"శ్రీ యన గౌరి నా బరగు" అన్న సూక్తి ప్రకారము మహాభట్టారికయైన యైన పరమేశ్వరి శ్రీ శబ్దముతో బహువిధములుగాప్రస్తుతింపబడుతున్నది.
1శ్రీయతే ఇతి " శ్రీః"
చేతనులు ఆశ్రయించే పరాత్పరి "శ్రీ."
2.శ్రేయతే ఇతి "శ్రీః"
ఆశ్రయించబడిన చేతనులకు పురుషకారత్వము/సహాయరూపముగా మారునది "శ్రీ"
3.శ్రుణోతి ఇతి "శ్రీః"
శరణార్తుల మొరలను ఆలకించునది "శ్రీ"
4.శ్రావయతి ఇతి "శ్రీః"
శరణార్తులమొరలను స్వామికి హృద్యముగా విన్నవించేది "శ్రీ".
5.శృణాతి ఇతి "శ్రీః"
పాపాలను నశింపచేయగల శక్తిస్వరూపిణి "శ్రీ"
6.శ్రీణాతితి ఇతి "శ్రీః"
కారుణ్యాది గుణములచే జగమంతా వ్యాపించి యుండి భక్తులకు కైంకర్యభాగ్యమును అనుగ్రహించే తల్లి "శ్రీ"
ఆ మహాకామేశ్వర కామేశ్వరి "యంత్ర " రూపముగా సాధకుని అనుగ్రహించు విధానమే చక్రము.
శ్రీచక్రము అంటే సులభతరముగాసాధకుడు తనమనోఫలకమున అమ్మ తత్తమును ఆకారములుగా ఊహిస్తూ అర్చించే విధానము.
శ్రీచక్రము లోని వివిధ ఆకారములలో దాగిన స్వరూప-స్వభావములను సంకేతించిన ,
ప్రమాణములను-పరిమాణములను-పరిణామములను తెలియచేయునదే "దేవిఖడ్గమాల స్తోత్రము."ఈ స్తోత్రము వామకేశ్వర తంత్రములో పంకజము వలె ప్రకాశిస్తున్నది.
అసలు చేతనులు శ్రీచక్రము గురించి-దాని లో దాగిన రహస్యములను గురించి తెలుసుకోవలసిన అవసరమున్నదా?
అంటే ,
మూల ప్రకృతి అయిన మాయ/మహామాయ జగత్తునంతా వ్యాపించి మోహింప చేస్తుంది.జీవుని/చేతనుని జ్ఞానానంద
స్వరూపమునకు అడ్డుగానిలుస్తుంది.భగవత్ కైంకర్య ధ్యాసను తప్పించి వేస్తుంది.దేహమే నేను అన్న భ్రాంతిలో ముంచేస్తుంది.మనలో దాగిన "ఈశ్వర చైతన్య" ప్రసక్తిని మరిపింపచేస్తుంది.ద్వంద్వములలో మునకలు వేయిస్తుంటుంది.
స్వస్వరూపము తెలియాలంటే,సర్వద్వంద్వక్షయంకరి కృపాకటాక్షము మనపై ప్రసరింపవలసినదే.ఆమె చేతిని పట్తుకుని మనము "అణిమ" నుండి "బిందువు" వరకు మనప్రయాణమును చేయవలసినదే.
మనకు అర్థమగుటకై,ఒకసారి పరమేశ్వరి పరమేశ్వరుని,
స్వామి! శ్రీచక్రం అంతే ఏమిటి? అని వినయముగా ప్రశ్నించినదట.
అప్పుడు పరమేశ్వరుడు దేవీ!
"శ్రీచక్రం త్రిపురసుందర్యా బ్రహ్మాండాకరమీశ్వరీ"అని సెలవిచ్చినాడట.
"పంచభూతాత్మకంచైవ -తన్మాత్రాత్మకమేవచ" అంటూ,
పంచభూతములు-పంచతన్మాత్రలు,కర్మేంద్రియములు-జ్ఞానేంద్రియములు-మనసు.
ఇవికాక
మాయ-శుద్ధవిద్య-మహేశ్వరుడు-సదాశివుడు
అను 21 అంశలతోనిండి సృష్టి విధులను నిర్వహిస్తున్నది ఆ పరాశక్తి.
ఇంకొక ముఖ్యవిషయము
ఏకేశ్వర రూపములో నున్న పరమాత్మ సృష్టిచేయు సంకల్పముతో తనను తాను
ప్రకాశ-విమర్శ రూపములుగావిభజించుకుని,
"శ్రీ చక్రము"లో,
శివశక్తులుగా
పార్వతి-పరమేశ్వరులుగా
బింబ-ప్రతి బింబములుగా
ప్రకృతి-పురుషులుగా,
తొమ్మిది కోణములుగా,
విరాజిల్లుతున్నారు.
ఇందులో వారిరువురి మధ్య ఎక్కువ-తక్కువ ప్రసక్తి కాని,గోచర-అగోచర భావము కాని,స్థావర-జంగమ ప్రాధాన్యము కానిలేనేలేదు.
పరబ్రహ్మమునకు రూపకల్పనము జరిగితే "పరాభట్టారిక" గా ప్రకటితమవుతుంది.పాలిస్తుంది.
శ్రీ మాత్రే నమః.