Thursday, June 11, 2020

OM NAMA SIVAAYA-89


  ఓం నమః శివాయ-26
  ****************

 ప్రళయము చూస్తుంటావు-ప్రణవము చేస్తుంటావు
 అదృశ్యము చేస్తావు-పంచకృత్యమని అంటావు

 అల్లుడిని కానంటావు-ఇల్లరికము ఉంటావు
 సన్యాసిని అంటావు-సంసారిగ  ఉంటావు

 దయనీయుడనంటావు-దహించివేస్తుంటావు
 ఎవ్వడు వాడంటావు-ఎదిరించలేడనంటావు

 ఎడమకాలితో తన్నుతావు-మడమతిప్పనంటావు
 ఎడమకాలు ఎవరిదంటే-తడబడుతుంటావు

 నీవు చేయని శిక్షణను-నీవే చేసానంటావు
 అమ్మ చేయుచున్న రక్షణను-అంతా దాచేస్తావు

 మక్కువ అంటూనే అమ్మను-నువ్వు తక్కువగా భావించే
 కక్కూర్తి వాడవటర  నీవు  !     ఓ తిక్కశంకరా.


 శివుడు జగములు జలమున మునిగిపోతుంటే చేతకానివాడై కళ్ళుమూసుకొని జపము చేసుకుంటాడు.దక్షుడికి నేను ఇప్పుడు అల్లుడిని కానని,నమస్కరించకుండా,ఎప్పుడు కైలాసములోనే ఇల్లరికము ఉంటాడు.దయార్ద్రహృదయుడనని అంటూనే దహించివేస్తుంటాడు. ఎడమకాలితో శత్రువులను తరిమికొడుతు,మడమతిప్పని ధైర్యము కలవాడనని అంటాడు.సర్వము సతి చేస్తుంటే,దానిని చెప్పకుండా అంతా తానేచేస్తున్నానని చెప్పుకుంటాడు.ఎడమకాలి ప్రసక్తి వస్తే తడబడుతుంటాదు-నింద.

 

  శివాయ నమః శివాయ-శివాని నమః శివాయ
  సన్నుతి నమః శివాయ-సద్గతి నమఃశివాయ

  నమః శివాయ నమ: శివాయ ఓం నమః శివాయ.



 "ప్రపంచ సృష్ట్యున్ముఖ  లాస్యకాయై
  సమస్త సంహారక తాండవాయై
  జగజ్జనన్యై జగదేక పిత్రే
  నమః శివాయైచ నమః శివాయ"

   అర్థనారీశ్వర స్తోత్రము.

 లలితనృత్యమును చేయు తల్లి పాదము-దుష్టతాడనము చేయు స్వామి తాండవ పాదము జగత్కళ్యాణకారకములైన సచ్చిదానంద స్వరూపమే.-స్తుతి.

 ఏక బిల్వం శివార్పణం.



 




OM NAMA SIVAAYA-88


  ఓం నమః శివాయ-88
  ********************
 ఉమ్మిపూసి మందు అనిన కిమ్మనక ఉంటాడు
 గుగ్గిలపు వాసనలకు ఉబ్బితబ్బిబవుతుంటాడు

 కుంటి గాడిదమీద కులుకుతు కూర్చుంటాడు
 మట్టిముంతకోసమని గట్టివాదులాడువాడు

 చెన్నప్పవ్వ బొంతను కప్పుకుని రోతగా ఉంటాడు
 రంగులు మారుస్తు ఎంతో పొంగిపోతు ఉంటాడు

 రాళ్ళు రువ్విన వాని ఆరళ్ళను తీరుస్తాడు
 బాణపుదెబ్బలను తింటు బాగుబాగు అంటాడు

 క్లేశహారిని అంటు కేశములను కోరుతాడు,
 కళ్యాణప్రదాతనని కళ్యాణము కానీయడు

 నవ్వులపాలవుతున్నా నవ్వుతూనే ఉంటాడని
 వెక్కిరిస్తున్నారురా ఓ తిక్క శంకరా.


 సాలీడు పాకిన చోటంతా శివలింగమునకు పొక్కులు వస్తే,నక్క నాయనారు భార్య ఉమ్మివేసి అదే దానికి మందని అంటే ఆనందంగా స్వీకరించాడు.కలశ నాయనారు భార్య మంగళసూత్రమును తాకట్టు పెట్టి గ్రాసము తీసుకురావటానికి వెళుతుంటే సాంబ్రాణిని దానికి బదులుగా ఇచ్చాడు.చాకలి నాయనారు తన కుంటిగాడిదమీద మాసిన బట్టల మూతతో పాటు కూర్చోపెడితే వాహనపూజ అంటు వాహ్వా అన్నాడు.నీలకంఠ నాయనారుకు మట్టిముంతను దాచిపెట్టమని,అది చాలా మహిమాన్వితమైనదని,మాయమాటలు చెప్పి,దానిని మాయము చేసి,తిరిగి తనకు ఇవ్వలేదని గట్టిగా పోట్లాడాడు.సుచి-శుభ్రము అంటే తెలియని వాడుగా అందుకే చెన్నప్పవ్వ తన పాత కుళ్ళుకంపుకొట్టుచున్న బొంతను కప్పగానే,ఎంతో వెచ్చగా ఉందంటు వచ్చిపడుకున్నాడు.సక్కియ నాయనారు రళ్ళను గట్టిగా విసురుతుంటే దెబ్బతగులుతున్నా వాటిని పూలపూజగా అనుకొని నాయనారు కష్టాలను తీర్చాడు.అర్జునుడు బాణాలతో గట్టిగా కొడుతుంటే భలే బాగుందన్నాడు.అంతే కాదు.హవ్వ మరీ విడ్డూరము.కంచార నాయనారు కుమార్తె కళ్యాణమునకు వెళ్ళి వధువు కేశములను కోరాడు.పెళ్ళికూతురు జడను కోయించి తీసుకొనుటయే కాడు.ఏకంగా పెళ్ళిని చెడగొట్టుటలోను సిధ్ధహస్తుడు.మరేమనుకున్నారు.సుందరారు పుస్తె కట్టే సమయమునకు వెళ్ళి,వాడు తన బానిస అని పెళ్ళికానీయకుండా తన వెంట తెచ్చేసుకున్నాడు.ఎంతైన రంగులు మార్చే స్వభావమున్నవాదు కదా.కుంభకోణము దగ్గరనున్న ఆలయములో కళ్యాణ సుందరేశుని నామముతో రోజుకు ఐదారుసార్లు తన లింగపురంగును మార్చే చతుౠడు కదా ఏమైనా చేస్తాడు-ఎపుడైనా చేస్తాడు-ఎవరితోనైన చేస్తాడు.-నింద,

 అర్థి నమః శివాయ-దాత నమః శివాయ
 చింత నమః శివాయ-స్వాంతన నమః శివాయ

 నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ.

 దేవదేవ ధవళాచల మందిర గంగాధరా హర నమోనమో
 దైవతలోక సుధాంబుధి హిమకర లోకశుభంకర నమోనమో
 హాలాహలధర శూలాయుధకర శైలసుతావర నమోనమో.స్తుతి.

 ఏక బిల్వం శివార్పణం.


OM NAMA SIVAAYA-87


  ఓం  నమః శివాయ-37
 **********************

 సూర్యరశ్మి తాకిడికి పారిపోయిన నాచు
 జారినాడులే అంటూ చేరుతోంది చెరువులోకి

 చుట్టివేసి ఉందని ముట్టుకోలేననిన నీరు
 పరిచారులే పదమంటూ చేరుకుంది చాపకిందికి

 .పరిక్రమ సమయమని..ఆక్రమించలేనన్న చీకటి
  మళ్ళీ మామూలేగా అంటు ఆవరించింది మనసులోకి

  విబుధగోష్టి వేళయని బంధనాలనిన వికృతి
 .వివరము తెలియలేదంటువిస్తరించిందిమనిషిలోకి

  పిశాచాలతో ఆడే పిచ్చివాడు శివుడని,పునరావృత
  మాయను పూర్తిగా మాయము చేయలేనివాడని


కచ్చగా వచ్చి మమ్ము గుచ్చుతుంటే  హెచ్చరించలేవని
నిన్ను తక్కువ చేస్తున్నారురా ఓ తిక్కశంకరా



శివుడు పూర్తిగా దేనిని తొలగించలేడు.కనుకనే నాచు మరల నీటిలోనికి ప్రవేశించగలుగుతోంది.మాయ చాపకింది నీటిలా మనకు తెలియకుండానే మన దరిచేరుతుంది.ధ్యానము ధ్యాసను కుదురుగా ఉండనీయదు.మనసును చలించేలా చేస్తుంది.సద్గోష్ఠి ముగియగానే విపరీత భావనలు సమయము చూసి స్వాధీనము చేసుకుంటుంది.వీటన్నికి కారణము శివుని అసమర్థతే.-నింద.

 ప్రకృతి  నమః శివాయ-వికృతి నమః శివాయ
 రాకయు నమః శివాయ-పోకయు నమః శివాయ

  నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ.


 " నమః ఆతార్యాయచ-ఆలాద్యాయచ." రుద్రనమకం.

 సంసారమునుండి తరింపచేయు తత్త్వజ్ఞానము లభించినను ,దానిని ఉపేక్షించి,మరల సంసార భ్రాంతిని పొందుటయే ఆతారము.(ఆతార్యాయచ).సంపూర్ణముగా కర్మఫలములను పొందువాడు  ఆలాదుడు.అవి దైవకృపచే పరిహరింపబడవు.(ఎవరికి)

 "అసారే సంసారే నిజభజన దూరే జడథి తతా
 భ్రమంతం పరమకృపయా పాతుం"-శివానందలహరి

 సారము లేని సంసారములో మతిలేక తిరుగుచున్న నన్ను మాయ అవకాశము చూసి మరల మరల ఆవరించుచున్నది.నా ప్రయత్న లోపమో-నీ ప్రసాదగుణ తాత్సారమో తెలియకున్నది.పరమేశా! అనుగ్రహించుటకు నాకంటే దీనాతి దీనుడు లేడు.నీకంటే వేరొక దీనరక్షకుడును లేడు.సత్వరము మమ్ములను అనుగ్రహింపుము సదాశివా.నీకు నమస్కారములు.-స్తుతి.

 ఏక బిల్వం శివార్పణం
..




.







TANOTU NAH SIVAH SIVAM-12

    తనోతు నః శివః శివం-12   *****************   "  వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే      జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...