సౌందర్య లహరి-33
పరమ పావనమైన నీ పాదరజ కణము
పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము
పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము
కుండను తయారు చేయగ నిమిత్తము కుమ్మరి
మన్ను ఉపాదానమైనది కుండ నిజము కాదంటు
మన్ను ఉపాదానమైనది కుండ నిజము కాదంటు
ఆభరణము తయారు చేయగ నిమిత్తము కంసాలి
బంగారము ఉపాదానమైనది నగ నిజము కాదంటు
బంగారము ఉపాదానమైనది నగ నిజము కాదంటు
నీ మూర్తిని తయారుచేయగ నిమిత్తము శిల్పి
నీ మహత్తు ఉపాదానమైనది అన్నీ నీవే అంటూ
నీ మహత్తు ఉపాదానమైనది అన్నీ నీవే అంటూ
ప్రథమము.ప్రధానము,ప్రకృష్టము "నీవే" కద తల్లీ!
నా నికృష్టపుతనము, పరమోత్కృష్టముగ మారుచున్నవేళ
నా నికృష్టపుతనము, పరమోత్కృష్టముగ మారుచున్నవేళ
నీ మ్రోలనేనున్న నా కేలు విడనాడకమ్మా,నా
మానస విహారి ఓ సౌందర్య లహరి.
మానస విహారి ఓ సౌందర్య లహరి.
భావము
నా మనసనే తోటలో విహరించుచున్న తల్లీ నిన్ను నిశిత దృష్టితో చూసిన నిజము అర్థమగును.కుండలను చేయుచున్న కుమ్మరి నిమిత్తమాత్రుడు జీవులనే కుండలను చేయుచున్న బ్రహ్మ నీ అనుగ్రహపాత్రుడు.సాధారణముగా చూస్తే కుండ కనిపిస్తుంది కాని నిశితముగా చూస్తే అది మట్టి.కుండ పగిలిపోతుంది.మట్టి మిగిలిపోతుంది.ఇదే విధముగా నగలను చేయుచున్న కంసాలి,నీ మూర్తిని తయారుచేయుచున్న శిల్పి నిమిత్త మాత్రులు.అన్నిటిలో ఉన్నది నీ మహిమ.కుండ,కూజా,మూకుడు.ఇటుక,పొయ్యి,బాన ఇలా అనేక రూపములలో ఉన్నది మట్టి.అదే విధముగా నింగి,నేల,నదులు,సముద్రములు,వనములు,కొండలు,చరాచరములలో దాగిఉన్నది నీ శక్తి.ప్రతి దానిలో మొదలు,ముఖ్యము,ఔన్నత్యము అన్నీ నీవే తల్లీ.నాలోని నీచాతినీచ స్వభావము ఉన్నతముగా మారుచున్న వేళ నీ దగ్గరనేనున్న నా వేలిని విడిచిపెట్టకమ్మా.అనేక వందనములు.
....
....