Sunday, February 11, 2018

MAHA SIVARAATRI-02

   పరమేశుడు వచించిన ప్రకారముగా సద్యోజాత-వామదేవ-అఘోర-తత్పురుష-ఈశానాది ముఖములను తనలింగములో నిక్షిప్తము చేసికొని దర్శనమిచ్చిన శుభ సందర్భము.ఈ ఐదు ముఖములు తమలో పంచభూతత్త్వమును,షట్చక్ర నిర్మానమును,కోశ సంపదను,బీజాక్షర విజ్ఞానమును,సప్తస్వర రాగములను,ఐదు దిక్కులను,ప్రణవ నాదములోని అక్షరములను,మరెన్నో రహస్యములను పొందు పరచుకొని కన్నులవిందు చేయుచున్నవి.

  1.సద్యోజాత శివ స్వరూపము

  లింగము సంకేతముగా,శుభరూపము శివునిగా
  సృజనాత్మక తత్త్వముతో నిశ్చయముగ శుభములొసగు
  పశ్చిమాభిముఖుడు,పరమ కరుణాంత రంగుడు
  సద్యోజాత నామ శివుడు సకల  శుభములొసగు గాక.

  సద్యోజాత శివుడు పశ్చిమాభిముఖుడు."శి" బీజాక్షరము ఇతడు.మనోమయకోశ పాలకుడు.అగ్నితత్త్వము కలవాడు.సప్త స్వరములలోని పంచమ స్వరము.మణిపుర చక్రమునకు అధిపతి.ఓం కారములోని మకారము.సద్య: అనగ అప్పుడె జాత: అనగా పుట్టినవాడు.ఈ శివుడు జీవులలో ప్రవేశించి సృష్టి కార్యమును నిర్వ హిస్తూ,మనలనందరిని అనుగ్రహించు గాక.

  అఘోర శివ స్వరూపము

 లింగము సంకేతముగా,గుణరహిత మూర్తిగా
 మేథ-జ్ఞాన తత్త్వములతో సకల విద్యలనొసగు
 "దక్షిణాభిముఖుడు" దక్షరాజు అల్లుడు
 అఘోరనామ శివుడు అఘములు తొలగించుగాక.

  అఘోరుడు దక్షిణాభిముఖుడు.పంచాక్షరి లోని "మ" బీజాక్షరము.ప్రాణమయకోశ పాలకుడు.పంచ భూతములలోని జలతత్త్వము.స్వాధిష్టాన చక్రమునకు అధిపతి.సప్త స్వరములలో మధ్యమ స్వరము.ఓం కారము లోని "ఉ " కారము.అఘోర నామ శివుడు మనపాపములను తొలగించి, జ్ఞానమును అనుగ్రహించుగాక.

  తత్పురుష శివ స్వరూపము

 లింగము సంకేతముగా,మాయను కప్పువాడుగా
 తిరోధాన తత్త్వముతో,పరిపాలన సాగిస్తూ
 తూరుపు ముఖాభిముఖుడు,మార్పులేవి లేనివాడు
 తత్పురుష నామ శివుడు పురుషార్థములిచ్చుగాక.

 తత్పురుషుడు తూర్పు ముఖాభిముఖుడు.పంచాక్షరి లోని "న" బీజాక్షరము.అన్నమయకోశ పాలకుడు.పంచభూతములలో పృథ్వి తత్త్వము కలవాడు.మూలాధార చక్రమునకు అధిపతి.సప్త స్వరములలో షద్జమ-రిషభ-గాంధార స్వరములు.ఓం కారములోని "అ" కారము. తూర్పు ముఖుడిగా లింగాకారములో నున్న "తత్పురుష"నామ శివుడు మనలను మాయవైపు తిప్పుతు సృష్టి పోషణ (తల్లి శిశువును పెంచుట)చేయుచు,మనలను రక్షించుగాక.


 లింగము సంకేతముగా,పంచకృత్యములైనాడుగా
 అనుగ్రహ తత్త్వముతో భువనైక సంపదలొసగు
 ఊర్థ్వముఖాభిముకుడు పరమార్థమైనవాడు
 "ఈశాన " నామ శివుడు ఈప్సితార్థమిచ్చుగాక.

 ఈశ్వర శబ్ద సమానమైన ఈశాన శివుడు ఊర్థ్వముఖుడై ఉంటాడు.పంచాక్షరి లోని "య"కార బీ జాక్షరము.ఆనందమయకోశ పాలకుడు.పంచభూతములలోని ఆకాశ తత్త్వము.విశుద్ధ ,ఆజ్ఞా,సహస్రార చక్రముల పాలకుడు.సప్త స్వరములలో నిషధము.ఓం కారములోని నాదము.
  పైకి చూచుచున్న ముఖము కలవాడుగా నున్న "ఈశాన" నామ శివుడు సృష్టి,స్థితి,లయ,తిరోధానము,అనుగ్రహము అను ఐదు పనులను నిరంతరము చేయుచు,మనలను అనుగ్రహించు గాక.

"శివ దర్శనం న చింత నాశనం
పాద దర్శనం న పాప నాశనం
జంగమ దేవర స్మరణం జన్మ సార్థకం."
(ఏక బిల్వం శివార్పణం)

MAHAA SIVARAATRI-01

  మహా శివరాత్రి
 ****************
 సృష్టి ప్రారంభమునకు ముందు చరాచర జగతి శూన్యముగా నుండెడిదట.ఆ శూన్యమునందు పరమేశుని తేజస్సు ప్రవేశించి ,చలనముతో దానిని తేజోవంతము చేసినదని అధర్వణ వేదములోని అధర్వ శివోపనిషత్తు ఘోషించుచున్నది.

  ప్రతిజీవిలో పరమేశుని శక్తి నీవారశోక ప్రమాణమున(గడ్డిపోచ కొన) ప్రవేశించుటచే,తదనుగుణముగా పంచభూతములు,సూర్య చంద్రులు,సముద్రములు మొదలగునవి కూడ చైతన్యవంతమయినవి.పరిణామ ప్రభావితులైన దేవతలు ఈశ్వర సంకల్ప ప్రేరితులై "నీవెవరవు?"? అని ఆ తేజోమూర్తిని ప్రశ్నించిరి. 

    వారిని సమాధానపరచ దలచి పరమాత్మ వారితో అద్వైతము-ద్వైతము-త్రికాలములు-చతుర్వేదములు-పంచభూతములు-షట్చక్రములు-సప్త స్వరములు-అష్ట దిక్కులు-నవగ్రహములు-నవావరణములు-    కొశములు-దశేంద్రియములు-ప్రణవమైన ఓంకారము మొదలగునవి అన్నీ తననుండి ఆవిర్భవించినవని,అవి సమయానుకూలముగా సూక్షమమునుండి స్థూలముగాను,స్థూలము నుండి సూక్ష్మము గాను మారుచుండునని,తానును సమయాచారమును బట్టి రూపిగను-అరూపిగను ప్రకటింప బడుదునని చెప్పెను. 

  ప్రతి మాసమునందును బహుళ చతుర్దశి మాస శివరాత్రి అయినప్పటికిని మాఘ బహుళ చతుర్దశి నాటి లింగోద్భవ కాలము మహా శివరాత్రి పుణ్య విశేషముగా పరిగణింపబడుచున్నది.పరమేశుడు సెలవిచ్చిన సాకార-నిరాకార తత్త్వ ఉద్భవము(.పైనుండి కిందికి వచ్చిన అవతరణము.కిందనుండి పైకి వచ్చిన ఉద్భవము.)  

SIVA SANKALPAMU-108

" పునరపి జననం- పునరపి మరణం
పునరపి జననీ జఠరే శయనం
ఇహ సంసారే -బహు దుస్తారే
కృపయా పారే -పాహి త్రిపురారే"
ఓం నమ: శివాయ
శివ కుటుంబములోని "చిన్ని శిశువును" నేను
"ఆకలేస్తున్నదంటే" అన్నపూర్ణమ్మకు చెప్పు
"అన్నము నే తిననంటే" ఆ జాబిలిని కిందకు దింపు
"దాహమువేస్తున్నదంటే" ఆ గంగమ్మకు చెప్పు
"నేను ఆడుకోవాలంటే" ఆ లేడిపిల్లను పంపు
ఆటుపోటులన్నిటిని" ఆదరముతో" కప్పు
కనురెప్పగ పిల్లలను" కాచుటయే ఒప్పు"
కానిపనులు చేసినను" క్షమియించుటయే మెప్పు"
"ఉప్పుబొమ్మ కరిగినది" కొత్త బొమ్మ మిగిలినది
తప్పు తెలిసికొన్నది" తరియిస్తున్నది నీ ఒడిలో"
లక్షణమగు ప్రేమతో" ఒక్క క్షణమైనను" నన్ను వీడక
రక్షను అందీయరా తక్షణమే శంకరా

......కార్తీక మాసము శివ కేశవ మాసము.రెండు రూపములు ఒకే మనసు.ఈశ్వర హృదయస్య కేశవ-కేశవ హృదయస్య ఈశ్వర అనునది ఆర్యోక్తి.కాలాతీతమైన దేవుడు కనికరముతో ఎన్ని జన్మలందైనను మనలను తన ఒడిలోనికి తీసుకొని ఆదరిస్తూనే ఉంటాడు.మాయాతీతముకాని జీవుడు
మరల మరల భగవంతుని ఎన్నో కోరికలు కోరుతూనే ఉంటాడు.శిశువుగా శివుని ఒడిలో పులకిస్తూనే ముద్దుగా తన ముచ్చటలను పురమాయిస్తూ ఉంటాడు.ఇదే శీతకన్ను వేయలేని శీతల కొండ నివాసి హేల.పరమాద్భుతమైన శివలీల.
.....................................................................................................................................................................................................ప్రియ మిత్రులారా.నా ఈ చిన్ని ప్రయత్నమునకు ఊపిరినిచ్చినది మీ ఉన్నత సం స్కారమే కాని నా
అర్హత కాదు.ఈ పవిత్ర
" శివ సంకల్ప" పలుకులను -చూసినా-చూడకున్నా,వినినా-వినకున్నా,చదివినా-చదువకున్నా,చర్చించినా-లేకున్నా,ఎప్పుడో పుక్కిట పట్టేశామని వెక్కిరించినా,గొప్పగా ఏమిలేదు అని పెదవిని చప్పరించినా,తప్పులు సవరించుటకు కనికరించినా.మేమా--తప్పులను సవరించేది అని హుంకరించినా
(ఫలశృతి)
గంగా స్నాన ఫలితమును ఇచ్చు గంగాధరుని ఆన
నాశ రహిత పుణ్యమును ఇచ్చు నాగాభరణుని ఆన
విభవమొసగు-విజయమొసగు విశ్వేశ్వరుని ఆన
సర్వ జనులకు శుభములు ఇచ్చు సదా శివుని ఆన.
( సవినయ ధన్యవాద కుసుమాంజలి)
మంగళం మహత్...హర హర మహాదేవ శంభో శంకర.

SIVA SANKALPAMU-107


  ఆనంద భాష్పాలతో అభిషేకము చేయనా
  భక్తి మకరందమును  చందనముగ పూయనా

  ఆది-అనాది లేదంటు బూదిని నే పూయనా
  శాంతి సహనపుష్పాలతో పూజలనే చేయనా

  పాప రహితము అనే దీపము వెలిగించనా
  పొగడపూల వాసనలనే పొగలుగ నే వేయనా

  లబ్బు-డబ్బు శబ్దాలతో స్తొత్రములే  చేయనా
  ఉచ్చ్వాశ-నిశ్వాస  వింజామరలను  వీచనా

  అరిషడ్వర్గములు లేని ఆతిధ్యమునీయనా
  హర హర మహాదేవ అంటు హారతులే ఇయ్యనా

  దాసోహం-దాసోహం అంటు నే ధన్యతనే పొందనా
  నా పక్కనే  ఉన్నావురా  చూద చక్కనైన శంకరా!

SIVA SANKALPAMU-106


 తిక్కవాడివై నీవుంటే భక్యుల మొక్కులెలా పెరుగుతాయి
 మండే చెట్టూవై నీవుంటే పక్షులెలా వాలుతాయి 

 కరిగే కొండవై నీవుంటే మృగములెలా తిరుగుతాయి
 పారని గంగవై నీవుంటే జలచరముఎలా బతుకుతాయి

 స్వార్థపరుడివై నీవుంటే అర్థనారీశ్వరమెలా అవుతుంది
 శితికంఠుడివై నీవుంటే స్థితికార్యమెలా జరుగుతుంది 

 లయకారుడివై నీవుంటే శృతిలయలెలా నిన్ను చేరతాయి
 మన్నించమని నేనంటే నిన్నెంచను అని అంటావు

 ఆదరమేమో నీది అవగతమయ్యెను అంతలోన
 ఆ నిందా వాక్యములు అవి గతమయ్యెను వింతలోన

 అంతలేసి మాటలాడ ముద్దుమాటలంటావురా
 అద్దమంటి మనసున్న ఓ పెద్ద శంకరా.

SIVA SANKALPAMU-105

   శివ సంకల్పము-105
 నువ్వు తిక్కలోడివని అంది నా మూఢత్వం
 నిన్ను చక్కదిద్దాలనుకుంది నా మూర్ఖత్వం
 నీకేమి తెలియదంది నా అహంకారం
 నీకు తెలియచేయాలనుకుంది నా అంధకారం
 నిన్ను గౌరవించలేనంది నా తాత్సారం
 నీతో గారడి చేయాలనుకుంది నా మాత్సర్యం
 నీకు నాగరికత లేదంది నాలోని ఆటవికం
 నిన్ను నాగరికుడిని చేయాలంది నాలోని ఆధునికం
 నీకు పాఠము చెబుదామనుకుంది నాలోని ఆర్భాటం
 నీకు పరీక్ష పెట్టాలనుకుంది నాలోని ఆరాటం
 సముద్రాన్ని పరీక్షించు ఉప్పుబొమ్మ నేనైతే
 నా తప్పు చెప్పినావురా ఓ గొప్ప శంకరా.

SIVA SANKALPAMU-104

ఓం నమ: శివాయ
భక్తుల కంఠస్థమైన శితికంఠుని స్తోత్రములకు-దండాలు శివా
పృథ్వీలింగమైన ఏకామ్రేశ్వరునికి -దండాలు శివా
అగ్నిలింగమైన అరుణాచలేశునికి-దండాలు శివా
జల లింగమైన జంబుకేశ్వరునికి-దండాలు శివా 
వాయు లింగమైన శ్రీ కాళహస్తీశ్వరునికి- దండాలు శివా
ఆకాశలింగమైన చిదంబరేశ్వరునికి- దండాలు శివా
సూర్యబింబ లింగమైన కోణార్క దేవునికి-దండాలు శివా
చంద్ర బింబలింగమైన చంద్రకోన దేవునికి-దండాలు శివా
భక్తి ఆలింగనమైన మహాలింగమునకు -దండాలు శివా
(ఓం) న-మ:-శి-వా-య అను పంచాక్షరికి-దండాలు శివా
దం-డా-లు-శి-వా అను ఐదు అక్షరములకు-దండాలు శివా
సుస్పష్టపు ఇష్టమైన అష్టమూర్తికి-దండాలు శివా.
.......................................................................................................................................................................................................మాలిన్యము లేనిది మాల.పరమాత్మ ప్రతిభను గుర్తించి చేయు కీర్తనలే స్తోత్రములు.ఉదాహరణ-శివ మహిమ నవరత్న మాలిక.విలువైన నవరత్నములు కంఠమున అలంకరింపబడి అతిశయించుట సాధారణ అర్థము భక్తుల కంఠములందు తిరుగుతు వాగ్రూపముగా వెలువడుట గూఢార్థము.నేల,నింగి,నీరు,నిప్పు,గాలి,ఎండ,వెన్నెల,భక్తానుగ్రహ రూపములలో ప్రకాశించు శివునికి అనేక అనేక నమస్కారములు
( ఏక బిల్వం శివార్పణం )

SIVA SANKALPAMU-103

 చిలుకగ నే జన్మిస్తే చిదంబరుడ అంటాను
 కోడిగ నే జన్మిస్తే కోటిలింగేశ్వర అంటాను

 కాకిగ నే జన్మిస్తే కాళహస్తేశ్వర 
 ఆవుగ నే జన్మిస్తే అంబాపతి అంటాను

 మేకగ నే జన్మిస్తే నే మేలమాడుతుంటాను
 పాముగ నే జన్మిస్తే భృస్మేశ్వర అంటాను

 ఏనుగుగ నే జన్మిస్తే ఏకాంబరేశ్వర అంటాను
 కీటకముగ నే జన్మిస్తే నే కీర్తిస్తూనే ఉంటాను

 జన్మకాదు ముఖ్యమనే కర్మసిద్ధాంతపు సాక్షిగా
 ఏ జన్మలో నేనున్నా ఏలినవారి దయతో

 "త్వమేవాహం" అని తలుస్తు నన్ను తరియింప చేయగా
 బిరమున నన్ను బ్రోవరా పరమైన శంకరా.

SIVA SANKALPAMU-102

కాసు లేనివాడవని కానిమాటలన్నాను
బేసి కన్నులను చూసి రోసిపోయి ఉన్నాను

దోసములే నీ పనులని ఈసడించుకున్నాను
వేసమేమిటో అంటుఈసడించుకున్నాను

నీ కొండను ఎత్తినాడు నీ విల్లు ఎత్తలేదు కద
సహకారమునుఈయనిది అతని అహంకారమేగ

దిక్కు నీవు అనగానే  పక్కనేఉంటావు
అహంకారమును వదిలేస్తే అధీనుడివి అవుతావు

స్వల్పకాలిక లయముతో శక్తినీస్తావు
దీర్ఘకాలిక లయముతో ముక్తిని ఇస్తావు

నిన్ను తక్కువన్న నా తెలివి పక్కదారి మళ్ళించి
మొక్కనీయరా భక్తితో  ముక్కంటి శంకరా!

TANOTU NAH SIVAH SIVAM-12

    తనోతు నః శివః శివం-12   *****************   "  వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే      జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...