సౌందర్య లహరి-46
పరమ పావనమైన నీ పాదరజ కణము
పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము
అధిష్ఠాన దేవుడిగ ఆదిపూజ్యుడుండగా
పాము చుట్ట చుట్టినట్లు నెమ్మదిగ పడుకొని
పంచభూతములలోని పృధ్వి తత్త్వముగ
పంచాక్షరి నామములో "న" కారముగ నీవు మారి
వ-శ-ష- స అను అక్షరములు నాలుగింటిని
నాలుగు దళములుగల పద్మములో ప్రకటించుచు
అండ-పిండ-బ్రహ్మాండ కుండలినీ శక్తిగా
మూలాధార చక్రములో నిన్ను చూచుచున్న వేళ
నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
మానస విహారి! ఓ సౌందర్య లహరి.
"అరుణాం కరుణాంతరంగితాక్షిం" తల్లి ఎర్రనైననది. కరుణతో నిండిన కన్నులు కలది .ఒక విధమైన అర్థమైతే,కరుణతో నిండిన అంతరంగము కలది అని కూడా మనము అన్వయించుకోవచ్చును.అదే విధముగా మూలాదార చక్రములో,మూడు చుట్టలు చుట్టుకొన్న "కుండలినీ శక్తి" కూడ అమ్మదయ ప్రసరించుటచే ఎర్రని రంగును కలిగి,పైకి పాకి మనలను చైతన్య వంతులను చేయుట అను స్వభావమును కలిగియున్నది.ఈ మూడు చుట్లు భూత-వర్తమాన-భవిష్య కాలములకు సంకేతములుగా భావిస్తారు.మూలాధార పద్మములోని నాలుగు దళములను మానవ జీవిత బాల్య-కౌమార-యవ్వన-వార్ధక్య దశలుగా పరిగణిస్తారు.మన పూర్వ జన్మల కర్మఫలితములు కుండలినిలో నిద్రాణమై ,తల్లిదయతో జాగృతమైన తదుపరి సుఖ-దుఖముల రూపములో మనకు అనుభవములోనికి వస్తాయట.సంపదలకు సంకేతమైన సప్తదంతి (ఏడు దంతములుగల ఏనుగు) మూలాధారచక్రమునకు చిహ్నముగా స్వీకరించి,ఏడు దంతములు మానవ శరీర ఏడు ధాతువులుగా అభిప్రాయమును తెలియచేసారు.మూలాధారైక నిలయమైన తల్లి నా శరీరములోని మూలాధారచక్రములో ప్రవేశించి,కుండలినీశక్తిని,తనదయా కిరణములచే జాగృతపరచుచున్న సమయమున,చెంతనే వీక్షించుచున్న ,నా చేతిని విడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు.