కదా త్వాంపశ్యేయం-07
*****************
" జిహ్వ చిత్త శిరోంఘ్రి నయన శ్రోతైః అహం ప్రార్థితం
నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం."
' ఆమ్నాయాంబుధిమాదరేణ సుమనః సంఘః
సముద్యన్మనో మంథనం దృఢభక్తి రజ్జు సహితం
కృత్వా మథిత్వా ...." అనుగ్రహించే స్వామిని మన మనోఫలకముపై స్థిరముగా నిలుపుకుని,ఈ నాటి బిల్వార్చనను ప్రారంభిద్దాము.
పంతులు గారు ఏ మంత్రం వేసారో-కనికట్టు చేసారో తెలియదు కాని,గిరిజను చూస్తాను అని బడికి తీసుకువచ్చింది కన్ను తన పని అయిపోయినట్లుగా,చెవికి ఆ బాధ్యతను అప్పగించింది.మూడుకన్నుల వాని మాటను జవదాటగలదా కలలోనైనా.
త్రినయనం-త్రిగుణాకారం నమో-నమః.
కాసేపు నేను అలా చల్లగాలికి తిరిగివస్తాను అని శంకరయ్యను అక్కడే వదిలేసి చల్లగా జారుకున్నాడు శివయ్య.
గురువుగారు,ఏవో శ్లోకాలను చదువుతున్నారు ఉపదేశలహరులను ఉరకలు వేయిస్తూ,
శంకరయ్య వంకచూస్తూ నవ్వుతూ,
శివయ్య నాతో చెప్పాడు లెండి
మీరు వాడిని ఎప్పుడు చూస్తామా? అని బయలు దేరారట.
అసహనముగా ఉన్న శంకరయ్య ముఖము చూస్తూ,కాదు-కాదు, నేను సరిగా వినలేదు లెండి,
వాడు మిమంల్ని ఎప్పుడు చూస్తాడా,వెంటనే పట్టుకుని వాడిని సంస్కరించాలనుకుంటున్నారటగా,సకలజనుల బాగుకై..
ఆనందంతో వెలిగిపోతోంది శంకరయ్య ముఖము.
అయితే గురువు గారు మన పక్షమేనన్నమాట అని మనసులో అనుకుంటూ,మీరు మాతో వస్తే బాగుంటుంది అన్నాడు.
వాక్కు కూడా చెవితో కలిసి చమక్కులు చేయటానికి సిద్ధమవుతోది. శివోహం.
ప్రస్తుత బిల్వార్చనములో పరమేశ్వరునికరుణ మనకు ప్రత్యక్ష ప్రమాణము-అనుభవ ప్రమాణములను పరిచయముచేస్తూ,కిం? కర్తవ్యం ను సూచిస్తున్నది.
ఏదో సాధించామనుకోవటం-ఎవరినో జయించామనుకోవటం గొప్పవిషయమే కాని దానిలో దాగిన సామాన్యమును గ్రహించుట కదా మానుషజన్మ పరమార్థము.(మన ఉపాధి విశేషము-మనలోదాగిన చైతన్యము సామాన్యము అద్వైత భాష.)
జగద్గురువులు తర్కశాస్త్ర ప్రాధాన్యమును వివరిస్తూనే దానిని సగము వరకే దర్శించగలిగితే-చర్చింగలిగితే నిష్ప్రయోజనమే అంటున్నారు.
ఇకకథలోనికి వస్తే ,మథనము ప్రవేశించింది శంకరయ్య మనసులో.గురువుగారిని పరిచయము చేసిన శివయ్య గురి కుదిరేందుకేమో కాసేపు పక్కకు తప్పుకున్నాడు.
ఈ శంకరయ్య ఇప్పుడప్పుడే కదిలేలా లేడు.కాసేపు అలా చల్లగాలి పీల్చుకుని వస్తా నంటూ పక్కకు జరిగాడు.
ఇంతలో శంకరయ్యను మరింత కట్టిపడేసేందుకా అన్నట్లుగా ఉమ పరుగెత్తుకుంటూ వచ్చింది.
గురువుగారు చూసి రమ్మని తత్త్వము తెలుసుకు రమ్మని బయటకు పంపిన ఆ రెండు జట్టులు,మధ్యలోనే ఆగిపోయి విపరీతముగా వాదించుకుంటున్నారండి.
ఏ జట్టు వెనుకకు తగ్గటంలేదు.
నేను వారికి మీరు అప్పచెప్పిన పనిని గుర్తుచేస్తే ,నీకెందుకు పొమ్మన్నారండి అంటూ రొప్పుతూ చెప్పసాగింది.
అయ్యో పంతులుగారు,మీ విద్యార్థులు మీరుచెప్పిన పనిచేయకుండా వాదించుకుంటున్నారా.మీరు వెళ్ళి వారిని హెచ్చరించండి నేను మళ్ళీ వస్తా అన్నాడు శంకరయ్య.
మరేమి ఫరవాలేదులెండి.మీరు కూడా నాతో రండి.మనిద్దరము కలిసి వారిని సరిచేద్దాము-శాంతింపచేద్దాము అన్నారు గురువుగారు.
మారు మాటాడకుండా గురువుగారిని అనుసరించాడు శంకరయ్య.
ఏమయ్యిందరా మీకు?ఈ వాదనలు ఏమిటి?ఆవేశం ఎందుకు? అని కొంచము గట్టిగానే అడిగారు పంతులుగారు.
వాళ్ళసలు భయపడకుండా-బాధపడ కుండా తమ తప్పేమిలేదంటూ,
అక్కడున్న ఒక మంచినీళ్ళ కుండను చూపించారు.
ఘటోవా-మృత్పిండోవా అంటూ గబగబ శ్లోకము చదివి ఘటమును చూపిస్తూ,
అర్థమయ్యింది గురువుగారికి వారేమిచెప్పబోతున్నారో.
అర్థంకాలేదు శంకరయ్యకు వారేమి చెప్పబోతున్నారో.
నిశ్చేష్టుడై చూస్తున్నాడు ఆ ముగ్గురు అబ్బాయిలను.
నిశింతగాచూస్తున్నారు గురువుగారు ఆ ముగ్గురు అబ్బాయిలను.
ఒకడు ముందుకు వచ్చి ,
గురువుగారు నేను దీనిని చూపిస్తూ"కుండ" దీనిపేరు అన్నానండి.దాని పేరు సరైనదే కదా,
అన్నాడు.
అంగీకరిస్తూ తలఊపారు గురువుగారు.
దీనిలో వాదించుకోవటానికి ఏముంది? అన్నది శంకరయ్య సందేహము.
ఇంతలో రెండవ వాడు ముందుకు వచ్చి,ఇదికుండకాదు గురువుగారు.ఇది మట్టి అన్నాడు గట్టిగా.
సరేనన్నారు గురువుగారు.
మొదటివాడికి కోపం వచ్చింది.మట్టి కుండ ఎట్లా అవుతుంది?
కూజా కావచ్చును,పళ్ళెము కావచ్చును,బొమ్మకావచ్చును ఇలా ఎన్నో రూపాలుగా మారవచ్చును.ఎన్నో పేర్లతో పిలిపించుకోవచ్చును.అన్నాడు.
మొదటివాడు సమాధానము చెప్పేలోగా మూడవ వాడు ముందుకు వచ్చాడు.
ఒక్కొక్క దానిలో ఇన్ని అని మట్టికణములు ఉంటాయి కనుక మట్టి అణువుల పరిమాణము ఇది ముమ్మాటికి అన్నాడు గురువుగారితో ధైర్యముగా.
అయోమయములో పడ్డాడు శంకరయ్య.
ఉన్నది ఒక వస్తువు.చర్చిస్తున్నది-నిర్ధారిస్తున్నది ముగ్గురు.నామ-రూపములంటున్నారు.
గురువుగారు ఏమి సమాధానము చెబుతారో వినాలనే కుతూహలము ఒక పక్క అదే ప్రశ్న కనుక ఆ పిల్లలు నన్ను అడిగితే వారిలో ఎవరిది సరియైన సమాధానము అన్న సందేహము సందడి చేస్తున్నాయి.
మౌనముగా ఉన్న గురువుగారిని చూస్తూ ,
వాడి దగ్గర ఉన్న ఒకవస్తువును చూస్తూ,ఇప్పుడే మాప్రతిభను ప్రదర్శిస్తాము అంటూ,
ఇదే ఇదే ప్రత్యక్ష ప్రమాణం అంటూ,పటోవా అనిమొదలు పెట్టగానే శ్లోకము తరువాత చెబుదురు.ముందు సమస్య చెప్పండి అన్నారు గురువుగారు.
మొదటివాడు వస్త్రమన్నాడు.రెండవవాదు కాదు నూలు అన్నాడు.అతనికంటె ఘనుడు మూడోవాడు.
మీరిద్దరు తప్పే చెప్పారు.నాకు సంఖ్యా శాస్త్రం బాగా తెలుసు.ఇందులో 10,000 అడ్డపోగులు,12000 నిలువు నిలువు పోగులు ఉన్నాయి.కాదనగలరా ఎవరైనా? ఆ బడుగు-పేకల గురించి అంటూ సవాలు విసిరాడు.
ఇప్పటికి మౌనముగా నే ఉన్నారు గురువుగారు.
అవుననిలేదు-కాదనలేదు.
శంకరయ్య గారు వీరి వాదనను విన్నాముకదా.
వారి వాదనను కూడా వింటేనే కదా,
విషయం/సమస్య పూర్తిగా అర్థమయ్యేది.సమస్య పరిష్కారమయ్యేది అంటూ వాళ్ళని పిలిచారు.వీళ్ళను ఆడుకోమన్నారు.
వాళ్ళు వస్తువును చూస్తూ చెబుతున్నారు.అందులో గొప్పతనమేముంది.అదే మేమయితే వస్తువును చూడకుండానే దాని ఉనికిని చెప్పగలము.అదే అనుభవ ప్రమాణపూర్వకముగా.అంటూ తలేగరేస్తున్నారు."ధూమోగ్నిరచలః" అంటూ,
అంటే ఇందాకటి జట్టు కంటే ఈ జట్టు చాలా తెలివైనదా? ఓటమిని తెలియనిదా?
గురువుగారు మా మాట వినండి.మేము వాళ్ళకు తెలియని విషయాలు చెబుతుంటే ఉమ వచ్చి అడ్దుపడి,మీ దగ్గరికి వచ్చి మామీద నేరాలు చెప్పింది.
వాళ్ళు మా స్నేహితులు.వాళ్ళకుచెప్పటం మా కర్తవ్యం.అందుకే కాస్త గట్టిగానే చెబుతున్నాము అన్నారు.
అనుభవ ప్రమాణమా అన్నాడు ఆశ్చర్యముగా శంకరయ్య.చిరునవ్వు తో మీ వాదనలు వినిపించండి అన్నారు గురువుగారు.
ఆ కొండవైపు చూడండి గురువుగారు.మీకు ఏమికనిపిస్తున్నది? అడిగారు.
పొగ వస్తోందికదరా అన్నారు గురువుగారు.అవునన్నారు శంకరయ్య.
మేము ఇక్కడే కూర్చుని కొండ వెనకాల నిప్పు ఉంది అనిచెబుతున్నాము నిశ్చయముగా.కావాలంటే మీరెవరైనా వెళ్ళిచూడవచ్చును..
గురువుగారు మీరే చెప్పండి.వస్తువును చూసి చెప్పటము గొప్పా/చూడకుండా చెప్పటము గొప్పా?
అన్నారు అన్నీ తెలుసన్న అహముతో.
అసలు పరీక్ష ఆరంభమయినది.
పిల్లలు మీకు కుండ - కుండలోదాగిన మట్టి--మట్టి అణువుల సంఖ్య కనిపించింది.కాని నాకు ఇంకొక సందేహము వస్తోంది.
ఇంకో సందేహమా గురువుగారు అదగండి చెప్పేస్తాం అన్నారు సంతోషముగా.
అసలు మట్టి ఎక్కడినుండి వచ్చిందిరా?
వీడు తెచ్చాదా?వాడు తెచ్చాడా?లేక మూడో వాడు తెచ్చాడా?
పిల్లలతో పాటుగా శంకరయ్య అవాక్కయాడు గురువుగారి మాటకు?
మీరు చూపించిన వస్త్రములోని నూలు సైతము భూమిలో నాటిన మొక్క నుండి వచ్చినదేగా.తలలు ఊపారు పిల్లలు.
అసలు ఈ మట్టిని ఎవరు పుట్టించారు.మీరు చెప్పిన నిప్పును ఎవరు పుట్టించారు.మీరు చూపించిన కుండలోని నీటిని ఎవరు సృష్టించారు అని ఎన్నో సందేహాలు నాలో.
మీరు మీ తల్లితండ్రులను అదగండి.మనమందరము కలిసి రేపు తరగతిలో చర్చించుకుందాము.పొద్దుపోయింది.జాగ్రత్తగా ఇళ్లకు వెళ్ళండి అన్నారు.
గిర్రున తిరుగుతోంది బడి-పిల్లలు-గురువుగారు వాళ్ళమాటలు.
అవును మట్టి ఎప్పుడు పుట్టింది.నీళ్ళకన్నా ముందరా?తరువాతనా?
నిప్పు ఎప్పుడు పుట్టింది.
నీళ్ళూ గొప్పవా? నిప్పు గొప్పవా?
నీళ్ళతో నిప్పునార్పుతాము కదా.
కాదు కాదు నీళ్ళళోంచి నిప్పు పుడుతుంది కదా.
దూరముగానిలబడిన శివయ్య -
ఇంకా ఎంతసేపు నిలబడాలి నీకోసం శంకరయ్యా,
త్వరగా త్వరగా రా అంటున్నాడు
అడుగులు తడబడుతున్న శంకరయ్యను చూస్తూ.
కదిలేవి కథలు-కదుపుతున్నది కరుణ.
'తన్మై మనః శివ సంకల్పమస్తు
వాచే మమశివపంచాక్షరస్తు
మనసే మమ శివభావాత్మ మస్తు".
పాహిమాం పరమేశ్వరా.
(ఏక బిల్వం శివార్పణం)