" తాదృశం ఖడ్గమాప్నోతి యేనహస్త స్థితేనవై
అష్టాదశ మహాద్వీప సమ్రాడ్భోక్తా భవిష్యతి."
అమ్మ కరుణతో సృష్టిచక్రత్రయమును దాటి,సాధకుడు స్థితిచక్రత్రయ మొదటిదైన,"సర్వసౌభాగ్యదాయక " చక్రములోనికి ప్రవేశించబోతున్నాడు.
16 దళములతో,8 దళములతోవృత్తాకారముగా నున్న చక్ర ఆవరనములను దాటి , 14 కోణములతో వృత్తాకారముగా నున్న మన్వస్త్రము లోనికి ప్రవేశించబోతున్నాడు.కోణములు సూక్ష్మత్వమునకు సంకేతములై,సాధకుని పరబ్రహ్మ తత్త్వమును తెలియచేయుటకు సంసిద్ధమగుచున్నవి.
పరమేశ్వరుడు గురువై పార్వతీదేవికి (గురుశిష్యసంప్రదాయానుసారముగా ) ఉపదేశిస్తున్నాడు.
" ఈకారస్తు మహామాయా భువనానిచతుర్దశా
పాలయంతు పరాతస్మాన్ చక్రకోణం భవేత్ ప్రియే"
సర్వ సంక్షోభిణీ-సర్వ విద్రావిణీ-సర్వాకర్షిణీ-సర్వాహ్లాదినీ-సర్వ సమ్మోహినీ-సర్వస్తంభినీ-సర్వజృంభిణీ-సర్వవశంకరీ-సర్వరంజనీ-సర్వోన్మాదినీ-సర్వార్థ సాధినీ-సర్వ సంపత్తి పూరిణీ-సర్వ మంత్రమయీ-సర్వ ద్వంద్వక్ష్యంకరీ అను గౌణనామములతో " సంప్రదాయయోగినులుగా కీర్తింపబడుతూ,పదునాలుగు కోణములుగా ప్రకటిమగుచున్నది ఈ ఆవరనము.
ఈ ఆవరణములో అర్షడ్వర్గములకు తావులేదు.సప్తధాతువులు శుద్ధిచేయబడి ఉన్నాయి.ముద్రాశక్తులు మార్గమును సుగమము చేస్తున్నాయి.భువనేశ్వరి అనుగ్రహప్రాప్తిని పొందుటకుసాధకునితో పాటుగా,సర్వ వశంకరీ ముద్రా మాత-ఈశ్వర భావనను పెంపొదిస్తూ ఈశిత్వసిద్ధి మాత చెరొకచేయి పట్టుకుని నడిపిస్తున్నారు.
ఇంతకంటె సౌభాగ్యము ఇంకేముంటుంది.
సాధకునికి సర్వసౌభాగ్యచక్ర ప్రవశము ముఖ్యమైనది.శివశక్తులు విడివడి నాలుగు ఊర్థ్వకోనములుగా-ఐదు అథో కోణములుగా స్థావర-జంగమములుగా సంకేతించబడుతు దర్శనమిస్తాయి.
అథోముఖముగా విస్తరించిన ఐదు శక్తికోణములు సమసి తిరిగిజనించు పంచభూత ప్రకృతిగాను,ఊర్థ్వముఖముగా నున్న నాలుగు శివ కోణములు శాశ్వతమైన ధర్మ-అర్థ-కామ-మోక్షములు గాను సనాతనము కీర్తిస్తుంది.
ఇప్పటి వరకు సాధకుడు అవిద్యా స్వరూపముగా నుండి విద్యాస్వరూపములైన యోగినుల-చక్రేశ్వరుల అనుగ్రహముతో తనలోని ఉనికిని గమనించడము ప్రారంభిస్తున్నాడు.బ్రహ్మము గురించి తెలుసుకోవాలనే తపనకు బీజం పడింది.అది చక్రేశ్వరి"త్రిపుర వాశిని" అనుగ్రహము.
వాసిని అన్న పదమునకు నివసించునది అను అర్థము ఉన్నప్పటికిని,వాసి-ఖడ్గము/గొడ్డలి ని ఆయుధముగా ధరించియున్నది అని విశ్లేషకులు చెబుతారు.అమ్మ అనుగ్రహమనే గొడ్డలి ఒకేదానిని మూడుగా భావించే అజ్ఞానమును ఖండించివేస్తుంది.
ఈ చక్రమును విశ్వముతో అన్వయించుకుంటే పరదేవతయొక్క దశేంద్రియములు-మనసు-బుద్ధి-చిత్తము-అహంకారము
ఈ చక్రములోని పదునాలుగు కోణములను పదనాలుగు భువనములుగా పరిగణిస్తారు.
ఈ చక్రమును ఉపాధి పరముగా అన్వయించుకుంటే హృదయస్థానమయినానాహత చక్రము అంటారు.నాడీ మండలములోని ఇడ-పింఘళ-సుషుమన మొదలగు పదునాలుగు ముఖ్యనాడుల అనుసంధానముతో పోలుస్తారు.(72000 నాడుల ఉపాధి అయినప్పటికిని)
ఉపాధి ఆరోగ్యపరముగా సమన్వయించుకుంటే ఈ పదునాలు కోణములే రక్తప్రసరణమునకు సహాయపడుతూ,సప్తధాతువులను సమన్వయపరుస్తూ,శరీరములోని శీతోష్ణములను నియంత్ర్స్తూ,వాక్పటిమను కలిగిస్తుంటాయి.
బ్రహ్మజ్ఞానపిపాసిగా మారిన సాధకుడు చక్రేశ్వరి త్రిపురవాసిని ఆశీర్వచనముతో,యోగినీ మాతల సిద్ధిమాత-ముద్రామాత అండ-దండలతో తరువాతి ప్రాంగణమైన సర్వార్థసాధక చక్ర ప్రవేశమునకు అర్హుడవుతున్నాడు.
సర్వం కామేశ్వర-కామేశ్వరి చరణారవిందార్పణమస్తు