Monday, February 19, 2018

SAUNDARYA LAHARI-11

    సౌందర్య లహరి-11



  పరమపావనమైన నీపాదరజ కణము

  పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము



  లోభమునకు లోబడి రోగియైన నా మనసు

  పనికిరాని పనులతో సతమతమౌతుంటుంది



  కన్నుమిన్ను కానరాక కల్లుతాగిన కోతిలా



 దండగ పనులను బహుదండిగ చేస్తుంటుంది





  చిమటలా కొరుకుతూ చీదరపుట్టిస్తుంటుంది

  మితిమీరిన తెలివితో తలక్రిందులు వేలాడుతు



  చీకటిలో ఉబ్బితబ్బిబ్బౌ గబ్బిలము అవుతుంది

  గబ్బిలమౌ మది పూజలో గుగ్గిలమగుచున్న వేళ

 నీ మ్రోలనే  నున్న  నా కేలు  విడనాడకమ్మా,నా
 మానస విహారి! ఓ సౌందర్య లహరి.

  "దశాంగం గుగ్గిలోపేతం సుగంధంచ సుమనోహరం
   ధూపం దాస్యామితే దేవి గృహాన పరమేశ్వరి"

  సంబరేను చెట్టు వలన కలిగిన ధూప ద్రవ్యము సాంబ్రాణి.పది సుగంధ వృక్షముల ఆకు,కాడ,బెరడు,ద్రవము మొదలగు వానినుండి వచ్చే సుగంధ ద్రవ్యములే దశాంగము.

 
 పూజలను ద్రవ్య పూజ-భావ పూజ అని ఎండు విధములుగా పెద్దలు వివరించారు.ఆదిశక్తికి ద్రవ్యములను అర్పిస్తుచేసే పూజ ద్రవ్య పూజ.ద్రవ్యములు లేకుండ మనసులోనే భావిస్తు చేసే పూజ భావ పూజ.ద్రవ్య పూజ భావపూజకు నిచ్చెనగా ఉంటుంది.సుగంధపరిమళ ధూపమును అమ్మకు అపించుట ధూప సేవ.

  ధూపద్రవ్య జ్వలనమునకు పంచభూతములలోని అగ్ని,సుగంధమును వ్యాపింప చేయుటకు వాయువు సహాయపడును.సువాసనను పీల్చుటకు పంచేంద్రియములలో ఒకటైన ముక్కు సహాయకారి.తాను కష్టపడియైన పదిమందికి సుఖశాంతులను పంచమని ధూపము తెలియచేస్తుంది.అమ్మను సేవించుకొనుచున్నామని సుగంధ పరిమళములు సంతసించు సమయమున,నీ చెంతనే నున్న నా చేతిని విడిచి పెట్టకమ్మా.అనేక నమస్కారములు.

."

SAUNDARYA LAHARI10

  సౌందర్య లహరి-10

  పరమపావనమైన నీపాదరజ కణము
  పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము

  సకలవీర తిలకమే సకుంకుమ విలేపనముగ
  సకల కళల లోగిళ్ళు నీ ఎర్రని చెక్కిళ్ళుగా

  చిరునవ్వుల చూపులే సిరుల కంఠమాలలుగ
  కరుణాంతరంగమే అరుణోదయ భంగిమగ

  సకలము ఆవరించియున్న సత్ప్రకాశ మేఖలగ
  అందరిని    ఆదరించు అమ్మ చీర కొంగుగా

  లేత ఎరుపు ప్రకాశించె నీ ఎర్రని పాదాలుగా
  సకల శాస్త్రాలు నీ ఎర్రని వస్త్రములగుచున్న

 నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
 మానస విహారి ఓ సౌందర్య లహరి.

 " సర్వారుణ అనవద్యాంగి సర్వాభరణ భూషితా"

  జలము అమ్మ స్పర్శచే పవిత్రమై తీర్థముగా మారుతోంది.అభిషేకానంతరము  లేత ఎరుపు రంగు(అరుణోదయ సూర్యకాంతి ) పరిణతనొందుచు నునులేతదై అమ్మ పాద కమలములను చేరి పునీతమైనది.కొంచము మారి లేతదనముతో అమ్మ నడుముకు మణిమేఖలయై (ఒడ్డాణమై) మరికొంచము సౌకుమార్యమును సంతరించుకొనుచు కరుణాంతరంగమును చేరినది.ధన్యోస్మి అంటు.మణిద్వీపము నందలి సువర్ణమయ ప్రాకారమును దాటి వెళ్ళగానే ప్రకాశించు పుష్యరాగమణి అమ్మ నుదుటను సిందూరముగా చేరుతూ,మైమరపుతో తనకాంతులను అమ్మచెక్కిళ్ళను అద్దాలని ప్రయత్నించిందా అన్నట్లు చెక్కిళ్ళు పసిడిమణిమయ కాంతులతో ప్రకాశిస్తున్నాయి.అసుర సంహారి ఆదిశక్తి వీరత్వ సంకేతమై,సకల శుభప్రదమై చిక్కని ఎర్రటి కుంకుమ,అమ్మ ధరించిన ఎర్రని వస్త్రములను చూసి మురుయుచున్నదా అన్నట్లు మెరిసిపోతున్న సమయమున,నీ చెంతనే నున్న  నా చేతినివిడిచి పెట్టకమ్మా.అనేక నమస్కారములు.

SAUNDARYA LAHARI-09


   సౌందర్య లహరి-09



  పరమపావనమైన నీపాదరజ కణము

  పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము



  గౌరీపతి కడకు గంగ పరుగులెత్తుతోంది

  శ్రీరాముని కాళ్ళు కడుగ గోదావరి కదిలింది



  రాధామాధవ లీల యమున గంతులేస్తోంది

  దుర్గమ్మను అభిషేకింపగ కృష్ణమ్మ సాగుతోంది



  పుణ్యతీర్థ సంపద త్రివేణి సంగమమైనది

  నదులు-ఉపనదులు పరమపదమునంద గోరి



  సాగర సంగమమునకై వేగముగా సాగుచున్న

  సురుచిర జలధారలు నీకు శుద్ధోదక స్నానమైన వేళ

 నీ మ్రోలనే నున్న  నా కేలు విడనాడకమ్మా,నా
 మానస విహారి! ఓ సౌందర్య లహరి,

 " గంగేచ యమునేచై గోదావరి సరస్వతి
   నమదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు."

  గంగ-యమున-గోదావరి-సరస్వతి-నర్మద-సింధు-కావేరి నదులలోని పవిత్ర జలములు అమ్మకు శుద్ధోదక జలముగా మారి,అమ్మలో దాగిన భువన భాండములను చల్లగా చూచుటకు తాము  అభిషేక రూపమై భాగస్వాములమైనామని,అమ్మ స్పర్శను పొంది అనుగ్రహింప బడుతున్నామని సంతసించుచుచున్నవి.
    అవి పంచ భూతములలో ఒకటైన జలరూపమై ధన్యతనొందుచు,మనకు జీవనాధారమైనవి.అంతే కాక సాగర సంగమము అయిన తరువాత భాగ్యమేమో కాని ప్రళయ సమయమునకూడ సూక్ష్మ జగత్తును అమ్మ దయతో తమలో దాచుకొనగలుతున్నవి.

    అమ్మ అనుగ్రహధారలే  శుద్ధోదక అభిషేకములగుచున్న  సమయమున, నీ చెంతనే నున్న నా చేతిని విడిచి పెట్టకమ్మా. అనేక నమస్కారములు.


SAUNDARYA LAHARI-08


   సౌందర్య లహరి-08

  పరమపావనమైన నీపాదరజ కణము
  పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము

  గర్భస్థ శిశువుగ దుర్భరవేదన   పడుతూ,
  బాల్యావస్థలో పడరానిపాట్లు ఎన్నో   పడుతూ,

  సంసార సాగరాన్ని శక్తిలేక ఈదుతూ
 అరిషడ్వర్గపు ఆటలలో అనుక్షణము ఓడుతూ

  నిండైన జీవితము ఎండమావి అని చాటుతూ
  అమ్మ పాదాలే దిక్కని అనుక్షణము    వేడుతూ


  పటిష్ఠతను కోల్పోయి పండు ముసలి చేయుచున్న
  పంచాక్షరి నామాలే పంచామృత స్నానమగుచున్న వేళ

   నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
   మానస విహారి ఓ సౌందర్య లహరి.

   " పంచమి పంచ భూతేశి పంచ సంఖ్యోపచారిణి"

  " న మృతః"  అమృతము.చావు లేక నాశము లేనివి పంచామృతములు.అవి పాలు-పెరుగు-నెయ్యి/వెన్న-తేనె/చక్కెర/పటికబెల్లము/చెరుకు రసము- జలము.పండ్ల రసమును కలిపినచో
ఫల పంచామృతములందురు 

( పాలు-పెరుగు-నెయ్యి-తేనె-ఐదవది చక్కెర ని కొందరి-జలము అని మరి కొందరి భావన.అమ్మ దేనినన్న వాత్సల్యముతో అంగీకరిస్తుంది).ప్రతిజీవి బాల్య-కౌమార-యవ్వన-వార్థక్య దశలను దాటి చరమదశ అను ఐదవ దశలో పరమేశ్వరిని స్తుతించు    పంచేంద్రియ తత్త్వములు అమ్మదయతో పంచామృతములై ,మించిన భక్తితో అభిషేకమగుచున్న సమయమున ,చెంతనే నున్న నాచేతిని విడిచి పెట్టకమ్మా.అనేక నమస్కారములు.( గోమాత మనకు పాలు-పెరుగు-నెయ్యి ప్రసాదిస్తుంటే,భూమాత చెరుకును,తనపైనున్న చెట్లను
తేనెటీగలకు ఆలంబనగా తేనెను అందించుటకు అనుమతిస్తున్నది.)




SAUNDARYA LAHARI-07

  సౌందర్య లహరి-07

  పరమ పావనమైన నీ పాదరజకణము
  పతిత పాలకమైన  పరమాత్మ స్వరూపము

  కరుణకాంతులీనుచున్నవి  కామాక్షి నేత్రములు
  శరత్కాల వెన్నెలలే కద శర్వాణి నాసిక

  మణిదర్పణములను మించినవి మాహేశ్వరిచెక్కిళ్ళు
  పారిజాత ప్రభలైనవి మా పార్వతి పలువరుసలు

  కస్తురితిలకము మూడవ కన్నుతో నుదురు
  కనులారా దర్శించిన కలతలు చెల్లాచెదురు

  ఆశ్రితరక్షణ సదనమైన  అఖిలాండేశ్వరి వదనమునకు
  నా విచారములె వింతగ ఆచమనీయములగుచున్న వేళ

 నీ మ్రోలనే నున్న  నా కేలు విడనాడకమ్మా,నా
 మానస విహారి! ఓ సౌందర్య లహరి.

 " లాకిని లలనా రూపా లసద్దాడిమ పాటలా
   లలంతికా లసత్ఫలా లలాట నయనార్చితా."

   నా మనసనే తోటలో విహరించుచున్న తల్లీ! నీ నయనములు కరుణను వర్షించుచున్నవి.నీ ముక్కు పండువెన్నెలయై చల్లదనమును శాంతిని శ్వాసించుచు-శాసించుచున్నది.నీ నుదురు కస్తురి తిలకముతో త్రినేత్రముతో ప్రకాశించుచు శుభములనొసగుచున్నది.ఆశ్రిత రక్షణకు నిలయమైననీ ముఖమును చూచుచున్న సమయములో,వింతగ నా ఆలోచనలన్ని నీ దయతో ఆచమనీయములైన సమయమున నీ చెంతనే నున్న  నా చేతిని విడిచిపెట్టకమ్మా.నమస్కారములు.(ముఖ ప్రక్షాళనకు ఇచ్చు మంత్రపూరిత జలము ఆచమనీయము.)

TANOTU NAH SIVAH SIVAM-12

    తనోతు నః శివః శివం-12   *****************   "  వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే      జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...