తనోతు నః శివః శివం-01
*******************
" కైలాసగిరి నుండి కాశికై
కాశికాపురి నుండి దాసికై
దాసికై ఈ దక్షవాటికై
దయచేసినావయా హరహర హరహర."
లోక కళ్యానమునకై ఈశ్వరచైతన్యము సూత్రధారియై కొందరిని పాత్రధారులుగా మలుస్తుంది.వారిని అంటిపెట్టుకుని ఉండమని ఇంద్రియములను పిలుస్తుంది.వాటిని అరిషడ్వర్గములతో ఆటలాడుకొమ్మంటుంది.అయ్యో పాపం అంటూ అక్కునచేర్చుకుంటుంది.దానికిఉదాహరణమే,
నిరాకారము-నిరంజనము-నిర్గుణమైన ఈశ్వరచైతన్యము సాకారమై,తనతో పాటు మరికొన్నింటిని,మరికొందరినితాను ఆడుచున్న ఆటలో భాగస్వాములనుచేస్తుంది.తానొకవైపు-తన చైతన్య ప్రకటనము మరొకవైపు ఉండేటట్లు చేస్తుంది.
పరమాత్మతత్త్వము మనకు ఒకాద్భుత స్తోత్రరాజమును అందించాలనుకుంది.దానికి మరొకరిని కర్త అనుకునేటట్లుగా చేసి సంఘటనలను పొందుపరిచినది.వాటితే మనకేమి సంబంధము లేదు అనుకుంటే మనము పప్పులో కాలేసినట్లే.
ప్రతి ఒక్కరి బదులుగా ఆ పాత్రలు భక్తిభావముతో స్వామిని సేవించుకుంటూ మనకు మార్గదర్శకముగా మారతాయి.మంచి-చెడు విచక్షణను కలిగించటానికి రెండుగా ప్రకటనమవుతాయు.వాటి మధ్యన సంఘర్షణను కలిగిస్తూ మనలను సంస్కరిస్తుంటాయి.
తన పాద తాడనమును అంశముగా చేసి-తాండవమును అనుగ్రహించాడు.
తన స్వరూప-స్వభావములను లోకవిదితము చేయుటకు,రవమును బ్రహ్మాండముగా చేయగల తనభక్తుడైన రావణ బ్రహ్మను ఎంచుకున్నాడు.అతనికి "మాతృభక్తి" అనే మహాపాశమును చుట్టబెట్టాడు.కైకసి శివార్చనకు విఘ్ణమును కలిగించి,తన పథకమును నిర్విఘ్నముగా కొనసాగించాడు.
గమనిస్తే ఇక్కడ అన్నివిచిత్రములే.అన్నీ విరుద్ధములే.
దక్షిణా పథము నుండి-ఉత్తరాపథమైన కైలాసమునకు
ప్రయాణము.
రావణుడు గ్రహీత -సదాశివుడు దాత.
జీవుడు ప్రదర్శించినది శక్తి-దేవునికి కావలిసినది భక్తి.
రావణునిది అహంకారము-సదాశివునిది మమకారము.
రావణునిది ఆగ్రహము-సదాశివునిది అనుగ్రహము
రావణుడు కోరుకున్నది ఆత్మలింగము-సదాశివుడు ఇచ్చినది ఆత్మసాక్షాత్కారము
వారికి మధ్యన సారథి అయినది స్తోత్రము.
మొదటి చరణము
**********
" జటాటవీ గలత్ జల ప్రవాహ పావితస్థలే
గలేవలంబ్య లంబితాం భుజంగ తుంగ మాలికాం
డమడ్డమ డ్డమడ్డమ న్నినాద వడ్డ మర్వయం
చకార-చండ తాండవం "తనోతి నః శివః శివం."
ఈ చరణ విశేషములను రేపటి బిల్వార్చనలో తెలుసుకునే ప్రయత్నము చేస్తాను.
కదిలేది ప్రపంచం-కదలనిది పరమాత్మ
.
భజశివమేవ నిరంతరం.
ఏక బిల్వం శివార్పణం.
.