Friday, November 22, 2019

30

  నః ప్రయచ్చంతి సౌఖ్యం-30

  **********************

 భగవంతునిది హిమగిరి-భగవదంశది మహిమగిరి.



  " బ్రహ్మాండ వ్యాప్తదేహ భసితహిమరుచా భాసమానా భుజంగైః

    కంఠేకాలాః కప్ర్దా కలిత శశికలాశ్చండ కోదంద హస్తాః

    త్రక్య్షా  రుద్రాక్షమాలా స లలిత వపుషః శాంభవా "మూర్తిభేదాః

    రుద్రా శ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవా " నః ప్రయచ్చంతి సౌఖ్యం."



 " ఓం కైలాసవాసినే నమః."





   " కేళీనాం సమూహం కైలం-కైలస్య ఆవాసం కైలాసం."



    సర్వాంతర్యామి  యైన స్వామి నివాసము చర్మచక్షువులకు హిమగిరి పర్వతశ్రేణులలోని కైలాసగిరి.ఇది స్వామి విభూతిమహిమ.కొంచము నిశితంగా పరిశీలిస్తే కైలాసము అను స్వామి నివాసమును ఇసుమంతయును దుఃఖ స్పర్శలేని పరమానందధామము.సృష్టి-స్థితి-సమ్హార-తిరోధాన-అనుగ్రహములను పంచకృత్యములను పరమప్రీతితో పరమేశుడు ఎక్కడుండి తాను చేయునో అదియే కైలాసము.పార్వతీ-పరమేశ్వరుల పవిత్ర దర్శన ప్రసారమే అదే ప్రసాదమే కైలాసము.



 " నమో గిరిశాయచ-శిపివిష్టాయచ."



  భక్తరక్షణకై కైలాస పర్వతమున ఉమామహేశ్వరునిగా స్థిరముగానున్నరుద్రునకు నమస్కారము.గిరులనగా వాక్కులు అను మరొక అర్థమునకు అన్వయించుకొనినచే వాక్స్వరూపుడు వేదమయుడుగా రుద్రుని కీర్తించవచ్చును.



  " నమః స్లోక్యాయచ-అవసాన్యాయచ".

 వైదికమంత్రములు-వేదాంతము రెండును తానైన రుద్రునకు నమస్కారములు.





 " నమో హ్రదయ్యాయచ-నివేష్యాయచ."

 నివేషయముమంచునీరు.రుద్రా నీ లీలా విభూతిని నేనేమని వర్ణించగలను? సముద్ర మట్టానికి 21,778అడుగుల ఎత్తున టిబెట్ భూభాగములో నున్న హిమాలయ పర్వతశ్రేణులలో కైలసగిరి కన్నులపండుగ చేయుచున్నది.కైలాస పర్వతము నలువైపులా నాలుగు రూపాలతో,నాలుగు రంగులలో ఉంటుందట.ఒక వైపు సింహము,మరొల వైపు హయగ్రీవము,ఇంకొక వైపు ఏనుగు,మరొకవైపు నెమలి ఈశ్వర స్వరూపమునకు ప్రతీకలుగా ప్రసిధ్ధిపొందాయి.భౌగోళికులు కైలాసమును మధ్యస్థానముగాను, యోగశాస్త్రములో కైలాసగిరిని సహస్రార చక్రముగా పేర్కొంటారు. విష్ణు పురాన ప్రకారము కైలాస పర్వత నాలుగు ముఖములు  స్పటిక,హిరణ్య,కెంపు,నీలి వర్ణాలతో శివతత్త్వమును ప్రతిపాదిస్తు-ప్రకాశిస్తుంటుంది.కైలాస పర్వత మూలమున నున్నబ్రహ్మపుత్ర,సుట్లెజ్,సింధు మొదలగు నదులు నాలుగు వైపులా ప్రవహిస్తూ సస్యశ్యామలంగా సందర్శనమిస్తాయి.



  " ఓం నాద్యాయచ-వైశంపాయచ" నదులయందును,చిన్న సరస్సుల యందును ప్రకాశించుచున్న రుద్రునకు నమస్కారములు.



   ప్రపంచములో ఎవరు అధిరోహించని పర్వతము కైలాసగిరి.సాలగ్రామ మయమైన సదాశివుని నివాసమును అధిస్ఠించుట అపచారముగా హిందుమత విశ్వాసకులు భావిస్తారు.కొందరు ప్రయత్నించినప్పటికిని కృతకృత్యులు కాలేదు.



 " నమః కాట్యాచ-గహ్వరేష్ఠాయచ."



   ప్రవేశింపరాని పర్వతగుహలందున్న రుద్రునకు నమస్కారములు.



 జగమంతానిబిడీకృతమై యున్నది శివచైతన్యము.కైలాసగిరిని తండ్రిగాను,మానస సరోవరమును తల్లిగాను భావిస్తారు.కైలాస పర్వత పాదపీఠములోని మానస సరోవరము మహాద్భుతము.బ్రహ్మముహూర్తములో పరమేశ్వరుడు జ్యోతిరూపుడై దర్శనమిస్తాడని  నమ్ముతారు.బ్రహ్మ మానసమునుండి దీనిని సృజించినాడని నమ్ముతారు.ఎందరో ఋషులు,యోగులు ఇక్కడ స్నానముచేసి పునీతులవుతుంటారు.ఇక్కడిది దేవస్నానము.మనోబుధ్ధులను మలినరహితముచేయు మహేశ్వర కృపాకటాక్షములను మందాకిని స్నానము.



 " నమః కాట్యాయచ-నీప్యాయచ"



 కొద్దిపాటి నీరు ప్రవహించు చిన్నచిన్న కాలువలయందును,కొండల శిఖరములపై (కైలాసగిరుల) నుండి జారు మానస సరోవరమందున్న రుద్రునకు నమస్కారాము.హరహర మహాదేవ శంభోశంకర.



  ఇక భగదంశ-భగవంతుడున్న కొండ తమిళనాడు రాష్ట్రములోని తిరువన్నామలై నగర సమీపములో 2500 అడుగులేత్తులో అరుణవర్ణముతో ప్రకాశిస్తూ అరుణగిరిగా,శోనగిరిగా ప్రసిధ్ధిచెందిన అరుణాచలము.బ్రహ్మ విష్ణువులకు తనతత్త్వమునుతెలియచేసిన అరుణాచలేశ్వరుడు అపీత కుచాంబ సహితుడై అలరారుచున్న ఆనందధామము.



  " దర్శనాత్ అబ్రసదసి

    జననాత్ కమలాలయే

    స్మరణాత్ అరుణాచలే

    కాశ్యాంత్ మరణాన్ ముక్తి"

 అని స్వయముగా పరమేశ్వరునిచే పలుకబడిన స్వయం ప్రకాశక లక్షణముకలది.



   "గిరిశ ప్రణిత కామ వర్షిన్" అని ఆర్యోక్తి.



 ఆద్యంత రహిత తేజోపుంజాలను సామాన్య చక్షువులు స్వీకరించలేవని పరమదయాళువైన పరమేశ్వరుడు కరుణాంతరంగుడై తేజోమయలింగమై విరాజిల్లుతున్నాడు.



 శివుడు మొట్టమొదట వ్యక్తముచేసిన రూపము జ్యోతిర్స్తంభము.ఈ సంఘటనలో బ్రహ్మవిష్ణులు సృష్టి-స్థితులకు పరిమితమయ్యారు.లయమగునది అనంత తత్త్వము.దానిని తెలియచేయునదే అరుణాచలము.అరునము అనగా వెలుగు అమ్మతత్త్వము.అచలము స్థాణువగు స్వమి తత్త్వము.అగ్నిస్తంభము స్వామి క్లుప్తమై అరుణగిరిగా దర్శనమిస్తుంది.ఇప్పటికిని అనుగ్రహపాత్రులకు గిరిమధ్యస్థానములో గోచరిస్తుందట.అరుణాచలము కృతయుగమున జ్యోతి రూపమునను,త్రేతాయుగమున పసిడి రూపముగను,ద్వాపర యుగమున రాగి రూపముగను,కలి యుగమున శిలారూపమునను వ్యక్తీకరింపబడుతోంది.



  అరుణాచలము రాశీభూతమైన జ్ఞానాగ్ని.ఇచ్చట అగ్నిలింగముగా ఆరాధింపబడుచున్న స్వామి,సామాన్యభక్తులను అనుగ్రహించుటకై,తన అగ్నికీలలను శిలలలో నిక్షిప్తముచేసి,స్థూల రూపముతో విరాజిల్లుచున్నాడు.



 " నమః అనిర్హతేభ్యః."

 సర్వపాపములను సంపూర్ణముగా పరిహరింపచేయువాడు సదాశివుడు.



 అరుణాచలము మూడు యోజనములవరకు గిరితేజస్సును అనుగ్రహిస్తుంటుంది.కనుక ఇక్కడ ఏ దీక్షానియమములు వర్తించవు.గౌతమముని పూజా విధానములను శివుని ఆనగా నిర్దేశించినాడని పెద్దలు చెబుతారు.కాలభైరవుడు క్షేత్రపాలకుడు.

ఇప్పచెట్టు స్థలవృక్షము.



 " వృక్షేభ్యో హరికేశేభ్యో నమో నమః".



  అరుణాచల గుహలో పరమశివుడు దక్షిణామూర్తి తత్త్వముతో తపోముద్రలో నున్నాడని భక్తుల విశ్వ్వాసము.కాని అక్కడికి ప్రవేశము నిషేధము.ఎంతో మంది ప్రయత్నించి విఫలురైనారట.



 " ఆసీనేభ్యో-శయానేభ్యశ్చవ నమో నమః."



  అరుణాచల ప్రవేశము పొందినవారెంత అనుగ్రహపాత్రులో.గిరిప్రదక్షిణము ఎంతో మంగళప్రదము.



 " నమ ఆశవేయచ-అజరాయచ."



  సర్వ ప్రపంచమును శీఘ్రముగా వ్యాపించినవాడును,గమనమున సమర్థుడగు రుద్రునకు నమస్కారము.



  శివమహిమ్నా స్తోత్రములో పుష్పదంతులవారు సెలవిచ్చినట్లు సరస్వతీదేవి సముద్రమును సిరాచేసికొని,పర్వతమును కలముచేసుకొని,భూమిని పత్రముగా మార్చుకొని శివమహిమలను సంపూర్నముగా వ్రాయుట అసాధ్యము.శివస్వరూపులు నా అజ్ఞానమును మన్నించెదరు గాక.



 అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచశివ అరుణశివ."

 భగవాన్ శ్రీరమణుల పాదపద్మములకు నమస్కారములతో.



 కొండకు ప్రదక్షిణము శివునికి ప్రదక్షిణము.ప్రతి దిక్కు-ప్రతి మూల పరమేశ్వరానుగ్రహ పాత్రములు.రమణులవారు నన్ను మన్నించి ఆశీర్వదించెదరు గాక.మనో-వాక్కాయ-కర్మలు వారి స్మరణతో నిండి నన్ను అనుగ్రహించుగాక.ఇక్కడ భక్తులకు స్వామి ఎందరెందరినో ఎన్నోవిధములుగా సాక్షాత్కరించి సహాయపడిరి.కావ్యకంఠ గణపతి ముని భక్తిని లోకవిదితము చేయుటకై స్వామి తన రథమును ఆపి,గణపతిముని కరస్పర్శచే కదిలించెను. తన భక్తుల మనోరథములను నెరవేర్చు,



 " రథేభ్యో రథపతిభ్యశ్చవో నమో నమః."



 అరుణాచలేశుని దయతో చచ్చుబడ్ద భక్తుని కాళ్ళు చేవను సంపాదించుకొన్నవి.

 భక్తురాలు దివ్య సంగీతము వినగలిగినది.

 జట్కావాడి క్రూరత్వము నుండి వనిత రక్షింపబడినది.

 కొండల మధ్యలో బూట్లు చిరిగిన భక్తుని అశక్తతను తొలగించగ బూట్లు ఒకతనిచే కుట్టబడినవి.



 ఇలా ఎన్నో ఎన్నో ఎన్నో నక్షత్రములను లెక్కబెట్టగలమా? అరుణాచలేశుని మహిమలను గుర్తించగలమా?



  ఇచ్చటి భక్తులకు సాక్షాతు లక్ష్మీదేవియే వైద్యము చేస్తుందట. ఆహా ఎంతటి అదృష్టము



 అద్భుత అనుగ్రహములకు ఆలవాలమైన అరుణాచలేశుడు మనలను అనుగ్రహించు గాక.



   ఏక బిల్వం శివార్పణం.



  సర్వం పరమేశ్వరార్పణం. ఓం తత్ సత్.



















3

MARGABANDHUVU

  నః ప్రయచ్చంతి సౌఖ్యం-29

 ***********************

 భగవంతుడు-భగవదంశ ఇద్దరును మార్గబంధువులే
*******************************************



 " నమః సస్పింజరాయ త్విషీమతే పథీనాం పతయే నమః."



  లేత పచ్చిగడ్డివలె ఎరుపు-పసుపు వర్ణముల కలబోతతో ప్రకాశించు,మార్గములకు అధిపతి యైన రుద్రునకు నమస్కారములు.



 జీవుల కర్మాచరణ ఫలితముగా వారిని,పునరావృత్తి సహిత,పునరావృత్తి రహిత,విదేహ ముక్తి మార్గములలోనడిపించ కరుణించు రుద్రస్వామికి నమస్కారములు.కొందరితో కఠినముగా ,మరి కొందరితో కరుణాసంద్రముగా కనికరిస్తూ వారి పాపకర్మలను భరింపచేస్తు,హరింపచేస్తు భవబంధవిముక్తులను చేయు శుభంకర! నమస్కారములు.
 ఆదిశంకరులే మనలను  ఆధ్యాత్మికామార్గమున నడిపించదలచి,అమూల్యమైన వరప్రసాదముగా శంకరునిగా,
  శంకరాచార్యులు 8వ శతాబ్దములో కాలడిలో,ఆర్యాంబ-శివగురువులకు శివాంశగా వైశాఖశుధ్ధ పంచమి,ఆరుద్రా నక్షత్ర సమయమున జన్మించారు.ప్రపంచలో రెండు అను తత్త్వము లేదని ,అంతా ఒకటే  అను అద్వైత సిధ్ధాంతమును ప్రతిపాదించినారు.



  " నమః సోభ్యాయచ-ప్రతిసర్యాయచ."



" న ద్వైతం సమస్తం ఏకం" అని భావించు భగవదంశ పుణ్య-పాప మిళితమైన మర్త్యలోకమున సామాన్య మానవునిగా ,మార్గబంధువుగా జన్మించుటకు కారణము వైదిక ధర్మ పునరుధ్ధరణమే.



 " నమో కపర్దినేచ-వ్యుప్త కేశాయచ." జటాధారి-ముండనకేశుడు రెండును తానైన రుద్రునకు నమస్కారములు.



  తల్లి అనుమతితో సన్యాసమును స్వీకరించి,గోవిందపాదుల వారిని గురువుగా భావించి,సేవించి,వారి అనుగ్రహమును పొందగలిగి ప్రసిద్ధ స్తోత్రములను జనబాహుళ్యమునకు చేరువచేయుచు,దివ్యతేజోమయుడై ప్రకాశించుచు,అనుచరులను అనుగ్రహించుచున్నారు ఆదిశంకరులు.ఏమి మన భాగ్యము.సర్వేశ్వరా సదా స్మరామి-మనసా భజామి.




 పూర్ణా నదిని మాతృపాదముల వద్దకు రప్పించగలిన మహానుభావుడు తత్త్వవిచారణలో అసంపూర్ణుడుగా అజ్ఞానియై ఆదిదేవుని అవమానించుటయా? అద్వైత సాంగత్యమును విడనాడుటయా? పరమేశ్వర తత్త్వమును ప్రత్యక్షముచేయు పవిత్ర సంకల్పము తప్ప వేరే పరమార్థము లేదు. పరమేశా! పాహి_పాహి.
 అమ్మ తన బిడ్డడు గురువై తనను సరిచేయు ఆనందమును అనుభవించుటకై ముద్దుగా ముద్దుగా ముద్దగా మాటలాడి పరవశించునో,అదేవిధముగా సాక్షాత్తు ఆ దేవదేవుడు తన దేహభ్రాంతిని చూపెడుతూ,ఆడే ఆటలుగాక ఇంకేమిటి?




 ఒకరోజు ఆదిశంకరులు గంగానదికి స్నానమునకై తమ శిష్యులతో నడచుచున్నారు.అదనుచూసుకొన్నాడు ఆ ఆదిదేవుడు.



 " నమో మహద్భ్యః క్షుల్లకేభ్యశ్చవో నమః."

 మహిమాన్వితుడైనప్పటికిని మాదిగవానివలె ప్రకటింపబడ తలిచాడు.అదియును నాలుగు కుక్కలతో,మరియును సన్నటి దారిలో,తగులకుండ జరుగలేనంత విధముగా,

నమశ్శ్వభ్యః శ్శ్వపతిబ్యశ్చవో నమః.


,

  ఎంత మోసగాడివయ్యా శివా-నువ్వెంత వేషగాడివయ్యా శివా!

  సద్బ్రాహ్మణత్వమునకు సంకటస్థితిని  ఏర్పరచినాడు.  ఆ ఏలినవాడు.

    శివలీలలు-చిద్విలాసములు చింతింపవే ఓ మనసా!.



 " నమః స్రుత్యాయచ-పథ్యాయచ."

 సన్నని కాలిబాటలయందును-విశాలమైన మార్గములందును తిరుగాడు స్వామి నమస్సులు.



   " శ్రుతాయచ-శ్రుతసేనాయచ" వేదాంతమైన వాడు వేదములనువిడిచి ఉండగలడా?



   వేదమును తెలియచేయుటకు వచ్చిన వేదాంతుడు అదియే మాదిగవాడు మార్గమునకు ఆటంకముగా మారెను.మార్గబంధువా మహాదేవ నమోనమః.



 





 అంతా మిథ్య అన్నవిషయమును ఆకళింపుచేసుకోలేని భజగోవిందకర్త వాని బాహ్య రూపమును చూచి దారికి అడ్డుతొలగమనెను.తానా సనాతన సంప్రదాయములను గౌరవించు సద్బ్రాహ్మణుడు.తారసపడినవాడా తమస్సుతో నిండిన చండాలుడు పంచముడు.వానిని తాకక ముందునకు పోవు మార్గములేదు వాడు దారి ఇచ్చుటకు పక్కకు జరిగిన తన దారిన తాను వెళ్ళవచ్చుననుకొన్నాడు తొలగవలసినది తనలో అజ్ఞానమని  తలువని తాపసి.




  " నమః స్వపథ్యో జాగ్రద్భ్యశ్చవో నమో నమః."



   నిదురించునపుడు మెలకువతో నుండువాడు.మెలకువతో శరీరమున్నప్పుడు వివేకము నిదిరింపచేయుచు  తిరిగి   మేల్కొలుపు మహాదేవుడు,శంకరునిచే చండాలునిని గచ్ఛదూరం గచ్ఛదూరం అంటు,  మార్గము మధ్యనుండి తొలగి,తనకు దారినిమ్మనెను.



 ఆ మాటలను విన్నపంచభూతేశ్వరుడైన  పంచముడు ఏ మాత్రము జంకకుండా తనను తొలగమన్న అజ్ఞానముతో,




 అయ్యా,

అయ్యా,సురాపాత్రలోను-సురగంగా పాత్రలోను ప్రతిబింబించే సూర్య బింబము ఒక్కటే అని పెద్దలు చెబుతుంటే విన్నాను (చూడగలిగినవారికి)




     అద్వైత సిధ్ధాంతకర్తా! ఆదిశంకరా! నాకొక చిన్న సందేహము.అదిపోయిందంటే దారికి అడ్డము తొలగుతాను.సెలవీయండి స్వామి అని ,

 జీవము నీవే కదా-బ్రోచే భారము నీదే కదా అని భగవంతుని స్తుతించుచు,


   మన ఇద్దరి శరీరములు పంచభూతాత్మకములు.జీవాత్మ-పరమాత్మ సంయోగములు.



      మన ఇద్దరి శరీరములలో    ఈశ్వరచైతన్యమే నిండియుండగా మీరు నన్ను తాకిన ఏవిధముగా మైలపడెదరు? శారీరకముగానా? మానసికముగానా? ఆధ్యాత్మికముగానా? సెలవీయగలరు  స్వామి అని, వినయముగా  వేడుకున్నాడు ఆచార్యునికి ఆచార్యుడై."గురుః బ్రహ్మ-గురుః విష్ణుః -గురుః దేవ మహేశ్వర"

 " నమః కూప్యాయచ-అవట్యాయచ."

 నూతులయందు,పల్లము స్థలములందు ప్రకాశించుచున్న రుద్రా! నా అజ్ఞానము అను లోతుబావి నుండి నన్ను పైకిలాగి,సరైనమార్గమును చూపించిన వాడు పండితుడైనను పంచముడైనను శివతత్త్వమును తెలియపరచినవాడే మనీషి. మహోన్నతమైన మనీషాపంచకము మానవాళికి అందచేసిన సమయమిది.



   " బ్రహ్మైవాహమిదం సకలం చిన్మాత్ర విస్తారితం

     సర్వం చైతదవిద్యయు త్రిగుణాయాసేషం మయా

     ఇత్థం యస్య దృఢామతిః సుఖతరే నిత్యేపరే నిర్మలే


     చాండాలోస్తు సతుద్విజోస్తు గురురిత్యేషా మనీషా మమ.

    యద్యత్ కర్మ కరోమి సర్వమఖిలం శంభో తవారాధనం.






      అద్వైత సిద్ధాంతమును అవగతము చేసికొనిన,శ్రీ అప్పయ్య  దీక్షితులు విరించిపట్టణం వేలుపైన పరమేశుని,సదాశివుని  మార్గ బంధువుగా గుర్తించి,ప్రయాణ సమయమున   కీర్తించినది. ఈ స్తోత్రము.వివిధ శరీరములలో ఈ జీవి ప్రయాణములు అనంతములు.వాటిని సన్మార్గమున నడిపించమని వేడుకొనుటయే ఈ స్తోత్ర ప్రాశస్త్యము.



 దక్షునిచే శాపగ్రస్థుడై,కడలిని దాగినచంద్రుని శాపవిముక్తునిచేయుటయే కాక,తన సిగపూవుగా అలరారుటకు కారణుడైన పరమేశుని భజించు.



  క్షీరసాగర మథనమున హాలాహలమును త్రాగువేళ,సహాయకారులై ,తామును విషమును గ్రహించి,స్వామికి ఆభరణములై ప్రకాశించుటకు మార్గమును చూపిన నాగాభరణునికి నమస్కరించుచున్నాను.



   మార్గ ముడులను విడిపించి,సన్మార్గమును చేర్చు త్రినేత్రుని భజించు అదృష్టమును స్వామి అనుగ్రహించును గాక.



 భవానీ సమేతం- భజే మార్గ బంధుం

*********************************************



  శంభో శివా ప్రాపు నీవు

  దయా సింధో నా దారి చూపు



  శంభో మహాదేవ దేవా

  శివా శంభో మహదేవేశ శంభో

 ...........



  తరిమింది జాబిలిని శాపం

  తలదాచుకొమ్మంది కరుణా సముద్రం

  సిగపూవునే  చేసింది   మార్గం

  భవానీ సమేతం -భజే మార్గబంధుం..భజే మార్గబంధుం



  ............



  తాగినది విషజ్వాల సర్పం

  వెన్నంటి నడిచింది  హరుడే  సమస్తం

  ఆభరణమునే  చేసింది మార్గం

  భవానీ సమేతం-భజే మార్గబంధుం  భజే మార్గ బంధుం.



  ........



   తొలగినది భవబంధ పాశం

   కరుణించె నను కోటి సూర్యప్రకాశం

   మమేకమే  చేసినది మార్గం

   భవానీ సమేతం -భజే మార్గబంధుం  భజే మార్గ బంధుం.


 స్వామి బిల్వార్చనకు రేపు కలుసుకుందాము.



   ( ఏక బిల్వం శివార్పణం)



      ( ఏక బిల్వం శివార్పణం.)

ADIYOGI.



  నః ప్రయచ్చంతి సౌఖ్యం-27

  *************************

  " సహస్ర సహస్రాది సంవత్సర పూర్వం
    నరజ్ఞాన ఉధ్ధరణాయ సమర్పితం
    ఆదియోగి నాద్యం సప్తర్షిభ్యో బోధితం
    అతి శ్రేష్ఠం ఇదం విశాలం విజ్ఞానం

    ఆదియోగి ప్రణమామ్యహం
 ఆదియోగి నమస్తుభ్యం ప్రసీద యోగేశ్వర.





  భగవంతుడు ఆదియోగి-భక్తుడు ఋషభ యును యోగియే.





 " యోగేశ్వరాయ మహాదేవాయ-త్రయంబకాయ త్రిపురాంతకాయ

   త్రికాగ్ని కాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ

   సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః.'

 "యుజ్" అనగా కలయిక.యుజనే సన్స్కృత ధాతువు నుండి యోగ/యోగము అను పదము ఏర్పడినది.యోగమనగా మన ఇంద్రియములను వశపరచుకుని,చిత్తమును ఈశ్వరుని యందు లయము చేయు ప్రక్రియ.జీవాత్మ పరమాత్మను తెలిసికొనుట.అభేదమును గుర్తించ గలుగుట ఈశ్వరానుగ్రహమను యోగము.

   జ్ఞాన సృంగ వృషభారూఢా ప్రచండం విశ్వేశ్వరం
   జటాజూటం భస్మాంగం ఆదియోగినం ప్రణమామ్యహం.

   మానవమేథస్సు నిద్రాణమై యున్న సమయమున జనులు ఒక వింత విషయమును గురించి ముచ్చటించుకొనసాగిరి.హిమాలయములను జ్ఞాన శిఖరములందు విబూదిరేఖలతో,జటలతో ఎద్దునెక్కి ఒక యోగి తిరుగుచున్నాడని నీవు ఎవరికి సంబంధించిన వాడవని ప్రశ్నించిన
 వారికి ,అతడు మందహాసముతో తనకు తానే పుట్టానని చెప్పుకుంటున్నాడని గుసగుసలు మొదలైనాయి.
  " ఓం నమో ప్రథమాయచ-మధ్యమాయచ"


 హిమాలయములందు సంచరించు యోగి దేవుడని కొందరు,,తనకు తానే సృజించుకొని సంచరించువాడని కొందరు,కొందరు సామాన్య మానవుడని తమ అభిప్రాయములను వెలిబుచ్చసాగారు.

 "పృథ్వీతేజోదకం వాయు వశీకృతం ఆకాశచ
  మహాభూతేశ్వరం దేవం ఆదియోగినం ప్రణమామ్యహం.

   ఎన్నో జన్మల పుణ్యఫలితముగా నిత్యానిత్య వస్తు విచక్షణ,స్థూల-సూక్ష్మ తత్త్వ వివరణ,జీవాత్మ-పరమాత్మ విచారమునము ఆసక్తికల ఎందరో మునులు-యోగులు-ౠషులు ఆ వ్యక్తి సంచార విచారమును తెలిసికొనగోరి,ఆ పవిత్ర పరమేశ్వరానుగ్రహ పాత్రత నందించు ప్రదేశమును నిష్కళంక మనస్కులై,నిరంతరము జపిస్తూ,దర్శనముకై వేచిచూస్తున్నారట.

     నిర్గుణం త్రిగుణ పరం రుద్రహర సదాశివం
     బంధపాశహరం దేవం ఆదియోగినం ప్రణమామ్యహం.

  బంధపాశము కొందరిని బంధించినది.వేచియుండలేక వెనుతిరిగి వెళ్ళిపోయారు.సప్తర్షులను మాత్రము బంధవిముక్తులను చేసినది.స్వామిని దర్శించుకోగలిగారు.ప్రస్తుతించారు.

 తమ మనసులలోని అంధకారమును తొలగించమని పరంజ్యోతిని ప్రాధేయపడ్డారు.వారి నిష్కల్మష ప్రార్థనను నిటలాక్షుడు అంగీకరించి,ఒక్కొకరికి ఒక్కొక్క ప్రత్యేక యోగ నైపుణ్యమును ఉపదేశించి,అనుగ్రహించాడట.Yఓగినాం పతయే నమః.


   దక్షిణాభిముఖస్థితం యోగవిజ్ఞాన మోక్షదం
   సప్తర్షిభిర్వందితం ఆదియోగినం ప్రణమామ్యహం.

     " నమః శంభవేచ-మయోభవేచ"



 ఇహపరములను ప్రసాదించు రుద్రునకు నమస్కారములు.



  హిమాలయ పర్వతముపై నందినాథుడను యోగి తన ఎనిమిది మంది శిష్యులను ధర్మ సంస్థాపనకై పంపించెనన్న వాదమును కలదు.



  '" నమో పూర్వజాయచ-పరజాయచ"





   పరమార్థమును బోధించిన పరమేశ్వరుడు తన అంశలతో భూలోకమున ఎందరో యోగులను ప్రసాదించినాడు.వారి దర్శనము స్మరణము సర్వపాపహరమనుటకు ఋషభయోగి మందరుడు-పింగళను పునీతులను చేసిన విధము పరమేశ్వర సంకల్పము.




    ' ప్రపంచముతో బంధము మోహము-పరమాత్మతో బంధము మోక్షము."



   అవంతీపురములోని మందారుడు సకలశాస్త్రపారంగతుడు.పింగళ అను వేశ్యాలోలుడు.ఒకరోజు వారి ఇంటికి అతిథిగా ఋషభముని వెడలెను. ఋషభయోగి స్కాంధపురాణములోని బ్రహ్మోత్తరఖండమునందు ప్రస్తావింపబడినాడు.

  నమః శివాయచ -శివతరాయచ"

 మిక్కిలి శుభములనందించు మూడు కన్నులవాని సంకల్పమన,మందర-పింగళ గృహమునకు అతిథిగా ఋషభయోగిని పంపాడు.


 " కైలాసగిరి ఉండి కాశికై-కాశికా పురి నుండి-ఈ దాసులకై-దయచేసినావయ హర హర-శివ శివ" అనుచు ఆప్యాయముగా ఆహ్వానించి,షోడశోపచారములను-స్తోత్రములతో జరిపించి,
అతిథిగా వచ్చిన యోగిని పరమ శివునిగా భావించి,అత్యంత భక్తిశ్రధ్ధలతో ఆరాధించి,ఆశీర్వాదనుగ్రహమును పొందకలిగినారు.శివప్రసాదమన మందరుడు
  పుణ్యఫలమునందుకొనుటకై, దశార్ణమహారాజునకు వజ్రబాహు నామముతో జన్మించెను.కథలో మలుపులు తిప్పి కాగల పనినిచేయుటయే కరుణాంతరంగుని లీల.వజ్రబాహు జననము ఇష్టములేని మిగిలినరాణులు సుమతిపై విషప్రయోగమునుచేసిరి.గరళకంఠుని ఘనత చాటగ, విషము వారిని తీవ్ర అనారోగ్యవంతులను చేసినది.దశార్నమహారాజు వారిని అరణ్యములో వదిలివేయమని ఆజ్ఞాపించెను.



  " నమో నిచేరవే పరిచరాయారణ్యానాం పతయే నమః."



    అరణ్యములలో దాగి వేచియుండి వారి పాపములను దోచుకొనవలెననుకొన్నాడు ఆ దొంగలకు దొంగ.నమస్కారములు.తస్కరాణాం పతయే నమః.స్వామి
" నమో మంత్రిణే వాణిజాయ కక్షాణాం పతయే నమః." ధనిక వైశ్యునిగా వారి వారిని తన దగ్గరకు తెచ్చుకున్నాడు.ఘోరము-అఘోరము రెండును తానైన స్వామి వారి పూర్వపాప క్షయమునకు కొడుకును కాలముచే కబళించచేసినాడు.కన్నతల్లి కన్నీరు మున్నీరుగా మారినది.దీనముతో దిక్కుతోచక నున్న సుమతిని సమీపించాడు ఋషభముని.
" ఆరాత్తే గోఘ్నా స్వామి నీ ఘోరరూపమును మాకు దూరముగానుంచుదవుగాక అని పరిపరివిధముల యోగిని ప్రార్థించినది పరమసాధ్విసుమతి.మృత్యుంజయుడైన స్వామి ఋషభయోగి బాలుని మృత్యుంజయుడిని చేసెను.



  " నమోబృహతేచ-వర్షీయతేచ".

 అకారముచే గొప్పవాడును గుణ
 సుసంపన్నుడును అయిన రుద్రుడు బాలునికి "శ్రీ శివకవచ స్తోత్రమును" ఉపదేశించి,ఆయుధములనొసగి ఆశీర్వదించి,లోక రక్షణకు సాగిపోయెను.



"అస్య శ్రీ శివకవచ స్తోత్రమహామంత్రస్య ఋషభయోగీశ్వర ఋషిః |

అనుష్టుప్ ఛందః |

శ్రీసాంబసదాశివో దేవతా |

ఓం బీజమ్ |

నమః శక్తిః |

శివాయేతి కీలకమ్ |

మమ సాంబసదాశివప్రీత్యర్థే జపే వినియోగః ||"



 అంబేశివమయముగా,భస్మీలంకృతుడైన భద్రాయువు  మగధరాజునకు బందీయైన తన తండ్రిని బంధవిముక్తుని చేసి,తాను భవబంధ విముక్తుడై భవుని ఆరాధనలో తరించెను.



   యోగిరూపుడైన త్రిలోచనుడు భద్రాయువును రక్షించినట్లు మనలనందరిని రక్షించునుగాక.



 స్వామి బిల్వార్చనకు రేపు కలుసుకుందాము.



   ( ఏక బిల్వం శివార్పణం)



   ( ఏక బిల్వం శివార్పణం.)






























TANOTU NAH SIVAH SIVAM-12

    తనోతు నః శివః శివం-12   *****************   "  వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే      జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...