సౌందర్య లహరి-మణిద్వీప ఉపోద్ఘాతము
పరమపావనమైన నీ పాదరజకణము
పతిత పాలకమైనపరమాత్మ స్వరూపము
మథుకైటభ విధ్వంసములకు భయపడినవాడు
తామరతూడు క్రిందకు జారి దాగినాడు (బ్రహ్మ)
అది తామరసదళనేత్రుని నాభియని గ్రహియించె
నానా సంశయములను తల్లి తొలగించ దలచె
దివ్య విమానమును పంపి త్రిమూర్తులను దీవించె
సప్త అథోలోకములను-సప్త ఊర్థ్వ లోకములను దాటి
సాక్షాత్ సర్వేశ్వరి దయతో సాగుచున్న వారికి
సందర్శనమైనది సర్వలోకము అన్న సత్యము తెలిసిన వేళ
నీమ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
మానస విహారి ! సౌందర్య లహరి.
బ్రహ్మాండములకు గొడుగైన మణిద్వీపమునకు వందనం
మణిద్వీప వాసిని మూల ప్రకృతికి వందనం."
జగన్మాత నీ లీలలను తెలిసికొనలేని మాయామోహితులైనారు త్రిమూర్తులు.ఇక మేమెంత? తల్లి నిర్హేతుక కృపాకటాక్షమునకు నిజ నిదర్శనము సంకల్పమాత్ర సర్వలోకము మన.మనో-వాక్కాయ-నమస్సులను స్వీకరించి,అనుగ్రహ ఆవిష్కారమే మణిద్వీప సందర్శనము.
శ్రీ మహావిష్ణువు చెవి గులివి నుండి మధుకైటభులు అను అసురులు జనించి,హరి నాభికమలమున ఉన్న బ్రహ్మపై దండెత్తిరి.అనుకోని ఈ పరిణామమునకు భయపడిన బ్రహ్మ పద్మము తూడులోని కిందకు కిందకు జారి దాగుకొను సమయమున శ్రీ హరిని దర్శించెనట.కొత్తగా చూసిన హరి నాభి కమలము తన జన్మస్థానము అర్థమైన బ్రహ్మకు అంతా అయోమయముగా తోచెను.అవ్యాజ కరుణాంతర0గ అమ్మ బ్రహ్మ సందేహ నివృత్తి చేయ దలచెను. ఒక దివ్య విమానము బ్రహ్మముందు వచ్చి ఆగెను.అందులోనుండి ఓంకారము వినబడుచున్నది.దైవ నిర్దేశముగా బ్రహ్మ ఆ విమానమును ఎక్కి హరి-హరులతో పాటు అతల-వితల-సుతల-తలాతల-మహాతల-రసాతల-పాతాళ సప్త అథోకములను,భూర్లోకము-భువర్లోకము-సువర్లోకము-మహర్లోకము-జనలోకము,తపోలోకము-సత్యలోకమునకు పైననున్న సర్వలోక చింతామణి గృహమున ప్రవేశించినారన్న సద్విషయము అర్థమైన సమయమున చెంతనే నున్న నాచేతిని విడిచిపెట్టకమ్మా. అనేక నమస్కారములు.