సౌందర్య లహరి-పుష్యరాగ ప్రాకారము
పరమపావనమైన నీపాదరజకణము
పతితపాలకమైన పరమాత్మ స్వరూపము
సమిష్టి దిక్పాలకా పాలితము-సాక్షాత్తుస్వర్గము
సమస్తము మణిమయము-సర్వాంగ సుందరము
చతుషష్టి శక్తుల సంరక్షణ నిలయము
తల్లినిసేవించు చతుర దాస-దాసీజనము
ఇంద్రాణి-మహేంద్ర విరాజిత అమరావతి పట్టణమున్న
పుష్పరాగ ప్రాకారములో ఆనందభాష్పములతో నున్న వేళ
నీమ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
మానస విహారి! ఓ సౌందర్య లహరి.
" కురువింద మణిశ్రేణి కనత్కోటీర మండితా" సంకల్ప నిర్మితమైన పుష్యరాగ ప్రాకారమునకు సమిష్టి దిక్పాలకులు నాయకులు.ఇక్కడ తరువులు-పత్రములు-ఫలములు-పక్షులు-సరోవరములు అన్ని ఎర్రని కాంతితో ఉంటాయి.ఉత్తరమున కుబేరుడు-పశ్చిమమున వరుణుడు-వాయవ్యమున వాయుదేవుడు-ఆగ్నేయమున అగ్నిదేవుడు ఈశాన్యమున రుద్రుడు మహాతేజోవంతులై వారివారి శక్తులను,ఆయుధములను ధరించి అమితోత్సాహముతో నున్నారు.ప్రమథగణ సంసేవితుడైన పరమేశుడు అష్టమూర్తియై,ఇష్టకామ్యములను తీర్చుచున్నాడు.అతి సుందర అమరావతి పట్టణమున అలౌకిక ఆనందముతో నున్న సమయమున చెంతనే నున్న నా చేతిని విడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు.
No comments:
Post a Comment