Friday, December 29, 2017

POOJALU-SARASVATEE NAMOSTUTE

సరస్వతీ నమోస్తుతే
*******************
జగమున శారద నమోస్తుతే _ గగనపు శారద నమోస్తుతే
సుత నారద నమోస్తుతే -సిత నీరద నమోస్తుతే
ఇందిర సఖి నమోస్తుతే -ఇందు ముఖి నమోస్తుతే
వేదసారమా నమోస్తుతే - ఘనసారమా నమోస్తుతే
పటిమ అనుపమ నమోస్తుతే - పటీర ఉపమ నమోస్తుతే
మాఘ శుక్ల పంచమి నమోస్తుతే - మరాళ వాహన నమోస్తుతే
తల్లి ఆకార నమోస్తుతే -మల్లికాహార నమోస్తుతే
నిషాద ఏలిక నమోస్తుతే - తుషార పోలిక నమోస్తుతే
చేత కచ్చపి నమోస్తుతే - ఫేన స్వచ్చత నమోస్తుతే
అజుని నాయికా నమోస్తుతే - రజతాచలమా నమోస్తుతే
కాంతి సంకాశ నమోస్తుతే -కాస ప్రకాశ నమోస్తుతే
పుష్ప కేశిని నమోస్తుతే- పూజ్య ఫణీశ నమోస్తుతే
భక్త మందార నమోస్తుతే - కుంద మందార నమోస్తుతే
వసుధ నాదనిధి నమోస్తుతే - సుధా పయోధి నమోస్తుతే
ఆశ్రిత పోషిత నమోస్తుతే _ సిత తామరస నమోస్తుతే
ఆగమ విహారి నమోస్తుతే -అమర వాహిని నమోస్తుతే
ఓంకార రూప నమోస్తుతే - శుభాకార రూప నమోస్తుతే
పోతన శుభస్తుత నమోస్తుతే - శ్వేత వస్త్రధర నమోస్తుతే
సకల బుద్ధివి నమోస్తుతే - సకల సిద్ధివి నమోస్తుతే
సర్వశుక్ల రూపమా నమోస్తుతే -సరస్వతీ నామమా నమోస్తుతే
మనసా-వచసా- శిరసా సతతం స్మరామి.
పురుషార్థ ప్రదాయినీ పున: పున: నమామి.
భావము
శరదృతువులో పిండారబోసినట్లుండే వెన్నెల- శారద
నీటిని తనలో దాచుకుని తెల్లగా ప్రకాశించే మేఘము- నీరదము
మరల మరల అభివృద్ధిని పొందువాడు చంద్రుడు- ఇందు
ఆత్మార్పణములో అవశేషమే లేనిది కర్పూరము- ఘనసారము
పరిమళము-ప్రశాంతత కలది- మంచి గంధము-- -పటీరము
పాలు-నీరు వేరుచేయ గలిగినది హంస- మరాళము
శబ్ద-స్పర్శ-రూప-రస-గంధాదులు కలిగినది-మల్లెపువ్వు--మల్లిక హార
అర్ద్రతయే స్వభావముగా గలది-మంచు--తుషార
పరుగుల ఒరవడి-నడవడి గలది నురుగు-ఫేనము
చల్లదనము-తెల్లదనము కల కొండ- వెండి కొండ--రజతాచలము
పరమాత్మ సూక్ష్మ రూపములో వసించు గడ్డి(పువ్వు)--రెల్లుపువ్వు--కాశ
అగ్నిని-జలమును సమతౌల్యము చేయగలది-ఆదిశేషుడు-- ఫణీశ
స్వయం ప్రకాశ -సత్వగుణ ప్రతీక-దేవతా పుష్పము--కుంద
కోరిన కోరికలు తీర్చు కల్పవృక్షము---మందార
అవధులులేని అమృతగుణము- పాల సముద్రము-- సుధా పయోధి
సకల జ్ఞాన స్థానమే తెల్ల పద్మము ---సిత తామరస
పైనుండి క్రిందికి దిగివచ్చినది-ఆకాశ గంగ-- అమర వాహినీ
ఓంకార స్వరూపమైన సంపూర్ణత్వము శుభాకారత
ప్రకాశించుట యందు ఆసక్తిగలది భారతి.(జ్ఞాన స్వరూపము)

పోతనగారి సహజకవిత్వపు లోతులగురించి తెలిసికొనుటకు భక్తి-భావన అను రెండు దివ్య నేత్రముల సహకారము ఎంతో అవసరము.వారు ఈ పద్యములో ఎన్నో తాత్త్విక విషయములను పొందుపరచిరి అనిపిస్తోంది.ఇవి అలంకారిక శాస్త్ర ప్రకారము తీసుకున్న ఉపమానములు మాత్రమే కావేమో.కొంచం పరిశీలిద్దాము.
1 స్థూల సూక్ష్మ విషయ విచారణ చేశారనుటకు వారు ప్రయోగించిన
మేఘము-వెన్నెల, మంచు బిందువు-మంచు కొండ,నురుగు-సముద్రము, రెల్లు-కల్పవృక్షము,పద్మము-జ్ఞానము రెండు అమ్మయే అయితే అమ్మ అంటే ఎవరు. ఇంకొంచము దర్శించగలిగితే
పంచభౌతికతత్త్వము ఈ జ్ఞాన ప్రకాశము అనిపిస్తుంది.ఉదాహరణకు,
1.ఆకాశ తత్త్వము- మేఘము-వెన్నెల-చందమామ
2.జల తత్త్వము-మంచు బిందువు,నురుగు,ఆకాశ గంగ,సముద్రము.
3.అగ్ని తత్త్వము- ఆదిశేషుడు {విషము-అగ్నికీలలు)
4.భూతత్త్వము-రెల్లు,కల్ప వృక్షము
5.వాయు తత్త్వము-పువ్వులు చందనము కర్పూరము (సువాసనను వ్యాపింపచేయును)
పంచేంద్రియ సంకేతములు కూడా గోచరిస్తున్నాయి.
సముద్రము- నాదము -కర్ణము (చెవి)
వెన్నెల-గంగ-స్పర్శ (చర్మము)
పువ్వులు-గంధము-నాసిక ముక్కు)
మకరందము-వాక్కు-రసనము (జిహ్వ)
సర్వ శుక్లరూపము-నయనము. (కన్ను)
అంతేకాదు,
శరదృతువు,మేఘము,చంద్రుడు,కర్పూరము,మంచిగంధము,మల్లెపూలు,కల్పవృక్షము,మంచుకొండ.ఆకాశ గంగ,రజో-తమో గుణములనధిగమించితమని తాము స్వఛ్చందముగా సమర్పించుకుంటూ,పరోపకారం ఇదం శరీరం గా ప్రకాశించునవి.
చర్మ చక్షువులకు సరస్వతీదేవి సర్వశుక్ల స్త్రీమూర్తిగా ద్యోతకమగును కాని కొంచము ఆలోచిస్తే పోతన ఆ మూర్తిని పరోపకారమైన పంచభూత స్థూల-సూక్ష్మ ప్రాకృతిక ప్రవాహ జ్ఞానముగా కనుగొనినాడనిపిస్తోంది.
అట్టి జ్ఞానగంగా ప్రవహాము మనలనందరిని అనుగ్రహించుగాక.

AMMA-08

"అవిదితం కిం"
( తల్లీ నీకు తెలియనిదా!!)
కడుపున పడగానే కడు సంతోషిస్తానమ్మా
ఎదుగుతున్నన్నాళ్ళు ఒదిగిఒదిగి ఉంటానమ్మా
హోరాహోరి పోరులో "నేను" కేరుమంటానమ్మా
నా ఏడుపు నీ గెలుపుకు "అభినందనలే" అమ్మా.
నేను,నీ
ఒడిలో పడగానే ఒడుపుగ పట్టుకుంటానమ్మా
ఆడపిల్లేమోనని అనుమానపు దిగులున్న
అమ్మగా నిన్నసలు ఊహించనేలేనమ్మా
ఏడాది నిండగానే తోడు నడుస్తానమ్మా
ఆడపిల్లనని అక్కడే వదిలివెళ్ళుచున్న
అమ్మగా నిన్నసలు ఊహించనేలేనమ్మా
పాల బువ్వ పెడుతూనే మురిపాలు పంచుతానమ్మా
ఆకలవుతున్నదని నన్ను అమ్మకానికి పెట్టుచున్న
అమ్మగా నిన్నసలు ఊహించనేలేనమ్మా
ఎదురుగా ఎదుగుతూనే మీ కీర్తిని ఎగురవేస్తానమ్మా
ఆడపిల్ల నీవనుచు అవమాన పరచుచున్న
అమ్మగా నిన్నసలు ఊహించనేలేనమ్మా
ఏడడుగులు నడిచినా ఎదలో నింపుకుంటానమ్మా
జోలి నిండుతుందని ముసలికి ఆలిని చేయుచున్న
అమ్మగా నిన్నసలు ఊహించనేలేనమ్మా
మెట్టినింట నేనున్నా పుట్టినింటికి వన్నె తెస్తానమ్మా
వేరొక ఇంటిదీపం అని వివక్ష చూపించే
అమ్మగా నిన్నసలు ఊహించనేలేనమ్మా
కాని,ఒక్కమాట
అమ్మా, నీవు నాకొక అవకాశము ఇస్తేనే గదా
నేను "అమ్మనై"" అభినందనలు" అందుకునేది.
happy mother's day

NAANNA-NAANNA CHAYI

జగత: పితరే వందేం పార్వతీ పరమేశ్వరం
తన్మయమున నన్ను చూస్తున్న ఒక అమృతమూర్తిని
అమ్మ పరిచయము చేసింది అపురూపపు నాన్నని
అందిస్తు నన్ను తన అమూల్యమైన చేతికి
ఆ నిమిషము నుండి అరనిమిషము వదలకుండ
ఆశీర్వదిస్తున్నది అనవరతము ఆ చేయి
.........
చరచరమను జ్వరముతో విచారముతో నేనుంటే
ఆచారిగ మారి నా నుదురును సరిచేసింది.
అవమానముతో కృంగి అశ్రువులతో నేనుంటే
కన్నతల్లి తానై నా కన్నీటిని తుడిచింది
ఈడు హోరులోపడి చెడుదారిలో నే వెళితే
చెవి పాశమై చతురతతో నా దారిని మళ్ళించింది
చిరుతిళ్ళను ఆశించి చిల్లర నేనీయకుంటే
ముక్కుపిండి నా పనులను చక్కగ చేయించావు
మందు చుక్క మింగలేక మందముగ నేనుంటే
కందకుండ బుగ్గనొక్కి అందగాణ్ణి చేసింది
ముద్దను రానీయనని మారాముతో నేనుంటే
గోరుముద్దగా పెదవిని గోముగా తాకింది
బ్రతుకులో భయపడి నే కాస్త వెనుకాడితే
అభయము తానై నన్ను వెన్నుతట్టి పంపింది
ముళ్ళదారి నా పాదాలు కందిపోతాయని
గుబళించు గులాబిగ నా అడుగుకు మడుగు అయ్యింది
తన చేతలతో నా పై ప్రేమను చాటిన ఆ చేయి
ఘనతను కనుగొని నమస్కరిస్తు నేనుంటే
అనయపు ఆశీర్వచనమై నా తలపైన కూర్చున్నది
........................
వాస్తవాలను గుర్తించి ప్రస్తుతించలేని నాకు
సమస్తమే కద ఇ "హస్త మస్తక సమ్యోగము"
పునీతుడుగ మారి"
"ప్రణుతితో నాచేతులను ప్రణతిగా మారనీ"

NAANNA- A SAMASTAAT

ఆ-సమస్తాత్ ( తానే సర్వం)

బాలమిత్ర పుస్తకములో బాలరాజు కథకాదు
కాల దోష చరిత్రలో ఎన్నటికి చేరిపోదు
మీ నాన్నా మా నాన్నా మనందరి నాన్నల కథ
తరాలెన్ని మారినా తరలించలేని కథ.
మమకార సామ్రాజ్యపు మహారాజు కథ.
********************************
దైనందిన పనులలో సైనికుడిని అంటాడు
పనిచేసే వేళలలో సేవకుడిగా మారుతాడు
అక్షరాల అర్చనలో ఆచార్యునిగా మారుతాడు
క్రమశిక్షణ నేర్పుతూ ఆరాధ్యునిగా అవుతాడు
తాను సంపాదించిన సర్వస్వము నా కోసము అంటాడు
సంస్కారపు సంపదకు కోశాధికారి అవుతాడు
చెడుజోడు చేరనీక అరికడుతు ఉంటాడు
ఒడుపున దునుమాడే దండనాథుడవుతాడు
ఒడిదుడుకులలో రక్షించి గట్టి భద్రతను ఇస్తాడు
పట్టువదలక నన్ను పట్టభద్రునిగా చేస్తాడు
కుళ్ళు కుతంత్రాలను కుళ్ళగించి వేస్తాడు
మళ్ళీ దరిచేరని మంత్రాంగం చేస్తాడు
ఖచ్చితముగా తన సంతోషము ఖర్చు చేస్తుంటాడు
నన్ను మెచ్చుకునేలా చేయుటకు నిచ్చెన తను అవుతాడు
ఎవరెంత పొగిడినా భేషుగ్గా వింటాడు
ఏ మాత్రము మారడు భేషజమే లేనివాడు
రాజువని నేనంటే రాజీ పడనంటాడు "నాన్న",తనపై
పూజనీయతకు రోజు రోజు మరింత చోటునిస్తు.

PANDUGALU-RANJAAN

ఈద్ ముబారక్
*************
మనసును "మక్కా" చేసిన మనిషి తెలుపు కృతజ్ఞత
" ఈద్-ఉల్-ఫితర్" అను ఈద్ ముబారక్ కత.
"నమాజ్-సలా-రోజ-జకాత్-హజ్" అను ఐదు
పవిత్రతకు రూపాలు-పాటించవలసిన నియమాలు.
తొమ్మిదవనెల "చంద్రరేఖ" తోడై
చేయిస్తుంది " రం జాన్ నెల ప్రారంభము"
ఆకలి-దప్పులను అధిగమించుటయేగ "రమదాన్"
" అల్ల-హో-అక్బర్" అంటున్నది అమ్మీజాన్.
ఆధ్యాత్మిక శిక్షణ అలవరచుకొనుటయేగ "రం జాన్"
అర్థము వివరిస్తున్నాడు అందరికి బాబా జాన్.
చేతగాని వారికి చేయూతగ సాయము చేయి
"సహరీ" అందిస్తున్నాడు సలీం అనే అబ్బాయి.
కుతూహలము ఆగదుకదా "కుత్బా" సమయము కొరకు
కూలంకషమైన పరమ పవిత్రము ప్రతిపలుకు.
విశ్వసోదరత్వమునకు అవుతాము గిరఫ్తారు
విశిష్టతను వివరించు విందుయేగ "ఇఫ్తారు".
ఖర్జూరపు మిఠయిలు-కమ్మనైన హలీములు
తియ్యనైన పాయసాలు-తీరైన సలాములు.
" అల్ల(హ్) అచ్చా కరేగా" అంటున్నది అమీనా
"ఫిత్రా' నందుకున్న చేతులతో దీవిస్తూ
అచ్చా పేట్ భరేగా అనుకున్నది ఆలియా
ధాన్యమును దానమిచ్చు పద్ధతిని పాటిస్తూ.
అంతా మనుషులమేగా ఆదుకోగ హమేషా
"జకాత్" ను అందిస్తున్నాడు జాలితో పాషా.
ఇరవై ఒకటవరోజు నుండి "షవ్వాల్" మాసము వరకు
"ఏతెకాఫ్" చేస్తున్నారు ఎందరో మహనీయులు.
"ఉమ్రాలు-తఖ్వాలు-తహజ్జుదులు-తరావీలు"
ప్రవక్త సందేశాలను పాటించుచు ప్రార్థనలు.
"షబ్-ఎ-ఖదర్" ప్రీతితో అందించినది" ఖురాను"
షడ్వర్గ నియంత్రణతో ప్రవర్తించాలని "ముసల్మాను"
"రోజేదారులు ప్రవేశించ స్వాగతించె "రయ్యాను"
ఉమ్రాను హజ్జ్ గా పరిగణించె "సులేమాను"
అత్తరు పరిమళాలు-కొత్త బట్టల కొనుగోళ్ళు
సరదాలు-సందళ్ళు- సంబురాల ఆనవాళ్ళు.
రానే వచ్చేసింది షవ్వాల్ నెల మొదటిరోజు
రాతిరి తెచ్చేసింది "హిలాల్"ని నువు చూడు.
"అలాయ్-బలాయ్" అంటూ ఈద్ త్యోహార్ ఆగయా
ఆశీర్వదిస్తున్న అల్లహ్ కు బహూత్ బహూత్ షుక్రియా.
(దోషములను సవరించి పునీతము చేసిన శ్రీ షేక్ అన్వర్ అహమ్మద్ గారికి సవినయ నమస్కారములు.నా అజాగ్రత్త వలన అక్షర దోషములు-అర్థ దోషములు దొర్లిన క్షంతవ్యురాలను.) నిమ్మగడ్డ సుబ్బలక్ష్మి.

PANDUGALU-NEW YEAR-2013


ప్రతి నాసిక పీల్చని పరిమళాల గాలిని
ప్రతి నాలుక రుచి చూడని షడ్రసోపేతములని
ప్రతి భుజము మోయని ప్రగతి పంట బరువుని
ప్రతి గుండెలో నిండని కరుణ అనెడి కడలిని
ప్రతి కడుపు తేంచని పదార్థములతో నిండి
ప్రతి చేయి జేకొట్టని బంగారు దేశానికి
ప్రతి నడుము బిగించని ప్రతిజ్ఞా పాలనకి
ప్రతి అడుగు కదలని ప్రశాంత జీవనానికి
ప్రతి మేథ తరలని సుందర బృందావనానికి
ప్రతిధ్వనులు వినిపించని జయజయ నినాదముకి.
విశ్వమే విరబూయని శాశ్వత ఆనంద పూవులని .

pandugalu-new year 2012

 నూతన సంవత్సర శుభాకాంక్ష
 రమ్మన్నా,పొమ్మన్నా
ముమ్మాటికి విననంటూ
ఎవరేమనుకున్నాగాని
తనదారే తనదంటూ
మంచిచెడులు పంచుతూ
కలిమిలేమి చెలిమిచేస్తూ
సుఖదు:ఖముల
శ్రీముఖములు చూస్తూ
పెద్దతనమునేమాత్రము
చిన్నబుచ్చనీయకుండా
చిన్నతనము వెన్నుగా
మిన్నతనము చాటుతూ
మత్తులెన్నో తొలగిస్తూ
గమ్మత్తులనెన్నో తెస్తూ
వీడలేని వీడ్కోలు
ఎంచలేని ఎదుర్కోలు
ఇరుముఖములుగా గల
జానుస్‌ జనవరిగా మారగా
కాలపు కొలమానముగా
యమ మాయాజాలముగా
దోబూచులాడుతూ
చీకటి వెలుగులుగా
వాకిత్లో వరమైనది
రెండువేల పద్నాలుగు.

TANOTU NAH SIVAH SIVAM-12

    తనోతు నః శివః శివం-12   *****************   "  వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే      జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...