ఆదిత్యహృదయము-శ్లోకము-23
**********************
ప్రార్థన
*****
" జయతు జయతు సూర్యం సప్తలోకైక దీపం
హిరణ సమిత పాప ద్వేష దు@ఖస్య నాశం
అరుణకిరణ గమ్యం ఆదిం ఆదిత్యమూర్తిం
సకలభువన వంద్యం భాస్కరం తం నమామి."
పూర్వరంగము
**********
ఆదిత్యుని విశ్వాత్మకునిగా-విశ్వరక్షకునిగా-
అగ్నిహోత్రునిగా-అగ్నికార్యమైన క్రతువుగా సంభావించిన అగస్త్య భగవానుడు ,పూర్వ శ్లోకములలోని ప్రతిపదము ఫలశృతియే యైనప్పటికిని,ప్రస్తుత శ్లోకము నుండి తదుపరి శ్లోకములను "ఫలశృతిగా/ఫలసిద్ధిగా"పరిగణిస్తారు దైవజ్ఞులు.
ఇంకొక విశేషమేమిటంటే అగస్త్య భగవానుడు,
"రామ రామమహాబాహో" అన్న శ్లోకములో రామచంద్రుని సంబోధనము తరువాత గుహ్యముగా చెప్పవలసినది పూర్తిచేసి,రాఘవ శబ్ద ప్రయోగముతో ప్రియతాత్మజ అని యుద్ధోన్ముఖుని చేసి యుద్ధరంగమును నిష్క్రమించినాడు.
పరమాత్మను విష్ణుస్వరూపునిగా భావించి,కొలిచేవారు,
"ఆర్తా విషణ్ణా-శిధిలాశ్చ భీతా
ఘోరేషుచ వ్యాధిషు వర్తమానా
సంకీర్త నారాయణ శబ్ద మాత్రం
విముక్త దుఃఖః సుఖినో భవంతు"
అని ఫలసిద్ధిని నొక్కి వక్కాణిస్తుంటే,
పరమాత్మను స్త్రీమూర్తిగా/అమ్మగాభావించి,స్తుతించేవారు,
" అనేన సదృశం స్తోత్రం న భూతం న భవిష్త్యతి
సర్వరోగ ప్రశమనం సర్వ సంపత్ ప్రవర్ధనం"
అని అమ్మ అనుగ్రహమును చాటుతోంది.
అదే విధముగా ప్రత్యక్ష నారాయణుని స్తుతి,
ప్రస్తుత శ్లోకములో,
శ్లోకము
******
"
" ఏనమాపత్ సుకృత్యేషు కాంతారేషు భయేషుచ
కీర్తన్ పురుషః కశ్చిన్ "నావసీదతి" రాఘవ."
ఏ తత్ స్తోత్రము మనము ఆపాదలలో నున్నను,స్థిమితముగానున్నను,స్వగృహములోనున్నను-భయంకర అరణ్యములో నున్నను పఠన ఫలితముగా మనలో "సమస్థితిని" కలిగించి స్థితప్రజ్ఞులుగా మారుస్తుంది.
"ఫలశృతి" చేతనులకు విష్ణు సహస్రనామములో చెప్పబడినట్లు ఉద్ధరణమునకై చెప్పబడుతుందికదా కాని సాక్షాత్ దశావతారములలో ఒకటియైన రామచంద్రమూర్తికి చెప్పిన శ్లోకములో ఉన్నదేమిటి? అన్న సందేహము కలుగ వచ్చును.
రామావతారము నరునిగా జన్మించి మెట్టు మెట్టు ఎదుగుతూ ధర్మనియమ పాలనతో దేవత్వమును పొందినది కనుక ఫలశృతి సమంజసమే అని కొందరు సనాతనులు,
అంతేకాక,
ఆదిత్యహృదయ స్తోత్రము రామునికి ప్రత్యక్ష ఉపదేశము చేస్తున్నట్లుగా అనిపించే ప్రపంచోద్ధరణమునకు పరోక్ష ఉపదేశము.
అందుకే ఆ యుద్ధమునకు సాటి ఆ యుద్ధమే.
ప్రస్తుత శ్లోకము ఆపదలో నున్నప్పుడు-భయములో నున్నప్పుడు,అని రెండు పదములను ప్రస్తావించినది.
ఒక సిద్ధాంతము ప్రకారము ఆపద వస్తుందేమోనన్న చిత్తవృత్తి భయము.
మరొక సిద్ధాంతము ప్రకారము భయము వ్యక్తిగతము.
విధ్యార్థికి పరీక్షాఫలితములు,రోగికి ఆరోగ్య నివేదికలు,రాజకీయ నాయకులకు పదవీ కాంక్షలు ఇలా అనేక విధములుగా ఒక్కొక్కరిలో ఆందోళనమును-భయమును కలిగించును.కాని అందరి భయము ఒకటి కాదు.
ఆపద విషయమునకు వస్తే అది తెలిసి రావచ్చును లేక అకస్మాత్తుగాకూడా రావచ్చును.అదిఒక నిర్ణీత ప్రదేశమును (వరదలు-భూకంపములు-క్షామములు మొదలగునవి) గురిచేయవచ్చును లేదా సమస్తమును (కరోనా) వణికించవచ్చును.
మరొక ముఖ్యమైన విషయము ఆదిత్యహృదయ స్తోత్రము రెండు పదములతో చెప్పవలసిన సూక్ష్మమును చెబుతున్నది.
అవి
1 నాశయత్యేష వైభూతం
2.నావసీదతి.
ప్రపంచ విషయాసక్తతను నశింపచేస్తుంది.
తత్ఫలితముగా
నావసీదతి అంటే మనలను బంధవిముక్తులను చేస్తుంది అని సకలౌపాధులకు కనువిప్పు కలిగించు తరుణమున,
"తం సూర్యం ప్రణమామ్యహం."