" తనూ కరోతి ఇతి త్వష్టా" సృష్టి లోని ప్రతి పదార్థమునకు ఒక నిర్దిష్ట రూపమును కలిగించేవాడు.
"రూపము రూపం బహురూపం బభూవ" జగత్తులోని రూపములు ప్రకటింపబడటానికి,వాని గుర్తించగలగడానికి త్వష్ట యే కారణము.
స్వామి ఈష మాసమున వృక్ష నివాసము చేస్తూ,త్వష్ట నామధేయముతో పరిరక్షిస్తుంటాడు.పెద్దలు త్వష్ట అను నామమునకు మలుచువాడు/తొలుచువాడు అని సమన్వయిస్తారు.మనకు కావలిసిన హరితమును సంభరితము చేస్తూ,ఆహారమునకు కావలిసినవి ఉంచుతూ,కలుపులను తుంచుతూ హరితవాసము చేస్తాడు స్వామి."ఈశావాస్యం ఇదం సర్వం" అన్న సూక్తిని అనుభవైవేద్యము చేస్తాడు.ఆ స్వామికి జమదగ్ని మహాముని వేదసూక్తులతో మోదమునందిస్తుంటాడు.అప్సరస తిలోత్తమ్మ అనుపమాన నాట్యముతో పూజ్స్తుంటుంది.నృత్యం సమర్పయామి అంటూ.దానికి తోడుగా ధృతరాష్ట్రుడను గంధర్వుడు తన భుజబలముతో స్వామి యానగా అవనీతలమును కాపాడుతూ,ఆనందగానము చేస్తుంటాడు.కంబలాశ్వ సర్పము రథపగ్గములను పటిష్టపరుస్తుంటే,యక్షుడు శతాజిత్ తాళ్ళను మెలివేస్తూ,తరలుతున్న గమనశక్తికి గమకము అద్దుతున్నాడు.బ్రహ్మపేత రాక్షసుడు బ్రహ్మాండాధిపతి రథమును వెనుక నిలబడి ముందుకు జరుపుతుండగా,జగములకు తన కరుణను స్పష్టము చేస్తూ,అరిష్టనివారణకై అనుగమిస్తున్నాడు స్వామి.
తం త్వష్ట ప్రణమామ్యహం.