Sunday, October 31, 2021

ANAYA NAYANAR

బ్రహ్మ మస్తకావళీ నిబధ్ధతే నమః శివాయ జిహ్మగేంద్ర కుండల ప్రసిధ్ధతే నమః శివాయ బ్రహ్మణే ప్రణీత వేద పధ్ధతే నమః శివాయ జిహ్మకాల దేహదత్త పధ్ధతే నమః శివాయ నమః శివాయ ఆదిశేషువే కుండలములైన వానికి దండాలు శివా ఆ కాలునే కాలదన్నినవానికి దండాలు శివా వేదములే శిరములైన వానికి దండాలు శివా వేదార్థములే తానైన వానికి దండాలు శివా. " ఆ నయ గో సం రక్షక" నాయనారు తిరుమంగళములో గోకులమున జన్మించెను.క్షత్ర వాసన ఏమో వేణుగానముతో పున్నమి వెన్నెల నిండిన బిల్వనంబున సామవేదేశ్వర నాదార్చనముతో సకలజగములలో సుఖశాంతులను నెలకొల్పినాడు. నామరూప భేదమేకాని నాదార్చనలో లోపములేదు.మనోలయమొనరిచే మహాద్భుత మురళీగానము భక్తుని శబ్దమును భగవంతుని చెవికి చేరుస్తూపరవశిస్తున్నది.భగవత్ప్రసాదమైన ఊపిరిని భగవత్సేవకు కైంకర్యమొనరించుచు,కులవృత్తిని గౌరవించుచు , శిశుర్వేత్తి-పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణిః" అన్న నానుడిని నిజము చేస్తూ,గోవులు మేతమీద ధ్యాసను మరల్చుటలేదు.దూదలు తల్లిపాలకై పరుగులు తీయుట లేదు.ఉరుములు తమ నిశ్సబ్దములైనవి.వేడి గాలుల జాడ లేదు. ప్రకృతి సమస్తము ప్రశాంతముగా పరవశిస్తున్నది.పరమాత్మ తత్త్వమును పరిపరి విధములుగా ప్రస్తుతిస్తున్నది. సహజ వైరమును మరచినవి సాధకుని సాంగత్యములో సమస్త ప్రాణులు.సహనమునకు పెద్దపీట వేసినవి.సంఘీభావమునకు శంఖుస్థాపన చేసినవి. ఆనయ హోమద్రవ్యములను మనకు అందించు కామధేనువులను కామేశ్వరునిగా పూజిస్తూ,నాదార్చనను నమ్మిన భక్తితో చేస్తూనే ఉన్నాడు. naadam tanumaniSam Sankaram.

TIRUNEELAKANtHA NAYANAR.

వ్యోమకేశ దివ్య భవ్య రూపతే నమః శివాయ హేమ మేదినీ ధరేంద్ర చాపతే నమః శివాయ నామ మాత్ర దగ్ధ సర్వ పాపతే నమః శివాయ కామనైకతాన హృద్దురాపతే నమః శివాయ ఆశాపాశమునకు అందనివానికి దండాలు శివా ఆకాశము కేశములైన వానికి దండాలు శివా పర్వతమును విల్లుగ మలచిన వానికి దండాలు శివా పాపములు దహించు స్మరణనామికి దండాలు శివా చింతలు తీర్చే చిదంబరమున కుమ్మరి కులములో జన్మించినాడు తిరు నీలకంఠ నాయనారు.సారెతో కుండను మలచిన రీతితో,సాంబశివుని కృపతో తన నిండు జీవితమును సద్భక్తునిగా మలచుకొని సంతుష్టిని పొందుచుండెను. కాలము మాయాజాలమేమో కాని కామునికాల్చిన కామేశుడు వానిని కనికరించుటకు,వాని భక్తిని లోకవిదితము చేయుటకు వానినే పరికరముగా మలచి పంపాడు. శివభక్తులకు భిక్షాపాత్రలనొసగి పరవశించుటకు బదులు స్త్రీల కదగంటి చూపు భిక్షకై వేశ్యాగృహములకు తరలినాడు.కాని పనులు చేసినాడు.భార్య ముందు కాదనలేక పోయినాడు. అంతటితో ఆగలేదు ఆదిదేవుని పరీక్ష.ఆలించే తనను తాకిన నీలకంఠేశుని పై ఆన అని అభ్యంతరమును చెప్పించాడు. తప్పు తెలిసికొనిన నాయనారు తన భార్యను మాత్రమేకాదు,తక్కిన స్త్రీలను సైతము మాతృమూర్తులుగా భావిస్తూ,తాను బ్రహ్మములో చరించసాగాడు. ఆటవిడుపునీయ దలిచాడు ఆ మూడుకన్నులవాడు.ఏ భిక్షాపాత్ర దాన వ్రతమును పాటిస్తున్నాడో ఆ భిక్షాపాత్ర గ్రహీతగా తరలి వచ్చాడు. విస్మరించిన గృహస్థధర్మమును గుర్తుచేసి,వారు ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి అందించుటకు శివయోగిగా తిరునీలకంఠను సమీపించాడు. దర్శనము నందించిన ధన్యత ఎదురేగి ఎనలేని భక్తి సాదరముగా ఎదురేగి స్వామిని సత్కరించింది.భిక్షపాత్రను అందీయ బిడియమును వీడింది. ఆటను ప్రారంభించాడు నిటలాక్షుడు.స్నాన నియమమును వివరించి,వీలుకానిచో వెళ్ళిపోతానన్నాడు. భార్యను తాకనను ప్రతిన ఒకవైపు/భక్తునికిచ్చిన మాట ఇంకొక వైపు దేనిని తిరస్కరించాలి?దేనిని పురస్కరించాళి? పెద్ద ధర్మ సంకటము. అవుననలేడు/కాదనలేడు. కఠిన పరీక్షకు కాస్త సడలింపునిచ్చాడు కరుణామయుడు సలహారూపములో. ఆలుమగలు తాకకుండా ఒక కర్రను పట్టుకుని (ఆనను గౌరవిస్తూనే) జంట స్నానాలు చేసి(యతి నియమమును కాదనకుండానే) స్నానముచేసి,స్వామి సాక్షాత్కారమును పొంది సఫలీకృతులైనారు. ఆ నీలకంఠుని అనుగ్రహించిన నీలకంఠుడు మనలందరిని అనుగ్రహించుగాక. ఏక బిల్వం శివార్పణం

AMARANEEDI NAYANAR

ఇష్టవస్తు ముఖ్యదాన హేతవే నమః శివాయ దుష్ట దైత్య వంశ ధూమకేతవే నమః శివాయ సృష్టి రక్షణాయ ధర్మ సేతవే నమః శివాయ అష్టమూర్తయే వృషేంద్ర కేతవే నమః శివాయ ఋషివందిత ఋషభవాహనునకు దండాలు శివా ధర్మపు వంతెన సృష్టిరక్షకునకు దండాలు శివా దుష్టుల శిక్షించు ధూమకేతనునకు దండాలు శివా ఇష్టవస్తు ప్రదాత అష్టమూర్తికి దండాలు శివా. అశాశ్వత ఉపాధిని నడిపించుచున్న శాశ్వత /అమర శక్తివి నీవే అని పరమాత్మ తత్త్వమును తెలిసిన సార్థక నామధేయుడు అమరనీతి నాయనారు. వృత్తి-ప్రవృత్తులు విరుధ్ధములైనప్పటికిని ,వాటిని తన సంస్కారముతో సమర్థవంతములుగా మలచుకొనిన వాడు.పళైయర్ లో వైశ్యకులములో జన్మించిన అమరనీతి ఇహమునకు సంబంధించిన భోగలాలసను పెంపొందించు పట్టు వస్త్రములను.సువర్ణ-నవరత్నములను కులవృత్తిగా విక్రయించుచున్నప్పటికిని,బురద తాకని తామరవలె,వైరాగ్య సంపన్నుడై అత్యంత భక్తి శ్రధ్ధలతో నటరాజ భక్తులైన శివయోగులకు ,వైరాగ్య సంకేతమైన కౌపీనములను దానము చేయు దీక్షాపరుడిగా శివార్చనలను చేయుచుండెడి వాడు. తన సంపాదనతో శివభక్తుల వసతికై ఎన్నో మఠములను కట్టించాడు.పరవశిస్తూ శివభక్తుల పాదములను (పాద్యముతో) పరమేశులే అంటూ కడిగే వాడు.కాశీ విశ్వేశ్వరులంటూ కౌపీనములను భక్తితో సమర్పించేవాడు. కళ్యాణ సుందరేశుని కనులారా దర్శించుకుంటు,మనసారా స్మరించుకుంటూ మైమరచి పోతుండేవాడు. గోచీ సమర్పణ వ్రతుని పేచీతో అనుగ్రహించాలనుకున్నాడు ఆ మూడుకన్నులవాడు వేడుకగా. అంతే. దాక్షిణ్యమూర్తి కౌపీనమును ధరించి,తన దండమునకు రెండు కౌపీనములను కట్టి ,సమీపించాడు అమరనీతి నాయనారును.వచ్చినది తనను పరీక్షించుటకని తెలియని భక్తి, భక్తుని చేత సంభ్రమాచర్యములతో పరుగులు తీయించినది.పాదసేవనము చేసినది.పరిపరి విధముల ప్రార్థనలను చేయించినది. .ప్రణామములిడినది.పరవశిస్తున్నది.అయినా ఏదో వెలితి. అదను కోసము చూస్తున్నాడు మదనుని కాల్చినవాడు.వానితో తందానా అంటూ మోదముతో నున్నది కథను నడిపించే కౌపీనము. స్వామి మిమ్ములను సేవించుకొను అవకాశమునిమ్మని అమాయకముగా వేడుకుంటున్నాడు మాయావిని మైమరచి అమరనీతి. మరీ ఇంత మొహమాటపెడితే కాదనగలనా.కానీయి నీ ఇష్టమే అంటూ , తన దండమునకున్న ఒక పొడి కౌపీనము నిచ్చి , , నేను నదీస్నానము చేసివచ్చేవరకు దీనిని నీ దగ్గర భద్రపరచు.వచ్చి తీసుకుంటాను అన్నాడు మహదేవుడు. .మహాభాగ్యమంటు మురిసిపోయాడు నాయనారు. అంతలో ... అనుకోకుండా, కురుస్తున్నది కరుణామృత వర్షమందునా/ కఠిన పరీక్షకు నాంది అనుకోనా /కైవల్య కటాక్షమునకు శిక్షణ యా అది? ఆదిదేవుడు ఆటను ప్రారంభించాడు.తన శరీరము మీది కౌపీనమును/దండమునకు కట్టిన దానిని తడిసి ముద్దయేటట్లు చేసాడు.మంచుకొండ నివాసమైన వాడిని నేనేమనగలను? చలికి గడగడ వణుకుతు వచ్చి అమరనీతిముందు నిలబడి, అమరనీతి నా పొడి కౌపీనమును ఇస్తే కట్టుకుంటున్నాను అన్నాడు అగ్గి కన్నువాడు అమాయకముగా. తక్షణమే దాచిన కౌపీనమును తిరిగి ఇచ్చివేయుటకు లోనికి వెళ్ళాడు అమరనీతి. . దాచిన చోట కౌపీనములేదు.తొందర పెడుతున్నాడు బయటనున్న అతిథి కౌపీనమునకై. క్షమాపణ నడిగి తన దగ్గరనున్న కౌపీనమును స్వీకరించమన్నాడు భక్తుడు.తానిచ్చిన కౌపీనమే కావాలన్నాడు భగవంతుడు."లాలోచిపడిన కౌపీనము తనపని తాను చేసుకుపోతున్నది భక్తునికి అందకుండా.భగవదాజ్ఞను పాటిస్తూ." భంగపాటును భరిస్తూనే భక్తి బ్రతిమలాడ సాగినది మరొక్క అవకాశమునకై.కౌపీనమునకు బదులుగా మరేదైనా స్వీకరించుటకై.శివపాదమును విడువకున్నది. కనికరించాడు కదిలివచ్చినవాడు.భక్తులకు స్తుతుల నందించ దలచి కౌపీనముతో తులాభారమునకు అంగీకరించాడు అష్టమూర్తి.త్రాసులో కౌపీనమునుంచారు ఒకవైపు. అష్టసిధ్ధులు ఒకవైపు -అష్టైశ్వర్యములు మరొకవైపు ఆడుకుంటున్నాయి.సరితూగుట సాధ్యము కానిది కదా. మాట తప్పని అమరనీతి తన కుటుంబముతో సహా తక్కెడలో కూర్చున్నాడు తూగుటకు. జగమంత కుటుంబమైన జంగమ దేవర కనికరించాడు.నిజ దర్శనమునందించాడు. విషయభోగములను విష సర్పముల బారిన పడకుండా ,విశేష ఫలమును అందించుటకు,కౌపీనమును కారణము ు చేసిన శరణాగత రక్షకుడు మనలను రక్షించును గాక. ఏక బిల్వం శివార్పణం .

TANOTU NAH SIVAH SIVAM-12

    తనోతు నః శివః శివం-12   *****************   "  వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే      జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...