ధ్యాయేత్ ఈప్సిత సిధ్ధయేత్-06
***********************
మనసంతా ఒకటే గందరగోళం.మనము చూసేదేది నిజమైనది -శాశ్వతమైనది కాదా? శాశ్వతమైనది సులభముగా మనము దర్శించలేమా?
లోపల బయట తానే యున్నదంటున్నారు కొందరు "జగమెవ్వని లోపలనుండు "అంటు.
అంటే ఈ దృశ్యప్రపంచము ఎవరో మనకు తెలియని వాని లోపలఉందా?
లోపల కనుక ఉంటే మనలను బయటనే ఉన్నట్లు ఎలా భ్రమింపచేస్తున్నది.
ఇది భ్రమ తత్త్వమా? బ్రహ్మాండ తత్త్వమా?
ఒక సందేహమునకు తోడుగా మరొక సందేహమును జతకలుపుకొనుటకా అన్నట్లు,
పనులన్నీ చేసుకొని కాసేపు కాలక్షేపం కోసము చర్చావేదికను చూచుటకు టి.వి ముందు కూర్చున్నాను.
కార్యక్రమము ప్రారంభమైనది.చర్చకు ఇరువర్గముల వారు అభిముఖముగా అసీనులైనారు.ఆసనముపై న్యాయనిర్ణేత వారిని గమనిస్తున్నారు.
సహకారపరికరములుగా కొన్ని వస్తువులను ప్రవేశపెడుతూ చర్చా కార్యక్రమమును ప్రారంభింపచేసారు.
వారిద్దరి మధ్యన రంగురంగు గులాబీలతో, అలంకరింపబడిన పుష్పగుచ్చమును ఉంచారు.గులాబీలలో కొన్ని ఎర్రవి.కొన్ని పసుపుపచ్చవి.కొన్ని తెల్లనివి.మరికొన్ని గులాబీ రంగువి.ఎన్నోరంగులతో మరెన్నో హంగులతో పరిమాళాలు వెదజల్లుతు అక్కడున్న వారిని పరవశింపచేస్తున్నాయి.ఏమా సుకుమారత. ఏమా సుందరత.ఏమా సుగంధము.
నా ఆలోచనలకు అడ్దుకట్ట వేస్తు మొదటి వర్గమువారు రెండవ వర్గము వారిపై ప్రశ్నను సంధించారు తామే గెలుస్తామన్న గట్టి నమ్మకముతో.
పూలగుత్తిని తమ చేతిలో పట్టుకుని,
ఇది ఏకమా? అనేకమా? అంటు.
ఒక్క సారిగా ఉలిక్కిపడటము నా వంతైంది.
లోపల-బయట అనే చిక్కే కాకుండా,ఏకమా-అనేకమా అనే మరో సమస్యనా...
ప్రశ్నకు సమాధానము మరింత ప్రసన్నముగా
ఇది ఏకము.అనేకము కాదు అంటు వచ్చింది.
మరొక్కసారి పరిశీలించి చెప్పండి హెచ్చరించింది మొదటి వర్గం.
ఇది ఏకమే అనేకము కాదు ప్రశాంతముగా సమాధానమిచ్చింది.
మరొక హెచ్చరికను జారీ చేసింది తికమక పెడుతుప్రత్యర్థిని.
ముమ్మాటికి ఇది ఏకమే.స్థిరముగా వచ్చినది సమాధానము.
అంగీకారాన్ని తమ మౌనముతో తెలియచేసింది పశ్నించిన వర్గము.
ఎన్నో రంగుల పూలున్న గుత్తిని ఏకమే అంటున్నారు అంటే కచ్చితముగా వీరు గుత్తిని మాత్రమే పరిగణనలోనికి తీసుకున్నారన్నమాట.పొరబాటు పడ్డారు అనుకున్నాను.
రెండవ పర్యాయము సహకారముగా
జామ-మామిడి-సపోట-పనస-ద్రాక్ష- దానిమ్మ......... ఎన్నో పళ్లతో నిండిన గంపను ప్రవేశ పెట్టారు.
మళ్ళీ అదే ప్రశ్న.ఈ పళ్ళన్నీ-ఉన్న గంప కాదు
ఏకమా? అనేకమా? అదే ప్రశ్న.
మళ్ళీ అదే సమాధానము నిశ్చలముగా.
ముచ్చటగా మూడవ అవకాశము అంటు
కాకి-కోకిల-చిలుక-కోడి-కోతి-ఆవు-మేక-చిత్రములున్న పటమును చూపిస్తు,
ఇవి చేయు శబ్దములు ఏకమా? అనేకమా?
అంటే ఈ ఏక-అనేకములు దృశ్యములకు మాత్రమే కాక శబ్దములకు కూడ వర్తిస్తుందా?
మరొక సందేహ సందడి.
ఇదే చివరి అవకాశము.సరిగా గమనించి-ఆలోచించి చెప్పంది అన్నది ఠీవిగా.
అన్ని ప్రశ్నలకు అదే సమాధానము.వాటి శబ్దములన్నీ ఏకమే కాని అనేకములు కాదు.
ఏకమైన శబ్దశక్తి అనేకములుగా తన ప్రాభవమును ప్రకటిస్తున్నది.
ఓటమిని ఒప్పుకుంటు తలవంచింది.మొదటి వర్గము.అభ్యంతరములు లేవన్నాడు న్యాయ నిర్ణేత.
ఈసారి అయోమయములో పడటము నా వంతు అయింది.ఇదెక్కడి న్యాయమయ్యా.వీళ్లు తప్పు సమాధానములను ఒప్పంటు .....గొప్పగాఒప్పుకుంటున్నారు.
దానితో ఆగక సమాధానమిచ్చిన వారిని సత్కరించుటకు సన్నాహాలు చేస్తున్నారు.
ప్రేక్షకులు ఎక్కువశాతం మంది సన్మానానికి అభ్యంతరాన్ని తెలియచేస్తూ,అరవసాగారు.
అది గమనించిన నిర్వాహక వర్గము వారి సందేహ నివృత్తి కార్యక్రమమును వచ్చేవారానికి వాయిదా వేసారు.
స్వస్తివాక్యములతో సభను ముగించారు.
నా ఈ దేహములోనికి సందేహములను పంపిస్తున్న పరమాత్మయే వాటిని నివారించునుగాక అనుకుంటు నమస్కరించాను.
సర్వం పరమేశ్వర చరణారవిందార్పణమస్తు.
కరుణ కొనసాగుతుంది.