము) ఉండి సేవించుకొనుచు పరవశించు అదృష్టమే ఉపచారము.శక్తోపచారములు అనగా తల్లికి మన శక్తి కొద్ది చేసే సేవలు అనునది బాహ్యార్థము.కాని కొంచము నిశితముగా ఆలోచిస్తే అమ్మ మనము పరస్పరము ఒకరిదగ్గరగా మరొకరు వసిస్తు తాదాత్మ్యతను పొందే సుకృతము.
ఆది పరాశక్తి మన ఆకలికి ఆహారమై,శ్రమకు విశ్రాంతియై,చీకటికి వెలుతురై,రోగమునకు ఔషధమై,సమస్యకు పరిష్కారమై,కంటికి రెప్పయై కాపాడుచు,భక్తులను ఆనందపరచుటకై సర్వ ఉపచారములను అందుకొనుచున్న సమయమున,చెంతనే నున్న నాచేతిని విడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు.

TANOTU NAH SIVAH SIVAM-12

    తనోతు నః శివః శివం-12   *****************   "  వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే      జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...