ఓం నమః శివాయ-54
***************
నీలిమేఘమే నీవనుకొని నే చాతకమై చూశానురా
నీలిగరళము నన్ను చూసి గేలిచేసినదిరా
"సూర్యాయ-దక్షాధ్వర" అన విని చక్రవాకమై కదిలారా
మంచుకొండ నన్నుచూసి గేలి చేసినదిరా
చంద్రశేఖరుడవని నేను చకోరమై కదిలానురా
వెన్నెల్లిక్కడెక్కడిదని మూడోకన్ను గేలి చేసినదిరా
నటరాజువి నీవని నే నెమలిగా చేరానురా
భృంగి కన్ను నన్నుచూసి గేలిచేసినదిరా
శుభకరుడవు నీవని నే గరుడినిగా వాలానురా
కంచిగరుడ సేవకు సమయము మించిదన్నారురా
భ్రమలను తొలగించలేని భ్రమరాంబికాపతి,ఈ
ఇక్కట్లేమిటిరా నాకు ఓ తిక్కశంకరా
శివుడు తనదగ్గర మేఘము-వేడి-వెన్నెల-నాట్యము-ప్రభుతవము అన్నీ ఉన్నాయని,అవి తాను చెప్పినట్లు నడుచుకుంటాయని అంటాడు.కాని చాతకమునకు మేఘమునుండి వర్షమును ఇవ్వలేడు.చక్రవాకమునకు వేడిని ఇవ్వలేడు.చకోరమునకు వెన్నెలను అందించలేడు.నమలికి నాట్య మెలకువలను చెప్పలేడు.గరుడుని సేవలను స్వీకరించలేడు.-నింద.
చాతకి నమః శివాయ-చకోరి నమః శివాయ
ఎండ నమః శివాయ-వాన నమః శివాయ
నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ
శివా అజ్ఞానపూరితమైన నా మనసు నిన్ను నిందించి ఆనందపడుతున్నది.సత్యమును అవగతము చేసుకొనుచున్న నా మనసు నిన్ను అర్థము చేసికొనుటకు ప్రయత్నించుచున్నది.
" హంసః పద్మవనం సమిచ్చతి యధా నీలాంబుదం చాతకం
కోక: కోకనదప్రియం ప్రతిదినం చంద్రం చకోరస్థధా
చేతో వాంచతి మామకం పశుపతే చిన్మార్గమృగ్యం విభో
గౌరీనాథ భవత్పదాబ్జ యుగలం కైవల్య సౌఖ్యప్రదం"
శివానందలహరి.
హంస పద్మసరస్సును,చాతకపక్షి నీరునిండిన నల్లని మేఘమును,చక్రవాకపక్షి చంద్రుని ఏ విధముగా ప్రతిదినము ఇష్టపడతారో,అదేవిధముగా మోక్షమునకు
దారిని చూపు (జ్ఞానమార్గమునకు) నీపాదపద్మములయందు నా మనసు ఇష్టపడుచున్నది.కరుణామూర్తి కనికరించు తండ్రీ.-స్తుతి.
ఏక బిల్వం శివార్పణం.