సౌందర్య లహరి-ఇత్తడి ప్రాకారము
పరమపావనమైన నీపాదరజకణము
పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము
అతిమనోహరము ఐదవ హారకూట ప్రాకారము
అగుపించును హరిచందన వాటికల హర్షాతిరేకము
మేఘదంతి- మదవిహ్వల-వాయుధారాది ద్వాదశ శక్తులకు
నభశ్రీ-నభస్యశ్రీ ల నాయకుడు మేఘవాహనుడు
పింగళ నయనములతో, వజ్ర సదృశ గర్జనలతో
కుండపోత వర్షములను మెండుగ కురిపిస్తున్నాడు
సిద్ధులు తమ సతులతో హర్షముతో నున్నారు
ఇత్తడి ప్రాకారములో నేను చిత్తడి అగుగుచున్న వేళ
నీమ్రోలనే నున్న నాకేలు విడనాడకమ్మా,నా
మానసవిహారి! ఓ సౌందర్య లహరి.
దయార్ద్ర-నిష్కళంక- నిర్విరామ అమృతాధారా ప్రవాహ మయము, ఏడు యోజనముల విస్తీర్ణముగల ఇత్తడి ప్రాకారము.స్థలము-సమయము-సందర్భములను గమనిస్తూ,మేఘవాహనుడు (శ్రావణ-భాద్రపదములైన) నభశ్రీ-నభస్య శ్రీ అను తన రాణులతో పాటు ,సర్వస్య-రస్య మాలిని-నితంతి-భ్రమయంతి-వర్షయంతి-వారిధార-మేఘయంతిక -వారిధార-చిపుణిక-మదవిహ్వల అను శక్తులను కూడి,తల్లి సంకేతానుసారముగా( నిమిత్తమాత్రుడై) వర్షిస్తూ.బాధాతప్త హృదయాలకు చలివేంద్రమై వర్షిస్తుంటాడు.జయహో జగదీశ్వరి.అక్కడచిత్ప్రకాశ ధారలలో చిత్తుగా నేను తడుస్తున్నను.నాతో బాటుగా అనేకానేక సిద్ధులు-దేవతలు ఉల్లాస భరితులై సతీ సమేతులై ఆ పవిత్రధారలలో పునీతులగుచున్న సమయమున చెంతనే నున్న నాచేతిని విడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు.