కదా త్వాం పశ్యేయం-14
**********************
"జిహ్వ చిత్త శిరోంఘ్రి నయన శ్రోతైః అహం ప్రార్థితం
నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం."
" ప్రాక్పుణ్యాచలమార్గదర్శిత సుధామూర్తిః ప్రసన్నః శివః
సోమః సద్గుణ సేవితో మృగధరః పూర్ణః "తమో మోచకః"
చేతః పుష్కర లక్షితో భవతి చేత్ ఆనంద పాథోనిధిః
ప్రాగల్భ్యన విజృంభతే సుమనసాం వృత్తి సదా జాయతే."
తమోమోచకుని,చీకట్లను మనసులో పూర్తిగా తొలగించేవానిని చిత్తములో స్థిరముగా నిలుపుకుని,ఈనాటి బిల్వార్చనమును ప్రారంభిద్దాము.
ఆశ్చర్యముతో తుమ్మెదలు-అప్రయత్నముగా శంకరయ్య చేస్తున్న శివనామ మహాత్మయమా అన్నట్లుగా కదిలివచ్చింది శివయ్య కనికరము పరమానందలహరిలా పరవళ్ళు తొక్కుతూ .....
తడిపి వేస్తోంది తనతో పాటుగా మహాదేవ తత్త్వమును మరింత దర్శింపచేయుటకు.
తాతగారు తాతగారు ఏంచేస్తున్నారండి అంటు వచ్చిన పిలుపుతో శంకరయ్య తన్మయత్వము నాదార్చనము బహిర్ముఖుని చేసినది.
తాతగారు బయటకు వచ్చి రండి రండి అంటూ,
ఇప్పుడే ఆ మార్గబంధువి మనసారా స్మరిద్దామని,
ఎంతటి మహాభాగ్యము.సరియైన సమయమునకే నన్ను తీసుకుని వచ్చాడు సదాశివుడు అని చేతులు జోడిస్తూ కూర్చున్నాడు.
అదేమి విచిత్రమో,
శంకరయ్యకు కోపము రావటము లేదు.వానిని పట్టుకోవాలన్న పంతము తొందరపెట్టటంలేదు.పైగా వంతపాడే శివయ్య సైతము....చెంత లేడు.
మనో బుద్ధ్యహంకార చిత్తములు చిదానందమయమవుతున్నాయన్నట్లుగా ఇతర చింతనములను చేరనీయటము లేదు.
తుమ్మెదలు నవ్వుతూ అడిగాయి.ఏమైనది శంకరయ్యగారు మౌనముగా ఉన్నారు.మాతో పాటుగా ఏదో నామమును మీరు చేసినట్లున్నారు.అదే అదే మీ ....
ఇంతలో శ్రావ్యముగా శ్లోక పఠనమును ప్రారంభించారు తాతగారు.
"ఛందశాఖి శిఖాన్వితై ద్విజవరై సంసేవితే
సౌఖ్యాపాదిని ఖేదభేదిని సుధాసారై ఫలైర్దీపితే
చేతః పక్షి శిఖామణే "త్యజ వృధా సంచార మన్యైరలం
నిత్యం శంకర" పాదపద్మ యుగళీనీడే" విహారం కురు."
హే చేతః పక్షి-ఓ నా మనసనెడి పక్షి
నీవు ఇటు -అటు వ్యర్థముగా తిరుగకు."మహేశ పాదపద్మములనే గూటి"లో స్థిరముగా వసించు..అని చెబుతూ తాదాత్మ్యం చెందుతున్నారు.
మళ్ళీ అయోమయంలో పడ్డాడు శంకరయ్య.
ఇప్పుడిప్పుడే, ఈ తుమ్మెదల సాంగత్యముతో వీటి ప్రభువైన ఈపెద్ద తుమ్మెద విషమును తనగొంతులోనే నిలిపివేసి అందరికి సహాయపడిందని విని,నిజమనుకున్నాను.మహాదేవుడంటే తుమ్మెదనే అనుకుని మనసా-వచసా స్మరించాను.భజన చేసాను.భక్తి చూపాను.అంతా మోసం.
వాడు మాయావియే.పక్షులకు గూళ్ళు/గుళ్ళు కడుతుంటాడన్నమాట.
ఆయన ఆలోచనలకు ఆనకట్ట వేస్తూ,అయ్యా! శంకరయ్య గారు ....
కోపముగా తుమ్మెదలతో మీరు మోసగాళ్ళు కనుకనే నాకు ఆ తుమ్మెదను చూపిస్తూ విషమును కంఠములోనే నిలిపినది ఒక ఉదాహరణమును కల్పించి నా దృష్టిని మరలించారు.నా ఇంద్రియములపై ఇంద్రజాలమునుచేసి ...
నవ్వుకుంటున్నాయి ఆ నల్లని తుమ్మెదలు.
మీ మోసమును నేను పసిగట్టానని,చేసేది లేక నవ్వుకుంటున్నారు.
తాతగారేమో మనసు ఒకపక్షి-మహేశుని పాదపద్మములు ఒక పక్షిగూడూ,పోయి అందులో నిత్యనివాసముచేయి అంటున్నారు అన్నాడు రోషముగా.
ఇంతలో అక్కడికి రానేవచ్చాడు మనవడు/మనవాడు.
శంకరయ్య గారు మీకు ఆ పక్షులను చూడాలని ఉందా? మా తుమ్మెదలు మిమ్మల్ని అక్కడికి,అదే పక్షిగూడు ఉన్న చెట్టు దగ్గరికి తీసుకుని వెళతాయిలెండి. .
మన మధ్యన వాదనలెందుకు? అని చెప్పి తుమ్మెదలను తోడు తీసుకుని చెట్టు దగ్గరికి వెళ్ళమని,పంపించాడు.
నడుస్తున్నాడు శంకరయ్య.నడిపిస్తున్నాడు పరమాత్మపక్షిగూటి దగ్గరికి.తాతగారి మాటలు పదేపదే మారుమ్రోగుతున్నాయి మంగళవాయిద్యములుగా
" ఓపక్షి! నీకు ఒకచక్కటి గూటినిచూపిస్తాను.అది గాలివానలకు కూలిపోదు.ఎండ వేడిమికి కాలిపోదు.చీకటిని రానీయదు.చింతలను రానీయదు.ఎన్నో పక్షులు ఈ చెట్టు కొమ్మల చివర నున్న అమృతఫలములను ఆహారముగా తీసుకుంటూ,ఇక్కడే-ఈ గూటిలోనే స్థిరనివాసమును ఏర్పరుచుకుని ఎంతో ఆనందముగా ఉన్నాయి.ఆ మహాదేవుడు మాకోసము తాను సైతము పక్షిగా వచ్చిమాతో ఆడతాడు.పాడతాడు.ఆదరిస్తాడు.ఆ శరభేశ్వరుడే ఈ మహాదేవుడు.
హంసలకోసము పరమ హంసగా,కోయిలలకోసం వసంతముగా,చేపలకోసము సెలయేరులుగా,మృగములకోసము పర్వతములుగా,అరణ్యములుగా,నెమలులకోసము నీలిమబ్బుగా,చాతకములకోసము,చక్రవాకములకోసము,ఎండగా-వెన్నెలగా,సూర్యునిగా-చంద్రునిగా,సకలచరాచర సృష్టిలో తానై ఉంటాడు,తనువులోను ఉంటాడు.అంటూ నడుస్తున్న వారు ఆ వేదవృక్షమును సమీపించారు.
తుమ్మెదలు తమ స్నేహితులైన పక్షులను పిలిచి,
ఓ! నేస్తములారా!
ఈయన శంకరయ్యగారు.మీరు నివాసము చేస్తున్న ఈ వేదవృక్షమును గురించి,వీరికి వివరించండి.మేము ప్రదోషపూజకు తరలివెళుతున్నాము అంటూ వెనుదిరిగినాయి.
అత్యంత అత్మీయతతో ఆ పక్షులు తమ అతిధిని స్వాగతిస్తున్నాయి.
కదిలేవి కథలు-కదుపుతున్నది కరుణ.
'తన్మై మనః శివ సంకల్పమస్తు
వాచే మమశివపంచాక్షరస్తు
మనసే మమ శివభావాత్మ మస్తు".
పాహిమాం పరమేశ్వరా.
(ఏక బిల్వం శివార్పణం)