ఓం నమః శివాయ-84
****************
నీ చేతల మంచి-చెడులు నీ నిర్ణయమని అంటుంటే
నిరపరాధులను నీవు బాధిస్తున్నావంటున్నవి
శిలను శిల్పముగా మలచే స్థపతి అని నీవంటే
తప్పుచేయకున్నను తప్పవు ఉలిదెబ్బలు అంటున్నది శిల
నీటిని నివ్వెరపరచే నిషాదుడను అని నీవంటే
తప్పుచేయకున్నను తప్పదు వలకాటు అంటున్నది చేప
అడవిని సంరక్షించే మృగయుదను అని నీవంటే
తప్పుచేయకున్నను తప్పదు శరమువేటు అంటున్నది మృగము
ప్రళయమునే చూడగలుగు ప్రబుద్దుడను అని నీవంటే
ముంచుతున్న ఆపదను రక్షించలేని సాక్షివి అంటున్నది ప్రళయము
నిర్దయతో హింసిస్తు నిష్కళంకుడను అని నీవంటే
నిక్కమనుకోరురా ఒక్కరైన ఓ తిక్కశంకరా.
శివుడు తాను శిల్పినంటు-జాలరినంటు-వేటగాని నంటు-ప్రళయసాక్షినంటు చెప్పుకుంటు ఎన్నో ఎందరినో నిరపరాధులను అమాయకులను శిక్షిస్తున్నాడు.-నింద.
శరము నమః శివాయ-శరణము నమః శివాయ
జననము నమః శివాయ-మరణము నమః శివాయ
నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ
" యోగక్షేమ ధురంధరస్య సకలశ్రేయః ప్రదోద్యోగినో
దృష్ట్వాదృష్ట్వామతోపదేశకృతినో బాహ్యంతరవ్యాపినః
సర్వజ్ఞస్య దయాకరస్య భవతః కింవేధితవ్యం మయా
శంభోత్వం పరమాంతరంగ ఇతిమే చిత్తే స్మరామ్యన్వహం."
శివానందలహరి.
సర్వజీవుల యోగక్షమభారమును మోయు సదాశివా సకలము నీ అధీనము.
" నమః పుంజిష్టేభ్యో నిషాదేభ్యశ్చవో నమః" రుద్రనమకము.
పరమేశ్వరుడు జగములన్నింటిని తనలో నిక్షిప్తము చేసుకొని,సృష్టి-స్థితి-సంహార-తిరోధాన-అనుగ్రహములను ఐదు పనులతో పునరావృతము చేస్తున్నాడు.స్థపతి అను పదము శిల్పి అను అర్థములో వాడుచున్నప్పటికిని,సర్వమును స్థాపించినవాడు అను మరొక అర్థమును కూడ పెద్దలు చెబుతారు.పంచకృత్య నిర్వహణలో జీవులు తమతమ కర్మానుసారముగా సుఖదు@ఖములను పొందుతు,కొత్త శరీరములను ధరించుచున్నవి.కొట్ట శరీరమును ధరించవలెనన్న శిధిలశరీరమును విడనాడవలసినదే కదా.
జగ్ కర్తా-జగ్భరతా-జగ్ హరతా తుం పరమేశా!పంచకృత్యములను సమభావముతో నిర్వర్తించు సదాశివా సకలజగములను సంరక్షింపుము.
ఏక బిల్వం శివార్పణం.