సౌందర్య లహరి-పద్మరాగమణిప్రాకారము
పరమ పావనమైన నీ పాదరజకణము
పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము
దశయోజన విస్తీర్ణపు ధర్మ సంస్థాపనము
ఆయుధముల రణసామాగ్రుల భాండాగారము
పింగళాక్షి-విశాలాక్షి-వాగీశీ-బహురూపాది
కయ్యానికి కాలుదువ్వు అరువది నాలుగు శక్తులు
అసంఖ్యాకములు అచట రథాశ్వ గజములు
అసమాన పరాక్రమ వీరులు-అరివీర భయంకరులు
యోగి హృత్ పద్మనివాసిత సంకల్పిత తేజో
పద్మ మణి ప్రాకారమున నేను పరిణితి పొందుచున్నవేళ
నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
మానస విహారి! ఓ సౌందర్య లహరి.
"అరుణాం కరుణాంతరంగతాక్షి" సంకల్పిత పద్మరాగ మణి ప్రాకారము రక్షక స్థానము.చతుషష్టి కళలనెడు అరవై నాలుగు శక్తిస్వరూపములు-అరివీర భయంకరులైన వీరులు ధనుర్బాణ ధరులై,ధర్మపాలన చేస్తుంటారు.అసంఖ్యాక రథములు-గజములు-అశ్వములు-యుద్ధభూమి పయనమునకు సిద్ధముగా ఉంటాయి.ఆదిశక్తి అరివీరభయంకర సంకేతముగా,కుంకుమ సమ అరుణకాంతి భూభాగములో మండపములు-పక్షులు-వృక్షములు-ద్వారములు-సరోవరములలో పద్మరాగమణుల కాంతులు ప్రకాశించుచున్నవి.అమ్మదయతో నాలోని అరిషడ్వర్గములు అంతరించుచున్న సమయమున,చెంతనే నున్న నాచేతినివిడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు.