Thursday, May 9, 2019

NAH PRAYACHCHAMTI SAUKHYAM-24

   నః ప్రయచ్చంతి సౌఖ్యం-24
  *************************

   భగవంతుడు భగవతికి మరియు భక్తునకు దూత.

 " నమో దూతాయచ-ప్రహితాయచ."

   శత్రువుల విషయములను తెలిసికొని తన యజమానికి నివేదించగల నేర్పరి దూత.హితమును ఒకచోటు నుండి మరొక చోటునకు తీసుకొని వెళ్ళగల సమర్థుడు దూత.

 దూతను రాయబారి-వార్తాహరుడు-పురోసూచకుడు అనికూడా పిలుస్తారు.ఇతను చక్కని సమయస్పూర్తి-సంభాషణాచతురతను కలిగినవాదై యుండవలెను.జరుగబోవు పరిణామములను తెలియచేయగల సామర్థ్యమును కలిగియుండవలెను.మహా భారతములో శ్రీకృష్ణుడు,రామాయణములో హనుమంతుడు సమర్థవంతమైన దౌత్యమును చేసియున్నారు.సంధికి అంగీకరించని ఎడల కలుగు పరిణామములను తమను పంపినవారి శౌర్య పరాక్రమములను వివరించి పురోసూచకులుగా కూడ ప్రసిధ్ధిపొందారు.

  " సృష్టి స్థితి లయాయస్య లీలా ఇవ మహేశితుః
    తం వందే సచ్చిదానందం సర్వాశుభ నివృత్తయే"

    సకల అశుభములను నివృత్తిచేయు సర్వమంగళాకార సదాశివ నమస్సులు.

  శుంభ-నిశుంభులు యుక్తాయుక్తములను మరచి తల్లితో యుధ్ధమును కోరిరి.అంబిక అందులకు వారికడకు దూతగా పరమేశ్వరుని పంపెను.సప్తమాతృకలు తల్లికి సాయపడ సిధ్ధమైనారు.తల్లి తన సక్తిని నక్క కూతలో దద్దరిల్లచేసి,తనతో పోరాడవలెనన్న దానికి ముందు తన దగ్గరనున్న నక్కలను గెలిచి,తన దగ్గరకు రావలెనని చెప్పి అమ్మ "శివదూతి"గా ప్రసిద్ధికెక్కినది.
" యా దేవీ సర్వభూతేషు శక్తి రూపేన సంస్థితా
  నమస్తస్త్యై నంస్తస్త్యై నమస్తస్తై నమో నమః:.

 నలదమయంతుల కథలోను స్వామి కలహంసరాయబారి యైనాదట.

  "రుద్రం సురనియంతారం శూలఖట్వాంగ ధారిణం
   భీషణ భుజంగ భూషం ధ్యాయేత్ వివిధాయుధం రుద్రం.

  దేవతలను నియమించువాడైన రుద్రుడు త్రిశూలము-ఖట్వాంగము అను ఆయుధములను ధరించి,అభయంకరమైన అగ్నిజ్వాలలో కూడియుండి అఘములను హరించుగాక.

   భగవంతుని దూతగా తన భార్య వద్దకు పంపిన భాగ్యశాలి సుందరార్ నాయనార్.ఆయనకు ఆ సమయమున సంకరుడు అఘోరుడై ఆలికడకు సందేశమును తీసుకుని వెళ్ళు దూతయై సేవలనందించినాడు.

  " శాంతం పద్మాసనస్థం శశిధర మకుటం పంచవక్త్రంత్రినేత్రం
    శూలంవజ్రంచ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం
    నాగం పాశంచ ఘంటం ప్రలయహుతవహం సాంకుసం వామభాగే
    నానాలంకార యుక్తం స్పటికమణినిభం పార్వతీశం నమామి."

   అర్థనారీశ్వరుడు తన అర్థాంగిని తనదగ్గరకు చేరుస్తాడన్న నమ్మకముతో తన స్వామిని దూతగా మార్చాడు సుందరారు.సంతోషముగా కదిలాడు శంకరుడు.

   " విశ్వతః పాణిపాదాబ్జం విశ్వతోక్షి శిరోముఖం
     జ్వలంతం విశ్వమావృత్య తేజోరాశిం శివం స్మరేత్."

   స్వామి సర్వాంగములుసర్వతోముఖములు.సకల మంగళదాయకములు.విశ్వమంతటను వ్యాపించి విశ్వమును ప్రకాశింపచేయుచు,అందులో దాగి తాను ప్రకాశిస్తూ,భక్తసులభుడిగా ప్రకాశించు స్వామిని తన భార్య దగ్గరకు దూతగా సుందరారు పంపించుట,కలికామనాయనారుని కలతపరచినది.

  " నమో అగ్రియాయచ-ప్రథమాయచ" స్వామి ఎంతటి అపచారము జరిగినది.ఏ మాత్రము సహింపరానిది.పెరుమంగళమునకు స్వామి దూతగ వెళ్ళుతయా? సుందరారు స్వామిని దాసుని చేసుకొనినాడని నిందించుచు,తానెన్నడు సుందరారు ముఖమును చూడనని ప్రతినను బూని,నిరతర శివారాథనలో మునిగిపోయెను.

  " నమః ప్రతరణాయచ-ఉత్తరణాయచ"

సుందరారుని దూషించినదానికి కర్మానుభవమా అన్నట్లుగా కలికామనాయనారు వ్యాధిగ్రస్తుడాయెను.ఎంతగొప్ప వైద్యమును చేయించినను ఫలితము కనపడలేదు.పరమేశ్వరుడు కలలో కనిపించి సుందరారు వైద్యము చేయుటకు వచ్చును.మీరిద్దరు నాకు అత్యంత ఆప్తులు.నా లీలావిసేషమే నన్ను దూతను చేసినది.మీరిద్దరు పూర్వము వలె నిష్కళంకులై నన్ను సేవించండి అని సెలవిచ్చెను.సుందరారు వైద్యము కలికాముని సంపూర్ణ ఆరోగ్ఫ్యవంతుని చేసినది.
 "అద్యవోచదధి వక్తా ప్రథమోదైవ్యో భిషక్."
 ధ్యానించుటచేతనే రోగములను భవరోగములను పొర్గొట్టు రుద్రప్రభూ నమస్కారములు.

   సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః.

 స్వామి బిల్వార్చనకు రేపు కలుసుకుందాము.

   ( ఏక బిల్వం శివార్పణం)

   ఏక బిల్వం శివార్పణం.

 

NAH PRAYACHCHAMTI SAUKHYAM-23

   నః ప్రయచ్చంతి సౌఖ్యం-23
  *******************************

   భగవంతుడు-భక్తుడు ఇద్దరు ప్రణవస్వరూపులే
 
  భగవంతుడు ప్రణవబోధను పొందినవాడు
  భక్తుడు ప్రణవ పరమార్థమును పొందినవాడు.

  " పంచాక్షరీ శివపదేన విభాతి నిత్యం." ఓం నమః శివాయ.

  అకరా-ఉకార-మకార సంగమము " ఓంకారము." ఓంకారమును సూక్ష్మ ప్రణవముగను,పంచాక్షరిని స్థూల ప్రణవముగను దైవజ్ఞులు భావిస్తారు.ప్రణవము స్వయంప్రకాశకము నిత్యము నిరంజనము.

  " ఓంకార బిందు   యోగినాం
    కామదం మోక్షదం వందేం ఓంకారాయ నమోనమః."

  " వృక్షస్య మూలసేకేన శాఖాః పుష్యంతి వైయథా
    శివే రుద్రే జపాత్ ప్రీతే ప్రెతా ఏవాన్యదేవతాః" సూథ సంహిత.

    రుద్రాధ్యాయము వేదములలో ఉత్తమము.హోమాది కర్మలలో ప్రధానము.పాపమోచకము భుక్తిముక్తిప్రదము.ఆ రుద్రుడు తన కుమారుడైన షన్ముఖుని నోట ప్రణవమును -ప్రణవ పరమార్థమును శిష్యుడై తెలిసికొనుట లీలలు కాక ఇంకేమిటి.

  " నమః స్లోక్యాయచ-అవసాన్యాయచ."వేదమంత్రములయందుండువాడు స్లోక్యుడు.వేదాంతముచే చెప్పబడువాడు అవసాన్యుడు.నమో నమః.

  " నమో జ్యేష్ఠాయచ-కనిష్ఠాయచ" జగత్కళ్యాణమునకై జ్యేష్ఠుడు-కనిష్ఠుడు రెందును తానైన రుద్రుడు తనకుమారుడైన సుబ్రహ్మణ్యునికి శిష్యుడై ప్రణవజ్ఞాన సముపార్జనను చేసినాడు.స్వామి తన కార్యాచరణకు కమలనాభుని పావుని చేసినాడు.

 కమనీయం-రమణీయం కుమారుని కథనం.ఒకసారి కైలాసపర్వతమునకు వెళ్ళుచున్న బ్రహ్మ దారిలో కనిపించిన సుబ్రహ్మణ్యుని చిన్నపిల్లవాడుగా భావించి,పలుకరించకనే పరమేశ్వరదర్శనమునకై పరుగులు తీయుచుండెను.పథకము ఫాలనేత్రునిది.కదులుచున్న పదములు పద్మసంభవునివి,అంతా పరమేశ్వర లీల.ప్రసాదగుణపు హేల.
అహంకారమునకు దాసుడైన అజునకు ఆదివ్యాధి వైద్యమునకు సమయము ఆసన్నమైనది ఆ శివుని కనుసన్నలలో.అంతే ఆ శుబ్రహ్మణ్యుడు బ్రహ్మగారిని నమస్కరించి,తానే పలుకరించి,సృష్టియజ్ఞ వివరమును తెలీయచేయమని కోరెను.కనుల మాయతెరలు కప్పియుండుటచే ఖాతరు చేయక ఏముది వేదముల సాయముతో ప్రణవమును చేస్తూ సృష్టిని సాగిస్తాను అన్నాడు బ్రహ్మ.సమాధానముతో సంత్ప్తి చెందని స్కందుడు,ఒకసారి చదివి వినిపించమన్నాడు.

 " హే స్వామి కరుణాకర దీనబంధో." కరుణామయుదైన స్వామి కఠినతకు కారణమును తెలిసికొనలేని కమలజుడు,పఠనమును ప్రారంభించగానే,బ్రహ్మను ఓకారము యొక్క భావమును తెలియచేయమన్నాడు." ఆట కదరా శివా నీకు అమ్మతోడు."

   వివరించలేని విధాతను బందీని చేసి,శరవణుడు స్వయముగా సృష్టికార్యమును కొనసాగించుచున్నాడు.

  


  " ద్రుత చామీకరప్రఖ్యం శక్తిపాణిం షడాననం
    మయూరవాహనారూఢం స్కందరూపం శివంస్మరేత్."

   మహాదేవుడే బ్రహ్మను తిరిగి తీసుకొని రాగలయోధుడని గ్రహించిన దేవతలు.

  " యేభూతానామధిపతియోవిశిఖికాసః కపర్దినః" జటలు కలిగి-జటలు లేని రుద్రుల స్వరూపములఓ నున్న రుద్రా నీ ఆయుధములను మాపై ప్రయోగింపకుము.దయాళువై బ్రహ్మగారిని తిరిగి తీసుకురమ్ము.అని ప్రార్థించగా వల్లెయని ,

  " ఓం నమో పూర్వజాయచ-పరజాయచ" పూర్వాపరములు రెండును తానైన స్వామి బ్రహ్మ అచూకిని గుర్తించి,తన కుమారుని దగ్గరకు వెళ్ళెను.

     బ్రహ్మగారికి జ్ఞానోదయమును కలిగించుటకు జరిగిన పరిణామములను తెలియచేసి తండ్రికి నమస్కరించెను.తండ్రికి తాను గురువై ప్రణవ ప్రాముఖ్యమును వివరించెను.స్వామి శిష్యుడై అవధరించెను.ప్రణవ పరమార్థమును పరిచయము చేసిన ఆ పవిత్రస్థలము కుంభకోణము దగ్గర నున్న స్వామిమలై.

 ఎంతైన మహాకవి ధూర్జటి తెలియచేసినట్లు స్వామి పాలబువ్వకు అరటిపండ్లను వాత్సల్యలక్షీ లీలగా తెచ్చి ఇస్తాడు.వద్దనకుండా శిష్యుడై ప్రణవమును పుత్రునిచే ఉపదేశము పొందుతాడు.ఊహలకందని లీలలవాడు ఉమాపతి.  " శివాయ నమః" స్థూల ప్రణవము ద్వారా పరమేశ్వర దర్శనమును పొందిన భక్తుడు ఉపమన్యు మహర్షి.పేదవాడైన ఉగ్రదంతుని కుమారుడు క్షీరసేవనము చేయవలెన్న తీరని కోరిక కలవాడు.

  " నమో గోష్ఠాయచ".ఆవులు కట్టియుండే చోటనుండు స్వామి అనుగ్రహమును చూపకుండుటకు అంతరార్థమేదో ఆయనకే తెలుసు.అంతా శివమయం జగం.వ్యక్తం అంబామయం.అందులకనేమో తల్లి శివపంచాక్షరిని ఉపదేశించినది.త్రికరణ శుద్ధిగా నమ్మిచేసినవారిని త్రినేత్రుడు కరుణీంచకుండునా? అసలే భోళాశంకరుడు.

  ' శివశివశివ అనరాదా శివపాదముచేదా?
    శివపాదము మీద నీ శిరసునుంచరాదా?

  అనుచు ఉపమన్యు చేయుచున్న పంచాక్షరి నామ జపమునకు ప్రసన్నుడైన పరమేశ్వరుడు ప్రత్యక్షమై,క్షీర రామలింగేశ్వరుడై అనుగ్రహించెను ఆ ప్రదేశమే నేటి క్షీరపురి  పాలకొల్లు.

  ఉపమన్యుని ధన్యుని చేసిన పంచాక్షరి-స్థూల ప్రణవము మనలనందరిని పరిపాలించునుగాక.శబ్ద-రూపములకు అతీతుడైన స్వామి మనలను తన అక్కున చేర్చుకొనుగాక.
 స్వామి బిల్వార్చనకు రేపు కలుసుకుందాము.

   ( ఏక బిల్వం శివార్పణం)

  ( ఏక బిల్వం శివార్పణం)



 

TANOTU NAH SIVAH SIVAM-12

    తనోతు నః శివః శివం-12   *****************   "  వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే      జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...