మార్గళి మాలై-27
****************
ఇరవై ఏడవ పాశురం
****************
కూడారై వెల్లుం శీర్ గోవిందా! ఉందన్నై
ప్పాడిపరై కొండు యుం పెరు శెమ్మానం
నాడు పుగుళుం పరిశినాల్ నన్రాగ
శూడగమే తోళ్వళైయే తోడే శెవిపూవే
పాడగమే ఎన్రనైయ పల్కలనుం యాం అణివోం
ఆడై ఉడుప్పోం ; అదన్ పిన్నే పార్చోరు
మూడ,నెయ్ పెయ్దు ముళంగై వళివార
కూడి ఇరుందు కుళిరుందు ఏలోరెంబావాయ్!
తల్లికి క్షమాపణ అభ్యర్థనలతో.
*********************
శ్రీకరము శుభకరము భవహరణము శ్రీవ్రతము
శ్రీ గోదారంగనాథుల అనుగ్రహము అనవరతము
గోవింద! హనుమకు సీతమ్మ అందించిన హారము మాదిరి
ఆదరమున మా అమ్మ నీలమ్మతో ఆభరణములను అందించు
అనుకూలురు-ప్రతికూలురు-ఉదాసీనులను కలుపుకొని
ఆండాళ్ తల్లితో పాటుగ నిన్ను సేవింపగ వచ్చినాము
పరమపురుష! వండినాము పరమాన్నమను నైవేద్యమును
కర్ణిక చుట్టు రేకులవలె కూర్చుని ప్రసాదమును తిందాము
అహం అన్నం అని మేమమనగా అహమన్నాదో అనుచు నీవు,
అహం అన్నం నేననుచు నీవు అందించుటయే పెద్ద సన్మానము
వేదవిదునితోడ కలిసి కూడారై పాశురమున
చల్దురారగింప రారాదో ! ఓ చెలులారా!.
ఎంతటి అద్భుత సన్నివేశము.
********************
నవ్వునొక గోపిక-నవ్వించు నొక లలన
ముచ్చటాడు ముదిత-మురిపించునొక వనిత
పందెమేయునొకతె-పరుగుతీయునొకతె
ముందున్న గోవిందు మొదట తాకగను
పారవశ్యమునొందు పల్లాండ్లు పాడుచును
చిద్విలాసుని చూస్తు చిందులేయు
బుంగమూతిని పెట్టు బువ్వ తినిపించమని
చెంగల్వ పూదండ చేరి సవరించు
పదిమందికి పంచు పరమార్థమును తెలుప
పరమానందముతో స్వామికి పరమాన్నమందించు
దశేంద్రియ దేహము దివ్య పరిమళమైన వేళ
సాలంకృతులైనారు గోపికలు స్వస్వరూపులుగా.
వారిని సాలంకృతులుగా మలచినది ఎవరు? ఎప్పుడు? అను మన సందేహమునకు గోదమ్మ,వారు ఈ పాశురములో స్వామిని ఆరు అత్యద్భుత అలంకారములను స్వామిచే ధరింపచేయ బడిన వారట .ఆ ఆరు అలౌకిక ఆభరణానందములు,
1.ముంజేతి కంకణము-శూడగమే
2.భుజములకు శంఖ-చక్రములు-తోళ్వళియే.
3.చెవికి అష్టాక్షరి మంత్రము-తోడే
4.చెవి పూవుగా -మంత్ర స్వరూప-స్వభావము-సెవిపూవే
5పాడగమే-పాదాభరణములు(అందియలు)-పాడగమే
6.దివ్య వస్త్రములు ( దేహము)-ఆడై
ఎందరెందరో విభవమొతో అలంకరించు స్వామిచే వారు అలంకరింపబడినారు ఈ ఫలదాయక పాశురములో.కనుకనే వారు స్వామిని "కూడారై గోవింద" అని గోదమ్మతో పాటుగా కీర్తించుచున్నారు.
కూడని వారు.భగవత్ తత్త్వమును చేరని వారు.వారిని మనము ప్రతికూలురుగాను తటస్థులు గాను అనుకోవచ్చును.
ఈ ప్రతికూలురు మూడు విధములుగా నుందురు.
1. అహంకారముతో భగవంతుని యందు ప్రతికూలతను కలిగియుందురు.స్వామి తన పౌరుషమును ప్రయోగించి వారిని సంస్కరించును.శిశుపాలుడు.
2. మరి కొందరు అనుకూలురే అయినప్పటికిని స్వామి, దర్శనమునీయ
జాప్యముచేయుచు, తమను బాధపెట్టుచున్నాడని ప్రణయరోషముతో తాత్కాలిక ప్రతికూలతను ప్రదర్శించుచుందురు.స్వామి వారిని తన శృంగార చేష్టలచే సంతోషపరచి సంస్కరించుచుండును
.
3. మరికొందరు తాము స్వామికంటె అన్ని విధములుగా తక్కువ వారమను న్యూనతాభావంతో స్వామిని కూడుటకు ఇష్టపడరు.స్వామి వారి దరిచేరి అనునయించి,సరస సంభాషణములను జరిపి సామీప్యము ప్రసాదించి సంస్కరిస్తాడు.కనుక స్వామి కూడని వారినెల్లను కూడి,ప్రతి భక్తుని ఆరగింపుని-మరొక భక్తుని జిహ్వ ద్వార రుచిచూసి,ఆనందించి-ఆశీర్వదిస్తాడు.
నిను నమ్మిన వారికెన్నటికి నాశములేదు నిక్కము కృష్ణా.!
కూడారై పాశురములో గోదమ్మకు అన్న స్థానములో తానుండి శ్రీరంగమునకు సారెను పంపిన శ్రీమత్ రామానుజాచార్యులను మనః పూర్వకముగా నమస్కారములను చేస్తూ,గోపికలతోబాటుగా మనము గోదమ్మ నాయకత్వమున పరమాత్మతో ఆడి-పాడి,అడిపడులను (పాదపద్మములకు)తాకుతు
పరవశిద్దాము.
( ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.)