ఆదిత్యహృదయము-శ్లోకము-16
**********************
ప్రార్థన
********
జయతు జయతు సూర్యం సప్తలోకైక దీపం
హిరణ సమిత పాప ద్వేష దుఃఖస్య నాశం
అరుణకిరణ గమ్యం ఆదిం ఆదిత్యమూర్తిం
సకలభువన వంద్యం భాస్కరం తం నమామి.
పూర్వరంగము
***********
సూర్యభగవానుని ఉదయాస్తమాన తూరుపు-పడమరదిక్కుల ప్రాశస్త్యమును, దినాధిపతిత్వమును-జ్ఞాన సంపత్తిని, పరమాత్మయొక్క,జయప్రదత్వమును-జయభద్రత్వమును స్తుతించిన అగస్త్యణగవానుడు,ప్రస్తుత శ్లోకములో ఉగ్ర/వీర స్వరూపమును,సారగ్రహణ స్వభావమును,మార్తండత్వమును(నాలుగు లక్షనములను) వివరించుచున్నారు.
శ్లోకం
******
" నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమోనమః
నమః పద్మ ప్రబోధాయ మార్తాండాయ నమోనమః."
ఉగ్రత్వమునకు-వీరత్వమునకు "నరసింహావతారమును " ప్రస్తావిస్తారు కొందరు ఉపాసకులు
.
1. సూర్యభగవానుడ-నీవు ఉగ్రుడవు-నీ ఉగ్రత్వమునకు నమస్కారములు.
ఉగ్రత్వమంటే భయంకరముగా కనిపించటమా అనుకుంటే కాదు అని చెబుతున్నది సనాతనము.
ఉత్ గ్రసతి ఉగ్రం అంటున్నది సాహిత్యము.
అన్నింటికిమించిన ఉన్నతస్థితి.అదియే పరమానందము/బ్రహ్మానందము.ఆ స్థితిని కలిగించువాడు ఉగ్రుడు
.కాదు కాదు,
ఉత్కృష్టస్థితియే తానైన వాడు ఉగ్రుడు.ఇదే విషయమును రుద్రము సైతము,
"నమః ఉగ్రాయచ-భీమాయచ" అని కీర్తిస్తున్నది.
మనకంటే చాలా ఎత్తైన ఆకాశమునందుండి ,తనకిరణములచే మనలను అనుగ్రహించువాడు ఉగ్రుడు.
.
స్తంభమునుండి ప్రకటితమై డింభకుని అనుగ్రహించిన వాడు ఉగ్రుడు
.
తన శక్తిని తాపముగా మార్చి,సకల చేతనాచేతనములనుకార్యోన్ముఖులుగా మలచువాడు ఉగ్రుడు.
అంతర్యామిగా మనలో దాగి ప్రాణశక్తులను సమకూర్చువాడు ఉగ్రుడు.నమోనమః
2సూర్యభగవానుడ నీవువీరుడవు.నమోనమః
ఉగ్రత్వము ఉపాధియైతే, సామూహికమైతే దానిని మరింత విశ్లేషించుటయే వీరత్వము.
" వివిధం ఈరయతి-ప్రేరయితి వీరం."
ఇంద్రియములను సమర్థవంతము చేయుట వీరము.
ఉదాహరణ కు జలుబు చేసినప్పుడు మనము వాసనను పీల్చలేము. .కాని మనముక్కు మనదగ్గరేఉంటుండి.దానిలోని ఘ్రాణశక్తి వీరము.ముక్కును ఏర్పరుచుట (ఆకారము) ఉగ్రము.దానికి శ్వాస శక్తిని-ఆఘ్రణ శక్తిని అందించుట వీరము.
ఇదే విధముగా కోకిల మథుర గాత్రము,హంసలనడకలు,నెమలికినాట్యము,చిలుకకు పదములు ప్రత్యేకలే కదా.అవే వీరములు.
మేథస్సును వ్యక్త పరచే ప్రక్రియయే వీరము.
ఇంద్రియ ప్రకాశకుడు వీరుడు.
వేదమయుడు-వేదవిదుడు వీరుడు.
గరుత్మంతుడు వీరుడు.
వినా ఈరతే-విష్ణుమూర్తి-పక్షివాహనుడు వీరుడు.
3.సూర్య భగవానుడు సారంగుడు.నమోనమః
' సారం శీఘ్రం గచ్ఛతి సారంగః"
శీఘ్రముగా కదల/పరుగులు తీయగల సూర్యశక్తి/రశ్మిభావనము సారంగము.కొందరు లేడి యొక్క స్వభావముగా పరిగణిస్తారు.ఆ నామమును లేడికి వ్యవహరిస్తారు.పరమేశ్వరుడు సారంగధరుడు అని సంకీర్తిస్తారు.
.
"సార గ్రహీత ఇతి సారంగ."
సారమును గ్రహించకల శక్తియే సారంగము.
భగవానుడు జలసారమును ఆవిరిగా గ్రహించి వర్షరూపములో శుభ్రపరచి అనుగ్రహిస్తాడు.ఇంద్రియముల సారములను గ్రహించి(నవవిధభక్తి రూపములో) బంధవిముక్తులను చేస్తాడు.
కర్మల సారమును గ్రహించి-కర్మఫలితములను అనుభవించుటకు మనలను కాలము కొంతకాలము ధర్మముతోను-కొంతకాలము అధర్మముతోను జతకట్టిస్తుంది.మనలను తన సత్యమైన తోవ నుండి కొంతసమయము కలుపుకుంటూ-కొంత సమయము జారవిడుస్తూ ఉంటుంది.
ఇదియే మనచే సారగ్రహణమును చేయించుట.ఆనిరంతర ఆవృత్తములలో(జగం మిథ్యా అన్న) ఉపాధి సత్యము/సారము ఎరుకపడుతుంది.
ఖగోళము కాంతి సంవత్సరమని మనము భావించే సమయమును సౌరాగమనము/సారంగము అని అంటుంది.
పద్మప్రబోధనాయ నమో నమః
స్వామియొక్క ఉగ్రత్వము-వీరత్వము-సారగత్వము ప్రత్యక్షముగా ముడుచుకొని యున్నపద్మములను వికసింపచేస్తుంది.అదియే అచేతనమైన జగత్తును జాగృతపరచు మార్తాండత్వము.పరోక్షము..
అజ్ఞానమనే చీకటితో /తిమిరముతో ముకుళించుకు పోయిన జన్మచక్ర బంధితులకు ,జన్మరాహిత్యమును ప్రసాదించుటయే పద్మప్రబోధనము.
బోధనము అనగా బుధ్ధిని వికసింపచేయుట.
ప్ర బోధనము అనగా పూర్తిగా బుద్ధిని వికసింపచేయుట.
' యన్మండలం గూఢమతిప్రబోధం
ధర్మస్యవృద్ధిం కురుతే జనానాం
యత్ సర్వ పాపక్షయ కారణంచ
పునాతుమాం తత్ సత్ వరేణ్యం".
తం సూర్యం ప్రణమామ్యహం.