శార్దూలము... మాతంగి వర్ణన.
ఊతం భద్ర సుభద్ర రుద్రరమణీమ్ ఉచ్చిష్ట చండాలినీమ్
భాతిమ్ రోహిత వస్త్ర సంపుటికరీమ్ వాణీం చతుర్బాహునీమ్
గీతం వాచక నాద నృత్య నిధి సంఘీభావ సంపూజనీమ్
మాతంగీమ్ హరితాం సుశోభి సుమతీమ్ మంత్రిత్వ సంచాలకీమ్!
భావము: ఆశ్రయము (ఊతం) ఇచ్చి భద్రంగా చూసే విష్ణురూప (సుభద్ర) రుద్రకామినీ ఉచ్చిష్ట చండాలిని గా పేరుపొందావు. ఎరుపు వస్త్రములతో ఆభరణములతో కాంతివంతముగా కప్పుకున్న (సంపుటి) నాలుగు బాహువులు గల సరస్వతీ. నృత్య నాట్య సంగీత వాచకములకు నిధివి, ఐకమత్య బోధకురాలివి కడుపూజనీయురాలివి. ఓ మాతంగీ! ఆకుపచ్చ రంగులో శోభిల్లు బుద్ధిమంతురాలివి, ఆ లలితా మాతకు ప్రధాన మంత్రి గా సంచాలకము చేస్తున్నావు. నమస్కారములు!
శ్రీ మాత్రే నమః
********************
" మాణిక్యవీణాం ఉపలాలయంతీం
మదాలసాం మంజుల వాగ్విలాసాం
మాహేంద్ర నీలద్యుతి కోమలాంగీం
మాతంగ కన్యాం మనసా స్మరామి.
చతుర్భుజే చంద్రకళా వతంసే
కుచోన్నతే కుంకుమరాగ శోణే
పుండ్రేక్షు పాశాంకుశ పుష్ప బాణ హస్తే
నమస్తే ! జగదేక మాతః."
ఆవిర్భావ కారణము-విధానము
**************************
హిమవంతునిస్నేహితుడైన మతంగముని శ్యామలా ఉపాసకుడు.మతంగముని పత్నిని ఆకుపచ్చని శరీరకాంతితో,పద్మధారియై మాతంగి స్వప్న సాక్షాత్కారమును అనుగ్రహించెను.నిరంతర, అకుంఠితసాధనతో తల్లిని పుత్రికగా పొందగలిగెను.
తత్ఫలితముగా బ్రహ్మాండసంకేతమైన కదంబవనములో మతంగముని ధ్యానాసక్తుడైయున్న సమయమునబ్రహ్మాండమను కదంబ వనమున ప్రసన్నవదనయై,మందస్మితముతో తల్లి సాక్షాత్కరించినది.
" శ్యామాంగీం అరుణాంబరాం పృథుకుచాం గుంజావళీశోభితాం
హస్తాబ్జాన్ దధీతిం కపాలమమలం తీక్ష్ణాం తథా కర్రికాం
ధ్యాయేత్ మానసపంకజే భగవతీం ఉచ్చిష్ట చాండాలినీం."
శక్తిసమాగమ తంత్రానుసారము లక్ష్మీనారాయణులు పార్వతీపరమేశ్వరులకుభక్తిప్రపత్తులతో మహానైవేద్యమును సమర్పించగా,కరుణతో స్వీకరించుచున్న సమయమునకొన్నిమెతుకులు క్రిందకు జారి,వాని నుండి ఒక అందమైన కన్య ఆవిర్భవించినదట.విపరీతమైన ఆకలితో నున్న ఆ కన్య, వారు భుజించగా మిగిలిన నైవేద్యమును భుజించి,ఉచ్ఛిష్ట చండికగా ప్రసిధ్ధిచెందినది.
మత్స్య పురాణానుసారముగా అంధకాసుర రుధిరపానార్థమై పార్వతీదేవి తనశరీరము నుండి కౌశికీదేవిని ఉత్పన్నము చేసినదట.మాతృరూపిణియైన గౌరీదేవి దేహము నుండి ఉత్పన్నమైన కారణమున ఈమెను మాతంగి అంటారట.
అసురీశక్తులను అంతమొందించు యుధ్ధమున పరమేశ్వరి తన శరీరమునుండి ఒక అద్భుతశక్తిని ఆవిర్భవింపచేసి ,సేనలకు ప్రధానమంత్రిణిగా నియమిస్తు,తనచేతి ముద్రికను తొడిగినారని.యుధ్ధమున తల్లి విషంగుడు అను రాక్షసుని అంతమొందించినదను కథనము కలదు.,ముద్రికాదేవిగా కూడ ఆరాధిస్తారు.
అశుభములలో,అశుభ్రతలో మిళితమైన కాలుష్యశక్తిగా భావించి,మాతంగిని చండాలిక గా పిలుస్తారు.చండాలిక విషయవాసనలు అంటలేనిది కాని మనము అంటరారానిది కాదు.
రూపము
******
ఉగ్ర మాతంగిగా ఘోరరూపియై,శవసింహాసనయై,ఒక చేత పుర్రెతో అరణ్యనివాసినిగా సంచరిస్తుంటుంది.
శ్యామలాదేవిగా మరకత మణివర్ణముతో, పద్మాసనస్థితయై,పద్మమును,కెంపులుపొదిగిన వీణను ధరించి,ఎర్రని వస్త్రములతో,ఎర్రని ఆభరణములతో ఎర్రనిపూలమాలలతో వాక్శక్తియై అనుగ్రహిస్తుంది.మహాకవి కాళిదాసు.
రాజమాతంగిగా చేత నాదస్వరూపమైన వీణను ధరించి,చిలుకలకు పలుకులు నేర్పుతూ,సంగీత-సాహిత్యమనే ఘనస్తనములతో,చతుషష్టి కళారూపిణియై యుంటుంది.
ధ్యాన మాతంగిగా నీలివర్ణముతో కదంబమాలను ధరించి,సృష్టి-స్థితి-లయములను నడుము క్రింది మూడు వళులతో(ముడుతలతో) ముజ్జగములనేలుతుంటుంది.సర్వ వర్ణోపశోభిత సర్వశక్తి సమన్వితా.
స్వభావము
**********
మోహరాత్రియైన మాతంగి మతంగుడు అను శివశక్తిని కలుపుకొని పరిపూర్ణమవుతుంది.శ్రావణ బహుళ అష్టమి బుధ్ధావతారముగా భావించే తల్లికి ప్రీతిపాత్రము.మూలబిందువు నుండి వాయవ్యదిసకు విస్తరిస్తుంది.వాక్శక్తి-మంత్రశక్తియైన తల్లి సర్వతంత్రిణి.
ఆయుధములు
*********
" ఖరాంశుః ఖేలినీ ఖట్వా ఖరా ఖట్వాంగధారిణీ'
ఘోర రూపియైన మాతంగి-ప్రచండ చండిక పాశాంకుశములను,ఖట్వాంగమును ఆయుధములుగా ధరించి యుంటుంది.
సౌమ్యరూపియై ఉన్నప్పుడు చెరుకువిల్లు,పూలబాణములు,చిలుకను,వీణను ధరించియుంటుంది.ఘోరరూపియైనపుడు పాశాంకుసములు,దండము కృపాణమును,కపాలమును ధరించియుంటుంది.
నివాసస్థానము
**************
శరీరములోని విశుధ్ధిచక్రము మాతంగి నివాసస్థానము.
త్రికోణము మాతంగి నివాసస్థానము.సూక్ష్మరూపములో యంత్రముగాను,స్థూలములో మూర్తిగాను,చతుషష్టికళలలో ప్రకటితమవుతుంది.పరా-పశ్యంతి-మధ్యమా-వైఖరీ వాక్కుగాను ప్రకటింపబడుతుంటుంది.మేరుదండములా ఉన్న మన వెన్నెముకలో,తిరగబడిన ఆడఏనుగు తొండమువలె మాతంగి నివసిస్తుంది.తృతీయనేత్ర స్థానము నుండి బయలుదేరిన శక్తిని జిహ్వాగ్రమునకు చేర్చే సరస్వతీనాడినివాసిని మాతంగి.శరీరమందలి విశుధ్ధిచక్రములోను ఉంటుంది తల్లి.
అంతరార్థము.
**********
సరస్వతీదేవి అవతారమే మాతంగి.అంతఃకరణ ప్రపంచము మాతంగిది.బాహ్యము సరస్వతిది.ఆధ్యాత్మిక విషయబోధనలకు గురువు మాతంగి.ఆనందానికి ప్రతీకగా హస్తములో అమృతపాత్రను,వ్యాకరణరూపమైన శంఖమును ధరించిన,అవ్యాజకరుణామూర్తి పాదపద్మములకు సవినయ సమర్పణము చేస్తూ,మహాకవి కాళిదాసును అనుగ్రహించుటకు అడ్డుపడుతున్న ఏడుజన్మల పాపరాశులను కాళిసతి ద్వారా ఏడు క్షణములుగా మార్చి,సరస్వతీ తత్త్వముతో బీజాక్షరమును అనుగ్రహించినదను కథనము కూడ కలదు.
"మాణిక్యవీనా ముపలాలయంతీం
మదాలసామ్మంజుల వాగ్విలాసాం
మహేంద్రనీలద్యుతికోమలాంగీం
మాతంగ కన్యాం మనసా స్మరామి."
" యదక్షర పద భ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్
తత్సర్వం క్షమ్యతాం దేవి శ్రీమాతానమో స్తుతే.
అపరాధసహస్రాణి క్రియంతే అహర్నిశం మమ
దాసో యమితి మాతా క్షమస్వ పరమేశ్వరి.
యాదేవీ సర్వభూతానాం మాతంగిరూపేణ సంస్థితాం,
నమస్తస్త్యై నమస్తస్త్యై నమస్తస్త్యై నమోనమః.
https://www.youtube.com/watch?v=50Dy7fU_kpc&feature=youtu.be
.
.
.
.
.
No comments:
Post a Comment