శిత్తం శిరుకాలే వందు ఉన్నై చ్చేవిత్తు ఉన్
పొత్తామరై యడియే పోట్రుం పొరుళ్ కేళాయ్
పెత్తం మెయ్ త్తుణుం కులత్తిల్ పిఱందు నీ
కుత్తేవల్ ఎంగలై క్కోళ్ళామల్ పోగాదు
ఇత్తైపఱై కోళ్వాన్ అన్రుకాణ్ గోవిందా
ఎత్తెక్కుం ఏడేడ్ పిఱవిక్కుం ఉందన్నోడు
ఉత్తోమేయావోం ఉనక్కే నామాళ్ చెయివోం
మత్తైనం కామంగళ్ మాత్తు ఏలో రెంబావాయ్.
ఓం నమో నారాయణాయ-29
విచిత్రముగ నామది శ్రీవిల్లిపుత్తూరుగా మారినది
విష్ణుచిత్తీయమై శ్రీహరినామ సంకీర్తనమే కోరుతోంది
పశువులు మేసిన తరువాతనే తాము భుజించెడివారైన
మన గోపికను కలుపుకొనిన శ్రీ విల్లిపుత్తూరు గోపికలలో
పాలు-పెరుగు-వెన్న-నెయ్యి రూపు మారిన పాలైన
కొద్ది కొద్దిగ తమ మనసును దిద్దుకొనుచున్న గోపికలలో
తామర పూసల మాలికలు గళమున ధరించిన వాడైన
తామర నేత్రును కొలిచిన నారాయణత్వములో
"వంగక్కడల్ కడైంద" మాధవ-కేశవ చింతనమైన
అటు-ఇటు ఏడుతరములను కూడమంటున్న గోపికలలో
పరాన్ముఖము ప్రత్యన్ముఖమగు పడతులార రారె
ఆముక్తమాల్యద ఆండాళ్ అమ్మ వెంట నేడె
భావము
సర్వేంద్రియములు భక్తిభావముతో నిండిపోయి, సర్వస్య శరణాగతి ప్రకటనమే గోపికలు.అటువంటి పవిత్రులు వారి దినచర్యనుండియే భగవతత్త్వమును గ్రహించుచున్నారు.వారు రోజు చూసే పాలు-పెరుగు-వెన్న-నెయ్యి మారిన పాల రూపాలే అని, వారి ఆంతర్యములోని కృష్ణతత్త్వము వివిధ దశలను వివరించి,వారు ఏమికోరుకోవాలో కూడా సుస్పష్టము చేసినది. వాయిద్యములు-చీరెలు-సారెలు మొదలగు పరికరములు వారికి కానుకలుగా తోచలేదు.వారికి పరమాత్మతో చల్దులు-ఆట పాటలు దొరికితే చాలనుకున్నారు.స్వామి సరసను కూర్చుని,పరమాన్నమారగించుటయే పెద్ద సన్మానమనుకున్నారు.పాలు రూపాంతరము చెందుతూ పెరుగు-వెన్న-నెయ్యిగా మారి నిలిచిపోతుంది.నెయ్యి పేరుకున్నా కరిగించినానెయ్యిగానే ఉండి స్వామి నెయ్యమును కోరుతూనే ఉంటుంది.అదే విధముగా గోపికలు వారి గురించి మాత్రమే కాకుండా అటు-ఇటు ఏడుతరాలు"
వారు కూడ తరించాలనుకుంటున్నారు.
.ప్రజ్జ్వలిత జ్యోతులు పరంజ్యోతిని చుట్టి తామర పూసలై-తులసి పూసలై నారాయణత్వములో మమేకమవుతున్నారు మన గోపికమ్మతో సహా.
ఇంతకీ ఈ నారాయణత్వం ఏమిటి? అనే సందేహం నాలో జనించింది.
ఇంతలోనే ఓడలు తిరిగే కడలిని చిలికిన వాడా అంటున్నారు గోపికలు.పాలకడలిలో
ఓడలు ఉన్నాయంటున్నారేమిటి?అర్థం కావాలంటే నారాయణత్వం అర్థం కావాలి. ఆద్యంతరహిత గుణాత్మకమును తెలియచేయు వేదోక్త పరమాత్మ నారాయణుడు.నార అనగా నీరు అని అర్థము.అయన అనగా నివసించినవాడు.నీటిపై ప్రప్రధమముగా నివసించిన వాడు నారాయణుడు(వట పత్ర సాయి.)
మన దేహము పంచేంద్రియ సమాహారమైన పడవ.మనమున్నది సం సారమనెడి భవ(పాపముల) సాగరము.దానిలో స్వామిని చేర్చగలుగఇంద్రియములు-బుద్ధి చెదరకుండా రక్షించేవాడు.
ఆధ్యాత్మిక పరముగా ఆలోచిస్తే పాల సముద్రమునుండి జనించిన కల్ప తరువు,కామ ధేనువు,చంద్రుడు ,మహాలక్ష్మి మనలను దరిచేర్చుటకు సహాయపడు ఓడలు.అటువంటి ఓడలున్న పాల సముద్రమును చిలికిన స్వామి ధర్మమునకు గ్లాని కలుగకుండా అధర్మమును శిక్షిస్తూ కార్య నిర్వహణ చేస్తాడు.భక్తులను అనుగ్రహించి వారిని పవిత్రమైన తామర పూసలుగా మార్చుకొని తన గళమున అలంకరించుకుని ఆదరించుటయే. మన రూపము మారినన్ను మనపై స్వామికిగల అవ్యాజ ప్రేమభావ నిశ్చలత్వమే నారాయణత్వము.ప్రజ్వలిత జ్యోతుల సమాహారమైన పరంజ్యోతియే నారాయణత్వము.
ఇదంతా విని తెలిసికొనిన నా మనసు మన గోపికలు పరాన్ముఖత్వమును వీడి(బాహ్య విషయానురక్తి) ప్రత్యన్ముఖులైన వారు. (అంతర్దర్శనమును చేయుచున్నవారు) కనుకనే మనగోపిక అమ్మ అనుగ్రహముతో ముప్పదవ పాశురములోని విషయములతో పాటుగా, నయన మనోహరమైన గోదా కళ్యాణమును వీక్షించబోతున్నదని సంతోషముతో,అమ్మ వెంట స్వామిసేవకు చనుచున్నవారితో పాటుగా తన అడుగులను కదుపుతున్న గోపికతో పాటు నా మనసుకూడా అడుగులను కలుపుతోంది..
( ఆండాళ్ తిరువడిగళే శరణం )