నాల్గవ పాశురము*************
ఆళిమళై కణ్ణా! ఒన్రు నీ కై కరవేల్
ఆళియుల్ పుక్కు ముగందు కొడార్ త్తేరి
ఊళి ముదల్వన్ ఉరువం పోల్ మెయికరుత్తు
పాళియన్ తోళుడై ప్పర్బనాబన్ కైయిల్
ఆళిపోల్ మిన్ని వలంబురి పోల్ నిన్రదిందు
తాళాదే శార్ఙ్ ముదైత్త శరమళై పోల్
వాళ ఉలగనిల్ పెయిదిడాయ్ నాంగళుం
మార్గళి నీరాడ మగిళిందు ఏలోరెంబావై.
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః
ఓంగి ఉలగళంద్ పాశురములో స్వమి తానే త్రివిక్రమ వేషధారియై అవతారలీలావిశేషములౌ ప్రస్తుతించిన గోదమ్మ ప్రస్తుత పాశురములో స్వామి తాను సూత్రధారియై,వరుణదేవుని పాత్రధారునిగా మలచి,పద్మనాభస్వామి స్వరూప-స్వభావ-విభవములతో పోలుస్తు,వరుణదేవుని లోక సంరక్షణాకార్యనిర్వాకునిగా అదియును పాపపుణ్యములను లెక్కించని సర్వత్ర వానగా స్వామి ఆనగా వర్షించు అని ప్రార్థిస్తున్నది.వారి నోము లోక సంక్షేమమునకు గాన జలకములాడుటకు తగిన వనరులను అర్థించుచున్నది.
ఆళ్వారులు (ఆచార్యులు) వరుణదేవుని వంటివారు.వారు భగవత్ గుణములనెడి జ్ఞాన సముద్రములో పూర్తిగా మునిగి,భగవత్తత్త్వను నీటిని నిశ్శేషముగా త్రాగి,నిరంతరము నీలమేఘశ్యామునితో రమించుట వలన నల్లగా స్వామి మేనిఛాయను పొందుతారట.ఎంతటి భాగ్యశాలురో కద.మేఘము గగనమునకు వెడలునట్లు వీరును ఆ-అంతట-కాశము-ప్రకాశవంతమైన మూలతత్త్వమున ప్రవేశించి,మనలను సంస్కరించుటకు జ్ఞానామృతధారలను వర్షించెదరు
స్వామి శంఖనాద ప్రణవ నాదము శేష-శేషి భావమునకు,శరమళై స్వరూప యాదాత్మ్య జ్ఞానమునకు సూచికలు.ఉపదేశములు-.వారి జ్ఞాన వాగ్వర్షము కాంతిని-విజ్ఞతను మెరుపు ఉరుముల వలె కలిగియుండును.తిరుగులేని రామబాణముల వరుస వలె అనవరతము అనుగ్రహించుచుండును అని అమ్మ పర-వ్యూహ-విభవ మైన ఆచార్య తత్త్వమును " ఆళిమళైకణ్ణా! అని ప్రస్తుతించినది."ముగందు కొడు" అని జ్ఞానమును పూర్తిగా సంగ్రహించిన వారిగా ప్రస్తుతించినది.వారి జ్ఞాన ధారలను"మగిళిందు పెయిదిడాయ్"
వరుణదేవా నీవు సముద్రగర్భములోనికి ప్రవేశించి,కడుపునిండా నీరు త్రాగి,సంతోషముగా త్రేంచుచు పైకి లేచి,బీడునేల-పంటనేల అను వివక్షను చూపకుండా,ఏ విధముగా స్వామి అనుగ్రేహము పాపపుణ్యములను లీక్కకు తీసుకొనదో అదేవిధముగా మమ్ములను అనుగ్రహించు.
ఆ సమయములో నీ ఉరుములు స్వామి పాంచజన్య నాదములను,మెరుపులు సుదర్శన కాంతులను,నీ వాన చినుకులు శారంగ శరములను పోలి ప్రతిఫలించనీ.
స్వామి పర-వ్యూహ-అర్చ-విభవ రూపములను ప్రస్తావించిన తదుపరి ఆండాళ్ తల్లి మనకు భాగవత ప్రాశస్త్యమును పరిచయము చేస్తున్నదా అన్నట్లు,ఆచార్యులను వరుణదేవునితో వారు అందరికి సమానముగా అనుగ్రహించు ఆధ్యాత్మిక సంపదను వానతో వారి కాంతి నీలమేఘునితో,కరుణను వర్షించు,కనికరముతో సంకేతిస్తున్నదనుటలోను సందేహము లేదు.
పర మూర్తి,వ్యూహమూర్తిగా దర్శనమిస్తున్నప్పుడు తన నాభినుండి బ్రహ్మను సృజించినాడు.అదేవిధముగా తాను వరుణునికి తన సమ్రక్షనములో పాలుపంచుకునే అవకాశమును ఆశీర్వదించినాడేమో.
స్వామి శారంగమునుండి వచ్చున్న సరములా అన్నట్లు వానజల్లులను పోల్చినది.నిజమునకు అవి శరములుకావు.ఆశ్రిత వాత్సల్యము అందించుచున్న వరములు.
ఆండాల్ తల్లి మనలను గోపికలు అను పేర నున్న పదిమంది ఆళ్వారులను రేపటి నుండి పరిచయము చేయుటకు ముందుగా భగవదాశ్రయము ఎంతగొప్పదో-భాగవతాశ్రము సైతము అంతే ఉదాత్తమైనదను భావనమును అందించుచున్న ,
ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.