తనోతు నః శివః శివం-02
*****************
" వాగర్థా వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తియే
జగతః పితరం వందే "పార్వతీ పరమేశ్వరౌ".
వాక్కు+అర్థము ఏవిధముగా అవిభాజ్యములై పారవతీ పరమేశ్వర రూపములో ఉన్నాయో అట్టి పరమేశ్వర తత్త్వమునకు వాగర్థ ప్రసాదనమునకై నేను నమస్కరించుచుచున్నాను.(మహాకవి కాళిదాసు)
పూర్ణబిందువు ను పరమాత్మ తత్త్వముగా అన్వయించుకొను ఆగమశాస్త్రపండితులకు ,
శ్రీవిద్యారహస్యాన్వితమైన "శ్రీచక్రము"-ఉపనిషత్సమానమైన "శివ తాండవ స్తోత్రము" పరస్పరము బింబ-ప్రతిబింబములే.
చరణములోని నాలుగు పాదములు నాలుగు ప్రత్యేక విశవ్షములతో ప్రస్తావింపబడినవి.
1.ప్రపథమముగా గంగాజల ప్రవాహము నాట్య సభాస్థలిని పవిత్రమొనరించినది.
జటాటవీ గలజ్జల ప్రవాహ పావితస్థలే.
స్థలే-ప్రదేశము-పావిత స్థలే-పునీతముచేయబడిన ప్రదేశము,గలత్-ప్రవహ జలే-ప్రవాహ జలముతో పునీతము చేయబడినది ఆ నాట్యస్థలి.ఆ ప్రవాహ జలము తన పయనమును,
జటాటవి-మహాదేవుని అటవి వంటి జడల మధ్యనుండి ప్రారంభించినది.
శ్రీ చక్ర పరముగా అన్వయించుకుంటే ఇది భూపుర రహస్య సంకేతము.
ఆ ప్రవాహము ఈశ్వరుని జటాటవి నుండి తన కదలికలను ప్రారంభించి కల్మషములను తొలగించివేసినది.
అంటే ఈశ్వర చైతన్యము జలరూపముగా తనను తాను ప్రకటించుకొనుచు పృథ్వీ తత్త్వమును పునీతము చేస్తున్నది .
2.రెండవ పాదములో భుజంగము ప్రకటించబడినది.
గలేవ లంబ్య లంబితాం భుజంగ తుంగ మాలికాం
గలేవ-స్వామి కంఠమునకు,లంబ్య-చుట్లు,లంబితాం-చుట్టుకుని,భుజంగ-వాసుకి,తుంగ-పవిత్రమైన,మాలికాం-హారముగా తనను తాను అలంకరించుకొనినది.
3.డమడ్డమ డ్డమడ్డమ న్నినాద వడ్డమర్వయం.
డమరు-డమరుకము-అర్వయ-ప్రకాశించుచున్నది.
గంగ-వాసుకి స్వామికి అలంకారములై అనవరతము సేవించుట గమనించి,డమరుకము తాను సైతము డమ-డమ ధ్వనితో స్వామి కరముననిలిచి ప్రణవముతో ప్రకాశించుచున్నది.సర్వాంగ సుందరుడైన సదాశివుడు చేయుచున్న,
4.చకార చండ తాండవం "తనోతు నః శివః శివం."
గంగను-వాసుకిని-డమరుకమును ధరించిన స్వామి చేయుచున్న,
చకార-మంగళకరమైన,చండ-ప్రకాశవంతమైన,కాంతి+కరుణతో మిళితమైన తాండవము మనందరిపై మంగళములను వర్షించునుగాక.
విశేషములు
*******
స్వామి తన కదలికలతో అటవి అంటూ భూతత్త్వమును+జలము అంటూ ,జలతత్త్వమును,డమరుక నాదము అంటూ సోహం ప్రాణశక్తిని నిక్షిప్తము చేసి విశ్వరచనకై తన సాకార చైతన్యమును అమరిన కదలికల ద్వారా విస్తరింపచేస్తున్నాడు.
మొదటి పాదములో పంచభూతముల సృష్టి,రెండవ పాదములో లబ్య లంబితాం-చుట్లుచుట్లుగా చుట్టుకుంటూ,అంటూ పంచకృత్యముల ప్రస్తావనను నిక్షిప్తముచేసారు.అదేవిధముగా మూలాధారము కుండలిని చుట్లుచుట్టుకుని ఉండటం,అనాహత శబ్దముతో హృదయ స్థానము లోని ప్రణవమును నిక్షిప్త పరచి,విశ్వవిస్తరణమును చేయుచు ఈశ్వరచైతన్యము ఆర్భటి రీతిలో చేయు తాండవము శుభములను మనందరిపై విస్తరించునుగాక.
స్వామి ప్రాభవమును రేపటి బిల్వార్చనములో తెలుసుకునే ప్రయత్నమును చేస్తాను.
కదిలేది ప్రపంచం-కదలనిది పరమాత్మ
భజశివమేవ నిరంతరం.
ఏక బిల్వం శివార్పణం.