కుర్యాత్ కటాక్షం కళ్యాణి-04
******************
ప్రార్థన
******
గతైర్మాణిక్యత్వం గగనమణిభిః సాంద్రఘటితం
కిరీటం తేహైమం హిమగిరిసుతే కీర్తయతి యః
సనీడే యత్ ఛాయాత్ చురణశబలం చంద్రశకలం
ధనుఃశౌనాసీరం కిమితి నః బధ్నాతిధిషణాం.
శ్లోకము.
******
" బాలామృతాంశు నిభఫాలామనంగరుణ చేలానితంబఫలకే
కోలాహల క్షపితకాలామరాకుశల కీలా శోషణ రవిః
స్థూలాకుచే జలదనీలాకచే కలిత లీలా కదంబ విపినే
శూలాయుధా ప్రణుతి శీలావిభాతు హృది శైలాధిరాజ తనయా."
పూర్వ స్తోత్ర ప్రస్తావనము.
****************
మందార మకరందమాధుర్యమును గ్రోలుమధుపంబు బోవునే మదనములకు--పోతన మహాకవి.
అదేవిషయమునుమరింతనొక్కి వక్కాణిస్తూ,తల్లీ నీ పాద రజ మకరందమును, అనన్య భక్తితో గ్రోలుటకు నామనసును తుమ్మెదగా మార్చి నన్ను అనుగ్రహింపుము .తల్లీ !సంసారమనేసర్పము విషపుకాటులతో నన్ను సతమతము చేస్తున్నది.దానిని ఆడుముంగిసవై అదృశ్యము చేసి నన్ను నీ సేవకు సంసిద్ధముచేయి అని ,మహాకవిప్రస్తుత శ్లోకములో అకుశలతలను తొలగించమని వేడుకుంటున్నారు.
పద విన్యాసము
*************
1." లలాటం లావణ్యద్యుతి విమలం ఆభాతి తవ యత్
ద్వితీయం తత్ మన్యే మకుట ఘటితం చంద్రశకలం"
ఆదిశంకరులు తల్లీ నీ లలాట సౌందర్యము పూర్ణచంద్ర కాంతులీనునది,అయినప్పటికిని సగము భాగము నీ కిరీటము లో నిక్షిప్తమై,మిగిలిన అర్థభాగ చంద్రరేఖ మాత్రమే నీ ఫాలభాగముగా ప్రకాశించుచున్నదని, అహం-నేను,మన్యే-భావిస్తున్నాను తల్లీ"అని దర్శించి,మనలను అనుగ్రహించారు.
జగజ్జనని,
*********
ఫాలా-నుదురు కలది
నిభ -ఫాలా
పోలిన-నుదురు కలది
అంశు -నిభ -ఫాలా
కిరణములను-పోలిన-నుదురుకలది
అమృత-అంశు-నిభ -ఫాలా
అమృత-కిరణములను-పోలిన-నుదురు కలది.
బాల-అమృత-అంశు-నిభ
-ఫాలా
బాల/లేత-చంద్రుని-కిరణములను-పోలిన-నుదురుకలది
శిరస్థితా చంద్రనిభా ఫాలసేంద్ర ధనుః ప్రభా"
అమ్మా నీ ఫాలభాగము అర్థచంద్రరేఖను ధరించి ఇంద్రధనుసు వలె కాంతులీనుచున్నది.
సోమ-సూర్య-అగ్ని తత్త్వ విరాజితమైన జగజ్జనని నుదురు శుభములను అనుగ్రహించును గాక.
.
ఉపమా-కాళిదాసస్య-నమోనమః
2.వస్త్రము
*******
బృహత్-సౌవర్ణ-సౌందర్య -వసనాయై నమోనమః
బృహత్వమే-స్థూలత్వమే-వస్త్రముగా-ధరించిన సుందరి జగజ్జనని.
మొదటి శ్లోకములో పాటీరగంధ కుచ శాటీ-అని ఉత్తరీయమును మాత్రమే ప్రస్తుతించినమహాకవి,ప్రస్తుత శ్లోకములో,
చేలా-వస్త్రమును(చీరను) ధరించినది
అరుణ -చేలా-ఎర్రని వస్త్రమును - ధరించినది.
మనాక్- అరుణ -చేలా-
లేత - ఎర్రని -వస్త్రమును- ధరించినది.
3.ఓం సువర్ణ కుంభ యుగ్మాభ సుకుచాయై నమః
కుచే-
వక్షోజములు (పోషించునది) కలది
స్థూలా -కుచే
-విశ్వపోషణను నిర్వహించు స్తనములు కలది.
4. చంపక-అశోక- పున్నాగ- సౌగంధిక- లసత్-కచా
చంపకములు-అశోకములు-పున్నాగ పుష్పములు మొదలగువానికి సౌగంధమును ప్రసాదించుచు-ప్రకాశించుచున్న థమ్మిల్లము కల జనని నమస్కారము.
కచే-కేశ సంపద కలది.
నీలా-కచే-
నల్లని- కేశసంపద కలది.
జలద- నీలా- కచే-
జలమును ధరించి-ద-ఇచ్చుటకు/వర్షించుట సిద్ధముగా నున్న మేఘము వంటి నల్లని కేశ సంపద కలది.
లీలా స్వరూప విలాసము కలది.
కలిత లీలా-తనకు తాను మనోహరముగా కల్పించుకొనిన రూప సౌందర్యము కలది.
ఆది శంకరులు అమ్మ స్వరూపమును దర్శింపచేస్తూనే స్వభావమును సంస్తుతిస్తున్నారు.
4.రవి -సూర్యుని వంటిది.
శోషణ - రవి-
ఇంకింపచేయు సూర్యుని వంటిది.
కీలా- శోషణ - రవి
జలములను- ఇంకింపచేయు -సూర్యుని వంటిది.
అకుశల - కీలాల- శోషణ- రవి
కుశలము కాని-(/కష్టములను) నీళ్ళను - ఇంకింపచేసే - సూర్యుని వంటిది
అమర - అకుశల - కీలాల -శోషణ - రవి
దేవతల - కష్టములను -నీళ్లను - ఇంకింపచేసే - సూర్యుని వంటి తల్లి
- క్షపిత-కాల--- అమర . అకుశల -కీలాల - శోషణ - రవి
కష్ట కాలము గడుపుచున్న - దేవతల - కష్టములను నీళ్ళను- తన వేడిమితో-ఇంకింపచేయు - సూర్యుని వంటి తల్లి
కోలాహల-క్షపిత కాల -అమర- అకుశల - కీలాల-శోషణ-రవి
చుట్టుముట్టి కదలనీయని సమయములోనున్న-వాటిని అధిగమించలేని స్థితిలో నున్న - దేవతల - కష్టాల సమూహములనే నీళ్ళను - ఇంకింప చేయు - సూర్యుని వంటి తల్లీ.
చంద్ర సూర్య అగ్ని కళాత్మిక త్రినయని,అర్చిషిత్-మహస్వత్-జ్యోతిష్మత్ అను మూడు విధములైన కళలను ప్రసరింపచేస్తు సమశీతోష్ణములను కలుగచేస్తుంది.
సూర్యుని నుండి ప్రసరించునవి మహస్వత్ కళలు.కష్టములనే జలమును ఇంకింపచేయునవి.
5.
'ప్రణమ్రేష్వేతు ప్రసభముపయా తస్య భవనా
భవస్యాభ్యాత్థానే తవ పరిజనోక్తిః విజయతే (కిరీతం వైరించి-సౌందర్యలహరి)
సదాశివుడు గజాసురసంహానంతరము భవనమునకు విచ్చేయుచున్న వేళ,జగన్మాతభర్తను స్వాగతించి,నమస్కరించుటకు ఎదురేగుచున్న సన్నివేశము.అమ్మా నీ దారిలో నీకు నమస్కరించుటకు, వారి విజయములను విన్నవించుకొనుటకు నీచే పంపబడిన దేవతలకిరీటములు తాకి నిన్ను నొప్పించగలవు.కనుక వాటిని చూసి-దాటుకుంటూ వెళ్ళు తల్లీ అని చెలొకత్తెలు విజయధ్వానములను చేయుచున్నారట.
తల్లి మహా పతివ్రత.ప్రతిరోజు అత్యుత్సాహముతో శూలధారికి ప్రణమిల్లునది.ప్రణుతులను విని ఆనందించునది,అదేవిషయమును ఆదిశంకరులు జిహ్వాగ్రమున నున్న శుక్లసరస్వతి నీ పతి వీరగాధలను వినిపిస్తూ తాను సైతము నీ జిహ్వాగ్ర ఎర్రదనమును సంతరించుకున్నదని భావించారు.
శీలా-స్వభావము కలది
ప్రణుతి -శీలా-
స్తోత్రములే ఆహ్లాదము కలిగించు స్వభావము కలది
శూలాధిప -ప్రణుతి శీలా-
శూలధారి యైన పరమేశ్వరుని స్తోత్రములకు సంతసించు స్వభావముకలది యైన
శైల అధిరాజ తనయా
పర్వత రాజపుత్రిక
భాతు-ప్రకాశించును గాక
వి- భాతు
-విశేషముగా -ప్రకాశించును గాక
హృది - వి- భాతు-
హృదయములో నిలిచి విశేషముగా ప్రకాశించును గాక
మే-హృది-విభాతు
నా హృదయములో నిలిచి విశేషముగా ప్రకాశించును గాక.
ఓ శైలపుత్రీ!
నీవు భాను మండలమధ్యస్థా-భైరవి భగమాలినిగా, వశిన్యాది వాగ్దేవతలచే కీర్తింపబడుచున్నావు.అంతే కాదు మను విద్యా-చంద్ర విద్యా చంద్ర మండల మధ్యగా కూడా స్తుతింపబడుచున్నావు.తల్లీ నీ దక్షిణనేత్ర తీక్షణతగా సౌరశక్తిగా-వామ నేత్ర శరత్-జ్యోత్స్న ను చంద్రశక్తిగా ప్రసరింపచేయుచు జగమునకు పోషణను కలిగిస్తున్నావు.
ఓ స్థూలాకుచా నీ స్తనదర్శనములో మాకు మేము స్వీకరించే ఆహార పానీయాలను దర్శించగలగాలి.వక్రదృష్టి మా దరికి రానీయకమ్మా.నీ వు మాకు ఆహారమునకు కావలిసినజలమునందించు నల్లని మేఘ సంస్కారము నీ నల్లనికురులలో నిక్షేపించావు. ఓ జలద నీలకచా కరుణామృత వర్షమును అనుగ్రహించిమమ్ములను పోషించుచున్న ఓ
గోప్తీ గోవిందరూపిణి నీవు శివస్తుతులను ఆలకించుటయే నీ సహజ స్వభావముగా ఉంటావు.శివుడే శుభంకరుడు.శుభముల యందు ఆసక్తి నీ సహజ స్వభావము.
మహాదేవ రతౌత్సుక మహాదేవి వందనమమ్మా.
సంసార పంకనిర్మగ్నా! నీవు నన్ను ఈదనీయలేని సంసార సాగర కీలలను,నీ సూర్య ప్రతాపముతో ఇంకింపచేసి,నాహృదయములో వసించి,చైతన్య భరితము చేయవమ్మా.
అను భావ మకరందముతో అమ్మను అభిషేకించారు.
ఉపమాకాళిదాసస్య-అన్న నానుడిని రూఢి పరుస్తూ మహాకవి,అమ్మ నుదుటిని బాల చంద్రుని తోను,అమ్మ కురులను వర్షించే నల్లని మేఘముతోను,అమ్మ సంరక్షణ బాధ్యతను సూర్య ప్రతాపముతోను,అమ్మ సౌభాగ్య గుణమును శివ స్తోత్ర శ్రవణముతోను మనకు అర్థమగుటకు అన్వయించి,దర్శింపచేసారు.
బాలా,ఫాలా,చేలా,కోలాహలా,కాలా,కీలా,స్థూలా,నీలా,లీలా,శూలా,శీలా,శైలాధిరాజ మొదలగు పదములలో లా అను అక్షరము ఆవృత్తముచేసి వృత్తానుప్రాస లతో నాదభూషణములను అలంకరించారు..
కవితా చమత్కారము.
మహాకవి కాళిదాసు జలమును కరుణకు-కష్టములకు వేరువేరు సందర్భములలో ప్రస్తావించి కమనీయతను చాటినారు.
శూకాతుధ అను పదమును త్రిగుణాతీత స్థితికి సంకేతించినారు.
యాదేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా
నమస్తస్త్యై నంస్తస్త్యై నమస్తస్త్యై నమోనమః
సర్వం శ్రీమాత దివ్యచరణారవిందార్పణమస్తు.
(అమ్మ దయతో అర్చన కొనసాగుతుంది.)
****