చిదానందరూపా- కణంపుల్ల నాయనారు
********************************
కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా
కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా
కాముని కాల్చిన వాడే తనలోని తమోగుణమును కాల్చువాడనుచు
అగ్ని కన్నుగ నున్న దేవునికి ప్రజ్వల జ్యోతులు పెద్దసేవ యను
ఇరుక్కువేళూరులోని ఈశ్వరభక్తుడు కణంపుల్ల నాయనారు
సాష్టాంగముతో తనువు భూమిని తాకగ,సంకీర్తన నింగిని తాకు
అవధులులేని భక్తి గావించిన అద్భుత దీపాలంకరణము
ఆ హరు ఆనతిగాన భక్తుని ఆస్తిని హరించివేసెను
తృణములు దొరకని వేళ,తన కురులతో చేసిన దీపారధనమే
పరమేశ్వరు సన్నిధి చేరగ పణముగ పెట్టుట కారణమాయెగ
చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక
చిత్తముచే శివోహం జపంబు చింతలు తీర్చును గాక.
ఇళుక్కువేలూరు లోని శివుని భక్తుడు కణంపుల్ల నాయనారు.మదనుని కాల్చిన సర్వేశ్వరుదే తన మదమును జయింపగల దేవుడుగా భావించును.దానికి కారణమైన అగ్నినేత్రునికి అర్పణగా ఆఅలయ ప్రాంగణమంతయు ఆవు నేతి దీపాలతో అనుదినము అమిత భక్తితో సేవించేవాడు.సంకీర్తనము సాంబశివుని కీర్తిని అమబరమును తాకుచుండగా,సవినయ సాష్టాంగ నమస్కారముతోతనువు భూమిని తాకుతు సంతసించుచుండెడిది.స్వామి అనుగ్రహమేమో కాని తిల్లైలో కనక మహాసభయందలి స్వామి నృత్యమునకు,నాయనారు మదిలోని శివ లాస్యము అద్దమును పట్టుచుండెను.సానబెట్టిన గాని గంధపుచెక్క పరిమళించదు అన్నట్ట్లుగా స్వచ్చమైన భక్తునకు కలిమిలేములు కదిలించలేవుగా.ఆశీర్వాదమును పొందవలెన్న అగ్ని పరీక్షను అధిగమించుట అనివార్యము.ఆ శివుడు లీలా విశేషముగా నిటలాక్షుడు తన భక్తుని నిరుపేదగా చేసెను.నిరుత్సాహమే కానరాని నాయనారు కొడవలిచేతనుబూని,గడ్డికోసి దానినమ్మి వచ్చిన ధనముతో స్వామికి దీప కైంకర్యమును చేయసాగెను.భక్తుని కీర్తిని చిరస్థాయి చేయుటకు శివుడు ఆ గడ్డిని కూడా మాయము చేసెను.సాధ్యము కానిది ఉన్నదా సాంబ సివుని పూజకు! దీపములు ప్రకాశించుటకు గడ్డికి బదులు తన శిరోజములు శివభక్తుని ఆనతిని శిరసావహించినవి.శివోహం శివోహం శివపద స్థిర నివాసమును కల్పించినవి.
( ఏక బిల్వం శివార్పణం.)