కంటినీటి పూసలు నీకు కలిమిని అందీయగలవా
సిగపూవగు గంగమ్మ నీకు సిరులను అందీయగలదా
కట్టుకున్న గజచర్మము నీకు పట్టుపుట్టములు అందీయగలదా
నమ్ముకున్న ఎద్దు నీకు సొమ్ములను అందీయగలదా
అలదుకున్న విబూతి నీకు వైభవమును అందీయగలదా
కరముననున్న శూలము నీకు వరములను అందీయగలదా
పట్టుకున్న పాములు నీకు పసిడిని అందీయగలవా
కరుగుచున్న నగము నీకు నగలను అందీయగలదా
కదలలేని చంద్రుడు నీకు ఇంద్రపదవి ఈయగలడా
కాల్చుచున్న కన్ను నీకు రత్నరాశులను అందీయ గలదా
"ఓం దారిద్ర్య దు:ఖ దహనాయ" అనగానే నువు ఔనంటే విని
ఒక్కరైన నమ్మరురా ఓ తిక్క శంకరా
.................
శివుడు ధరించిన విబూది,రుద్రాక్షలు,ఎద్దు,శూలము ,కరిచర్మం,పా(ప)ములు,గంగ(పాలు) మూడో కన్ను(నాశనం) దరిద్ర్యమును తొలగించునని పొగడుట,శివుడు దానిని అంగీకరించుట హాస్యాస్పదము-నింద.
సంపద,భద్రత,ధర్మము,పవిత్రత,వి ఘ్న నివారణము,త్రికాల జ్ఞానము కలిగిన శివుడు అనేక విధములైన దారిద్ర్యములను తొలగించగల మహా దేవుడు-స్తుతి.