Monday, January 1, 2024

TIRUPPAAVAI-PAASURAM-18

  తిరుప్పావై-పాశురము-18 ****************** మాతః సముత్థితవతీ మది విష్ణుచిత్తం విశ్వోపజీవ్య మమృతం మనసా దుహానాం తాపఛ్చదం హిమరుచేరివ మూర్తిమన్యాం


సంతః పయోధి దుహితః సహజాంవిదుస్త్వాం. పూర్వపాశుర ప్రస్తావనము **************** నందభవనమునకు వెళ్ళి,యశోదా నందులను,బలరామకృష్ణులను మేల్కొలిపిన గోపికలు,వారికి నందగోపాలుని అనుగ్రహముగా అంబరము-తన్నీరు-శోరు అర్థించిరి.దాన విశిష్టతను వివరించిన గోదమ్మ , ప్రస్తుత పాశుర ప్రాభవము ********************* ప్రస్తుత పాశురములో "పురుషకారత్వము" సిఫారసు అను అద్భుత మాతృ నాత్సల్యమును "నీళాదేవి " జగన్మాత ను పరిచయము చేస్తున్నది. పాలకడలి చిలుకుటకు ఎంతో కష్టబడిన తరువాత ప్రభవించిన క్షీరసాగర కన్య మనలను అనుగ్రహించుటకై, " మామేక శరనం వ్రజః"అను చరమ వాక్య స్వభావమై,అన్యథా శరనం నాస్తి-త్వమేవ శరణం మమ అనగానే అడ్డుపడి,మనకర్మఫలములకు ప్రాయశ్చిత్తమను ఉపాయమును సూచించి,అనన్య శరణత్వమనే ఆలంబనమును చూపించి ,స్వామి మనలను ఉద్ధరించునట్లు చేస్తున్న కరుణయే "నీళాదేవి." నీలమేఘశ్యాముడు పాప-పుణ్యముల చిట్టా ప్రకారమే ఫలితములు చేతనులకూని అంటే,అది పితృస్వభావము కాదని,పాలన అసలు కాదని,మనలను సంస్కరించి,స్వామి కరుణకు పాత్రులను చేసే సమయస్పూర్తి కల సాధ్వి. స్వామి ఉపేయము-అమ్మ ఉపాయము. స్వామి సంరక్షకుడు-అమ్మ సమన్వయ కర్త. బ్రహ్మాండములను భోగోపకరణముగా(బంతిగా0 ధరించిన నీలాదేవి-లీలోపకరణ్ అములైన చేతనులను సవరించి,స్వామిచే ఉద్ధరింపచేస్తుంది. యశోద అన్న కుమార్తె-నందుని మేనకోడలు , కందం-కమళం-కుళలి-దోషరహితమైన/పరిమళ కేశ సౌందర్యము కల నీలాదేవి మనలను అనుగ్రహించును గాక. తల్లి నప్పిన్నాయ్-స్వామి మైందనన్-అవిభాజ్యములు.తల్లితండ్రులు.సంరక్షకులు.

"ఒప్పుకున్న తప్పులన్ని పురుషకార లాలనలో
తప్పిపోవ దండనలు పురుషోత్తమ పాలనలో."
దుష్టశిక్షణము-శిష్టరక్షణము స్వామి నియమములు.చేతనలుము కనుక చిన్నో-పెద్దో తప్పులు,తెలిసో-తెలియకో చేస్తూనే ఉంటాము.పశ్చాత్తాపమును మించిన ప్రాయశ్చిత్తము లేదను నీలమ్మ సిఫార్సు తో మనలను రక్షిస్తుంది అమ్మ.స్వామి శాసనములను గౌరవిస్తూనే వాటికి కొన్ని మార్పులను చేర్చుతు,తన వాక్చాతుర్యముతో అనుగ్రహించుటకు నీలమ్మను అభ్యర్థించుచున్న
గోదమ్మకు అనేకానేక దాసోహములను సమర్పించుకుంటు,పంచేంద్రియ పరమార్థమునందించు విశేషానుగ్రహ పాశురమును అనుసంధానము చేసుకునే ప్రయత్నమునుచేద్దాము.

పాశురము
**********
ఉందు మదగళిట్రన్ ఓడాద తోళ్వలియన్
నందగోపాలన్ మరుమగళే! నప్పిన్నాయ్
కందం కమళుం కుళలీ కడై తిరవాయ్
వందు ఎంగుం కోళి అళైత్తనగాణ్; మాదవి
పందల్ మేల్ పల్కాల్ కుయిల్ ఇనంగళ్ కూవిణగాన్
పందార్ విరలి; ఉన్ మైత్తునన్ పేర్పాడ
శెందామరైక్కైయ్యాల్ శీరార్ వళై యెళుప్ప
వందు తిరవాయ్ మగిందేలో రెంబావాయ్.
నప్పిన్నాయ్-యశోద సోదరుదైన కుంభగోపుని-ధర్మదల కుమార్తె.సుగంధ కేశసౌందర్యము కలది.
శెందామరల వంటి చేతులు కలది.శీరార్వళై -ఐశ్వర్యవంతమైన కరకంకణములు కలది.అంతే కాదు
"పందార్ విరలి" చేతిలో కందుకమును/బంతిని ధరించి యున్నది.
నప్పిన్నాయ్ -అనగా నల్ల పెణ్-సర్వసులక్షణ.
నప్పినాయ్ అమ్మవారిని ముద్దుగా తమిళభాషలో పిలుచుకునే పేరు.అంటే లక్ష్మీదేవి.లక్ష్మీదేవి అంశలు మూడుగా విడివడి ఆదివరాహుని భూమాతగాను,(భూదేవి) శ్రీ రాముని సీతాదేవి గాను (శ్రీదేవి) శ్రీ క్రిష్ణుని నీలాదేవిగాను అనుసరించారు.నప్పిన్నాయ్ ని ఉత్తర భారతీయులు రాధా దేవిగా కొలుస్తారు. అమ్మ స్వామి ఆత్మైక స్వరూపులు.దేహములు రెండు కాని ఆత్మ ఒక్కటే.స్వామి నిదురించుట అంటే అంతర్ముఖమైనారు.
ఓ నప్పిన్నాయ్-మా వరప్రసాదమా,నీవు మా నందగోపుని యొక్క
మరుమగళై-మేనకోడలివి.
మా నందగోపుడు,వేదశాస్త్ర సంపన్నుడు మాత్రమేకాదు ,
ఉందు మదగళిట్రన్ ఓడాద తోళ్వలియన్
బాగా మదించి,మదజలమును నిరంతరముగా స్రవించుచున్న ఏనుగుల గుంపులను,(మదగళిట్రన్)
ఉందు తోళ్వళియన్-అతిశయించున భుజబలముతో (ఓడాద)తరిమివేయగల పరాక్రమము కలవాడి కోడలా మా ఇంద్రియములు మదముతో చేసిన తప్పిదములను సైతము నీ వాత్సల్యముతో మాదరి చేరకుండా తరిమివేసి, మమ్ములను అనుగ్రహించు.
అదుపుతప్పి ప్రవర్తించు ఇంద్రియముల సమూహములే మదగజములగుంపులు.వాటిని తరిమివేయగల భావపరాక్రమము కలవాడు నందగోపన్.
అదేపరంపరను కొనసాగించగల ఓ నీలాదేవి స్వామిని మేల్కొలిపి మమ్ములను అనుగ్రహించునట్లు చేయవమ్మా

వారికి అమ్మపై అంత నమ్మకము.దానికి కారణము స్వామికి నీలాదేవి
కందం కమళుం కుళలీ-సహజ సుగంధభరిత కేశపాశముపై వీడలేని వ్యామోహము
.అంతేకాదు స్వామికి నీలాదేవి
శీరార్ వళై యెళుప్ప-ఐశ్వర్యవంతమయిన గాజుల శబ్దమును వినుటయందు వీడలేని ఉత్సాహము.
సాక్షాత్తు ఉపనిషత్సారముగా
పరిమళిస్తున్నవి అమ్మవారి కేశములు,ఉపకార/పురుషకార-చేతనుల తప్పులను మన్నించుమని,వారి తప్పులు తెలుసుకొని పశ్చ్హాత్తపముచెందిన ,దోషములనెంచక మన్నించమని ,మధురముగా స్వామికి నచ్చచెప్పు మాటల సవ్వడులే తల్లి అందమైన చేతులకు అలంకరింపబడి శ్రావ్యముగా మ్రోగుచున్న కంకణములు.చేయు ధ్వనులు.
నీలమ్మ ఒకచేతిలో లీలగా బంతిని పట్టుకుని యున్నదట.మరియొక చేతిని స్వామి భుజముమీద ఉంచి, మనతరఫున స్వామిని బుజ్జగిస్తున్నదట.
చేతనులైన మనకు చైతన్యమైన స్వామికి మధ్యన తానుండి స్వామిని సముదాయిస్తూ-మనకు సంస్కరించుకునే అవకాశమినిస్తున్నది నీలాపిరాట్టి.
కాని పరాశ్రయులైన గోపికలకు అమ్మ వచ్చి తలుపు తీసి,నేనున్నానులెండి.స్వామికి మీ గురించి చెప్పి నోముస్థలికి వస్తామని చెప్పలేదని ఆత్రత.
అందుకే వారు తల్లీ! తెల్లవారినది.అంటూ రెండు విషయములను సంకేతించినారు.
1.ఎంగుం కోళి అళైత్తనగాణ్-అంతటను కోళ్ళు కూయుచున్నవి.
2.కుయిల్ ఇనంగళ్ కూవిణగాణ్ -
మాదవి పందలి మేల్ పల్కాల్ అని బాహ్యమునకు అమ్మను రప్పించుటకు గుర్తులు చెప్పుచున్నారు.
ఎంగుం-అన్నిచోట్ల,
కోళి-కోళ్ళు లేచి
వందు-రమ్మని,
అలైత్తన్-పిలుస్తున్నాయి
దేనికి-తమ కాళ్లను సాగించి,చకచక అటు-ఇటు నడుస్తు తమకు కావలిసిన గింజలను ఏరుకుని-ముక్కున పట్టుకుని స్వీకరించమని .(ఆత్మనివేదనము)
తల్లీ కణ్-అమ్మా చూడు.
ఈ కోళ్ళు గింజలను ఎక్కడ తిరుగుతు ఏరుచున్నవి.అమ్మ నీలాదేవి భవనము దగ్గర.ఆ భవనము మణిమయము.నవరత్న తాపితము.అక్కడ వాటికి కావలిసిన ఆహారములో తో పాటుగా ఎన్నో మణులు-ముత్యములు-రత్నములు అన్ని కలగలిసి ఉన్నాయి.అవి వాటిని తమ ముక్కుతో వేరుచేస్తూ,తమకు కావలిసిన దానికై అటుఇటు కదులుతు గింజలను మాత్రమే తమ ముక్కుతో గట్టిగా పట్టుకుని స్వీకరిస్తున్నాయి
ఇది వాచ్యార్థము.ఈ కోళ్ళు ఆచార్యులు/ఆళ్వారులు.వారికి కావలిసినది శ్రీకృష్ణానుగ్రహమనే ఆహారము.అది ఐహికములై దారిమరల్చు విషయవాసనలతో మిళితమై ఉన్నది.వారు తమ జ్ఞానమనే ముక్కులతో వాటిని మణులను-నవరత్నములను దూరముగా తోసేస్తు,తమకు కావలిసిన పరమాత్మ అనుగ్రహమనే గింజలను నిశ్చల భక్తి అనే ముక్కుతో గట్టిగా పట్టుకుని,స్వామిని నివేదనమును చేస్తూ,ఆస్వాదిస్తు-ఆనందిస్తున్నారు.అందుకే వారు మేల్కాంచగానే ఒకరినొకరు సత్సంగమునకు పిలుచుకున్నారు.
ఇదేవిషయమును మరొక్క ఉదాహరణముతో
మాదవి పందల్-మాధవభక్తి అనే తీగ అల్లుకున్న పందిరి
మేల్-మీద/పైన కూర్చుని-స్థిరముగా
పల్కాల్-పలువిధములుగా
కుయిల్ ఇనంగళ్-కోయిలల గుంపులు
కూవిణగాన్-కీర్తిస్తున్నాయి
కోళ్ళ కూతలు-కోయిలల బృందసంకీర్తనలు
ఉన్మైందనన్-నీ భర్తయొక్క వైభవమును కీర్తిస్తున్నాయి.

పరమాత్మ దివ్యానుభవమే ఆ మాధవీలతలు ఆశ్రయించిన పందిరి.ఎందరో సంసేవిస్తున్న ముక్తపురుషులే ఆ పైకిపాకుతున్న లతలు.వ్యాస-వాల్మీకాదులే తరతరములకు తరగని సంపదనందించిన ఆ కూస్తున్న కోయిలలు.

ఇంక జాగుచేయక,
మము బ్రోవమని చెప్పవే నీలమ్మ తల్లి,నీ కరకంకణముల సవ్వడితో నీవు మా అజ్ఞానమనే తలుపుగడియను తీసి మమ్ములను అనుగ్రహించమని పురుషకారత్వమును మగిందు తిరవాయ్-రామానుజులను అనుగ్రహించిన తీరున మమ్ములను అనుగ్రహించమని తల్లిని ,
,ఏడు ఆంబోతులను ఒకేసారి కట్టివేసిన స్వామిని,మా పంచేంద్రియముల-మనసు-అహంకారముల మదమును తొలగించి,తన అధీనము చేసుకోమని వేడుకుంటున్న గోపికలను నడిపించుచున్న,గోదమ్మచేతిని పట్టుకుని,మన అడుగులను కదుపుదాము.

ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం

TIRUPPAAVAI-PAAsURAM-17


 


   తిరుప్పావై-పాశురం-17

   *******************

  మాతః సముత్థితవతీ  మదివిష్ణుచిత్తం

  విశ్వోపజీవ్యమమృతం మనసా దుహానాం

  తాపఛ్చదం హిమరుచేరివ మూర్తిమన్యాం

   సంతః పయోధి దుహితః సహజాం విదుస్త్వాం.


  పూర్వ పాశుర వైభవము.

  *******************

  జ్ఞానులను తమ నోమును నిర్వహించుటకు మేల్కొలిపి గోపికలు,అత్యంత యశోవిరాజితమైన నందగోపభవనమునకు స్వామిని సంసేవించుకొనుటకు బాహ్యప్రాకారమును ,ద్వారపాలకుల అనుమతితో దాటి,ఐహికములను విడిచి,లోపలి ద్వారమును చేరి,శయన మందిరము సమీపించుచున్నారు.

   వాచకార్థము అదే అయినప్పటికిని,వారు విషయవాసనలను అధిగమించి,ఆచార్యుల సహకారముతో స్వామి సమాగమనమునకు సంసిద్ధిలగుచున్నారు.

  ప్రస్తుత పాశుర ప్రాశస్త్యము

  *****************

  1.దానమును (సాత్విక-రాజస-తామస) దాని ప్రాముఖ్యతను -ఫలితములను గోదమ్మ వివరించినది.

  ప్రతిఫలాపేక్షలేకుండా/శక్తికి లోపము రానీయకుండా అర్హులకు చేసే దానము సాత్త్విలము.

  ప్రతిఫలమును కోరుతూ/ప్రయోజనము ఆశించి తన విభవము నలుగురికి తెలిసేలా ప్రకటించుకొనుచు ,చేసే దానము రాజస దానము.ఇది నిష్కామము కానిది.

   తాము యాచక అర్హతను గమనించకుండా/ స్వీకరించిన యాచకుని అవరసరమును/ఉపయోగమును పరిశీలించకుండా,చేసే అపాత్ర దానము తామసికము.


   2.శ్రీకృష్ణ పరమాత్మ ద్రౌపదికి-వస్త్రములు,కురుక్షత్ర యుద్ధములో అలిసిన అశ్వములకు జలము,గొల్ల బాలురకు (చల్దులారగించుట) ఆహారము ఇచ్చుట,తన తండ్రి నందుని దానగుణ వారసత్వముగా భావించవచ్చును.

  3.నందగోపుని ఆచార్యునిగాను

    యశోదను-మంత్రముగాను

    బలరాముని -భగవత్ శేషిగాను

    శ్రీకృష్ణుని-భగవంతునిగను అమ్మ సంకేతించినది.

  4.అంబరము-పరమపదము

    జలము-విరజానది

    అహమన్నము-పరమాత్మగాను సమన్వయపరచుకోవచ్చును.

   5.మొదటి పాశురము లో 'యశొదై ఇళంసింగం' అని కీర్తించిన ఆండాళ్ తల్లికి,మూడవ పాశురములో :ఓంగి ఉలగళంద ఉత్తమన్" గా ప్రస్తుత పాశురములో సైతము స్తుతిస్తున్న,బలరాముని (కడియ వైభవమును) పరిచయము చేసిన,

 అమ్మకు-ఆళ్వారులకు అనేకానేక దాసోహములను సమర్పించుకుంటూ,పాశురములోనికి ప్రవేశిద్దాము.

పదిహేడవ పాశురము

  *******************


  అంబరమే తణ్ణీరే శోరే అరం శెయ్యం

  ఎంబెరుమాన్ నందగోపాల! ఎళుందిరాయ్


  కొంబనార్కెల్లాం కొళుందే! కులవిళక్కే

  ఎంబెరుమాట్టి!  యశోదాయ్! అరివురాయ్


  అంబరం ఊడరత్త ఓంగి ఉలగలంద

  ఉంబర్కోమానే  ఊరంగాదు ఎళుందిరాయ్


  శెంపోర్ కళలడి శెల్వా బలదేవా

  ఊంబియున్  నీయుం ఉరంగేలే రెంబావాయ్.


 


  ఓం నమో భగవతే వాసుదేవాయ. 

  *****************************

  మహామహిమాన్వితమైన మధుకలశము ఈ పాశురము.మంత్రభూయిష్టము.మంత్ర ప్రకాశకము-మంత్ర రక్షకము.


   ఈ పాశురములో, పూర్వపు పాశురములలో వలె గోపికల మధ్యన ఊహలు లేవు.ఉక్రోషపు మాటలు లేవు.వాద-ప్రతివాదములసలే ,లేనేలేవు.


 అందరు దశేంద్రియ ప్రలోభములను జయించినవారలని మనము గ్రహించాము

.ఆ పదీంద్రియముల ప్రభావమును పారత్రోలిన ఆ గోపికలు(ఆచార్యులు)మనలను కూడ ఒక మెట్టు ఎక్కించే పనిలో నున్నారు.


  ఆధ్యాత్మిక మయమైన నందగోప పాలకుని శయనమందిరమునకు అత్యంత భక్తిశ్రధ్ధలతో, ప్రవేశించిన వారలై,అపురూప భావనము-ఆరాధ్య సేవనముతో,వారు ఎన్ పెరుమాన్-ఎన్ పెరుమాట్టి-త్రివిక్రమ-బలరామ అని వారి మహోన్నతత్త్వమును కీర్తిస్తూ,వారిని నలుగురిని తాము నోముచేయుచున్న ప్రదేశమునకు విచ్చేసి,నోమును సుసంపన్నము చేయమని ప్రార్థిస్తున్నారు."పఱ" ప్రసక్తి అసలు లేనేలేదు.


 మొదటిగా వీరు మేల్కొలిపినది,


 ఎంబెరుమాన్ నందగోపాల ఎళుందిరాయ్-అన్నారు.


 ఎన్-మాకు

 పెరుమాన్ -ప్రభువైన,

 నందగోపల-గోకుల ప్రభువైన నంద మహారాజ,


 ఎళుందిరాయ్-మేల్కాంచు,


  అని కీర్తిస్తున్నారు.


  ఇక్కడ మనమొక్క విషయమును గ్రహించాలి.వీరిది తమోనిద్రకాదు.తపోనిద్ర.


  నందుడు దేనికి ప్రభువు? 


 గో శబ్దమునకు వేదములు అను అర్థమును కూడ మనము అన్వయించుకోగలిగితే ఈ నందగోపాలుడు ఆనందమయమైన వేదవిదుడు.పరిపూర్న ప్రజ్ఞాన వంతుడు.

     కాని,


 ఇక్కడ ఒక చిన్న ప్రత్యేకత.అది ఏమిటంటే

 నందమహారాజునకు తన పాండిత్యమును అందరికి పంచవలెనను ధ్యాసలేదు.ఎల్లప్పుడు తానే దానితో రమిస్తు-తన్మయత్వముతో ఉంటాడు.


 నందుని మేల్కొలిపిన తరువాత మన గోపికలు యశోదా పెరుమాట్టిని(మహారాణిని-పరిపాలినిని)మేల్కొలుపుతున్నారు.


తల్లిని వారు -మూడు విశేషణములతో మేల్కొలుపుతున్నారు.అవి,


1.కొంబనార్కెల్లాం


2.కొళుందే

3.కుళవిళక్కే,


 బాహ్యమునకు, యశోద పిరాట్టి నదీతీరములలోమొలచు,అగ్నికార్యములలో ఉపయోగించు ప్రబ్బలి తీగె వంటిదని.                 నీవు నాజూకు తనముకలదానవు,నాయికవు,కులదీపమునీవు అని అనిపిస్తున్నప్పటికిని,లోతుగా గమనిస్తే


 ఏమిటి ఆమె నాజూకు తనము?


 పరిపూర్నప్రజ్ఞావంతుడైన నందుని పాండిత్యము అందరికి చేరువకాలేదు.తల్లిగా తానది చూస్తూ ఊరుకోలేదు.కనుక యశ -వేదసంస్కారమును-ద-పొందినది కనుక,


 పాండిత్యమును ఒక చిన్న మంత్రముగా సూక్ష్మీకకరించి-సులభముగా ఉచ్చరించకలుగునట్లు-అర్థంచేసుకొనునట్లు చేయుచున్నది.మంత్రము సర్వకాల సవావస్థలయందును జాగరూకమై యుండును కనుక నదీ తీరములలో మొలకెత్తు ప్రబ్బలి తీగె వంటి పవిత్రతను-పరమార్థమును అందించు యశోద జాగరూకవు కమ్ము అని అంటున్నారు.

 " మంత్రం యత్నేన గోపయేత్"

   మననాత్ త్రాయతే మంత్రం' అన్నది ఆర్యోక్తి.


 కుళవిళక్కే-అరివురాయ్ అని అంటున్నారు.


 తరువాత ఆమె పక్కన నిదురించుచున్న చిన్ని కృష్ణుని మేల్కొలుపుచున్నారు.మూడు అడుగులతో ముక్తిని ప్రసాదించువాడైనప్పటికిని తల్లి-తండ్రులను వదిలి లేచి రాలేక యున్నాడు.ఇది బాహ్యము.


 ప్రజ్ఞానము-మంత్రమును మిళితముచేసికొని ప్రజ్వలించుచున్న ప్రకాశము మన పరమాత్మ.అవి అవిభాజ్యములు.


 గోపికలు మేలుకొలుపు పాడుతున్న నాల్గవ వారు బలరాముడు. 

అప్పటి వరకు దేవకీ -వసుదేవులు పుత్రశోకముతో నున్నారు.దానిని నిరోధించి,శ్రీక్ర్ష్ణునికి రక్షగా నిలిచిన బలరాముని,.ఆయన కాలికున్న బంగరు కడియము ఆయన వీరత్వమును సూచిస్తు ఎర్రగా ప్రకాశిస్తున్నది.ఆ విషయమునే వారు,


 శెంపోర్ కళలడి అని ప్రత్యేకముగా గుర్తుచేస్తున్నారు.దీనిలో వారి ఉద్దేశ్యము ఏమిటి?

  హలాయుఢుడైన బలరాముడు మంత్రము వలె ప్రకాశించుచున్న స్వామిని-మంత్రము పరిరక్షించు అంగ రక్షకుడు.స్వామిని వీడి యుండలేని వాడు.


 అందులకే వారు 


 ఉంబియుం-నీయుం-ఉరంగే-మేల్కాంచి,

 తమ్ముడు-నీవు-మేల్కాంచి,


 నోమునకు రమ్మనమని అభ్యర్థిస్తున్నారు.


 వారికి కావలిసినవి మూడు వస్తువులు.వానిని అనుగ్రహించమంటున్నారు.అవి,


 అంబరమే-వస్త్రము

 తణ్ణీరు-మంచినీరు

 శోరె-అన్నము-ఆహారము అవి

 అరంసెయ్యు-అర్థులకు అందించావు.


  మాకును వాటిని ప్రసాదించు అని ప్రార్థిస్తున్నరు. 

  వీరు కోరుచున్న అంబరము-వైకుంఠము,

  తణ్ణీరు-విరజానది

  శోరే-ఉపనిషత్తుల చర్చ.



 కృష్ణుని మేల్కొలిపి నోము ప్రదేశమునకు తోడ్కొనివచ్చు పనిని బలరామునికి అప్పగించి,నీలమ్మను మేల్కొలుపుటకు గోపికలతో పాటుగా కదులుచున్న ఆండాళ్ తల్లి  చేతిని పట్టుకుని,మనము మన అడుగులను కదుపుదాము.


 ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం




TANOTU NAH SIVAH SIVAM-12

    తనోతు నః శివః శివం-12   *****************   "  వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే      జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...