తిరుపావై-పాశురం 12
****************
" మాతః సముత్థితవతీ మదివిష్ణుచిత్తం
విశ్వోపజీవ్యమమృతం వచసా దుహానాం
తాపఛ్చదం హిమరుచేరివ మూర్తిమన్యాం
సంతః పయోధి దుహితః సహజాం విదుస్త్వాం."
పూర్వ పాశుర ప్రస్తావనము
*******************
స్వధర్మానుచరణులైన,ధర్మ రక్షకులైన ఉత్తమవంశ సంజాత-వేద సంరక్షిణి,యోగీశ్వరి,వ్యతిరేకావస్థలో నున్న మహాజ్ఞాని యైన గోపికను మేల్కొలిపి,తమతో పాటుగా నోము స్థలికి తీసుకుని వెళ్ళుచున్నది అమ్మ.
ప్రస్తుత పాశుర ప్రాభవము
******************
స్వధర్మము-స్వామి ధర్మము అను రెండింటిలో ,
1.స్వామి ధర్మమునకై/స్వామి సేవనమునకై తన స్వధర్మమైన గేదెల పాలుపితుకుటను సైతము విస్మరించిన గోపిక అన్న.
ఆవుపాలు దేవ భోజ్యములు.గేదెపాలు ఉపాధి భోజ్యములు.ఒకవిధముగా ఐహికము-ఆధ్యాత్మికము అనుకొనిన ఐహిక సంపదలకు ప్రాధాన్యతనీయక,అర్చనకై చనిన ధర్మ సంరక్షకుని చెల్లెలు.మన గోపిక.
2.గోపిక గోష్ఠములోని పశువులు,తమ దూదలు ఆకలితో దుఃఖిస్తున్నాయని,తమను పిలుస్తున్నాయని,భావించుకుని -కనైత్తు,
మాతృవాత్సల్యముతో ఉన్నచోటనే (తమ దూడలు స్వీకరించగలవన్న ఊహతో) ఉన్నచోటనే,
నిండిన పొదుగు శిరములనుండి క్షీరధారలను కురిపిస్తూ నేలను చిత్తడిచేస్తున్నాయి.
(ఆచార్యుల అనుగ్రహము అపరిమితముగా జ్ఞాన క్షీరమును చేతనులకు అందిస్తూ,భూమిని సుక్షేత్రము చేస్తున్నది.
3.నేల తడిసి ఉంది కనుక పక్కకు జరుగుదామంటే,ఆకాసము సైతము హేమత ఋతువగుటచే మాతలల పై విశేషముగా మంచును కురిపిస్తున్నది.
(ఆచార్యులు అనుగ్రహము/ఉద్ధరనమను మంచును,సంసార తాపములను తొలగించుటకై,మా తలలపై,విశేషముగా కురిపిస్తున్నారు.)
4. నేలపై నిలబడలేక,నింగికిందను నిలబడలేక,నిన్ను నిదుర లేపుటకై,
అహంకారమనే జలముతో కప్పివేయబడి,పరమాత్మ జ్ఞానమును విస్మరించిన,హుంకరించిన,దశకంఠుని దశేంద్రియ మదమణచిన శ్రీరాముని కీర్తిస్తూ,నీ ఇంటి చూరు పట్టుకుని,నిన్ను ఆశ్రయిస్తూ,నిలబడి యున్నాము.
ఓ సౌభాగ్యవతి! నీవు మేల్కాంచి,నీతో బాటుగా నోమునకు మమ్ములను తీసుకుని వెళ్లు అని అంతున్న,
అమ్మ ఆండాళ్ తల్లికి-ఆళ్వారులకు అనేకానేక దాసోహములను సమర్పించుకుంటూ పాశురములోనికి ప్రవేశిద్దాము.
పాశురం
*******
కనైత్తిళం కాట్రెరుమై కన్రుక్కిరంగి
నినైత్తు ముళై వళియే నిన్రు పాల్శోర
ననైత్తిల్లం సేరుక్కు "నచ్చెల్వన్ తంగాయ్"
పనిత్తళై వీళనిన్ వాశల్కడై పట్రి
శినత్తినాల్ తెన్నిలంగై క్కోమానై శెట్ర
మనత్తుకు ఇనియానై పాడవుం నీ "వాయ్ తిరవాయ్"
" ఇనిత్తాల్ ఎళుందిరాయ్" ఈదెన్న "పేరురక్కం"
అనైతిల్లతారారుం అరుందేలో రెంబావాయ్."
గోదమ్మ చమత్కారముగా నిదురిస్తున్న గోపికతో మీ ఇరుగు-పొరుగు నిదురలేచి,స్వామిని సంసేవిస్తున్నారు.మేము నిన్ను మేల్కొలుపుట వారు వింటే బాగుండదు.కనుక నీవు మేల్కాంచి వస్తున్నా నని పలుకనైన పలుకవమ్మా.మీ ఇంటి నేల పాలతో తడిసి చిత్తడి అయినది.పైనుండి మా తలలపై మంచుకురుస్తూ తడుపుతున్నది.మీ ఇంటి చూరు పట్తుకుని శ్రీరాముని రావణ సంహారమును కీర్తిస్తున్నాము .
ఇరంగి-మాతృవాత్సల్యముతో
కాట్రు కనైత్తు-తమ దూదలు ఆకలితో నున్నయని
నినైత్తు-భావిస్తూ
నిన్రుపాల్శోర-నిలబడి పాలను వర్షిస్తున్నాయి
పనిత్తలై -తలపై మంచుకురుస్తున్నది
మనత్తుకు ఇనియానై-మనస్పూర్తిగా
తెన్నిలంగై కోమానై శెట్ర-దక్షిణలంకాధీశుని సంహరించిన శ్రీ రాముని కీర్తిస్తూ,
వాసల్ కడై పట్ర-నీ ఇంటి తలుపు చూరుని పట్టుకుని యున్నాము.
ఓ నచ్చెల్వన్ తంగాయ-ఓ సంపన్నునిచెల్లెలా
నీ వాయ్ తిరవాయ్-పలుకవమ్మా వస్తున్ననై అని,
గోపికను యోగనిద్ర నుండిబహిర్ముఖిని చేసి ,తమతో పాటుగా మనలను నోమునకు తీసుకుని వెళుతున్న ,
ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం