సౌందర్య లహరి-ఫలశృతి-108
పరమపావనమైన నీ పాదరజకణము
పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము
చెల్లియో-చెల్లకో-తెలిసియో-తె లియకో, దొర్లిన
అక్షర లోపములను-పద, పాదలోపములను
అమ్మవని నీతో నేనాడిన బొమ్మలాటలను
భావ లోపములను, లెక్కలేని అపరాథములను
కమ్మనైన కరుణతో, క్షమియించవమ్మా
కమ్మనైన ఫలములతో, కటాక్షించవమ్మా
నీవున్నావని అన్నా-లేవన్నా,నిన్ను గుర్తించలేకున్నా
ఆర్ద్రత నిండిన మనసుతో" అమ్మా" అని పిలువగనే
అర్హత ఉన్నను-లేకున్నను-అసలేమి కాము అనక,
చిన్న పిల్లలమనుకొని నీ ఒడిలో కూర్చోనీయమ్మా
సకలలోకరక్షిణి-శరణము నీవేనమ్మా,మా
మానస విహారి-మహా సౌందర్య లహరి.
ప్రియ మిత్రులారా!
శ్రీమాత ఆశీర్వచనములతో-శ్రీమాతాస్వరూపులైన మీ అందరి ఆదరణతో-ఆలంబనతో ఈ రోజు 108 వ భాగమైన స్తోత్రఫలశృతిని మీముందు ఉంచగలుగుతున్నాను.అ తల్లి సంకల్పిత జ్ఞానయజ్ఞములోని విశేషములన్నియు తల్లి పలికించినవే.దొర్లిన దోషములకు నా అజ్ఞానము-అహంకారము కారణములు.క్షంతవ్యురాలను.పరమేశ్వరి ప్రసాదమైన ఈ సౌందర్యలహరి మనందరి మనసులలో సౌందర్య కెరటములను ఉవ్వెత్తుగా ఎగురవైచి తల్లి ముఖారవిందమను జాబిలిని వీక్షించుచుండునట్లు చేయునుగాక.చల్లని తన అమృతకిరణములతో మనలను కంటికి రెప్పయై ఆ కరుణామయి కాపాడును గాక.
చివరికి ప్రస్తావించుచున్నను ఇది చిన్న విషయము కాదు.ఈ పవిత్ర యజ్ఞవాటిక నిర్వాహకులు-సభ్యులు -మిత్రులు పెద్దమనసుతో నన్ను అనుమతించినందులకు-నా భావములను ప్రోత్సహించుచున్నందులకు శతకోటి వందనములుమరియు ధన్యవాదములు.
స్వస్తి-శుభం భూయాత్.
సోదరి-నిమ్మగడ్డ సుబ్బలక్ష్మి.