అంబే శివం.
************
1.వ్రాసి వ్రాసి వ్రాసి వ్రాసి నీటిమీద రాతలే
మాసి మాసి మాసి మాసి ముసురుకున్న మాయలో
చూసి చూసి చూసి చూసి మోసపోయి శంకరా
రోసి రోసి రోసి రోసి సమసిపోయిరెందరో.
ఓం నమః శివాయ ఓం నమః శివాయ
2.తెలియలేదు జనము-జగము నిజము కాదని
తెలియలేదు అణువు అణువు నీవు దాగినావని
తెలియలేదు నీవు-నేను వేరువేరు కాదని
తెలియలేదు నేననేది నాది కానేకాదని.
ఓం నమః శివాయ-ఓం నమః శివాయ.
3. నీది ఏది?నాది ఏది? నీదినాది కానిదేది?
జననమంటు-మరణమంటు ఆటలాడుతున్నదేది?
రాజు అంటు-గురువు అంటు మాటలాడుతున్నదేది?
ఒక్కటైన రామరామరామ నీదు నామమే.
4.ఐదు శక్తులేగ సృష్టి ఐదు శక్తులేగ స్థితి
ఐదుశక్తుల కదలికేగ అంతరంగ పంచాక్షరి
అనాహతపు ఓంకారము అవగతమగుచున్నవేళ
నటరాజుని నాట్యమేగ నా దహరాకాశములో.
5. ఎడమకన్ను చంద్రుడు కుడిదిచూడు సూర్యుడు
ఎడమచేత శూలము కుడివైపున లేడిబూర
ఎడమకాలు ఎత్తితాకు ఎనిమిదైన దిక్కులను
ఎరుకలేకపోతినైతి ఎదలోదాగున్న నిన్ను.
6. ఊరు ఏది? తీరుఏది? నీ ఉనికికి ఊతమేది?
దూరమేది?దగ్గరేది? నీవులేని చోటు ఏది?
పెద్దదేది?చిన్నదేది? తారతమ్యమేది ఏది?
నిత్యసత్యమైన నిన్ను మేము చూడగలిగితే.
7. మట్టిపాత్ర ముక్కలైన మరలు కొత్తరూపుకై
లోహపాత్ర సొట్టలైన కరుగు కొత్తరూపుకై
నీవులేని దేహమేమొ నిలువలేదు నిమిషమైన
ఇంతకన్న సాక్ష్యమేది ఎంతమాయ ఈశ్వ రా
8. ఐదు దివ్యశక్తులే అండము-అఖండము
ఐదు దివ్యశక్తులే మూలము-మూవురు
ఐదు దివ్యశక్తులే అకారము-మకారము
ఐదు దివ్యశక్తులేపంచకృత్య వృత్తము.
8. బాణమేసినంతనే భయపడునా ఆకాశము
శాసనంబు నాదని చిలుకగలవ పాల్కడలిని
చేరలేదు కద చీకటి వీతమోహరాగుని దరి
తెలిసికొనిన వేళలో శివాలయమె నా మది.
9.నేలరాచినాను ఎన్ని పూవులనో తెలియదు
గేలిచేసినాను ఎన్ని మంత్రములనో తెలియదు
జారవేసినాను ఎన్ని వరములనో తెలియదు
కోరిచేరినాను ఎన్ని మందిరములో తెలియదు
10.
11. పదునాలుగు భువనములకు అకారమే ప్రతీకగ
పట్టుబడని తత్త్వమునకు ఉకారమే ప్రతీకగ
పరిత్రాణ రక్షణకు మకారమే ప్రతీకగ
ప్రజ్వరిల్లుచున్న సత్తు-చిత్తులేగ ఓంకారము.