మీఢుష్టమ శివతమ-26
*******************
"నటనం ఆడెనే ఆ భవతిమిర హరుడు
నటకా వతంసుడై తకధిమి తకయన
నటనం ఆడెనే.......
రుద్రుడు పాటను వింటూ,తలను పంకిస్తూ,అడుగులను లయబధ్ధంగా కదిలిస్తున్నాడు.
రుద్రా! ఈ రోజు అద్భుత నృత్యప్రదర్శన ఉంది.మాతోపాటు నువ్వుకూడ రా అన్నాడు సాధకుడు.
తబ్బిబ్బైపోతున్నాడు ఉబ్బులింగడు.
నాట్యము ప్రారంభమైనది.మంచి నిష్ణాతురాలేమో ఆ నర్తకి,మంత్రించివేసిందిచూస్తున్నవారిని.
ముగ్ధగా ఒకసారి క్రీగంట చూస్తున్నది.మరుక్షణమే విరహోత్కంఠగా విచారదృక్కులను విసురుతున్నది.ఆలస్యమును క్షమించనంటు కన్నెర్ర చేస్తున్నది.సమీపిస్తున్న నాధుని సరసిజేక్షణ స్వాగతిస్తూ సౌరభములను వెదజల్లుతున్నది.
అందరిని బహిర్ముఖులను చేస్తూ తెరజారినది.
కాని సాధకునికి నర్తకిస్థానములో రుద్రుడు వేదికమీదనర్తిస్తున్నాడు.నివ్వెరపరుస్తున్నాడు.
" కన్నార కననీయుమా శివా-కన్నార కననీయుమా
చెన్నుమీరెడి కళల చిన్మయపు రూపము
కమనీయమైన నీ ఘనతేజము
కన్నార కననీయరా"
రెప్పవేయకుండా చూస్తున్నాడు ఆ గొప్పనాట్యవైభవమును సాధకుడు.
అందరు వెళ్ళిపోయారు.మనము కదులుదామా అంటు కుదిపాడు పక్కనున్న రుద్రుడు.
ఏమా నర్తకి నేత్రసౌందర్యము.విన్యాసము-విలాసము-విజయోత్సాహము.అంటుంతే
రుద్రుడు బయట కనిపిస్తున్న కన్నా-లేక లోలనుండి తనశక్తిచే కనిపింపచేస్తున్న నేత్రమా నీ పొగడ్తలను అందుకొనుచున్నది? అని అడిగాడు రుద్రుడు సందేహముగా.
అమ్మో రుద్రుడు తన నైజమును వదలడు కదా.కన్నులో కన్నంటు నన్ను తికమకపెడుతున్నాడు.నిసందేహముగా నన్ను సందేహించుచున్నాడు.
సందేహము-సమాధానమురెండు నీవైన రుద్రా.
నేను కేవలము నర్తకి రెండు నేత్రముల ప్రాభవమును ప్రస్తావించుచున్నాను అన్నాడు.
అనుకున్నా నువ్విలా మాట్లాడతావని.నీవు చూస్తున్న కన్ను దర్శకశక్తి యొక్క విభూతి.శక్తి తాను ప్రసరించుటకు ఏరపరచుకొనిన ఒక మార్గము.
కళ్లజోడు బాహ్యముగా కనిపిస్తూ దర్శకసక్తికి సహాయకారి అవుతుంది.
నీ కన్నులోపల దాగిన కన్ను తన శక్తిని నీవుచూసే కన్నులోని పొంగిస్తూ నిన్ను చూసేలా చేస్తున్నది.నర్తకిని అభినయించేలా చేసింది కూడా అదే అన్నాడు.
ఆ లోపలి కన్ను దయాదాక్షిణ్యములపై మనమందరము ఆధారపడి,దాని దయతో చూడగలుగుతున్నాము అన్నాడు.
కనిపించని కన్నును కీర్తిస్తూ-కనిపించే కన్నును చిన్నపరుస్తున్నాడు రుద్రుడు.
జ్ఞానం పశ్యతీ...అంటున్నాడు.
చక్షుసః చక్షుః అని మరీ మరీచెబుతున్నాడు.
ఇంతలో వారిపక్కకు వచ్చి కూర్చున్నారు ఇద్దరు పండితులు ఒకరితో ఒకరు ముచ్చటించుకుంటూ
హరిచే సహస్రపద్మార్చన చేయించుకున్న కన్నుకదా.
తిన్నని కన్ననిగా మార్చిన కన్నుకదా..
నిన్న నేను కల్లు దుకాణములో కల్లుతాగుతు వారితో కలిసి చిందేస్తున్న కలవచ్చింది.విడిపించుకొని రాలేకపోయానంటే నమ్ము.
ఈ కన్ను నన్ను వట్టి చవటను చేసి ఆటలాడుకుంటోంది.ఎంత విచిత్రము అంటున్నాడు.
ఉలిక్కిపడ్డాడు వారిమాటలువిని సాధకుడు
కొలిక్కి తేవాలనుకుంటున్నాడు రుద్రుడు.
కదిలేవి కథలు-కదిలించేది కరుణ
అణువు అణువు శివమే-అడుగు అడుగు శివమే.
రేపు శివానుగ్రహముతో రేపు కలుసుకుందాము.
ఏక బిల్వం శివార్పణము.