1-
"విశృంఖలా వివక్తస్థా వీరమాతా వియత్ప్రసుః"
అని పరమేశ్వరిని ప్రస్తుతిస్తుంది లలితరహస్యసహస్రనామ స్తోత్రము.
శృంఖలములు /సంకెలలోబంధింపబడియున్నదెవరు.పరమేశ్వరి వాటిని తన అనుగ్రహముతో ఎలా తొలగిస్తున్నది అన్న అవ్యాజకరుణయే దేవీఖద్గమాలా స్తోత్రములోని నవావరణ ప్రాధాన్యము.
నిరంతరము మనలను అల్లుకుంటున్న మాయతెర మనలో దాగిన శక్తులను నిద్రాణముచేస్తూ,మనము గుర్తించలేని స్థితిలో ఉంచుతుంది.మూలాధారము తమోమయము.దానిలో నుండి ఊర్థ్వపయనము ప్రారంభించనంతవరకు పశుపక్ష్యాదులకు వలెనె మానవులకు సైతము
"ఆహార-నిద్రా-భయ-మైథునస్య" ఏ సమస్తముగా ఉంటుంది.అమ్మ అనుగ్రహముతో ఇది కాదు జీవితపరమార్థము అన్న నిజమును గుర్తించి,దానిని తెలుసుకొనుటకు ఉపక్రమించెదరు.
మానవ మేథస్సు పరిమితమైనది.అమ్మ తత్త్వము అపరిమితము.కారుణ్యము కరావలంబమవుతుంది.మనము ఏ విధముగా ఒకే స్థలములో నున్న వివిధ గదులను వంటిల్లు,నిదురిల్లు,ముందుగది,పెరడు అను వివిధ నామములతో,ఆప్రదేశములో నున్నప్పుడు వివిధ ప్రవృత్తులతో ఉంటాము.అదేవిధముగాబడి-గుడి-వైద్యశాల-గ్రంధాలయము అంటూ వివిధ పనులకు అనువుగా భవనములను పిలుస్తుంటాము.
మన ఆలోచనలకు అనుగుణముగా/సులభముగా అర్థము చేసుకునే విధముగా జగన్మాత తాను సైతము ఒకే మూలశక్తి అయినప్పటికిని అనేకానేక శక్తులుగా ప్రకటితమగుతూ,పరిపాలిస్తూ,మనలను చైతన్యవంతులను చేస్తుంది.
దాని ఉదాహరనమే శ్రీచక్రములోని నవావరణములు.
సాధకునికి తెలిసిన వాటిని చూపిస్తూనే తనను తాను తెలుసుకునే స్థితిని అనుగ్రహించటమే అమ్మ తత్త్వము.
చక్రము అంటే యంత్రము అను ఒక అర్థము ఉన్నప్పటికిని,మూలము,హృదయము,కేంద్రము,ప్రియమైనది,అతిరహస్యము అను అర్థములలో కూడా సంభావిస్తారు పెద్దలు.
మొదటి ఆవరనమును త్రైలోక్య మోహన చక్రము/భూపురము అంటారు.
ఇక్కడ పరమేశ్వరి మూలాధారైక నిలయా.
అమ్మ ప్రకృతిస్వరూపిణిగా ప్రకటితమయి మూడులోకములను సమ్మోహపరుస్తున్నది.భూతత్త్వముతో ఒక హద్దును చూపించింది అమ్మ భూపురముద్వారా.
ప్రతి చక్రము ప్రత్యేకమైనదే.పరమార్థమును అనుగ్రహించునదే.
స్థూలముగా గమనిస్తే త్రైలోక్యమోహనము అనగా
గాయత్రీమంత్రములో చెప్పబడినట్లు,
భుః=భువః-సువః లోకములు.
మానవ దేహమునకు అన్వయించుకుంటే స్థూల-సూక్ష్మ-కారన దేహములను.
వీటిని చైతన్యవంతము చేయుటయే మోహనత్వము.
వీటన్నిటిలో దాగిన అమ్మ విభిన్నాకృతులు-విభిన్న తత్త్వములు చేతనులకు వారి స్వస్వరూపమును తెలుసుకొనుటకు మార్గదర్శకమవుతాయి.
మొదటి ఊహా చతురస్త్రము గురించి తెలిసికొనే ప్రయత్నమును చేద్దాము.
ఈచతురస్రాకారములో ఎనిమిది సిద్ధిశక్తులు పరిపాలిస్తుంటాయి.సమన్వయముతో కొన్ని ద్వారములదగ్గర సాధకుని మార్గము చూపిస్తుంటే మరికొన్ని దిక్కులదగ్గర వానికి దిక్కుగా మారతాయి.
ఈ ఆవరణ ప్రవేశము సాధకునిలోని నిరుపయోగ రుగ్మతలను తొలగించి,తేజోవంతునిగా తీర్చిదిద్దితాయి.
మొదటి చతురస్రాకార రేఖలో,
1.అణిమ సిద్ధి
2,లఘిమసిద్ధి
3.మహిమసిద్ధి
4గరిమసిద్ధి
5.ఈశిత్వసిద్ధి
6వశిత్వసిద్ధి
7.ప్రాకామ్యసిద్ధి
8.ఇచ్ఛాసిద్ధి
9.భుక్తి సిద్ధి
10.సర్వకామసిద్ధి మొదలగు శక్తులుంటాయి.
కొందరివాదన ప్రకారము,గరిమ+మహిమ ఒకటిగాను,
భుక్తి+ప్రాకామ్య ఒకటిగాను లెక్కించబడుతుంది.
వాదించే శక్తిలేని నేను ఈసిద్ధిశక్తుల స్వరూపములో అమ్మ సాధకుని ఎలా సహాయ పడుతూ,అనుగ్రహిస్తుందో గమనిద్దాము.
1.అణిమాసుద్ధి-ఇతరులకు అన్వయిస్తే సూక్ష్మముగా మారుట.
కాని సాధకునికి అణిమా సిద్ధి,
"అణిమాదిభిరావృతాం అహమిత్యే విభావేత్ భవాని" ఆ జగజ్జనని
సాధకుని యొక్క స్వీయ ప్రాముఖ్యతను/వ్యక్తీకరణమును తగ్గించివేస్తుంది.ఈ నేను చిన్నదయితోకాని నేను ను గుర్తించలేము.
2.అణిమ సాధకుని స్వీయప్రవృత్తిని తగ్గించి లఘిమకు పరిచయము చేస్తుంది.నేను-నాది అన్న భావనను తగ్గించుకొనిన మనసు విషయవాసనలను రొంపి నుండివిడివడమంటుంది.నీ మనసులోని భావములను తేలికపరుస్తుంది.నిన్ను స్వతంత్రునిగా మలచుటకు నీకు మహిమసిద్ధిని పరిచయము చేస్తుంది.
3.ఇప్పుడిప్పుడే నీలో దాగిన చైతన్యము నీకు కొంచముకొంచముగా అర్థమవుతుంటుంది.నా ప్రజ్ఞా పాటవములకు కారణము ఆ చైతన్యమే దానిని ప్రకటించే పరికరమే నాఈ ఉపాధి అన్న తత్త్వము బోధ పడుతున్న సమయములోనిన్ను
ఈశిత్వ సిద్ధికి పరిచయము చేస్తుంది.
4.నిర్మలమనస్కునిగా సాధకుని మార్చివేసేదిఈశిత్వసిద్ధి.పరమాత్మను గమనించాలంటే కాలుష్యము తొలగవలసినదే కదా.కడిగిన ముత్యము వంటి మనసును చేసి వశిత్వ సిద్ధిని పరిచయము చేస్తుంది ఈశిత్వసిద్ధి.
5.వశిత్వ సిద్ధికనుక సాధకునికి సహాయపడితే ప్రపంచస్వరూప స్వభావాలు పూఎరితా మారిపోతాయి.ప్రతిశబ్దము ఓంకారము.ప్రతి రూపము పరమేశ్వరి.ప్రతికార్యము పారమార్థికమే అన్న భావనతో నున్న సాధకుంకి ప్రాకామ్య సిద్ధిని పరిచయము చేస్తుంది పరాత్పరి.
6ప్రాకామ్యసిద్ధి-పరిపూర్ణ కామ్య సిద్ధి.
సాధకుడు నిత్య తృప్తుడిగా ఉంటాడు ఇంద్రియములు సైతమువిషయవాసనలను విడిచి పరమార్థము వైపునకు దృష్టిని మరలుస్తాయి.ఆ సమయములో ప్రాకామ్యము పరిపూర్ణాందప్రదాయినిని
7.భుక్తి సిద్ధిగా పరిచయము చేస్తుంది.జీవన పరమార్థమును,తననిజస్వరూపమును,తన లోని చైతన్యము చేయుచున్న అద్భుతములను సాధకుడు అనుభవించుచున్న సమయములో
8 సర్వకామ సిద్ధే సాధకుని సంకల్పము-కామ్యమును చూపుతూనే,
ద్వంద్వభావనలతో నిండియున్న సాధకునికి చక్రేశ్వరికి వందనము చేయించి,
రెండవ చతురస్రాకార గీతలోని సప్తమాతృకలకు పరిచయముచేస్తుంది.
అష్టసిద్ధి దేవతలకు-సప్తమాతృకలకు ఉన్న అవినాభావ సంబంధమేమిటి? వారు మరింత సహృదయభావముతో సాధకునికి సహాయపడతారా అన్న అంశములను తదుపరి భాగములో తెలుసుకునే ప్రయత్నము చేద్దాము.
శ్రీ మాత్రే నమః.