Monday, May 28, 2018

ANDAAL AMMA

 సంభవామి యుగేయుగే  సాక్ష్యము హరి కళత్రము
 ధర్మ సంస్థాపనమే లక్ష్యమైన మన ఆళ్వారులు

 శ్రీవిల్లిపుత్తూరులో విష్ణుచిత్తీయుని పుణ్యముగా
 పసిపాపగ  ప్రకటించబడినది తులసివనములో

 విష్ణుకథాశ్రవణము-పుష్పమాలాలంకరణములు
 వివాహమాడదలచినది స్వామిని స్థిరచిత్తముతో

 గోపకన్యగా మారినది-గోపికలను పిలిచినది
 తిరు పాశురములు వ్రాసినది-వ్రతములు చేసినది

 చూడికొడిత్తాల్ మనకు మోక్షమార్గము చూపించినది
 రంగనాథుని దేవేరిగా  శ్రీరంగమున కొలువైనది

 నిత్య నిర్గుణ నిరంజనుని నిరతము మది నిలుపుకొని
 పరమార్థమును చాటిన ఆండాళ్ తల్లి పూజనీయురాలాయెగ.


 ఆంధ్రభోజుని ఆముక్తమాల్యదయే మన ఆండాళ్ తల్లి.తాను ధరించిన పూలమాలను స్వామికి అర్పించిన మహాపతివ్రత.ధర్మసంస్థాపనకై శ్రీవిల్లిపుత్తూరులో తులసివనమున అయోనిజగా ప్రకటించబడినది.చూడికొడుత్తాల్ అంటే తాను ధరించిన పూలమాలలతో స్వామిని ఆరాధించినది.ఆళ్వారులు పదిమంది అని వారు నారాయణుని దశావతారములు అని నమ్మువారు తండ్రి-తనయ లైన వీరిని ఒక అవతారముగానే లెక్కిస్తారు.పన్నెండు అను వారు వీరిని విడిగా పరిగణిస్తారు.తండ్రి చెప్పువిష్ణు కథలను వినుచు,విశిష్టతను తెలుసుకొని,స్వామిని తన భర్తగా ఆరాధించినది.ధనుర్మాసములో గోపకాంతలతో తానును ఒకతెగా మారి వారిచే కాత్యాయిని వ్రతమును,తిరుప్పావై వ్రతమును చేయిస్తు,వారికి ముక్తిమార్గమునకు దారిచూపినది,రామానుజుని సోదరియైన ఆండాళ్ తల్లి రంగనాథసమేతయై మనలను రక్షించును గాక.

( ఆండాల్ తిరువడిగళే  శరణం.)

PERIYAALWAR

 సంభవామి యుగేయుగే సాక్ష్యము హరి వాహనము
 ధర్మ సంస్థాపనమే లక్ష్యమైన మన ఆళ్వారులు

 ధన్వినవ్య పురములో ముకుందాచార్య దంపతులకు
 విష్ణుచిత్తుడుగ జనియించె గరుత్మంతుడ్

 విశిష్టతను తెలియచేయు అష్టాక్షరి మంత్రము
 వటపత్ర సాయికిచేయు పుష్పమాలా కైంకర్యము

 వాక్కు స్వామి వరమైనది  వల్లభదేవునితో  విజయము
 ఘనతను చాటుచు మధుర వీధులలో గజారోహణము

 ప్రత్యక్షమైన స్వామికి దృష్టి తగులునేమో యని
 ఏనుగు గంటలే తాళాలైన పల్లాండు ప్రబంధము

 నిత్య నిర్గుణ నిరంజనుని నిరతము మదినిలుపుకొని
 పరమార్థముచాటిన పెరియ ఆళ్వార్ పూజనీయుడాయెగ.

గరుత్మంతుని అంశతో శ్రీవిల్లిపుత్తూరునందు ముకుందాచార్యులు దంపతులకు పెరియాళ్వారు జన్మించారు.తల్లితండ్రులు ప్ర్ట్టిన పేరి విష్ణుచిత్తులు.చిన్నతనము నుండి అష్టాక్షరీ మంత్రమును అనవరతము మననము చేసెడివారు.స్వామివారి తోమాలాలచే ప్రభావితుడై,పుష్ప కైంకర్యముతో స్వామిని సేవించ దలచి,నిష్ఠగా పూమాలా కైంకర్యము చేయసాగెను.పాండ్యరాజు బ్రహ్మణోత్తముని వలన జీవిత పరమార్థమును తెలిసికొని,పరతత్త్వమును తెలియచేసినవారికి సువర్ణనాణెముల సంచిని బహుమతిగ ప్రకటించెను.స్వామి కోరిక ప్రకారము విష్ణుచిత్తుడు సభలో అష్టాక్షరీ మంత్ర వైభవమును వివరించి,గజారోహణ చేయుచుండగా,లక్ష్మీ నారాయణులు గరుత్మంతునిపై ప్రత్యక్ష్మైన,ఎనుగు గంటలను తాళములుగా వాయించుచు,పల్లాండ్లు పాడి పరవశించిన,పెరియాళ్వారునూనుగ్రహించిన నారాయణుడు మనలనందరిని అనుగ్రహించుగాక,

 (   పెరియాళ్వార్ తిరువడిగళే శరణం.)

PAEYAALWAR

 అదివో-అల్లదివో-పేయ్  ఆళ్వారు

 సంభవామి యుగే యుగే -సాక్ష్యములు  హరి ఆయుధములు
 ధర్మ సంస్థాపనమే లక్ష్యమైన మన ఆళ్వారులు

 మైలాపురమున మణికైరవ బావిలోని ఎర్ర కలువ పుష్పములో
 ప్రకటింపబడినది నందకము మైలపురాధీశునిగ

 పిచ్చిభక్తికి సంకేతమైన మహాయోగి  ముక్తిని అందీయగ
 'తిరండాల్ తిరువందాది" ని తీరుగ అందించెనుగ

 జోరైన వర్షమున తలదాచుకొనుటకు తిరుక్కవలూరులో
 అరుగుపైనముగ్గురితో పాటుగ చేరెను  నారాయణుడు

 భక్తి వెలిగించిన దీపమనే  భగవంతుని రూపమును
 దర్శించిన పొంగినవి కొంగు బంగారు స్తుతులు కరుణగ

 నిత్య-నిర్గుణ-నిరంజనుని నిరతము మది నిలుపుకొని
 పరమార్థముచాటిన పేయ్ ఆళ్వారు పూజనీయుడాయెగ.


  హరి నందకాంశము మైలాపూరులోని మణికైరవ బావిలోని,ఎర్రకలువ పుష్పములో పూదత్తాళ్వారు అవతరించిన మరునాడు ప్రకటితమాయెను.మహాద్భుతము.ఒకరి తరువాత ఒకరు,ఒకరోజు తరువాత ఒకరు.పేయ్ అను పదము తమిళభాషలో పిచ్చి అను అర్థమును తెలియచేయునది.మితిమీరిన హరిభక్తి తన్మయత్వపు చేష్టలతో నున్న వీరిని, అజ్ఞానులు పిచ్చివానిగా తలచి,పిలిచెడివారు.

 వీరి ముగ్గురిని పెరుమాళ్ళు కరుణించిన విధము పరమాద్భుతము.విని మనము తరించుటకు ప్రయత్నిద్దాము.

 స్వామి సంకల్పముతో వారు ముగ్గురు తిరుక్కోవలూరు  వెళ్ళవలసి వచ్చింది.కుండపోత వర్షము.అక్కడ వారికి ఒక ఇంటిముందు అరుగు సూత్రధారిగా మారినది.దాని వైశాల్యములో,ఒక వ్యక్తి శయనించవచ్చును.ఇద్దరు కూర్చుండవచ్చును.ముగ్గురయితే నిలబడగలుగుదురు.విశాలహృదయ సంస్కారముగల ఆళ్వారులు ఒకరి తరువాత మరొకరు అరుగును సమీపించి,నిలబడి,ఇరుకుగా నున్నను.సాటివానికి సహయముచేసి,హరి సంకీర్తనలతో ఆదమరచిపోవుచుండిరి,క్రమముగా వారికి మరింత ఇరుకుగా తోచసాగెను.మానవ స్పర్శ తగులుట లేదు.స్వామి వారికి జ్ఞానదృష్టిని ఇచ్చి,సాక్షాత్కరించెను.ధన్యోస్మి నారాయణ ధన్యోస్మి.ముదల్ ఆళ్వార్లలు ఇరుకును కలిగించిన పరంధాముని గుర్తించి,కీర్తించి,తరించిరి,అదే ఇరుకును పరమాత్మ మనలకు కలిగించి,కరుణించును గాక.
  పెరుమాళ్ తిరువడిగళే  శరణం.

  ( జై శ్రీమన్నారాయణ.)


POODATTAALWAR

 అదివో-అల్లదివో-పూదత్తాళ్వారు
 *******************************

 సంభవామి యుగే యుగే -సాక్ష్యములైనవి హరి ఆయుధములు
 ధర్మ సంస్థాపనమే- లక్ష్యమైన మన ఆళ్వారులు

 తిరుక్కడల్మల్లె సముద్రతీరమున గల మాధవీపుష్పమున
 ప్రకటింపబడినది కౌమోదకము బాలునిగ

 భక్తికి సంకేతమైన భూతయోగి ముక్తిని అందీయగ
 "ఇరండాల్ తిరువందాది" ని ఇలను ప్రసాదించెనుగ

 మానసమె ఒక ప్రమిద, మాయని భక్తియె  తైలము
 వివేకమె జ్వలనజ్యోతి ,వినయమె శరణాగతి

 పురుషోత్తముని  ఆనతిని  శిరసావహించి పూదత్త
 పురుషార్థములందీయ దివ్యదేశముల సంచరించె

 నిత్య-నిర్గుణ-నిరంజనుని నిరతము మది నిలుపుకొని


 పరమార్థము చాటిన పూదత్తాళ్వారు పూజనీయుడాయెగ.

భూతయోగి గా సంకీర్తనలందు పూదత్తాళ్వారు వారు,పొయిగై ఆళ్వారు జన్మించిన మరుసటి దినమున,మహాబలిపుర సముద్రతీరమున,మాధవీ కుసుమమున,పెరుమాళ్ళు (గద) కౌమోదక అంశమున అవతరించినారు.పూత అనగా యదార్థము,ఆత్మ అను అర్థములు కల పదమని పెద్దలుచెబుతారు.వీరు యదార్థమైన స్వామిని నూరు పాశురములతో కీర్తించిన గ్రంథము
" "ఇరణ్డాన్ తిరువందాది"గా ప్రసిద్ధికెక్కినది.పరమపూజ్యులైన పూదత్తాళ్వారును మనకు అందించిన శ్రీమన్నారాయణుడు,మనలనందరిని కరుణించుగాక.

 (జై శ్రీమన్నారాయణ.)


POIGE ALWAR

అదివొ-అల్లదివొ--పొయిగై  ఆళ్వారు
  ********************************

  సంభవామి యుగే యుగే -సాక్ష్యములైనవి హరి ఆయుధములు
  ధర్మ సంస్థాపనమే లక్ష్యమైన  మన ఆళ్వారులు

  యథోత్తకారి సన్నిధిని పుష్కరిణి స్వర్ణపుష్పమున
  ప్రకటించబడినది పాంచజన్యము తిరుసంగు గ

  జ్ఞాన సంకేతమైన  సరోయోగి ముక్తిని అందీయగ
  ముక్త పదగ్రస్తమైన ముదల్ "తిరువందాయ్" తేనెలు చిందెగ

  ప్రపంచము ఒక దీపము, ప్రజ్వలన తైలము సాగరములు
  సంసారము  ఒక సాగరము ,సరంగు  ఆ పెరుమాళ్ళు

  నామ సంకీర్తన దివ్యదేశములను పావనమొనరించె
  శుభ సంకల్పము  విజయ శంఖమును పూరించెగ

  నిత్య-నిర్గుణ-నిరంజనుని నిరతము మది నిలుపుకొని
  పరమార్థము చాటిన పోగయి ఆళ్వారు పూజనీయుడాయెగ.

పొయిగయాళ్వారు ముదలాళ్వారులలోని వాడు.తమిళములో పొయికై అంటే చెరువు.పుష్కరిణిలో తామర పుష్పములో అవతరించెను కనుక పొయికై ఆళ్వారుగా ప్రసిద్ధి చెందెను.వీరిని కాసార యోగి,సరోయోగి అని కూడ పిలుస్తారు.శ్రీ మహా విష్ణువు శంఖము పాంచజన్యమునకు అంశావతారమని భక్తుల విశ్వాసము.భగవద్దర్శనము లభించిన సమయమున పులకించి పాడిన నూరు పాశురములను "ముదల్ తిరువందాది" ని మనకు ప్రసాదించినారు. పరమపూజ్యులైన పోగయాళారును మనకు అందించిన ఆ శ్రీమన్నారాయణుడు,మనలనందరిని కాపాడు గాక.
( జై శ్రీ మన్నారాయణ.)

TANOTU NAH SIVAH SIVAM-12

    తనోతు నః శివః శివం-12   *****************   "  వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే      జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...