సౌందర్య లహరి-నవరత్న ప్రాకారము
********************************
పరమపావనమైన నీ పాదరజకణము
పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము
పంచభూత స్వామినుల ప్రకాశోపేతము-పవిత్రము
పగడముల ప్రదేశము-ప్రపంచ సంపన్నము
తూరుపు-పడమర-ఉత్తరము-దక్షిణము
ఊర్థ్వ-అథో ఆమ్నాయ దేవీసుసంపన్నము
అనంత తేజోమయ శుభలక్షణ శ్రీమంతము
అమృత రస ఆత్మానుభవ ఆనంద రామము
శ్రీమాత మంత్రములకు శ్రీకర నిలయములైన
నవరత్న ప్రాకారము నన్ను దీవించుచున్న వేళ
నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
మానస విహారి ఓ సౌందర్య లహరి.
"పంచమీ-పంభూతేశి" తల్లిని సేవించునవి పంచభూతములు.అవి నీరు-నిప్పు-నింగి-నేల-గాలి.అవి తల్లి కనుసన్నలలో పంచభూతములను గమనించుచు,వాటి గమనమును నిర్దేశించుతు,ఋతువులననుసరించి,ప్రపంచ సౌభాగ్యమునకు సమతౌల్యతతో-సంస్కారముతో ఉండునట్లు చేయుశక్తులు పంచభూతస్వామినులు..అలాకాకుంటే ప్రళయమే కదా.
శ్రీమాత పూజా విధానములో సృష్టి-స్థితి-లయ-తిరోధాన-అనుగ్రహ విధానములలో,బిందురూప పూజ. (సృష్టి) స్థితిపూజలో అర్చించిన దేవతలు కాకుండా మిగిలిన దేవతలను (మంత్రపూరితమైన వారిని) ఆమ్నాయ దేవతలు అంటారు.వారు నాలుగు దిక్కుల పేర్లతో-ఊర్థ్వ-అథో స్థానములను పాలిస్తుంటారు.
నవరత్నమణి ప్రాకారములో పంచభూతదేవతలు-దిక్కులను కాపాడుచున్న ఆమ్నాయ దేవతలు
ఆనందముతో నన్ను ఆశీర్వదిస్తున్న సమయమున చెంతనే నున్న నాచేతిని విడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు.