Saturday, September 12, 2020
SIVA SANKALPAMU-51
ఓం నమః శివాయ-51
********************
నగుమోముతో నగములు నిన్ను బంధువు అంటున్నవి
సాలెపురుగు పాలె దోమ దయాసింధువు అంటున్నది
తుమ్మెద అమ్మమ్మ నిన్ను కమ్మని చుట్టము అంది
కరిరాజు పరివారము తమ సరివాడవు అంటున్నవి
ఎద్దుతరపు పెద్ద నిన్ను పెద్దయ్య అంటాడట
లేడి చేడియ నిన్ను తనవాడివి అంటున్నది
వ్యాళపతి వాసుకి నిన్ను చుట్టమని చుట్టుకుంది
తిన్నని కన్న అడవి కన్నతండృఇ అంటున్నది
హరి సంగతి సరేసరి అసలుచుట్టమంటాడు
ఇందరి చుట్టమైన నీవు నన్ను చుట్టుకోకుంటేను
" నరత్వం-దేవత్వం-నగవన మృగత్వం" అన్న లహరి
లెక్కలోకి రాదురా ఓ తిక్కశంకరా.
శివునికి చుట్టములు కొండలు-కీటకములు-జంతువులుఅడవి మొదలైనవే కాని సరివారు ఎవరులేరు కనుక నేను స్తుతిచేస్తుంటే నన్ను కరుణించుట లేదు--నింద.
శిల్పం నమః శివాయ-శిల్పి నమః శివాయ
వేట నమః శివాయ-వేటు నమః శివాయ( దెబ్బ)
నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ
" నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకతా
పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం -శివానందలహరి.
పరమేశా! మానవునిగానో-దేవునిగానో-కొండగానో-అడవిగానో-జంతువుగానో-దోమగానో -పశువుగానో-కీటకముగానో -పక్షిగానో పుట్టినా ఎల్లప్పుడు నీ పాదపద్మ స్మరణమనే ప్రవాహములో తేలియాడే సౌభాగ్యమును ప్రసాదింపుము సదాశివా.ఇక్కడ మనమొక్క విషయమును గుర్తుచేసుకుందాము.ఎన్ని వరములను అడిగితే అవి ధర్మబధ్ధములైతే ఇన్ని వరములా అని అనడు ఈశ్వరుడు.కనుకనే లహరి అల ఈ విధముగా నిరంతరము కడలిని వీడక కదులుతూనే ఉంటుందో అదేవిధముగాశివానుగ్రహమనే సముద్రము నిరంతరము వరములను అలలతో నిండి అనవరతము అనుగ్రహించుచుండును. .అందుకే శ్రీ శివానంద లహరి నామమును సార్ధకతను అందించుచున్నది.శివోహం-స్తుతి.
శివుడు చేతనాచేతనములలో అంతర్లీనముగా ఉన్నాడు.కొండలలో వేదస్వరూపముగా,కీటకములలో సూక్షములో మోక్షమునకు బాటగా,పశువులలో పశుపతిగా,మనసనే దట్టమైన అడవిలో విషయవాసనలనే కౄరమృగముల నుండి రక్షించువాడిగా విలసిల్లుతున్నాడని స్తుతి.
ఏక బిల్వం శివార్పణం.
SIVA SANKALPAMU-50
ఓం నమః శివాయ-50
********************
అడ్డనామాలతో-నిలువు నామాలతో
శివుడు-శ్రీరాముడు ఆరాధిస్తారు పరస్పరము
శివరామ సంగమమేగ ఆ రామేశ్వర క్షేత్రము
సీతారామ కళ్యాణము చేయించినది శివధనుర్భంగము
శివ-శక్తికి ప్రతిరూపమేగ వారి దాంపత్యము
శివస్వరూపము రామునకు సంతోషదాయకము
సీతా వియోగ సమయమున శివ అంశయే సహాయము
సేవానిరతి పొందినది శ్రీరామ ఆలింగనము
శివుడు పార్వతికి చేశాడు శ్రీరామ మంత్ర ఉపదేశము
శివరామ సంగమమె శుభకరమగు అభంగము
ఈ శివుడే ఆ రాముడని-ఆ రాముడే ఈ శివుడని
ఒక్క మాట చెప్పవేరా ఓ తిక్క శంకరా.
శివుడు సీతారామ కళ్యాణమునకు తన ధనస్సును పాత్రధారిని చేసి,శివధనుర్భంగమను చూడచక్కని సీతారామకళ్యణ కథను నడిపించినాడు.ఒరిగినది ఏమిటి? తన ధనస్సు విరిగిపోయింది.పార్వతీదేవికి గొప్పగా తారకమంత్రమని శ్రీరామ మంత్రమును ఉపదేశించినాడు.జనులు శివుడు తన నామము ఏమీ చేయలేనిదని భావించారు.సీతా రాములను కలుపుటకు తన అంశ ఆంజనేయుని లంకకు పంపి రామకార్యమును నెరవేర్చినాడు.ఘనత మాత్రము రామునికే దక్కినది.రావణ సంహారము బ్రాహ్మణ హత్య కనుక పాపమును తొలగించుటకు తానున్న ప్రదేశములో వారధిని బంధింపచేసి ,శివలింగమును ప్రతిష్ఠింపచేసినాడు.కాని రాముడు ప్రతిస్ఠించిన శివలింగమని-రామేశ్వర పుణ్యక్షేత్రమని (చారదాం) పేరు మాత్రము రామునికే వచ్చినది.కష్టము వెనుక నున్న శివునిదే అయినా రాముడే కీర్తింపబడుతుంటే చూస్తూ ఊరుకుంటాడు కాని,రాముడంటే తనకు ఇష్టమని,నిజానికి మేమిద్దరము "ఏకాత్మా ద్వయీ రూపా" రెండు రూపాలతో నున్న ఒకేఒక చిత్స్వరూపమని చెప్పలేని వాడు శివుడు-నింద.
హేతువు నమః శివాయ-సేతువు నమః శివాయ
రాముడు నమః శివాయ-శివుడు నమః శివాయ
రమింపచేసే రాముడు-శుభంకరుడగు శివుడు
నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ.
మార్గ బంధు దయాసింధు దేవదేవ నమో నమో
దీన బంధు దయాసింధు మహాదేవ నమోనమో
మహా లింగ మోహనాశ జంగమేశ నమోనమో
సర్వ రక్ష సాంబదేవ సారసాక్ష నమోనమో.
ఏక బిల్వం శివార్పణం.
SIVA SANKALPAMU-49
ఓం నమః శివాయ-49
****************
రుద్రాక్షలు ఇష్టము-చిన్ముద్రలు ఇష్టము
అభిషేకము ఇష్టము-అవశేషము ఇష్టము
బిల్వములు ఇష్టము-బిలములు ఇష్టము
తుమ్మిపూలు ఇష్టము-తుమ్మెదలు ఇష్టము
తాండవము ఇష్టము-తాడనము ఇష్టము
అష్టోత్తరము ఇష్టము-నిష్ఠూరము ఇష్టము
చందనాలు ఇష్టము-వందనాలు ఇష్టము
కాల్చుటయు ఇష్టము-కాచుటయు ఇష్టము
లయగ ఆడుట ఇష్టము-లయముచేయుట ఇష్టము
మహన్యాసము ఇష్టము-మహాశివరాత్రి ఇష్టము
కష్టాలలోనున్న నాపై ఇష్టము చూపించకుండుట
నీ టక్కరితనమేరా ఓ తిక్కశంకరా.
శివుడు రుద్రాక్షలను-అభిషేకములను-తుమ్మిపూవులను,మారేడు దళములను-కొండగుహలను చందనములను ఇష్టమని ప్రకటించుకున్నాడు.ఇంతేనా ఇంకా ఏమైన వున్నాయా అని అడిగితే చిన్ముద్ర-అవశేషాలు-నాట్యములు-దండించుట-తుమ్మెదలు-నమస్కారములు కాల్చుట-కాచుట మహన్యాసములు ఇష్టమనినాడు.తనకు కావలిసిన సమాధానము రాలేదని ఇంకా ఏవైనా మరిచిపోయినావా శివా అని అడిగితే దరహాసం చేస్తాడు కాని తనపై దయ ఉందని మాత్రము అనడు-నింద.
బిలము నమః శివాయ-బిల్వము నమః శివాయ
కాల్చుట నమః శివాయ-కాచుట నమః శివాయ
నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ
" గలంతీ శంభో త్వచ్చరిత సరితః కిల్బిషరజో
దలంతీ ధీకుల్యా సరణిషు పతంతీ విజయితాం
దిశంతీ సంసార భ్రమణ పరితాపోపశమనం
వసంతీ మచ్చేతోహ్రదభువి శివానందలహరీ"
శివచరిత్రమను నదినుండి ప్రవహించుచు,పాపమనే ధూళిని కడిగివేయుచు,సంసారములో పరిభ్రమించుటచే నాలో ఏర్పడు సంతాపమును ఉపశమింపచేయుచు,నా హృదయమనే సరస్సులో నిలిచే ఆనందప్రవాహము శుభములను చేకూర్చును గాక.-స్తుతి.
ఏక బిల్వం శివార్పణం.
SIVA SANKALPAMU-48
ఓం నమ శివాయ-48
********************
నారి ఊదదీయమనగానే జారిపోవచేసావు
అమ్ములు దాచేయమనిన గమ్మున దాచేసావు
విల్లుకనబడకూడనిన వల్లె యని అన్నావు
పినాకమే కానరాని పినాకపాణివి నీవు
మంచపుకోడును కూడ కనిపించకుండ చేసావు
ఖట్వాంగధారివైన ఖండోబా దేవుడవు
పరశును మొద్దుచేయమంటే పదును తీసేసావు
ఖండపరశు కానరాని పరమేశుడివి నీవు
లేశమైన లేకుండా ఆశాపాశమును తీస్తావు
పాశుపతాస్రములేని పశుపతివి నీవు
రుద్రములో చెప్పారని వద్దనక చేస్తుంటే
తెలితక్కువంటారురా ఓ తిక్క శంకరా.
విల్లువద్దు బాణమువద్దు గొడ్డలి వద్దు మంచపుకోడు ఆయుధము వద్దు.నీ ఆయుధములను నిస్తేజముచేసి పక్కన పెట్టు అనగానే రుద్రములో శివుడు మారుమాటాడకుండా చేస్తాడు.నేనెందులకు చేయాలని ప్రశ్నించలేని పిరికివాడు శివుడు-నింద.
విల్లు నమః శివాయ-రెల్లు నమః శివాయ
పరశు నమః శివాయ-పరము నమః శివాయ
నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ.
" ఆకర్నకృష్టే ధనుషి జవలంతీం దేవీం మిషు భాస్వతి సంధధానం
ధాయత్ మహేశం మహనీయవేషం దేవ్యాయుతం యోధతనుం యువానాం."
ఆకర్ణాంతము లాగబడి ప్రకాశించు ధనువునందు ,మహాప్రభావముకల జ్వలించుచున్న బాణమును సంఢించ్చున్నవాడును,వీరుని రూపము కలవాడును,ఉత్తమమైన అలంకారము కలవాడును దేవితో కూడిన వాడైన మహేశ్వరుడు(దుష్టశిక్షణకై) మమ్ములను రక్షించుటకు వానిని దూరముగా ఉంచి,ప్రసన్నుడై అనుగ్రహించుగాక.
" నమస్తే రుద్రమన్యవ ఉతో త ఇషువ నమః
నమస్తే అస్తు ధన్వనే బాహూభ్యాముతతే నమః".
రుద్రమంత్రములు ప్రత్యక్ష కృతములు.స్వామిని స్వయముగా సంబోధించి,ప్రస్తుతించునవి.స్వామీ నీ ఘోర రూపమును ఉపసంహరించుకొని,శాంతుడవై అఘోర రూపివై అఖిలపాలనను కొనసాగింపుము. స్వామి ఆయుధములను పక్కకు పెట్టుట అంటే అఖిలజగములలో ధర్మము నాలుగు పాదములలో నుండుట-స్తుతి.
ఏక బిల్వం శివార్పణం.
SIVA SANKALPAMU-47
ఓం నమ: శివాయ-47
*****************
" విషమును దాచిన వాని వివరము" నీకెందుకంటు
అతని భక్తులము మేము "అనుక్షణము వదలమంటు"
నీ" పాద మంజీరమైన పాము" వదలని" ఆపదగా మారింది"
నీ" నడుముకు చుట్టుకున్న పాము" "నరకము తానేనంది"
నీ" జందెమైన పాము" నన్ను" బంధించిస్తోంది"
నీ" కరకంకణమైన పాము" నాపై "కనికరమే లేదంది"
నీ "మోచేతిని తాకుపాము" "వెతలకతగ మారింది"
నీ "మెడను తిరుగు పామేమో" "సంసారము తానంది"
"నీ జడను ఆడుచున్న పాము" నన్ను" జడముగా మార్చింది"
పోనీ అని "నువ్వు వాటిని రానిస్తే","కాని పనులు చేస్తూ"
కాలకూటము చిమ్మి "నన్ను" కాటువేయ చూస్తుంటే
" ఒక్క మాటైన అనవురా" ఓ తిక్క శంకరా.
విషముతో నిండిన పాములను శివుడు ఆదరముతో అలంకరించుకుంటే,కృతజ్ఞత లేక అవి భక్తులను బెదిరిస్తుంటే,శివుడు వానిని దండించుటలేదని-నింద.
లాలన నమః శివాయ-పాలన నమః శివాయ
సర్పము నమః శివాయ-సర్వము నమః శివాయ
నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ.
గళే ౠండమాలం "తనౌ సర్పజాలం"
మహాకాలకాలం గణేశాధిపాలం
జటాజూటభంగోత్తరంగైర్విశాలం
శివం శంకరం శంభుమీశానమీడే. "
భక్తి పరిపూర్ణతతో పునీతమైనపాములు, తమ విషయవాసనలు అను విషమును విడిచి, "శంకరాభరణములైనవి" అని నీ దయచే తెలుసుకొనిన నా మనసు, నాయొక్క" భక్తితత్పరతా లోపముచే" నీ దరి,చేరలేకున్నానని గ్రహించాను."పరమ శివా"నాగేంద్రహార,.
నా విషయ వాసనలను విషమును, నీ కంఠమున బంధించి,నన్ను అనుగ్రహించు. నీల కంఠేశ్వరా!-స్తుతి.
( ఏక బిల్వం శివార్పణం)
SIVA SANKALPAMU-46
ఓం నమః శివాయ-46
********************
మౌనము మాటాడునట మాయేదో చేసావులే
మేథా దక్షిణా మూర్తిగా బోధించేది మాయేలే
మూగయు మాటాడునట మాయేదో చేసావులే
మూక పంచశతిగా కీర్తించేది మాయేలే
కాళ్ళకింద పద్మాలట మాయేదో చేసావులే
పద్మపాదుడు అతడట గురుభక్తి మాయేలే
పూవులే పళ్లట మాయేదో చేసావులే
పుష్పదంతుడు అతడట పుణ్యాల మాయేలే
బోడిగుండు శివుడట మాయేదో చేసావులే
శంకర భగవత్పాదుడట శంక లేనే లేదులే
మాయా సతిని చూసి అమ్మయ్య అని నీవు మోస్తుంటే,నే
బిక్కచచ్చి పోయానురా ఓ తిక్క శంకరా.
శివుడు మౌనముగానే జ్ఞానమందించే అతీతశక్తులు కలవాడనని చెప్పుకుంటాడు.మూగవానిని మాట్లాడించగలను అని కూడ అంటాడు.అంతే కాదు గంధర్వుని శాప పరిహారమునకై వాని దంతములను సుగంధభరితములు చేసానని చెబుతాడు,పెద్దప్రవాహములో తనను నమ్మి నడుచు భక్తుని పాదముల క్రింద పద్మములను సృష్టించానని తనకు శ్రీ శంకర భవత్పాదులకు భేదములేదని,ఎలా ఎన్నో-ఎన్నెన్నో మాయమాటలు చెప్పే మొసగాడు.కనుకనే దక్షయజ్ఞకుండమునుండు ప్రభవించిన మాయాసతికి-మాత సతికి తేడాను గుర్తించలేక మాయా మోహితుడై భుజము మీదికెక్కించుకొని మోయుచున్న మోసగాడు.-నింద.
మౌనం నమః శివాయ- ధ్యానం నమః శివాయ
మోహం నమ:శివాయ-మోక్షం నమః శివాయ.
నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ.
లంకాయాం శాంకరీ దేవీ, కామాక్షీ కంచికాపురే, ప్రద్యుమ్నే శృంగళాదేవీ, చాముండీ క్రౌంచపట్టణే.
అలంపురే జోగులాంబా, శ్రీశైలే భ్రమరాంబికా, కొల్హాపురే మహాలక్ష్మీ, మాధుర్యే ఏకవీరికా.
ఉజ్జయిన్యాం మహంకాళీ, పీఠికాయాం పురుహూతికా, ఓఢ్యాయాం గిరిజాదేవీ, మాణిక్యా దక్షవాటికే.
హరిక్షేత్రే కామరూపా, ప్రయాగే మాధవేశ్వరీ, జ్వాలాయాం వైష్ణవీ దేవీ, గయా మాంగల్యగౌరికా.
వారాణస్యాం విశాలాక్షీ, కాశ్మీరేషు సరస్వతీ, అష్టాదశ సుపీఠాని యోగినా మపి దుర్లభమ్.
సాయంకాలే పఠేన్నిత్యం, సర్వ శత్రువినాశనం, సర్వ హరం దివ్యం రోగ సర్వ సంపత్కరం శుభం.
శివుని మౌన వ్యాఖ్య,మూక పంచశతి,పద్మపాదుడైన సునందుని స్తుతి పుస్పదంతుని భక్తి,సాక్షాత్ శివ స్వరూపమైన ఆది శంకరుని స్తోత్రములు శివుని పూజనీయుడిని చేస్తున్నాయని స్తుతి
శివుడు మాయామోహ పూరితుడై దక్షయజ్ఞ కుండమునుండి తిరిగి వచ్చిన మాయా సతిని ,తన భార్య అనుకుని మోసుకెళ్లాడని నింద.
అలా శివుడు మాయ నటించినది అష్టాదశపీఠ ఆవిర్భావమునకు అని స్తుతి.
ఏక బిల్వం శివార్పణం.
SIVA SANKALPAMU-45
ఓం నమః శివాయ-45
********************
పొగడ్తలకు లొంగిపోతే ఉబ్బులింగడు అంటున్నారు
చిరాకుని చూపిస్తే చిందేస్తున్నాడంటున్నారు
కోపముతో ఊగుతుంటే వీరభద్రుడంటున్నారు
చిట్టిచీమ కుట్టగానే శివుని ఆన అంటున్నారు
శుచిలేనిది చూస్తుంటే శివ-శివ అంటున్నారు
కలిసిరాక దిగులుంటే గంగపాలు అంటున్నారు
బిచ్చగాడివి నీవని ముచ్చటించుకుంటున్నారు
అమాయకతతో నుంటే అది నీ మాయ అంటున్నారు
దిక్కుమాలిన పోలికలతో నిన్ను తొక్కేస్తున్నారు
తీరులేనివాడివంటు నిన్ను తీర్మానిస్తున్నారు
మంచుకొండ దేవుడిలో మంచితనము లేదంటు
వెక్కిరిస్తున్నారురా ఓ తిక్క శంకరా.
తన అవలక్షణములను సందర్భానుసారముగా సమన్వయించుకునే చనువును శివుడు ఇచ్చాడు కనుకనే వారు ఉబ్బులింగడు-చిందేస్తాడు-వీరభద్రుడు-చీమలను కుట్టమంటాడు-గంగపాలు-బిచ్చగాడు అంటూ శిబునితో పోల్చుకుంటూ,అపహాస్యము చేస్తున్న వారిని ఏమీ అనలేక ఊరుకుంటాడు-పిరికివాడు శివుడు కనుక సర్దుకుని పోతాడు.-నింద.
లోకము నమః శివాయ-లోకులు నమః శివాయ
పోలిక నమః శివాయ-ఏలిక నమః శివాయ
నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ
" త్రయీవేద్యం హృద్యం త్రిపురహర మాద్యం త్రినయనం
జటాభారోదారం చలదురగహారం మృగధరం
మహాదేవం దేవం మయిసదయ భావం పశుపతిం
చిదలంబం సాంబం "శివమతివిడంబం" హృదిభజే."
శివానందలహరి.
శివుడు అత్యంత మనోహరుడు.నాగభూషణాలంకృతుడు.అవియును కదులుచున్న సర్పములను ధరించువాడు.కాలమనే లేడిని ఒడిసి పట్టుకున్నవాడు.త్రిపురాసురులను సంహరించినవాడు.మహా వీరుడు.చిత్ప్రకాశకుడు.అన్నింటికిని మించి,ఎవ్వరు-ఎన్నటికి-ఎక్కడైనను అనుకరించుటకు సాధ్యము కానివాడు.-స్తుతి.
ఏక బిల్వం శివార్పణం.
SIVA SANKALPAMU-44
ఓం నమః శివాయ-44
********************
నీకు మల్లే నీ నామమునకు నిలకడలేదు శివా
పెదవులు తెరుచుకోగానే పదమని పరుగెడుతుంది
శంభో అని పిలువగానే అంభోరుహము చేరుతుంది
శివ శివ అని పిలువగానే శిఖరాగ్రము చేరుతుంది
మహాదేవ యని పిలువగ తుహినముగా మారుతుంది
నీలగ్రీవ అనగానే వినీలగగనము అవుతుంది
విశ్వనాథ అని పిలువగ విశ్వమంత తిరుగుతుంది
ఈశ్వరా అని పిలువగ ఈడ ఉండనంటుంది
ఉమాపతి అని పిలువగ ఉరూరుచాటి వస్తుంది
పశుపతి అని పిలువగానే వశమయ్యానంటుంది
ఎవరేమని పిలిచినా ఎక్కడికి పోవద్దని,దానికి
ముక్కుతాడు వేయరా ఓ తిక్క శంకరా.
శివనామము శివుని ఖాతరుచెయ్యదు.దానికేమి శివుడంటే భయము లేదు,కనుకనే తన ఇష్టమొచ్చినచోటికి వెళ్ళిపోతుంది.మళ్ళీరావాలనిపిస్తే,అది వీలుచూసుకుని ఎప్పుడో కుదిరినప్పుడు మెల్లగ వస్తుంది.తనకు ఎన్నో పర్లున్నాయని మురిసిపోయే శివుడు,వాటిని నియంత్రించలేని అసమర్థుడు.-నింద.
నామం నమః శివాయ-నామి నమః శివాయ
సామి నమః శివాయ-సర్వం నమః శివాయ
నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ.
శివశివశివ అనరాదా శివనామము చేదా-శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి.త్యగరాజస్వామి మరెందరో శివునకు శివనామమునకు వ్యత్యాసములేదని వక్కాణించిరి.నిరాకార-నిర్గుణ-నిరంజనుని ఏ పేరుతో పిలువగలము? ఏమని వర్ణించగలం?
అన్నినామములిందే ఆవహించెను అన్నట్లుగా అన్ని రూప-నామములు తానైనవాడు-మనలను తరియింపచేయువాడు ఒక్కడే.
నమ సూద్యాయచ సరస్యాయచ్రుద్రనమకం.
బురదకలప్రదేశము సూద్యము.అందున్నది కమలము.అందుండువాడు సూద్యుడు.సరస్సున నుండువాడు సరస్యుడు.బురదకల సంసారమునందుండినను దానిని నంటనీయక అంతర్యామియై యున్న శివునకు నమస్కారములు-స్తుతి.
ఏక బిల్వం శివార్పణం.
SIVA SANKALPAMU-43
ఓం నమః శివాయ-43
*******************
దారుణ మారణ కాండను కారుణ్యము అంటావు
పొట్ట చీల్చి గజాసురుని మట్టి కరిపించావు
చుట్టుకుంది అతని తల నీ సుతు శరీరమునే
కన్ను తెరిచి మన్మథుని కన్ను మూయించావు
కన్నుల పండుగ ఐనది నీ కళ్యాణముతో
బాణమేసి వరాహము ప్రాణమే తీసావు
పాశుపతము చేరినది అర్జునునికి ఆశీర్వచనమై
హరిని అస్త్రముగా వాడి త్రిపుర సమ్హారము చేసావు
విరచితమైనది వీరముగా హరి మహిమ
ఎటు చూసిన పాతకమే నీ గతముగా మారితే
నీకు "మహాదేవం,మహాత్మానాం,మహా పాతక నాశనం" అని స్తుతులా అంటే
చక్క బరచుట అంటావురా ఓ తిక్క శంకరా.
భావము
శివుని గతము అంతా పాపమయము-నింద.చెడును దునిమాడాననుకొని తానే నష్ట పోతూ ఉంటాడు.పొట్ట చీల్చి గజాసురుని చంపాననుకుంటే ఆ ఏనుగుతల తనకొడుకుని చుట్టుకొంది.మన్మథుణ్ణి జయించాననుకుంటే,ఆ బాణమునకు లొంగి పార్వతీపతిగా మారాడు.పందిని గెలిచాననుకుంటే,పాశుపతమును పోగొట్టుకున్నాడు.త్రిపురాసురులను జయించాననుకుంటే,ఆ ఘనత అస్త్రముగా మారిన హరికి దక్కింది.ఇలా ప్రతిసారి శివుడు తాను గెలిచాననుకుంటూ,ఓడిపోతూ ఉంటాడు-నింద.
బాణము నమః శివాయ-ప్రాణము నమః శివాయ
గతము నమః శివాయ-పాతకము నమః శివాయ
నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ
"నమో మృగయభ్యశ్శ్వనిభ్యశ్చవో నమః" రుద్రనమకం.
వేటాడు వారికొరకు వారిరూపమున నున్న రుద్రునకు నమస్కారములు.మృగములను చంపుటకు వానిని సమీపించు రుద్రుడా కొంచము ఆగు స్వామి.నాదొక విన్నపము.
" స్వామిన్నాది కిరాత మామక మనః కాంతార సీమంతరే
వర్తంతే బహుశో మృగా" శివానంలహరి.
ఓ ఆదికిరాతకుడా! నీవు అటు-ఇటు పోకుము. నా మనసనే మహారణ్య ప్రాంతములో మాత్సర్యము-మోహము మొదలగు మదించిన మృగములు విచ్చలవిడిగ సంచరించుచున్నవి.మృగయాసక్తుడవైన ఓ శివా! వేట అనే నీకు ఆనందకరమైన వినోదముతో వాటిని చంపి,నన్ను ఉధ్ధరింపుము.--స్తుతి.
( ఏక బిల్వం శివార్పణం)
SIVA SANKALPAMU-42
శివాయ గురవే నమః-42
******************
గడ్డి పరకలతో చేసే బహుదొడ్డవైన పూజలు
మే,మే అని స్తుఇంచే మేకతల రుద్రాలు
కమ్ముకోను మేమనే నమ్ముకున్న తుమ్మిపూలు
ప్రత్యర్థుల బెదిరింపుకు పుట్టమైన పులితోలు
తప్పనిసరి ఐతేనే విచ్చుకునే కన్నులు
పరుగుతీయలేనట్టి మృగమున్న చేతివేళ్ళు
అమ్మ బాబోయ్ చలి అంటు మూతపడ్డ గుడులు
హద్దులు మీరుతు ఆకాశాన్నితాకే జడలు
దుమ్మెత్తిపోస్తుంటే గమ్మత్తుగ నవ్వులు
పాడుబడ్డగుహనున్నావని పాడుచున్న భక్తులు
పరిహాసాస్పదుడవగుచు పరమ శివుడు నేనంటే
ఫక్కున నవ్వుతారురా ఓ తిక్క శంకరా.
............
చులకనయైన గడ్డిపోచ పూజలు,మేకతల పలికెడి మే మే మంత్రాలుకప్పుకున్న పులితోలు,ఎప్పుడు మూసిఉండే కన్ను ,ఆరునెలలు మూసిఉండే గుళ్ళు,హద్దులులేని జటలు,దుమ్మెత్తిపోసే జనాలు,ఉంటున్న పాడుబడ్డ గుహలు నిన్ను పరమ శివుడు అంటే పగలబడి నవ్వుతారు-నింద
మేక నమః శివాయ-మేథ నమఃశివాయ
గుడులు నమహ్శివాయ-గురుతు నమః శివాయ
నమః శివాయ నమహ్ శివాయ ఓం నమః శివాయ
" నమః సస్పింజరాయ త్విషీమతే పథీనాం పతయే నమః"--రుద్రనమకం.
లేతపచ్చిగడ్డివలె ఎరుపు-పసుపు కలిసిన కాంతితో ప్రకాశించు రుద్రునకు నమస్కారములు.ఉపాసకులకు జీవన్ముక్తికి మార్గమును చూపు శివునకు నమస్కారములు.
"అనంత సంసార సముద్రతార
నౌకాయితాభ్యాం గురుభక్తిదాభ్యాం
వైరాగ్య సామ్రాజ్యద పూజనాభ్యాం
నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం."
(గురుపాదుకా స్తోత్రము)
అంతులేని సంసారమను సముద్రమును సాటుటకు నౌక వంటివి,పెద్దల పట్ల గొప్పభక్తిని కలిగించునవి,వైరాగ్య సామ్రాజ్యమునొసగునట్టి పూజ్య పరమేశ్వర పాదపద్మములకు మరల మరల నమస్కరించెదను.
భూయో భూయో నమామ్యహంస్తుతి.
ఏక బిల్వం శివార్పణం.
SIVA SANKALPAMU-41
ఓం నమః శివాయ-41
****************
సగము మహాదేవుడట-సగము మహాదేవి అట
సగము తేట తెలుపట-మరొకసగము పసిడిపసుపట
సగము చంద్రబింబమట సగము మల్లెదండలట
సగము జటాజూటమట-సగము ధమ్మిల్లమట
సగము బూదిపూతలట-సగము కస్తురి తిలకమట
సగము నాగహారములట-సగము నానాహారములట
డమరుక దక్షిణ హస్తమట-వరద వామ హస్తమట
సగము పులితోలేనట-సగము చీనాంబరములట
సగము తాండవపాదమట మరొకసగము లాస్య పాదమట
చెరిసగము స్త్రీ-పురుషులటసృష్టి కొనసాగింపునకట
నగజ అనఘ జతలో మిగిలిన సగమేది అంటే
దిక్కులు చూస్తావేమిరా ఓ తిక్క శంకరా.
అమ్మను దర్శించుకుందామని వస్తే ఏదో వెలితిగా ఉంది.అమ్మ మల్లెదండల థమ్మిలమునకు బదులు సగభాగము గంగను ధరించిన జటాజూటము కనిపించుచున్నది.కస్తురి తిలకముతో కన్నులవిందు చేయు ముఖమును బూదిపూతలు అడ్డుచున్నవి.మంగళకరమైన అమ్మ సొమ్ములను పాములు దాచివేయుచున్నవి.చీనాంబర శోభను పులితోలు కప్పివేయుచున్నది.పాదనమస్కారమును చేద్దామనుకుంటే లాస్యపాదము-తాండవ పాదము కనిపించుచున్నవి.ఆరాతీస్తే ఆ ఆదిశంకరుడు అమ్మను సగము ఆక్రమించేశాడు.మిగిలిన సగభాగమును ప్రశ్నించగా,సమాధానమును చెప్పక దిక్కులు చూస్తున్నాడు-నింద.
అర్థము నమః శివాయ-పూర్ణము నమః శివాయ
అమ్మయు నమః శివాయ-అయ్యయు నమః శివాయ
నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ.
" నమః శివాభ్యాం నవయవ్వనాభ్యాం
పరస్పరాశ్లిష్ట వపూర్ధరాభ్యాం
నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం
నమోనమః శంకర పార్వతీభ్యాం"
" చాంపేయ గౌరార్థ శరీరకాయ
కర్పూర గౌరార్థ శరీరకాయ
ధమ్మిల్లకాయైచ జటాధరాయ
నమః శివాయైచ-నమః శివాయ."
అర్థనారీశ్వర స్తోత్రము.
సంపెంగ పువ్వు వలె ఎర్రనైన అర్థశరీరము కలది,కొప్పు ధరించినది అగు పార్వతికి,కర్పూరము వలె తెల్లనైన అర్థశరీరము కలవాడు-జటాజూటమును ధరించిన శివునకు నమస్కారములు.-స్తుతి.
ఏక బిల్వం శివార్పణం.
SIVA SANKALPAMU-40
ఓం నమః శివాయ-40
********************
ఎప్పుడేమి అనిపిస్తే అప్పుడది చేస్తావు
తప్పొప్పులు గమనించక పప్పులో కాలేస్తావు
అంబ రెందు కన్నులను ఆటగా మూసావు
అంధకారములోనుండి అంధకాసురుడుదయించాడు
మూడో కంటి అగ్గిని జలధిలో దాచావు
ఆ జలధిలో నుండి జలంధరడుదయించాదు
కపాలమును గిల్లుటుకై గట్టిగ హుంకరించావు
అతిభయంకరముగ కాలభైరవుడుదయించాడు.
కుడి-ఎడమని చూడకుండ జటను విసిరికొట్టావు
భద్రతనే మరిచిన వీరభద్రుడుదయించాడు
హద్దు అదుపులేనివారి పనులను వద్దనవు నీవని
ఒక్కటే నిష్ఠూరములుర ఓ తిక్కశంకరా.
శివుడు తనకు ఏ పనిచేయాలనిపిస్తే దానిని ఆలోచించకుండా చేసే తొందరపాటు స్వభావము కలవాడు.కనుకనే అంధకాసురుడు-జలంధరుడు-కాలభైరవుడు-వీరభద్రుడు జన్మించారు.వారు యుక్తాయుక్తములను మరచి హింసాప్రవృత్తితో ముజ్జగములను గడగడలాడించారు.తిరిగి శాంతిని నెలకొల్పుటకు అంధకుని-జలంధరుని అంతమొందించవలసినది.మిక్కిలి కష్టముతో వీరభద్రుని-కాల భైరవుని శాంతింపచేసినారు.ఇదంతా శివుని నిర్వాకమే-నింద.
జననం నమః శివాయ-జ్వలనం నమః శివాయ
జగడం నమః శివాయ-జగము నమః శివాయ
నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ
" దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం
వ్యాల యజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం
నారదాది యోగబృంద వందితం దిగంబరం
కాశికా పురాధినాథ కాలభైరవం భజే"
కాశీక్షేత్రపాలకా-కాలభైరవా నమోనమః
దక్షారామ క్షేత్ర పాలక శ్రీమాన్ వీరభద్ర నమోనమః
అంధకాసుౠడు -జలంధరుడు శివుని ప్రమథగణములై కొలుచుచున్నారని పెద్దలు చెబుతారు.
భగవంతుని చేష్టల పరమార్థము బాహ్యనేత్రములకు అర్థముకాదు కాని అవి పరమ పురుషార్థములు.-స్తుతి.
ఏక బిల్వం శివార్పణం.
SIVA SANKALPAMU-39
ఓం నమః శివాయ-39
*********************
గుట్టలిచ్చు ఆసనమున కుదురుగ కూర్చుంటావు
చెట్లు చేయు అభిషేకము చెలిమితో స్వీకరిస్తావు
మిణుగురుల కదలికలను దీపములనుకుంటావు
పూలగాలి తాకగానే పరవశించిపోతావు
షట్పదీ ఝంకారము స్తోత్రములని అంటావు
షడక్షరీ మంత్రమంటు సంతసించి పోతావు
పిట్ట పారివేయు పండు ప్రీతి నైవేద్యమంటావు
ఉట్టి చేయి చూపిస్తే సుగంధతాంబూలము అంటావు
అడవిలో నెమలి నాట్యము మదర్పితము అంటావు
ఉప్పుమూటలాడుతుంటే గొప్పవాహనమంటావు
షోడశోపచారములా ఇవి నిషేధ అపచారములని
గ్రక్కున ప్రశ్నించవేరా? ఓ తిక్క శంకరా.
శివుడు పధ్ధతి లేని పనులను తనకు చేయు షోడశోపచారములని భ్రమపడుతుంటాడు.రాళ్ళతో కఠినముగా నున్న శిలను చూపించి ఇది నీకు ఆసనమనగానే,సరేనని కుదురుగా దానిమీద కూర్చుంటాడు.రాళ్ళుగుచ్చుకుంటాయని అనడు.చెట్టు తనపై బడిన మంచును దులుపుకుంటు చమత్కారముగా వృక్షరూపమున నున్న శివా! నీకు నేను అభిషేకము చేస్తున్నాను అంటే,నిజమనుకుంటాడు.మినుకుమినుకుమనుచున్న మిణుగురులను చూసి అవి తమకు దీపసేవ చేస్తున్నాయని భ్రమపడతాడు.పూలసువాసన గాలివాటమునకు వస్తే,అగరుధూపమును వేసాయంటాడు.మకరందమునకు పూవును చేరు తుమ్మెద ఝంకారము చేస్తుంటే తన కొరకు షడక్షరీ స్తోత్రమును ఆలపించుచున్నదంటాడు.పండును ముక్కున కరచుకొనిన పిట్టనోటి నుండి అనుకోకుండా పండు జారి క్రింద పడితే తనకు పిట్ట నైవేద్యమును సమర్పించినదని సంతసపడతాడు.ఆకు-వక్క-సుగంధద్రవ్యములకు బదులు కొన్ని అక్షింతలనుంచగానే తాంబూలపరిమళములకు పరవశించిపోతాడు. ఎక్కడో అడవిలో నాట్యముచేయుచున్న నెమలిని చూపిస్తు నాకు నాట్యసేవ చేస్తున్నదని,తండ్రి కొడుకును వీపుమీద ఎక్కించుకొని ఉప్పుమూట ఆడుతుంటే తనకు వాహనముగా మారిన భక్తుడని మురిసిపోతుంటాడు.యాదృచ్చికముగా జరిగే పనులను యద్యత్ కర్మ కరోతి సర్వం అఖిలం శంభో తవారాధనం" అనగానే నిజమనుకునే అమాయకుడు శివుడు-నింద.
కొండ నమః శివాయ-బండ నమః శివాయ
భ్రమయు నమః శివాయ-భ్రమరం నమః శివాయ
నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ
"నమః కిగ్ ం శిలాయచ క్షయణాయచ" రుద్రం.
చిన్నచిన్న రాళ్ళుగల ప్రదేశములందును-నివాసయోగ్యమగు ప్రదేశములందుండు రుద్రునకు నమస్కారములు.
""ప్రభుత్వం దీనానాం ఖలు పరమబంధుః పశుపతే
ప్రముఖ్యోహం తేషామపి కిముత బంధుత్వమనయో
త్వయైవ క్షంతవ్యాశివ మదపరాధాశ్చ సకలాః
ప్రయత్నాత్ కర్తవ్యం మదవన మియం బంధుసరణిః"
శివా నీవుదీన బంధువుగా పేరుపొందినవాడవు .నేను కడు దీనాతిదీనుడను కనుక నన్ను రక్షించుటయే బంధురీతి-స్తుతి.
ఏక బిల్వం శివార్పణం.
SIVA SANKALPAMU-38
ఓం నమః శివాయ-38
*********************
అంతా ప్రకాశమే నేనంటూ ఆర్భాటము చేస్తావు
అభిషేకములు జరిగేవి అంతంత మాత్రమేగ
ఋషుల తపోశక్తులను సర్పములుగా మలిచావు
నాగాభరణుడనంటు సాగదీస్తు ఉంటావు
ఋషిపత్నులపై శంకవేస్తు పులిని పుట్టించావు
వ్యాఘ్రేశ్వరుడను అంటు గుడిని కట్టించావు
పసిడిబిల్వహారములతో పరిచయము అవుతావు
తెరచాటుగ కథలను దొంతెరలుగ నడుపుతావు
కొమ్ములున్న వారమంటు నెమ్మది తీసేస్తావు
కాళ్ళులేని వాడివంటు ముళ్ళు గుచ్చమంటావు
నిన్ను కొలుచు పతంజలికి నిలువెల్ల పరీక్షలని
మొక్కుటెందుకటర నిన్ను ఓ తిక్కశంకరా.
ఆ-సమస్తాత్- ఆ అంటే అంతట.కాశము-వెలుగు.అంతట వెలుగుతో నిండినది ఆకాశము.శివుడు అది నేనే అని గొప్పలు చెప్పుకుంటాడు కాని అక్కడ తనకు (మూలవిరాట్) రోజు అభిషేకము చేయరని మాత్రము చెప్పుకోడు.ఋషుల యజ్ఞ ఫలమును సర్పములుగా మార్చునట్లు వారిచే చేయించి,వాటిని తాను ఆభరణములుగా ధరిస్తాడు.ఋషిపత్నులపై ఋషులకు అనుమానమును కలిగించి వారిచే ఒక పులిని సృష్టింపచేసి,దాని తోలుతో ఒక వస్త్రమును-ఆసనమును చేసుకొన్నాడు.మూడు స్వరూపాలు-ఐదు మండపాలు అని గొప్పలేకాని,తెర వెనక నక్కి కథలను బాగానే నడిపిస్తాడు.అందుకేగా పాపం నంది విజ్ఞతను మరచి పతంజలిని కొమ్ములు లేనివాడని ఎగతాళిచేసాడు.మూడుకాళ్ళ భ్రంగి కాళ్ళులేనివాడవంటు పదునైన మాటలతో బాధించాడు.శివుడు తాను సరిగా ఉండడు.తన దగ్గరనున్నవారిని సత్ప్రవర్తనతో నుండనీయడు.-నింద.
కాళము నమః శివాయ-కాశము నమః శివాయ
శంకలు నమ: శివాయ-శంకర నమః శివాయ
నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ
" నమో రుద్రేభ్యో యేంతరిక్షే యేషా వర్షమిషవత్" రుద్రము.
అంతరిక్ష స్వరూపమైన సదాశివా అనుగ్రహమును వర్షింపుము నీకు నమస్కారములు.
ఋషుల అహంకారమును నిర్మూలించి,పతంజలి మహర్షి యొక్క భక్తిని-భాషా పటిమను లోక విదితము చేస్తూ అనేకానేక అద్భుత గ్రంధములను మనలకు అనుగ్రహించిన అవ్యాజ కరుణాసాగరా-అంబికాపతి అనేకానేక నమస్కారములు.స్తుతి.
ఏక బిల్వం శివార్పణం.
SIVA SANKALPA,MU-37
ఓం నమః శివాయ-37
**********************
సూర్యరశ్మి తాకిడికి పారిపోయిన నాచు
జారినాడులే అంటూ చేరుతోంది చెరువులోకి
చుట్టివేసి ఉందని ముట్టుకోలేననిన నీరు
పరిచారులే పదమంటూ చేరుకుంది చాపకిందికి
.పరిక్రమ సమయమని..ఆక్రమించలేనన్న చీకటి
మళ్ళీ మామూలేగా అంటు ఆవరించింది మనసులోకి
విబుధగోష్టి వేళయని బంధనాలనిన వికృతి
.వివరము తెలియలేదంటువిస్తరించిందిమనిషిలోకి
పిశాచాలతో ఆడే పిచ్చివాడు శివుడని,పునరావృత
మాయను పూర్తిగా మాయము చేయలేనివాడని
కచ్చగా వచ్చి మమ్ము గుచ్చుతుంటే హెచ్చరించలేవని
నిన్ను తక్కువ చేస్తున్నారురా ఓ తిక్కశంకరా
శివుడు పూర్తిగా దేనిని తొలగించలేడు.కనుకనే నాచు మరల నీటిలోనికి ప్రవేశించగలుగుతోంది.మాయ చాపకింది నీటిలా మనకు తెలియకుండానే మన దరిచేరుతుంది.ధ్యానము ధ్యాసను కుదురుగా ఉండనీయదు.మనసును చలించేలా చేస్తుంది.సద్గోష్ఠి ముగియగానే విపరీత భావనలు సమయము చూసి స్వాధీనము చేసుకుంటుంది.వీటన్నికి కారణము శివుని అసమర్థతే.-నింద.
ప్రకృతి నమః శివాయ-వికృతి నమః శివాయ
రాకయు నమః శివాయ-పోకయు నమః శివాయ
నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ.
" నమః ఆతార్యాయచ-ఆలాద్యాయచ." రుద్రనమకం.
సంసారమునుండి తరింపచేయు తత్త్వజ్ఞానము లభించినను ,దానిని ఉపేక్షించి,మరల సంసార భ్రాంతిని పొందుటయే ఆతారము.(ఆతార్యాయచ).సంపూర్ణముగా కర్మఫలములను పొందువాడు ఆలాదుడు.అవి దైవకృపచే పరిహరింపబడవు.(ఎవరికి)
"అసారే సంసారే నిజభజన దూరే జడథి తతా
భ్రమంతం పరమకృపయా పాతుం"-శివానందలహరి
సారము లేని సంసారములో మతిలేక తిరుగుచున్న నన్ను మాయ అవకాశము చూసి మరల మరల ఆవరించుచున్నది.నా ప్రయత్న లోపమో-నీ ప్రసాదగుణ తాత్సారమో తెలియకున్నది.పరమేశా! అనుగ్రహించుటకు నాకంటే దీనాతి దీనుడు లేడు.నీకంటే వేరొక దీనరక్షకుడును లేడు.సత్వరము మమ్ములను అనుగ్రహింపుము సదాశివా.నీకు నమస్కారములు.-స్తుతి.
ఏక బిల్వం శివార్పణం
..
.
SIVA SANKALPAMU-36
ఓం నమ: శివాయ-36
***************
తిరుగుచున్న భూమి అనే తీరులేని "రథముతో"
నారి కట్టలేని మేరుకొండ అనే" వింటితో"
చేతి నుండి జారిపోవు కోతి అనే" అస్త్రముతో"
ఎదుటిసేన కాంచలేని" ఎగుడు దిగుడు కన్నులతో"
బారెడైన కప్పలేని కరిచర్మపు " కవచముతో"
పుర్రెతప్ప మోయలేని "కుర్రదైన చేతితో"
వీరముపై నీళ్ళుజల్లు " నెత్తిమీద కుండతో"
శత్రువుల మూలమెరుగలేని "శూలముతో"
పురములు దగ్గరైన" రిపుజయ శాపమున్న వారితో"
నేనెవరో తెలుసా అంటూ నీవు" డంభముతో"
లోహ త్రిపురులను జయించి " ఆహా అనుకుంటుంటే" నేను
"బిక్కమొగము" వేసానురా! ఓ తిక్క శంకరా.
శివుని రథమునకు కుదురులేదు.వింటికి నారి కట్టుట కష్టము.బాణములకు నిలకడ లేదు.బేసి కన్నులతో గురి చూచుట సాధ్యము కాదు.చేయి బలమైనది కాదు.నీ పౌరుషమనే అగ్నిపై నెత్తిమీది గంగమ్మ నీళ్లు చల్లుతుంది.శూలమునకు పదును లేదు.మూడు పురములు దగ్గరైన ఓడిపోవుదురను శాపమున్నవారిని ఓడించానన్నది శివుని పరాక్రమము-నింద.
సహనం నమః శివాయ-సమరం నమః శివాయ్
త్రిపురం నమః శివాయ-త్రిగుణం నమ: శివాయ.
" నమో దుందుభ్యాయచ-హనన్యాయచ" రుద్ర నమకం.
భేరి యందు శబ్దరూపమున పుట్టినవానికి,దానిని వాయించు దండనమునందు తాడన రూపమున నున్న వానికి నమస్కారములు.
"నమో ధృష్ణవేచ ప్రమృశాయచ" శతృసైన్యముల బలాబలములను తెలుసుకొనువాడును,యుధ్ధమునందు వెనుదిరుగని వానికి నమస్కారములు.
తారకాసురుని కుమారులైన తారకాక్షుడు-కమలాక్షుడు-విద్యుత్మాలి బ్రహ్మ గురించి ఘోర తపస్సును చేసి,బ్రహ్మచే విచిత్రమైన వరమును పొందిరి.మృత్యువును జతించుట జరుగని పని కనుక రథముకాని రథముపై,అస్త్రము కాని అస్త్రముతో తప్ప వారికి మరణము లేని వరమును పొందిరి.వారు మూడు పురములను కూడ పొంది తున్నారు.అవి బంగరు-వెండి-ఇనుముచే చేయబడినవి.అవి దగ్గరకు జరుగనంత కాలము వారికి మరణము లేదు.వారు దుష్కృత్యములతో ధర్మమునకు గ్లాని కలిగించసాగిరి.
ధర్మ సంస్థాపనకై భూదేవిని రథముగాను,సూర్య-చంద్రులను రథచక్రములుగాను,వేదములను గుఱ్ఱములుగను
,బ్రహ్మను రథచోదకునిగను,మేరుపర్వతమును విల్లుగాను,ఆదిశేషువును నారి తాడుగాను ఏర్పరచి,నారాయణుడు తానే స్వయముగా ప్రకటించుకొని,పరమేశ్వరునితో యుధ్ధము చేయించి,త్రిపురులకు మోక్షమును ప్రసాదించెను.-స్తుతి.(శివ మహా పురాణము)
కరుణ తప్ప కాఠిన్యము లేని శివుని పరాక్రమము మనలో త్రిగుణములైన సత్వ,రజో,తమో గుణములను జయించి శివజ్యోతిని దర్శింప చేస్తుంది.-స్తుతి.
( ఏక బిల్వం శివార్పణం )
SIVA SANKALPAMU-35
ఓం నమ: శివాయ-35
***************
కొండమీద నీవున్నావని కొలువగ నేవస్తే
బండరాయి కూడ నిన్ను తనతో పోల్చుకుంది
బావిలోన నీవున్నావని భక్తుడిగా నేవస్తే
బావిలోని కప్ప నిన్ను తనతో పోల్చుకుంది
బీడునేల నీవున్నావని తోడు కొరకు నేవస్తే
జోడువీడు అంటు బీడు తనతో పోల్చుకుంది
అటవిలోన ఉన్నావని అటుగా నేవస్తే
జటలు చూడు అంటు అడవి తనతో పోల్చుకుంది
చెట్టులోన ఉన్నావని పట్టుకొనగ నేవస్తే
పట్టులేక ఉన్నావని చెట్టు తనతో పోల్చుకుంది
సఖుడివి నీవై సకలము పాలిస్తుంటే
ఒక్కరైన పొగడరరేర ఓ తిక్క శంకరా.
భావము
శివుడు కప్ప వలె బావిలో,బండరాయిలా కొండ మీద, బీడు నేలలా పొలములో,జటలతో ఊడలమర్రిలా ,,అడవిలొ పటుత్వము లేని మద్ది చెట్టులా ఉన్నాడని నింద
బీడు నమః శివాయ-తోడు నమః శివాయ
బండ నమః శివాయ-అండ నమః శివాయ
నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ.
" నమః కూప్యాయచావట్యాయచ"
రుద్రనమకం.
బావులలోని జలములయందున్నవానికి,పల్లము స్థలముయందున్న వానికి నమస్కారములు.
బావి లోని నీరు నిర్మలముగా ఉంటుంది.పల్లపు నీరు మలినముగా ఉంటుండి.రుద్రుడు నిఎర్మలమైన నీటిలోను-మలినమైన నీటిలోని సర్వసమానత్వమును పాటిస్తు ఉంటాడు.అదే విధముగా సజ్జనులను మందభాగ్యులను కనికరిస్తుంటాడు.
"అశ్మాచమే మృత్తికాచమే గిరయశ్చమే పర్వతాశ్చమే" రుద్ర చమకము.
పరమేశ్వరా సర్వము నీవై శోభించుచున్నవాడ! నాకు నా ప్రయత్నమును సమర్థవంతము చేసికొనుటకు నాకు రాళ్ళు-మట్టి-పర్వతములు-చెట్లు మొదలగు బానిని అనుగ్రహింపుము అని సాధకుడు రుద్రుని అర్థించుచున్నాడు.
" గుహాయాం గేహేవా బహిరపి వనే వాద్రి శిఖరే
జలేనా వహ్నౌవా వసతు వసతేః కిం వద ఫలం
సదా యస్యైవాంతఃకరణమపి శంభో తవ వదే
స్థితం చేద్యోగోసౌ స చ పరమ యోగీచ స చ సుఖీ."
శివానందలహరి.
.
చిత్తునందు చిత్తము నిలుపని వాడు గుహలలో-అడవిలో-పర్వతశిఖరములలో-నీటిలో-అగ్నిలో-ఎక్కడెక్కడో నిన్ను వెతుకుచున్న ఏమిలాభము? ఎవడి మనస్సు నీ పాదపద్మములయందు స్థిరముగా నుండునో అతడే సుఖప్రద గొప్పయోగి.-స్తుతి.
తనలో దాగిన కప్పకు ఆహారమును,ఉనికినిచ్చు బావి వలె,వజ్ర సంకల్పమైన రాయివలె,ఏ ఆకర్షణకు లోనుకాని నిశ్చలత్వము వలె,బీడుగా పైకి కనపడుచున్నను ఆర్ద్రతతో కడుపునింపు పంటచేను వలె,తన పిల్లలు అందుకొనుటకు కరుణ పాశమను తాటిని వేలాడదీయు జడల వృక్షము వలె,తీగెలకు ఆలంబనమైన మద్ది వృక్షము వలె శివుడు ప్రకాశించుచున్నాడు.-స్తుతి.
ఏక బిల్వం శివార్పణం.
.
SIVA SANKALPAMU-34
ఓం నమ: శివాయ-34
*******************
నీకు పూజచేస్తే పున్నెమని విన్నానురా,వినయముతో
కాళ్ళుచేయి కడుగ నీళ్ళకెలితే గంగ కస్సుమన్నదిరా
"స్నానమెట్లు చేయిస్తు" సముదాయించర గంగను
"నిన్ను కూర్చోమనగానే" వేటకై తుర్రుమన్నదిరా పులి
"జందెమైన ఇద్దమన్న" చరచర పాకింది పాము
"కట్టుకోను బట్టలన్న" కనుమరుగయింది కరి
"నైవేద్యము చేయబోవ" విషజంతువులన్ని మాయము
వెతుకులాడి వెతుకులాడి" వేసారితిరా శివా"
అక్కజమేముందిలే నీ అక్కర తీరిందేమో
ఒక్కటైన కలిసిరాదు "చక్కనైన పూజసేయ"
వాటికి తక్కువేమైనదని ఒక్కటైనగాని నిన్ను
లెక్కచేయదెందుకురా ఓ తిక్కశంకరా.
ఓ శివా! భవహరమగు నీ పూజ భయావహము అగుచున్నది.-నింద.అర్ఘ్య,పాద్య,ఆచమనీయ అభిషేకములు చేద్దామంటే గంగ ఇష్టపడుటలేదు.నిన్ను కూర్చోమనగానే తన చర్మము అడుగుతావని పులి పారిపోయింది.జందెమును ఇద్దామంటే పాము చర చర పాకి మాయమైనది.బట్టలిద్దామనుకోగానే ఏనుగు భయపడి పారిపోయింది.నైవేద్యము సమర్పించుకుందామంటే విష జంతువులన్నీ పరుగో పరుగు.శివ పూజకు ఏవీ సహకరించుట లేదు.-నింద.
సుముఖం నమః శివాయ-విముఖం నమః శివాయ
సుగుణం నమః శివాయ-సుకృతం నమః శివాయ
నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ
శివా నీ అనుగ్రహముచే నా అజ్ఞానము తొలగుచున్నది. (శివానందలహరి)
" కరస్థే హేమాద్రే గిరిశ నికటస్థే ధనవతౌ
గృహస్థే స్వర్భూజమర సురభి చింతామణిగణే
శిరస్థే శీతాంశౌ చరణ యుగలస్థేఖిలశుభే
కమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనః."
స్వామి! నీ చేతిలో బంగరు కొండయున్నది.నీ వద్దే కుబేరుడున్నాడు.కల్పవృక్షం-కామధేనువు-చింతామణి నీ ఇంటిలోనే ఉన్నవి.నీ తలపై చంద్రుడున్నాడు.సమస్త శుభములు నీ పాదములను ఆశ్రయించుకొని యున్న సమయమున శంకరా! నా మనస్సు తప్ప నేను నీకేమివ్వగలను? -స్తుతి.
మేరుపర్వతము విల్లుగా కలవాడు-వైశ్రవణుని ఐశ్వర్యవంతుని గా అనుగ్రహించినవాడు,కల్పవృక్షము కామధేనువు-చింతామణి తన వద్దనే కలవాడు అన్నింటికిని మించి,సర్వశుభములను పాదాక్రాంతము చేసుకొనిన పరమేశ్వరుని నిశ్చల మనముతో స్తుతించెదను.
.
( ఏక బిల్వం శివార్పణం )
SIVA SANKALPAMU-33
ఓం నమః శివాయ-33
******************
ఎడమకాలి చెప్పు కుంచె ఎంతో నచ్చేసిందా
ఎరుకలవానిని వింతగ నెత్తికెక్కించుకున్నావు
నాయనారు నిర్లక్ష్యమునకు కోపము వచ్చేసిందా
పాతగోచి కోసము ఎంతో పేచీ పెట్టావు
లింగధారుల నియమములు సాంతం కట్టేసాయా
కుంచము నీవనగానే మంచిది అనుకున్నావు
వంకర పరీక్ష చేయాలను తలపొచ్చిందా
వంకయ్య గొడ్డుటావు పాలకు అడ్డుచెప్పకున్నావు
తిలకవ్వకు తికమకలు చూపాలనిపించిందా
కౌగిలించుకొనగానే మగవానిగా మార్చావు
మిక్కిలి ప్రేమయని మక్కువ చూపిస్తానంటు
చిక్కులుపెడుతుంటావురా ఓ తిక్కశంకరా.
ఎడమకాలి చెప్పును చీపురుచేసి,శివలింగార్చిత పత్రిని తోసివేసిన కన్ననికి శ్రీకాళహస్తి కొండమీద,గుడిని కట్టించి తన నెత్తిమీదుంచుకున్నాడు
( పెరియ పురాణం) .పాతగోచీ ముక్క కోసం అమరనీతి నాయనారుతో ఎన్నో వింత పేచీలు పెట్టినాడు.(బసవ పురాణ భక్తులు)ఒక లింగధారుల గుంపు దూర ప్రయాణమును చేయుచు,పూజా సమయమైనందున ఒక చోట ఆగి,శివలింగమునకై వెతుకగా వారికి కనపడలేదు.పూజా సమయము మించుతున్నదని వారు,వారు తెచ్చుకున్న ఒక బియ్యము కొలిచే కుంచమునకు శివుడని పేరుపెట్టి పూజిస్తే సరే కానిమ్మన్నాడు.వంకటయ్య అను కన్నడ భక్తుని ఇంటిలోని వట్టిపోయిన ఆవుపాలు తన పూజకు కావాలన్నాడు.అంతటితో ఆగాడా? అంటే అదీలేదు.తిలకవ్వ అను భక్తురాలు తనను వెంబడిస్తున్నవారి నుండి తనను రక్షించమని శివలింగమును పట్టుకుంటే,అదే అదనని ఆమెను మగవానిగ మార్చేసాడు.లోకరీతిని లోకువ చేసేవారిని రక్షిస్తూ,యుక్తాయుక్తములు మరిచినవాడు శివుడు.-నింద.
కుంచము నమః శివాయ-మంచము నమః శివాయ
చిక్కులు నమః శివాయ-దిక్కుయు నమః శివాయ
శివాయ నమః ఓం నమః శివాయ
" మార్గా వర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే
గండూషాంబు నిషేచనం పురరిపోర్దివ్యాభిషేకాయతే
కించిత్భక్షిత మాంసశేష కబలం నవ్యోపహారాయితే
భక్తిః కిం న కరోత్యహో వనచరో భక్తా వతంసాయతే".
శివానందలహరి.
మార్గమున నడిచి-నడిచి అరిగిన ఎడమకాలి చెప్పును తిన్నడు శివుని శరీరమును తుడుచుటకు కుంచెగను,పుక్కిటి నీటితో తడుపుతు దివ్యాభిషేకముగను,ఎంగిలి చేసిన మాంసపు ముక్కలను నైవేద్యముగా (యద్భావం తద్భవతి) సమర్పించి పునీతుడైనాడు.తక్కిన భక్తులు శివానుగ్రహముచే అసాధ్యములను సుసాధ్యములుగా పొంది ధన్యులైనారు.ఆహా! ప్రబలిన భక్తి చేయు ప్రదర్శనలను ఏమనగలము తండ్రీ నీ పితృ వాత్సల్యపు పీయూషములు తక్క.-స్తుతి.
ఏక బిల్వం శివార్పణం.
SIVA SANKALPAMU-32
ఓం నమ: శివాయ-32
********************
కాళ్ళుజారతాయని చూడకుండ నీళ్ళూ పోస్తుంటావు
తుడిచేందుకు బట్ట వేస్తే దానిని తడిపేస్తావు
ఏనుగులు కొలిచాయాని బాగానే చెబుతావు
ప్రత్యక్షపూజ కోరితే వృక్షము కమ్మంటావు
అప్పులింగేశ్వరుడనంటు గొప్పలెన్నో చెబుతావు
పప్పన్నానికి మాత్రము ఒప్పుకోను అంటావు
గురువును నేను నీకు అంటు గౌరితో అంటావు
అమ్మ శక్తిని కుదించి అఖిలాండేశ్వరి అంటావు
నీళ్లమడుగుపైన కన్నులపండుగగా వెలిసావు
తుళ్ళుచున్న ఆశలపై.నీళ్ళుజల్లుతుంటావు
నీళ్ళదొరని నేనంటు భక్తుల పెళ్ళికి అనుమతించని
ముక్కంటివి నీవటర ఓ తిక్కశంకరా.
నీళ్ళమడుగులో నుండి( కావేరి జలము) ప్రకటింపబడిన శివుడు నీళ్ళతో ఆడుతు వాఈఇని కింద పారపోస్తుంటాడు.భక్తుల కాలుజారి పడతారని ఆలోచించడు.ఏనుగులు ఈ క్షేత్రములో తనను పూజించాయని
గొప్పలుచెప్పుకుంటాడు.శంభుడు అను యోగి ప్రత్యక్షపూజానుగ్రహమును కోరగా నేరేడు చెట్టుగా మారి తనను పూజించమన్నాడు.గౌరీదేవికి తాను గురువునని కనుక ఆమెను పెండ్లిచేసుకోనని చెప్పాడు.తాను చేసుకోపోతే మానె,ఎవరైన ఉత్సాహంగా పెళ్ళిముచ్చట్లను చేస్తే వాటిపై నీళ్ళుజల్లి నిరుత్సాహ పరుస్తాడు.అంతే కాదు తన క్షేత్రములో ఎవరైనా సరే కళ్యాణమును చేసుకోవటానికి అనుమతించను అని పట్టుబట్టి కూర్చున్నాడు.-నింద.
జలము నమః శివాయ-జగము నమః శివాయ
గురువు నమః శివాయ-గురుతు నమః శివాయ
నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ.
జంబూపతే మాంపాహి-పాహి.జటాధారియే జలరూపియై జగమేలు శ్రీమత్ తీర్థము స్వామి నివాసము.
జ్ఞానక్షేత్ర జగదీశా జయము జయము.
తిరువనై క్కావల్ ఈశా శరణు శరణు.
.ఇక్కడ స్వామికి అర్చకులు మధ్యాహ్నార్చనను అఖిలాండేశ్వరీ గా స్త్రీమూర్తిగా అలంకరించుకొని కపిల గోపూజను,స్వామి నివేదనలను సమర్పిస్తారు.అన్నాభిషేకము కన్నుల పండుగగా జరుపుతారు.శివరాత్రి ఉత్సవాలను మండలదీక్షతో జరుపుతారు.ఆ ఉత్సవాలలో అమ్మవారిని అయ్యవారివలె-అయ్యవారిని అమ్మవారివలె అలంకరించి ఆలయ ప్రాంగణములన్నీ ఊరేగిస్తారు.
"నమః స్స్రోతస్యాయచ"
రుద్రనమకం.
స్రోతస్సులనగా దేహమునందలి రక్తనాళముగా కూడ అనుసంధానము చేసుకుంటే సకల హృదయ నివాసి యైన ఆ జలలింగేశ్వరుడు జగదానందమును కలిగించుగాక-స్తుతి.
ఏక బిల్వం శివార్పణం.
SIVA SANKALPAMU-31
ఓం నమః శివాయ-31
********************
కళల మార్పు-చేర్పులతో కదులుచున్న చంద్రుడు
నీ సిగముడుల చీకట్లలో చింతిస్తు ఉంటాడట
కుబుసపు మార్పుచేర్పులతో కదలాడు పాములు
నీలలోహిత చీకట్లలో చింతిస్తు ఉంటాయట
కునుకురాక తెరువలేక కుదురులేని మూడోకన్ను
తెరతీయని చీకట్లలో చింతిస్తు ఉంటుందట
ఆకాశము నుండి సాగి,జార అవకాశములేని గంగ
బందిఖాన చీకట్లలో చింతిస్తు ఉంటుందట
చీకటిని తొలగించలేని చిత్ జ్యోతి శివుడేనట
చింతలు తొలగించలేని వింతశక్తి శివుడేనట
దోషము తొలగించలేని వానికి ప్రదోషపూజలా అంటు
వెక్కిరిస్తున్నారురా ఓ తిక్కశంకరా.
శివుడు చంద్రుని కళల మార్పును అరికట్టలేడు.పాముల కుబుసములను కూడ సవరించలేడు.మూడో కన్నుకు కుదురునివ్వలేడు.గంగను సైతము తన జటలలోని చీకట్లలో బంధించి,వెలుగును చూపలేక పోతున్నాడు.కాని తాను మాత్రము జ్యోతిర్లింగమునని ,దోషరహితుడనని చెబుతూ,ప్రదోష పూజలను అందుకుంటాడు.దోషమూను పదమును చీకటి-పాపము అను అర్థములలో కూడ అలంకారికులు ప్రయోగిస్తారు.(చీకటి ఆవరించుటకు ముందుకల సమయము ప్రదోషము) చీకట్లను తొలగించలేని శివుడు తాను దోషరహితుడనని చెప్పుకుంటూ ,ప్రదోషపూజలను అందుకుంటాడు.-నింద.
తిమిరం-నమః శివాయ-తిరిపం- నమః శివాయ
త్రిదళం నమః శివాయ-త్రిగుణం- నమః శివాయ.
నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ.
"ప్రాక్పుణ్యాచల మార్గదర్శిత సుధామూర్తిః ప్రసన్న శివః
సోమః సద్గుణ సేవితో మృగధరః పూర్ణస్తమోమోచకః"
శివానందలహరి.
పూర్వపుణ్యమనే తూర్పుకొండపై వెలుగొందు అమృతస్వరూపుడు-ప్రసన్నుడు-శుభకరుడు-సద్గుణవంతులచే పూజింపబడు మృగధరుడు చీకట్లను పూర్తిగా తొలగించి, ప్రకాశించుచు మనలనందరిని పరిపాలించును గాక.-స్తుతి.
ఏక బిల్వం శివార్పణం.
SIVA SANKALPAMU-30
ఓం నమ: శివాయ-30
*****************
ఆపివేయ పలికినదియేగా "శివతాండవ స్తోత్రము"
శాపమీయ పలికినదియేగా "శివ మహిమ స్తోత్రము"
కనకాభిషేకమునకై కదిలినదేగా" కాశీఖండము"
వీర శైవ ఉన్మాదమేగ" బసవ పురాణము"
శాశ్వత స్థావరమునకేగా "శంకరాచార్య విరచితములు"
మేక మేథ బోధలేగ "నమక చమక స్తోత్రములు"
దిగ్గజ అక్కజమేగా" శ్రీ కాళ హస్తీశ్వర మహాత్మ్యము"
అడిగి ఆలకిస్తావు ఆనంద భాష్పాలతో
అతిశయముగ చూస్తావు హర్షాతిరేకముతో
"నిష్కళంక మనసు" నిన్ను కొలిచినది" శూన్యము"
యుక్తితో ముక్తి కోరువారిని "నీ భక్తులు" అను మాయలో
చిక్కు కున్నావురా! ఓ తిక్క శంకరా.
భావము
రావణుని కైలాస ప్రవేశము చేయనీయనపుడు ప్రవేశమునకైరావణుడు శివ తాండవ స్తోత్రమును పలికెను(రుద్రవీణ)(అహంకారముతో)
పుష్ప దంతుడు అను గంధర్వుడు తిరిగి తన శక్తులను పొందుటకు శివ మహిమ స్తోత్రమును రచించెను.(స్వార్థముతో)
శ్రీనాథుడు రాజాస్థానముచే కనకాభిషేకమును ఆశించి కాశిఖండమును రచించెను.(కీర్తి కొరకు)
బసవడు అన్యదైవ దూషణ అను మనో వికారముతో బసవ పురాణమును రచించెను.(వీర శైవ ఉన్మాదము)
ఆది శంకరులు తమ వాగ్వైభవమునకు శాశ్వతత్వమును ఆపాదించుటకు అనేక స్తోత్రములు చేసిరి.(లుప్తాయచ-వ్యోమ కేశాయచ)
మేకతల మేధస్సు నుండి జనించినవి నమక చమక స్తుతులు.(గుడ్డిగా మందను అనుసరించుట మేక స్వభావము)
వీరందరు భక్తితో తనను స్తుతిస్తున్నారని పొంగిపోవుట శివుని తెలివితక్కువ తనము-నింద.
నృత్యం నమః శివాయ-కృత్యం నమః శివాయ
స్తోత్రం నమశివాయ-సోభ్యం నమః శివాయ
( సోభ్యం-పుణ్య-పాపములయందు సమభావము)
నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ.
" నమః అనిర్హతేభ్యః" రుద్ర నమకం. అంతటను నిశ్శేషముగా పాపము ఎవరిచేత హతమగునే వారే అనిర్హతులు.పాపములను ఆసాంతము తొలగించువారు.బుధ్ధి వివేకమును ప్రసాదించువారు.వారి అనుగ్రహ వీక్షముతో శివతత్త్వము కన్నులకు సాకారముగా గోచరించును.సవినయులై వారు,
"మీడుష్టమ "శివతమ" సివో న స్సుమనాభవ"
రుద్ర నమకం
శివా! నీవు శివతముడవు.శివము-శివ తరము-శివ తమము.(అత్యధికము.ఇదియే శేవధి-హద్దు.శుభములను లెక్కలేనంతగా ఇచ్చువాడవు.అంతేకాదు.సుమనా భవ ఓ భవుడా నీవు సుమనస్కుడవు.నీ మంచి మనసు,కొలతకు రాని నీ శుభకర ప్రసాదగుణము "న" మామీద,మీడుష్టమ వర్షించనీయి తండ్రీ.నీకు నమస్కారములు.-స్తుతి.
ఏక బిల్వం శివార్పణం.
SIVA SANKALPAMU-29
ఓం నమః శివాయ-29
*******************
పాఠము నేర్పిస్తానంటు గూడుపుఠాణి చేస్తుంటావు
ఒకరికొకరిమీది నుండి ఒకరి ఒద్దిక తీసేస్తావు
బుధ్ధులు మారుస్తావు యుధ్ధము చేయిస్తావు
బ్రహ్మ-విష్ణాదులను సైతము బరిలో దించుతావు
అస్త్రముపై అస్త్రముతో ఆటలాడిస్తావు
అవనీతలమును బొంగరముగ తిప్పుతుంటావు
మార్తాండుని సైతము మరుగున దాచేస్తావు
విస్పుటలింగములను ప్రస్పుటింపచేస్తావు
అఖిలజగములను అతలాకుతలము చేస్తావు
ఏమయ్యా! ఏమిటిది? అంటే శివమాయ అంటావు
అగ్నిస్తంభముగా నీవు ఆవిష్కరింపబడుట,వారి
రెక్కల కష్టమేరా ఓ తిక్క శంకరా.
ఎటుచూసిన తననె జగములు స్తుతించుటలో తానొక్కడే ముజ్జగములకు మూర్ధాభిషిక్తుడననుకున్నాడు.అహంకారముతో నిండిన ఆనందముతో సంచరించుచుండగా క్షీరసముద్రములో అనంత శయనుడైన మరో వ్యక్తి కనిపించాడి.తనకు నమస్కరించలేదని వాదనకు దిగాడు బ్రహ్మ అతనితిఎ.నేను నీ తండ్రిని అని హరి అంటే కాదు నేనే నీ తండ్రిని అని బ్రహ్మ హుంకరించాడు.వారి వాదన యుధ్ధమునకు దారి తీసి ముజ్జగములను గజగజలాడించింది.సకల దేవతలు సదా శివుని ప్రార్థించగా ప్రపంచ సౌభాగ్యమునకై ,వారి యుధ్ధమును విరమింప చేయుటకై జ్యోతిర్లింగావిర్భావము జరిగినది.
శివుడు కావాలనే అహంకార పరీక్ష అంటు బ్రహ్మ-విష్ణుల యందు మాయను ప్రవేశింపచేసి,వారిని విచక్షణారహితులుగా మార్చి వైరముతో ఘోర యుధ్ధమును చేయునట్లు చేసెను.ముల్లోకములను అల్లకల్లోలము చేసి,ఆపద్బాంధవుని వలె నటిస్తూ,తాను అగ్ని స్తంభలింగముగా ఆవిర్భవించెను.ప్రణాళిక శివునిది.ఫలితము శివునిది.ప్రయాస మాత్రము బ్రహ్మ-విష్ణువులది.-నింద
కఠినం నమఃశివాయ-కరుణం నమః శివాయ
కదనం నమః శివాయ-కథనం నమః శివాయ.
స్మరణాత్ అరుణాచలే అభయం అభయం
మననాత్ రమణ మహాన్ మధురం మధురం
అరుణం పోట్రి- రమణం పోట్రి
సెల్వం పోట్రి-బిల్వం పోట్రి (మంగళం)
నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ.
సంపూర్ణ వివరణ చేయ లేని నా అశక్తతను స్వామి మన్నించి,మనలనందరిని ఆశీర్వదించుగాక.
" ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండ మావిస్పురత్
జ్యోతిస్పాటిక లింగ మౌళి విలసత్ పూర్ణేందు -వాంతామృతైః
అస్తోకప్లుతమేక మీశ మనిశం రుద్రాయ వాకాన్ జపన్
ధ్యాయేత్ ఈప్సితసిద్ధయే ధ్రువపదం విప్రోభిషించే చ్చివం." పాతాళము నుండి ఆకాశము వరకు విస్తరించియున్న భువన భాండములందు జ్యోతి స్వరూపుడై ఎవరు ప్రకాశించుచున్నాడో,వానిని నా ఈప్సితసిధ్ధికొరకు (ఈప్సితము-సక్రమమైన కోరిక) త్రికరణశుధ్ధిగా ప్రార్థిస్తున్నాను-స్తుతి.
ఏక బిల్వం శివార్పణం
SIVA SANKALPAMU-28
ఓం నమః శివాయ-28
**********************
సారూప్యము-సామీప్యము సాంగత్యమునకు ఆశపడి
నిర్హేతుక కృపనీదని నిన్ను సేవించాలని
కొంచము అటు జరుగమంటే చోటులేదు అంటావు
పోనీలే ఇటు జరుగమంటే వీలుకాదు అంటావు
ఎటు కుదిరితే అటు జరుగమంటే గుటకలు మింగుతావు
స్థపతిని నేనైనా స్థలమునకు అవస్థలంటావు
నాలాంటాడొకడు నన్ను కదలనీయడంటావు
బేలతనము చూపిస్తు జాలిలేక ఉంటావు
ఇబ్బందులు పడుతూనే ఇరుకున కిక్కురు మనవు
సిబ్బందులు చూస్తారని ఇసుమంత సిగ్గుపడవు
సర్వ వ్యాపివన్న సాకుతో నొక్కుతున్న వానిని
తొక్కివేయమేమిరా ఓ తిక్క శంకరా.
శివుడు తను సర్వస్వతంత్రుడనని-సర్వవ్యాపినని చెప్పుకుంటాడు కాని నిజమునకు అటు-ఇటు కొంచమైనను కదలలేనివాడు.పక్కకు తిరగగానే శివునిలాగానే ఉండే మరో మూర్తి శివుని అటు-ఇటు కదలకు అని మందలిస్తుంటాడు.స్థపతి-అన్నిటిని స్థాపించువాడు అని పిలువబడుతున్నప్పటికిని,కొంచం స్థలమును నేను కూర్చునుటకు సంపాదించలేనివాడు.చేసేదేమి లేక తన పక్కనున్నవాడు ఏమిచెప్తే సర్దుకుంటూఇరుకులో ఇబ్బందిపడుతుంటాడుకాని వాణ్ణి పక్కకు తోయలేని వాడు.-నింద.
ఏకం నమః శివాయ-అనేకం నమః శివాయ
సెల్వం నమః శివాయ- బిల్వం నమః శివాయ
నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ
" నమః పూర్వజాయా పరజాయచ"
రుద్రనమకం.
ఒకే సత్-చిత్-రూపము హిరణ్యగర్భ రూపమున పుట్టినదిగను-ప్రళయ కాలమున కాలాగ్ని రూపమున పుట్టినదిగాను భాసించుచున్నది.ముందు పుట్టినది-చివరకు పుట్టినది అనుట దాని లీలయే.నిజమునకు దానికి చావు-పుట్టుకలు లేవు.సత్యం-జ్ఞానం-అనంతం బ్రహ్మ సర్వకాల సర్వావస్థలయందు " నమఃస్తారాయచ" గా సంకీర్తింపబడుచున్నది.
" సంసార సాగరాత్ సర్వ జంతూనాం తారయతీతి తారః" తరుణోపాయమే ఇది.
ఈ సత్-చిత్-రూపము
" సహస్రాణి సహస్ర శో యే రుద్రాధి భూమ్యాం"
దశ రుద్రులుగా మారినప్పుడు దశాక్షరీ మంత్రముగాను,శత రుద్రులుగా మారినప్పుడు శతరుద్రీయ సంహితగాను,సహస్రరుద్రులుగా మారినప్పుడు సర్వలోకానుగ్రహ సకలదేవతా స్తుతిగాను సలక్షణమగుచున్నది.
ఏక బిల్వం శివార్పణం.
SIVA SANKALPAMU-27
ఓం నమః శివాయ-27
***********************
మన్మథబాణము అంటే మాయదారి భయము నీకు
కోపము నటించి వానిని మాయము చేసేసావు.
కోరికలతో కొలుచువారంటే కొండంత భయము నీకు
చేరువుగా రాకుండా పారిపోతు ఉంటావు
అహముతో కొలుచువారంటే అంతులేని భయము నీకు
దారి ఏదిలేక వారికి దాసోహము అవుతావు
సురలందరు కొలువగ కలవరమగు భయము నీకు
అనివార్యము అనియేగ గరళకంఠుడిగా మారావు
ధరించినవాటిని దాచలేని భయము నీకు
జగములు గుర్తించకుండ లింగముగా మారావు
" నమో హిరణ్యబాహవే-సేనాన్యే" అని విన్న,నా
బిక్క మొగమును చూడరా ఓ తిక్కశంకరా.
మన్మథబాణప్రభావమును ఎదిరించలేక పిరికితనముతో మన్మథుని కాల్చివేసాడు.వరములకొరకు తన దరి చేరు వాని నుండి తప్పించుకొనుటకై మద్యపానము చేస్తూ,మగువతో క్రీడిస్తున్నట్లు వారిని భ్రమింపచేసి ,వారిని దూరముగా పంపించివేస్తాడు.(బ్రహ్మను తదితరులను.తప్పనిసరి పరిస్థితులలో పిరికివాడైన శివుడు చప్పుడు చేయక కష్టమైనప్పటికిని వారు చెప్పినదే చేస్తాడు.అంతెందుకు తన దగ్గర నున్న గంగ-జాబిలి-శూలము-లేడి మొదలగు వాటిని ఎవరైన దొంగిలిస్తే,వారినెదిరించుట కష్టమని,ముందరే తాను లింగముగా మారి ఎవరికి ఏమీ కనిపించకుండా చేస్తున్నప్పటికిని,రుద్రము బంగారు చేతులు గల రుద్రా నీ సేనాధిపతివి అని కీర్తిస్తుంటే ,ఆనందంతో అంగీకరిస్తాడు-నింద.
" బీరం నమః శివాయ-వీరం నమః శివాయ
లింగం నమః శివాయ -లీల నమః శివాయ
నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ.
" నమః శూరాయచ-అవభిందతేచ"
రుద్రనమకము.
సకలలోకములు సదాశివుని బాహువులను హిరణ్యబాహవే" అని ప్రత్యేకించి కీర్తిస్తున్నవి.అవి హితమును-రమ్యత్వమును అందించు బాహువులు.
అట్టి హిరణ్య బాహువులు కలిగిన శివుడు జగద్రక్షణ అను యుధ్ధమునకు సేనాని అయినాడు.దుష్టశిక్షణ-శిష్ట రక్షణ అను దీక్షను స్వీకరించినాడు.తత్ఫలితముగా భక్తులయొక్క శత్రువులను అప్రయత్నముగా ఛేదించుచు -అవభిందుడిగా తన శూరత్వము చేత ధర్మమునకుగ్లాని
కలిగించబోవు బాహ్యశత్రువులను-అంతః శత్రువులను అవలీలగ అంతమొందించుచు (త్రిపురాసుర సంహారము)
,లోకకళ్యాణమును గావించుచున్నాడు.-స్తుతి.
ఏక బిల్వం శివార్పణం.
SIVA SANKALPAMU-26
ఓం నమః శివాయ-26
****************
ప్రళయము చూస్తుంటావు-ప్రణవము చేస్తుంటావు
అదృశ్యము చేస్తావు-పంచకృత్యమని అంటావు
అల్లుడిని కానంటావు-ఇల్లరికము ఉంటావు
సన్యాసిని అంటావు-సంసారిగ ఉంటావు
దయనీయుడనంటావు-దహించివేస్తుంటావు
ఎవ్వడు వాడంటావు-ఎదిరించలేడనంటావు
ఎడమకాలితో తన్నుతావు-మడమతిప్పనంటావు
ఎడమకాలు ఎవరిదంటే-తడబడుతుంటావు
నీవు చేయని శిక్షణను-నీవే చేసానంటావు
అమ్మ చేయుచున్న రక్షణను-అంతా దాచేస్తావు
మక్కువ అంటూనే అమ్మను-నువ్వు తక్కువగా భావించే
కక్కూర్తి వాడవటర నీవు ! ఓ తిక్కశంకరా.
శివుడు జగములు జలమున మునిగిపోతుంటే చేతకానివాడై కళ్ళుమూసుకొని జపము చేసుకుంటాడు.దక్షుడికి నేను ఇప్పుడు అల్లుడిని కానని,నమస్కరించకుండా,ఎప్పుడు కైలాసములోనే ఇల్లరికము ఉంటాడు.దయార్ద్రహృదయుడనని అంటూనే దహించివేస్తుంటాడు. ఎడమకాలితో శత్రువులను తరిమికొడుతు,మడమతిప్పని ధైర్యము కలవాడనని అంటాడు.సర్వము సతి చేస్తుంటే,దానిని చెప్పకుండా అంతా తానేచేస్తున్నానని చెప్పుకుంటాడు.ఎడమకాలి ప్రసక్తి వస్తే తడబడుతుంటాదు-నింద.
శివాయ నమః శివాయ-శివాని నమః శివాయ
సన్నుతి నమః శివాయ-సద్గతి నమఃశివాయ
నమః శివాయ నమ: శివాయ ఓం నమః శివాయ.
"ప్రపంచ సృష్ట్యున్ముఖ లాస్యకాయై
సమస్త సంహారక తాండవాయై
జగజ్జనన్యై జగదేక పిత్రే
నమః శివాయైచ నమః శివాయ"
అర్థనారీశ్వర స్తోత్రము.
లలితనృత్యమును చేయు తల్లి పాదము-దుష్టతాడనము చేయు స్వామి తాండవ పాదము జగత్కళ్యాణకారకములైన సచ్చిదానంద స్వరూపమే.-స్తుతి.
ఏక బిల్వం శివార్పణం.
SIVA SANKALPAMU-25
ఓం నమ: శివాయ-25
*********************
శ్రీకరుడౌ శివునికి కరివదనుని ప్రస్తుతి
షదక్షరీ మంత్రధారికి షణ్ముఖుని ప్రస్తుతి
ఆనంద తాండవునికి ఆ నందిముఖుని ప్రస్తుతి
హరోం హర దేవునికి హయ వదనుని ప్రస్తుతి
శుభకర శంకరునికి శుకవదనుని ప్రస్తుతి
శితికంఠ వదనునికి సిమ్హవదనుని ప్రస్తుతి
కపర్ది నామధారికి కపివదనుని ప్రస్తుతి
మేనక అల్లునికి మేషవదనుని ప్రస్తుతి
ఆపదోద్ధారకునికి ఆ పతంజలి ప్రస్తుతి
బ్రహ్మాండ నాయకునికి బహు ముఖముల ప్రస్తుతి
నాపై కరుణచూప నీవు సుముఖముగా లేకుండుట,నీ
టక్కరితనమేరా ఓ తిక్క శంకరా
..వినాయకుని ఏనుగుతల,తుంబురుని గుర్రముతల,శుక మహర్షి చిలుకతలనరసిమ్హస్వామి సిమ్హపుతల,నారదుని కోతి తల,దక్షుని మేకతల,పతంజలి మనిషితల..పాము శరీరము,కుమారస్వామికి ఆరుతలలు.వీరిలో ఎవరు పరిపూర్ణ మానవరూపముతో లేరు.తలవేరు-శరీరము వేరు.అయినా శివుడు వారి పూజలను స్వీకరిస్తు పూర్తి మానవరూపములో నున్న నాపూజను స్వీకరించుటకు ఇష్టపడకపోవటము నింద
స్మరణం నమః శివాయ-శరణం నమః శివాయ
అభయం నమః శివాయ-అఖిలం నమః శివాయ
నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ.
"నమో రుద్రాయ ..త తావినే క్షేత్రాణాం పతయే నమ:" రుద్రనమకం.
క్షేత్రములనగా శరీరములు.శరీరములతో జీవుని రూపమున నివసించు దేవుని రూపమును రక్షించువాడు పరమశివుడు.
ఈశానస్సర్వ విద్యానామీశ్వర స్సర్వభూతానాం
బ్రహ్మాధిపతిర్-బ్రహ్మణోఽధిపతిర్-బ్రహ్మా శివో మే అస్తు సదా శివోమ్ .
మంత్రపుష్పము.
బ్రహ్మం అనగా ఉన్నది అను అర్థమును పెద్దలు చెబుతారు.అనేక నామ రూపములతో-స్వభావములతో నున్న సకల జీవులు శివస్వరూపములే అని,వారిని శక్తి వంతము చేయుచున్నది ఈశ్వరచైతన్యమేనని మంత్రపుష్పము వివరించుచున్నది.పశుపతికి పశుముఖముల స్తుతి అభ్యంతకరము కానేకాదు.
.భక్తి ప్రధానముగాని భక్తుల రూపము శివునికి ప్రధానము కాదు.స్తుతి
ఏక బిల్వం శివార్పణం
తక్కువ చూపు
SIVA SANKALPAMU-24
ఓం నమ: శివాయ-24
******************
నేను అభిషేకము చేస్తుంటే అభినివేశము ఏది? అంటావు
నేను దీపారాధనము చేస్తుంటే భక్తి ఉద్దీపనము ఏది? అంటావు
నేను చందనము అలదుతుంటే అలదే చందమా? అంటావు
నేను పూలహారములు వేస్తుంటే పాపపరిహారములా! అంటావు
నేను మహన్యాసము చదువుతుంటే చాల్లే! అపహాస్యము అంటావు
నేను ఆరగింపు చేస్తుంటే పండ్లను ఏరలేదా? అంటావు
నేను హారతులను ఇస్తుంటే సేవానిరతి ఏది? అంటావు
నేను మంత్రపుష్పము అందిస్తే, సంపెంగ పుష్పము అంటావు
నేను సకల ఉపచారములు చేస్తుంటే త్రికరణ ఏది? అంటావు
నేను శక్తి కొలది పూజచేస్తే అనురక్తి లేదు అంటావు
నువ్వు సంతుష్టి చెంది,పరిపుష్టిని అనుగ్రహించేందుకు భక్తి అనే
రొక్కమెంత కావాలిరా ఓ తిక్క శంకరా.
..................................................................................................................................................................................................... కార్తీక సోమవార పూజా విధానములో ఒక భక్తుని శివుడు తనకు దీపమును ఆసక్తితో వెలిగించలేదని గంధమును ఆరాధనతో అలంకరించలేదని,పాపములను శివుడు పోగొడతాడనే వ్యాపార ధోరణిలో పూల హారములను సమర్పించాడని,మంచి ఫలములను ఏరి సమర్పించలేదని
త్రికరణ శుద్ధిగా మహన్యాసమును చదవలేదని,మకరందము లేని సంపెంగ పుష్పమును మంత్ర పుష్పముగా సమర్పించినాడని ఆక్షేపించి ఉపచారములను శివుడు స్వీకరించలేదు.నింద
నియమం నమః శివాయ-నిఖిలం నమః శివాయ
భక్తుడు నమః శివాయ-భర్గుడు నమః శివాయ
నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ.
నీలకంఠుని శిరముపై నీళ్ళుచల్లి
పత్తిరిసుమంత ఎవ్వాడు పారవైచు
కామధేనువు వానింటి గాడి పసర
మొల్ల సురశాఖి వాడింటి మల్లెచెట్టు.
రాజశేఖరచరిత్ర.
నెలరాజును శిఖయందుంచుకొనిన శివుని తలపై ఎవ్వడైన కాసిని నీళ్ళు చల్లి.కొంచము పత్రిని విసిరి వేసిననను పరమ దయాళువైన శివుడు కామధేనువును వాడి ఇంటికి గాడికి కడ్తాడు.కల్పవృక్షమును వారి తోటకు కదిలిస్తాడు.-
సంవిధ అను అంధురాలు ఆకలితాళలేక అన్నమునకై,అటువైపువెళుతున్న ఒక శివభక్తుని కాళ్ళు పట్టుకొనగా,అతని చేతిలోని జలపాత్ర జారి క్జలము సివలింగముపై పడినది.రాలిపడిన మారేడు ఆకును వాసన చూసి ఆహారముకాదని విసిరివేయగానే అది ఆ శివలింగముపై పడినదట.అంతే సర్వపాప క్షయకరం.తల్లి శివానుగ్రహమును పొందినది.-శివ మహా పురాణం.
అల్ప సంతోషి యైన అశుతోషుడు అందరిని అవ్యాజ కరుణతో అనుగ్రహిస్తాడు.స్తుతి. .
.
.
( ఏక బిల్వం శివార్పణం).
SIVA SANKALPAMU-23
ఓం నమ: శివాయ-23
*******************
అరిషడ్వర్గాలను ఆహా నువ్వు బెదిరిస్తుంటే
అహముతో అసురగణము నిన్ను బెదిరిస్తోందా
బ్రహ్మ పుర్రె పట్టుకొని నువ్వు బిచ్చమెత్తుతుంటే
బ్రహ్మర్షులు చిత్రముగా నిన్ను బిచ్చమడుగుతున్నారా
పొంగుచున్న గంగను నువ్వు జటలలో బంధిస్తే
పంచాక్షరి వింతగ నిన్ను పట్టి బంధిస్తోందా
ఆ నందిని కైలాస కాపరిగ నువ్వు నియమిస్తే
బాణుడు శోణపురి కాపరిగా నిన్నే నియమించాడా
పరమ గురుడు శివుడు అని నేను స్తుతులు చేస్తుంటే
అఖిలజగము పరిహసిస్తు విస్తుబోయి చూస్తుందా
బందీలు ఎవరో తెలియని నా సందేహము తీర్చకుంటే
నిక్కము అనుకుంటానురా ఓ తిక్క శంకరా.
,..శివుడు ఆరు శత్రువులను బెదిరిస్తున్నాను అని చెబుతూనే, తన ప్రాణము మీది మోహముతో రాక్షసులనుండి రక్షించుకోవటానికి పరుగులెత్తటమో,చెట్టు తొర్రలలో దాగుటయో చేస్తాడు
తాను యాచకుడిగా ఉంటున్నా బ్రహ్మర్షులకు తాను దాతను అంటాడు."ఓం నమ: శివాయ" అను పంచాక్షరి మంత్రములో తాను బందీగా ఉంటూ,గంగను జటలలో బంధించిన వాడినని పొంగిపోతుంటాడు.తాను బాణాసురుని శోణపురమునకు కాపరిగా ఉంటూ,నందిని తన కైలాసానికి కాపరిగా నియమించానని,నందికి యజమానిని అని చెప్పుకుంటాడు.శివుడు తనుచేసే పనులను ఇతరుల చేత చేయిస్తున్నానని చెప్పుకుంటున్నాడు అని, నింద.
కావలి నమః శివాయ-కాపాలి నమః శివాయ
దైత్యం నమః శివాయ-దైవం నమః శివాయ
నమఃశివాయ నమః శివాయ ఓం నమః శివాయ.
" నమః అశుషేణాయచ-అశురథాయచ
నమః శూరాయచ-అవబింధతేచ."
రుద్రనమకము.
భక్తరక్షణకై శీఘ్రముగా నడచునట్టి సేనలు,రథములు గల రుద్రా నమస్కారములు.భక్తులయొక్క శత్రువులను అప్రయత్నముగా ఛేదించు శూరా! నమస్కారములు.
త్వమేవాహం -నేనే నువ్వు,నువ్వే నేను అన్న తత్త్వముతో అహము-ఇహము,దాత-అర్థి,బంధించిన వాడు-బంధితుడు,కాపరి-యజమాని,స్తుతి-నింద,కీర్తి-అపకీర్తి,భగవంతుడు-భక్తుడు అంతా శివుడేనని స్తుతి.
( ఏక బిల్వం శివార్పణం) .
SIVA SANKALPAMU-22
ఓం నమ: శివాయ --22
******************
"పెద్ద దేవుడనని" అని నీవంటే" మద్ది" తెల్లబోయింది
"అంబే శివుడిని" అని నీవంటే "జంబూ" బెంబేలెత్తింది
"భూత నాథుడిని" అని నీవంటే "చూతము" చూతమంది
"దొడ్డవాడిని" అని నీవంటే " గడ్డి" అడ్డుచెప్పకుంది
"చెలకని వాడను" అని నీవంటే "చెరకు" ఊరుకున్నది
"మీ రేడును" అని నీవంటే "మారేడు" మారాడకున్నది
"ఉబ్బు లింగడిని" అని నీవంటే "కొబ్బరి"నిబ్బరించుకుంది
"నిర్వాహకుడిని" అని నీవంటే "ఉర్వారుకము"నవ్వింది
"యోగిని" అని నీవంటే నీవంటే "రేగి" ఆగి పోయింది
" వృక్షేభ్యో- హరికేశేభ్యో" అని మొహమాటముతో అనగానే
"అన్ని చెట్లు" నీవంటే "అక్కసుతో" పచ్చి అని,నిన్ను
వెక్కిరించాయిరా ఓ తిక్క శంకరా.
భావము
మద్ది చెట్టు,నేరేడు చెట్టు,మామిడి చెట్టు,రేగి చెట్టు,గరిక,చెరకు,మారేడు చెట్టు,కొబ్బరి చెట్టు,దోస పాదు, హరితమునందిస్తుంటే భక్తులు శివుని పచ్చనైన కేశములతో విరాజిల్లు హరికేశునిగా పొగడగానే శివుడు వాటి గొప్పదనమును తనపై ఆపాదించుకొను చున్నాడు-నింద
" నమో రోహితాయ స్థపతయే వృక్షాణాం పతయేనమః."
వృక్షములకు అధిపతియైన రుద్రా! నీకు నమస్కారములు.-రుద్రనమకము.
శ్రీశైల స్థల వృక్షమైన మద్దిచెట్టు,జంబూ ద్వీపముగా ప్రసిద్ధి చెందిన నేరేడు చెట్టు,పావన బదరికా వనముగా రేగి చెట్టు,త్రిగుణాత్మకతతో పువ్వులు లేకుండానే కాయలు అందించే మారేడు చెట్టు,కంచిలో ఆమ్రేశ్వర రూపమైన మామిడిచెట్టు,
అచంచలతకు ప్రతీకయైన కొబ్బరి చెట్టు,తుఫాను సైతము కదల్చలేని గడ్డి,హింసించినను మధురతను ఇచ్చు చెరుకు,మృత్యుంజయ మంత్ర వివరణ యైన దోస పాదు,పరమేశ్వరుని దయచే జగత్పూజ్యములైనవి.
" జైత్రంచమ ఔద్భిద్యంచమే" రుద్రచమకము
.వృక్షగుల్మాదుల ఉత్పత్తియే ఔద్భిద్యం
.సాధకుడు రుద్రుని తనకు ఆధ్యాత్మిక భానలను విస్తరించిన బోదెలు కలిగిన వృక్షములను ప్రసాదించమని,వానిని ఆసరా చేసుకొని సాధన అను తీగెలె పైపకి ఎదుగుతు పోనిమ్మని ప్రార్థిస్తాడు.ఆ చెట్ల సహాయముతో సాధకుడు విషయవాసనలను జయించగల సామర్థ్యమును కోరుకొనుటయే "జైత్రంచమ" శివుడు అనుగ్రహించు ఆధ్యాత్మిక వృక్షము ఆనందబ్రహ్మమును అందించునుగాక.-స్తుతి.
పుష్పం నమఃశివాయ-పత్రం నమశివాయ
వృక్షం నమః శివాయ-లక్ష్యం నమః శివాయ
నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ.
(ఏక బిల్వం శివార్ప
SIVA SANKALPAMU-21
ఓం నమ: శివాయ-21
ఉదారతను చాటగ " అసురుని ఉదరములో నుంటివి"
" గంగిరెద్దు మేళము" నిన్ను కాపాడినది ఆనాడు.
వరముగ కోరాడని " అసురుని హస్తమున అగ్గినిస్తివి"
" మోహిని అవతారము" నిన్ను కాపాడినది ఆనాడు.
భోళాతనమును చాటగ " అసురునికి ఆలినిస్తివి"
" నారద వాక్యము" నిన్ను కాపాడినది ఆనాడు.
ఆత్మీయత అను పేర " ఆ అసురునికే ఆత్మలింగమునిస్తివి"
" గణపతి చతురత" నిన్ను కాపాడినది ఆనాడు
భ్రష్టులైనవారిని "నీ భక్తులు" అని అంటావు
రుసరుసలాడగలేవు "కసురుకొనవు అసురతను"
మ్రొక్కారని అసురులకు " గ్రక్కున వరములు ఇస్తే"
" పిక్క బలము చూపాలిరా" ఓ తిక్క శంకరా.
భావము
శివుడు వరముగా గజాసురుని ఉదరములో నుండెను.తలపై చేయి పెట్టిన వారు భస్మము అగుదురని రాక్షసునుకి వరమిచ్చెను.రావణునికి అర్థాగిని మరియు ఆత్మ లింగమును వరముగా ఇచ్చెను.ఆలోచించకుండా శివుడు అసురులకు వరములిచ్చి ఆపదలలో చిక్కుకునిపరుగులు తీస్తుంటాడు-నింద.
బ్రహ్మాది దేవతలకు తమ భక్తిని చాటుకునే అవకాశం ఇచ్చాడు శివుడు.నారదుని,గణపతిని లోక కళ్యాణ కారులుగా,భక్తులకు" గోకర్ణేశ్వర క్షేత్రమును" అనుగ్రహించాడు.విష్ణువు యొక్క కరుణ అనే జగన్మోహనత్వమును ప్రకటింప చేసిన "పరమ శివుడు" దయా సముద్రుడు.-స్తుతి.
బీరం నమః శివాయ-వీరం నమః శివాయ
రౌద్రం నమః శివాయ-ఆర్ద్రం నమః శివాయ
నమః శివాయ -నమః శివాయ
ఓం నమః శివాయ.
( ఏక బిల్వం శివార్పణం )
SIVA SANKALPAMU-20
ఓం నమః శివాయ-20
*******************
కూడు తినగనీవు-కునుకు తీయగ నీవు
నీరు పారనీవు-నా తీరు మారనీవు
పుర్రె జారనీవు-గొర్రె పెంటికలో ఉంటావు
హాస్యము చూపిస్తావు-వేశ్య చన్నులో ఉంటావు
జన్నములు కానీయవు-అన్నము దొరకగనీవు
జలకమాడనంటావు-జలములో ఉంటావు
కాశి నేను అంటావు-కార్తికము అంటావు
ప్రదోషములో ఆడతావు-అవశేషములను ఏరుతావు
మరుభూమిలో తిరుగుతావు-పరిపాలన జరుపుతావు
పరాక్రమము చూపుతావు-పారిపోతు ఉంటావు
రూపములో ఉంటావు-అరూపిని అని అనే నీ తీరు,
చక్కదిద్దుకోవేమిరా ఓ తిక్క శంకరా.
ఏకభుక్తములు(నక్తము),ఉపవాసములంటు తన భక్తులను అన్నము సరిగా తిననీయడు.అంతటితో ఊరుకోకుండా జాగరణలు చేయమంటు నిద్రపోనీయడు.శుచి-శుభ్రము లేకుండ మేక మలములో,వేశ్యకుచములో కనిపిస్తుంటాడు.శ్మశానములో తిరుగుతూ,పరిపాలన చేస్తున్నానంటాడు.పుర్రెలను వదిలిపెట్టడు.దక్షుని యజ్ఞమును మధ్యలోనే ఆపించివేసాడు.దుర్వాస మహామునికి కాశిలో అన్నము దొరకకుండ చేసాడు.నీటిలో తానున్నప్పటికి బూడిద స్నానము చేస్తు మనలను మాత్రము స్నానములు చేయిస్తుంటాడు.(కార్తిక స్నానములు) క్షేత్రము-కాలమురెండును తానేనంటాదు.ఎటుకాని వేళలలో ఎగురుతుంటాడు.అసలు పధ్ధతి లేనివాడు-నింద.
" ఇందువారే వ్రతం స్థిత్వా నిరాహారో మహేశ్వరాః
నక్తం హౌష్యామి దేవేశ ఏక బిల్వం శివార్పణం."
బిల్వాష్టకం.
ఆహారసిధ్ధి-ఆసన సిధ్ధి-అభీష్టసిధ్ధి సమావిష్కరణమే మానసికావిష్కారమునకు శరీరమును అనుసంధించుకొనుటకు చేయు అభ్యాసములే శివపూజా నియమములు.-స్తుతి.
ఏక బిల్వం శివార్పణం.
SIVA SANKALPAMU-19
ఓం నమ: శివాయ-19
********************
"గంగాధర" అని పిలువగ గంగ తొంగి చూస్తుంది
"ముక్కంటి" అని పిలువగ తిక్క కన్ను పలుకుతుంది
"శశిశేఖర" అని పిలువగ జాబిలి ఊకొడుతుంది
"కపర్ది"' అని పిలువగ కచభారము కదులుతుంది
"నంది వాహన" అనగ ఎద్దు సద్దు చేయకంది
"జంగమ దేవర " అంటే లింగము పలుకలేనంది
"నాగేశ్వర" అనగానే పాము ఆగమంటుంది
"అర్థ నారీశ్వర" అనగానే అమ్మ మిన్నకున్నది
"పశుపతి" అని పిలువగానే పాశమేమిటంటుంది
"ఏక నామధారివి" కావని ఎకసక్కెము చేస్తున్నవి
"శివోహం" అను జపమాపి నేను నిన్ను పిలువగా
"ఒక్క పేరు" చెప్పవేరా ఓ తిక్క శంకరా.
పరమ శివా! గంగాధర,ముక్కంటి,శశి శేఖర,కపర్ది,నంది వాహన,జంగమ దేవర, నాగేశ్వర,అర్థ నారీశ్వర, పశుపతి అని శివుని పిలుస్తుంటే -గంగ,చంద్రుడు,పాములు,జటలు,పాశము,అమ్మ పార్వతి బదులిచ్చుటలో నిర్లక్ష్యము చేశారని నింద.
" గంగా తరంగ రమణీయ జటాకలాపం
గౌరీ నిరంతర విభూషిత వామభాగం
నారాయణ ప్రియమనంగ మదాపహారం
వారాణసీ పురపతిం భజవిశ్వనాథం.
విశ్వనాథాష్టకం.
కరుణాంతరంగుడైన శివుడు,తనను అంటిపెట్టుకుని ఉన్నవారిని తనపేరులో చేర్చుకొని అనుగ్రహించాడని స్తుతి.
SIVA SANKALPAMU-18
ఓం నమ: శివాయ-18
*****************
శశిశీతలకిరణములు నిను సతమతము చేస్తుంటే
గంగమ్మ నెత్తిమీద గజగజలాడిస్తుంటే
అభిషేకపు జలాలు అంతగా ముంచేస్తుంటే
పన్నీటి ధారలు మేము అల్లుకోమ అంటుంటే
చందనాల పూతలు చలి ముల్లులు గుచ్చుతుంటే
చుట్టుకున్న పాములు గుట్టుగ వణికిస్తుంటే
వింజామర గాలుల చలితెమ్మెర సాగుతుంటే
అయ్యో పాపం అంటూ అమ్మ నిన్ను పట్టుకుంటే
సగ భాగము మంచాయె చల్లదనపు అల్లరిలో
చల్లనైన కొండపై చెలువపు అర్థాంగితో నున్న
కొర కొర చూపులతో నిన్ను చలి కొరికేస్తుంటే
కిక్కురుమనవేమిరా ఓ తిక్క శంకరా.
.చంద్రుని వెన్నెల కిరణాలు, గంగా జలాలు,అభిషేక జలాలు, పన్నీటి ధారలు,పాములు,చందనాలు,వింజామర గాలులు,మంచు కొండ చలిని మరింత ఎక్కువచేస్తుంటే,అర్థాంగియైన పార్వతి మీ చలిని తగ్గించాలని ఆలింగనము చేసుకోగా చలి మరింత ఎక్కువైనది.శివునికి చలినుండి తనను ఎలా కాపాడుకోవాలో తెలియదని నింద.
సాక్షాత్ హిమాలయకృత శివస్తుతి స్వామిని,
సృష్టకర్త బ్రహ్మ నీవు-స్థితికర్త హరివి నీవు
వేదప్రకాశము నీవు-వేదవేద్యుడవు నీవు
పండితుడవు నీవు-పండిత గురుడవు నీవు
మంత్రజపములు నీవు-తత్ఫలితములును నీవు
ప్రకటిత అనేకరూప ఆలంబనము నీవు
భక్తులకు ప్రీతికర ప్రత్యక్షము నీవు,
అని కీర్తిస్తుంది
పంచభూతాత్మకుడైన పరమేశ్వరుడు మంచును వేడుకగా భక్తుల ప్రీతికై ధరించి,ప్రకాశిస్తున్నాడు.--స్తుతి.
ఏక బిల్వం శివార్పణం.
.
SIVA SANKALPAMU-17
ఓం నమ: శివాయ-17
**********************
కంటిచూపు ఉన్నది కాల్చుటకు అని నిన్ను చూసి కాబోలు
లంక చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు ఆ హనుమ
ఆలి ఉన్నది అగ్గిలో దూకించుటకే అని నిన్ను చూసి కాబోలు
అయోనిజను కోరె అగ్గి పరీక్ష ఆ రాముడు
అసత్యాల పుర్రెను ఆదరించిన నిన్ను చూసి కాబోలు
అవలీలగ పలికాడు అసత్యమును ఆ ధర్మరాజు
అడగకుండ వరమిచ్చే అలవాటుని నిన్ను చూసి కాబోలు
అంతటి వ్యధను పొందాడు ఆ దశరథ మహా రాజు
పొగడ్తలకు పొంగిపోవు నిన్ను చూసి కాబోలు
కౌరవులకు అపాత్ర ఆదరణను ఇచ్చె ఆ బలరాముడు
ఒక్కొక్కరు చేస్తున్న ఈ నికృష్టపు పనులన్నీ
నిక్కచ్చిగ నీవిరా ఓ తిక్క శంకరా.
......శివుడు కంటితో మన్మధుని కాల్చినాడని అదిచూసి హనుమంతుని లంకా దహనము,శివ పత్ని సతి
దక్ష యజ్ఞ వాటికలో అగ్గిలో దూకుట చూసి శ్రీ రాముని సీత అగ్ని పరీక్ష,పరబ్రహ్మ మూలమును చూసానని అబద్ధము చెప్పిన బ్రహ్మ తలను ధరించి గౌరవించుతచే ధర్మ రాజు అశ్వథ్థామ హత: కుంజర: అని అబద్ధము చెప్పుట,శివుడు వరములను సద్వినియోగ పరచుట తెలియని వారికి వరములు ఇచ్చి కష్టములు తెచ్చుకొనుట చూసి,దశరథుడు తాను అదేపని చేసిదుఖ:పడినాడని,పొగడ్తలకు లొంగి అసురులను ఆశీర్వదించు శివుని చూసి బలరాముడు పొగడ్తలకు లొంగి కౌరవ పక్షపాతి అయినాడని నింద
" కామ దహన కరుణాకర లింగం తత్ప్రణమామి సదాశివలింగం"
కాముని దహించి కరుణచూపినవానికి నమస్కరించుచున్నాను.
బ్రహ్మ మానస పుత్రుడైన మన్మథుడు పుడుతూనే " కం దర్పయని?" అని బ్రహ్మగారిని ప్రశ్నించాడని శివ మహాపురాణ కథనము.ఎవరి మదమును నేనణచాలి అని తండ్రిని ప్రశ్నించినవాడు కనుక కందర్ప నామధేయుడైనాడు.బ్రహ్మగారు తారకాసురుని మదమును తెలియచేసి,వానిని సంహరింపగల కుమార జననమునకై శివపార్వతులను కళ్యాణోన్ముఖులని చేయవలెనని సెలవిచ్చినారట.లోక కళ్యాణమునకై,కానిపనియే అయినను కాదనలేకపోయాడు.గిరిజా కళ్యాణకారకుడైనాదు.ముక్కంటి మూడో కన్నుతాకిడికి భస్మమైనాడు.కాని కరుణాంతరంగుడైన కపర్ది దివ్యశరీరమును ప్రసాదించి,తన గణములలో స్థానము కల్పించి,కాల్చుట-కాచుట కొరకేనని మనకు తెలియచేసినాడు.
ఏక బిల్వం శివార్పణం.
SIVA SANKALPAMU-16
ఓం నమ: శివాయ-16
*******************
సూక్ష్మము నేనంటావు స్థూలముగా ఉంటావు
వీరుడినని అంటావు పారిపోతు ఉంటావు
ఆది నేను అంటావు అనాదిగా ఉంటావు
సన్యాసిని అంటావు సంసారిగ ఉంటావు
పంట భూమినంటావు బీడునేలవవుతావు
జలాశయమునంటావు ఒయాసిస్సువవుతావు
రాజుని నేనంటావు బంటుగా మారుతావు
ప్రణవము నేనంటావు ప్రళయముగా మారుతావు
స్థాణువు నేనంటావు తాండవమాడుతుంటావు
అనుక్షణము సాగుతావు ఆరునెలలు దాగుతావు
దాగుడుమూతలు చాలుర కుదురు లేకుంటేను
వెక్కిరింతలేనురా ఓ తిక్క శంకరా.
శివుడు చెప్పేది ఒకటి,చేసేది మరొకటి.విరుద్ధ స్వభావములు కలవాడు-నింద.
"కృష్ట పచ్యంచమే-అకృష్టపచ్యంచమే" రుద్రచమకము.
రుద్రా నీవు మా కొరకు దున్నిన పంటభూములయందు-దున్నని బీడు నేలల యందుండి మాకు కూడును-గూడును సమకూర్చి,మా ఆధ్యాత్మిక సాధనను సమర్థవంతము-సఫలీకృతము చేస్తున్నావు తండ్రీ అని స్తుతిస్తున్నది.-
సర్వాంతర్యామి,సర్వ జగద్రక్షకుడు శివుడు అన్నీ తానుగా మారి మనలను,వాటిని రక్షించుచున్నాడు.స్తుతి.
SIVA SANKALPAMU-15
ఓం నమః శివాయ-15
*****************
తిరిపమెత్తువాడవని నిరుపేద శ్రీనాథుడు
గలగల ప్రవహించనీయని గడుసువాడవని గంగ
చరచర పాకనీయవని చతురుడవని కాళము
పరుగులుతీయనీయవని పాశమున్నదని లేడి
క్రిందకు జారనీయవని నిందిస్తున్నది విషము
జరుగలేక ఉన్నానని వంతపాడు జాబిలి
కట్టడి చేస్తున్నావని కట్టుకున్న కపాలములు
హద్దు దాటనీయవని వద్దనున్న వృషభము
ఆ లయకారుడు ఆలయమున ఉంటాడా? అంటూ
మేమెంతో గొప్పవారలమని వంతులవారీగ
నీ చెంతనే ఉంటూ,కాని చింతలను చేస్తుంటే,వాటి
పక్కదారి మార్చవేర ఓ తిక్క శంకరా.
శివుడు బిచ్చగాడు.గంగను ప్రవహించనీయడు.(స్వేచ్చగా)పాములను పాకనీయడు.లేడిని పరుగెత్తనీయడు.చంద్రుని కదలనీయడు.విషమును కంఠము జారనీయడు.ఎద్దును రంకెలు వేయనీయడు.పక్కనే ఉండి తనను నిందిస్తున్నా వాటినేమిచేయలేడు-నింద.
రుద్ర చమకములో చెప్పినట్లు "యంతాయచ-ధర్తాయచ" ఎక్కడ-ఏవస్తువులు ఎలా ఉండాలో వాటి స్థానమును-స్వభావమును నియంత్రించి-పోషించగల ఆచార్యుడు శివుడు.-స్తుతి.
ఏకబిల్వం శివార్పణం.
SIVA SANKALPAMU-14
ఓం నమః శివాయ-14
****************
కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యములను
అరిషడ్వర్గముల చేతిలో ఆటబొమ్మవైనావు
నీవు ఆదిదేవుడవనుటకు ఏదిరా ఋజువు?శివా
ఆహా! నీ కామము మోహినిని తల్లిగా చేసినది
అయ్యో! నీ కోపము కాముని కాల్చివేసినది
అమ్మో నీ లోభము చల్లదనపు ముల్లైంది
ఔరా! నీ మోహము భృంగిని అవమానపరచినది
అదిగో! నీ మదము సతీవియోగమునుచేసినది
అబ్బో! నీ మత్సరము సుతుని సంహరించినది
భద్రతను కలిగించే ఆ రుద్రుడివే నీవైతే
శుభముల ప్రతిరూపమగు ఆ శంభుడవునీవైతే
నీ లెక్కలు తెలుపరా ఓ తిక్క శంకరా.
శివుడు కామముతో మోహిని వెంటపడ్డాడు.కోపమూనకు అధీనుడై మన్మథుని కాల్చివేసాడు.లోభముతో చల్లదనముతో తనను బాధించుచున్నను,మంచు-గంగ-పాములు-గజచర్మము-హిమజనూ వదలేక చలితో వణూకుతు ఉంటాడు కాని వాటిని విడిచిపెట్టడు.పత్నీవ్యామోహితుడై విచ్చేసిన భృంగి మహామునిని స్వాగతించి,సపర్యలు చేయలేదు.నా అంతటి వాడికి దక్షయజ్ఞ ఆహ్వానము లేదన్న మదముతో సతిదేవితో దక్షయజ్ఞమునకు వెళ్ళలేదు.కైలసములో తనను అడ్దగించగలుగు మరోవ్యక్తిని చూసి అసూయతో (కన్నకొడుకును) సంహరించాడు.శివుడు అరిషడ్వర్గములను జయించలేక అవిచెప్పినట్లు ప్రవర్తించాడు_ నింద.
"శం కరోతి ఇతి శంకర." సుభమును కలుగచేయువాడు శంకరుడు.స్వామి ప్రకటిత అరిషడ్వర్గ చేష్టలు ప్రసాదగుణభరితములై
సకల జగములను అనుగ్రహించుచున్నవి.- స్తుతి.
ఏక బిల్వం శివార్పణం.
SIVA SANKALPAMU-13
ఓం నమః శివాయ-13
*********************
అమ్మ గర్భశిశువు వలె,అలలలోని జలము వలె
పాప నోటి పంటి వలె,పాలలోని వెన్న వలె
చేనులోని పంట వలె,మేనులోని మేధ వలె
భూమిలోని నీటి వలె,భూరుహుముల పండు వలె
ఆయువగు గాలివలె, సాయమగు జాలివలె
వ్యక్తమవని శక్తివలె,వ్యక్తి లోని యుక్తి వలె
కొయ్యలోని బొగ్గు వలె,కొమ్మలోని పువ్వు వలె
సూక్ష్మమైన స్థూలము వలె,స్థూలములోని సూక్ష్మము వలె
స్థాణువున చలనము వలె,సాధించిన సంకల్పము వలె
గుడ్డులోని పిట్ట వలె,విడ్దూరపు భూభ్రమణము వలె
విత్తులోని చెట్టు వలె,చిత్తులోని పట్టు వలె
నక్కినక్కి చూస్తావురా ఓ తిక్క శంకరా
శివుడు పిరికితనముతో తల్లిగర్భములో,అలలలో,పాలలో,పాపనోటిలో,భూమిలో,విత్తులో,చెట్టులో,కొమ్మలో,గుడ్డులో,చిత్తులో దాగి, ఎప్పుడెప్పుడు బయటకు వద్దామా అని తొంగితొంగి చూస్తుంటాడు--నింద
.
" వ్యక్తావ్యక్త స్వరూపాయ వామదేవాయ తేనమః".
వామదేవ నామియైన శివుడు సకలచరాచరసృష్టి విధానమునకు నియామకుడై,ఒక నిర్ణీతక్రమములో నడిపిస్తు, మనలను అనుగ్రహించుగాక.-స్తుతి.
ఏక బిల్వం శివార్పణం.
SIVA SANKALPAMU-12
ఓం నమ: శివాయ -12
****************
చేతులార పూజసేయ చెంతకు రావాలంటే
చెట్టువు కమ్మంటావని చెప్పలేని భయం
కనులారా దర్శించి కొలవాలనుకుంటేను
కుక్కవు కమ్మంటావని ఎక్కడో భయం
పాహి పాహి అంటూ పాదములు పట్టుకోవాలంటే
పాముగ మారమంటావని పాపిష్ఠి భయం
తోడుగ ఉండమని వేడుకోవాలంటేను
కోడివి కమ్మంటావని నీడలా ఏదో భయం
హరహర మహదేవుడని వరముకోరుకోవాలనుకుంటే
శరభము కమ్మంటావని నరనరములలో భయం
అభయము అడగాలంటే అడుగడుగున భయము నాకు
బిక్కుబిక్కునున్నానురా ఓ తిక్క శంకరా.
భక్తుడు పూజలు చేయుటకు శివుని సమీపించాలంటే మద్ది చెట్టుగానో,కుక్కగానో,పాముగానో,కోడిగానో,శరభము గానో (పక్షి శరీరము-సింహపుతల)శివుడు మారి పొమ్మంటాడని,భయమని నింద.
1.శ్రీశైలములో శివుడు తెల్ల మద్ది చెట్టు రూపములో (మల్లికార్జున స్వామిగా భక్తుల పూజలను,ప్రదక్షిణములను అందుకుంటు,అనుగ్రహిస్తున్నాడని,(చెట్టు నేపథ్యము)
2.కాశిలో ( నేపాలు,ఉజ్జయిని మొదలగు ప్రదేశములలో) శివుని గోటి నుండి జనించి,నాలుగు వేదములు నాలుగు కుక్కలుగా అనుసరించుచుండగా,బ్రహ్మ రాక్షసుల పీడ (మన మనసుకు పట్టిన పీడ) తొలగించుచు మనలను రక్షించు చున్నాడని,(కుక్క నేపథ్యము)
3.ఆదిశేషుని అనుగ్రహించిన ఆదిదేవుడు కుంభకోణములో జ్యోతిర్లింగముగా ప్రకాశించుచున్న నాగేశ్వరస్వామి మనలను రక్షించు చున్నాడని,(పాము నేపథ్యము)
4.పిఠాపురములో (పాద గయ) గయాసురుని శరీరమును యజ్ఞవాటిక చేసి,ధర్మ సంస్థాపనకై కోడి రూపమును ధరించి,(మన మానసిక అజ్ఞాన నిద్రనుండి మేల్కొలుపుచు)కుక్కుటేశ్వరుడై మనలను రక్షించు చున్నాడని,(కోడి నేపథ్యము)
5.మనలోని ఉగ్రత్వమును తొలగించి,శాంత స్వభావమును వ్యాపింప చేయుటకు,అతి తక్కువ సమయము ఉన్న ఉగ్ర నరసింహదేవుని శాంతింపచేసిన శివుడు తమిళనాడులో శరభేశ్వర స్వామియై సకల శుభములను అందచేయుచున్నాడని స్తుతి.
( ఏక బిల్వం శివార్పణం)
SIVA SANKALPAMU-11
ఓం నమః శివాయ-11
******************
పాట పాడుచు నిన్నుచేర పాటుపడుచు ఒక భక్తుడు
నాటకమాడుచు నిన్నుచేర పోటీపడుతు ఒక భక్తుడు
నాట్యమాడుచు నిన్ను చేర ఆరాటపడే ఒక భక్తుడు
కవిత వ్రాయుచు నిన్నుచేర కావ్యమైన ఒక భక్తుడు
తపమాచరించుచు నిన్ను చేర తపియించుచు ఒక భక్తుడు
ప్రవచనముల నిన్ను చేర పరుగుతీయు ఒక భక్తుడు
చిత్రలేఖనముతో నిన్నుచేర చిత్రముగా ఒక భక్తుడు
నిందిస్తూనే నిన్నుచేర చిందులేయు ఒక భక్తుడు
నిలదీస్తూనే నిన్నుచేర కొలిచేటి ఒక భక్తుడు
అర్చనలతో నిన్నుచేర ముచ్చటించు ఒక భక్తుడు
ఏ దారిలో నిన్ను చేరాలో ఎంచుకోలేని ఈ భక్తుడు,నువ్వు
నక్కతోక తొక్కావురా ఓ తిక్క శంకరా.
నక్కతోక తొక్కటం మీద అనేక కథలు ఉన్నప్పటికి వాటి సారాంశము ఒక్కటే.కష్టపడకుండా అదృష్టముతో చాకచక్యముగా ఐశ్వర్యవంతులుగా మారటం.శివుడు ఎవరిని అడగకుండా,ఏమి కష్టపడకుండా ఇన్ని విధములైన ఇంతమంది భక్తులను పొంది ఐశ్వర్యవంతుడైనాడని నింద.
ఈశ్వరుడు అను పేరులోనే ఐశ్వర్యము కలవాడు అని మనకు తెలుస్తోంది.పరమేశ్వరుడు భక్తితో ఆడినా,పాడినా,నర్తించుచు కీర్తించినా,చిత్తరువులు చిత్రించినా,కవితలు చెప్పినా,ప్రవచనములు అందించినా,నిందించినా,నిలదీసినా,అర్చించినా ఏమిచేయాలో అని ఆలోచించు చున్నా,పఠించినా,వినినా-ఉద్దేశ్యపూర్వకముగానైనా,కాకతాళీయము(ఒక కాకి తాటిపండు పడే సమయానికి చెట్టుమీద వాలినది.తన సహాయము వలనే తాటిపండు కిందపడిందనుకుందట.) అటువంటి భావాలు కల భక్తులను కూడా ఏ మార్గములోనున్న భక్తులను శివుడు కరుణతో అనుగ్రహిస్తాడని స్తుతి.)
" పురాణే మంత్రే వా స్తుతి నటన హాస్యేష్వ చతురః" శివానంద లహరి. పురాణములు-మంత్రములు-స్తుతులు-నటనలు-చతురోక్తులు మొదలగునవేవి తెలియని వాడను.నేనెటువంటి వాడినో/దానినో అంతా తెలిసిన పశుపతి నన్ను కృపతో పాలింపుము.
ఏక బిల్వం శివార్పణం
SIVA SANKALPAMU-10
ఓం నమః శివాయ -10
******************
శివుని తల్లి బెజ్జమహాదేవి అంటున్నారు
శిలాదుడు తండ్రియని నేను వింటున్నాను
శివుని అక్క మగాదేవి గారాబము చేస్తుందట
శివుని పత్ని పార్వతి పరిపాలించేస్తుందట
గణపతి-గుహునితో పాటుగ నీకెందరో సుతులట
శివుని సఖుడు హరి అట చెప్పుకుంటున్నారు
శివభక్తిని పశు-పక్షులు చాటిచెప్పుతున్నాయి
శివలీలలు యుగయుగము కనువిందు చేస్తున్నాయి
భావనలో నిండినది బహుచక్కని కుటుంబము
"బ్రహ్మజ్ఞానవళీయము" బహుచక్కగ చెబుతున్నది
"అసంగోహం-అసంగోహం-అసంగోహం-పునః పునః"
టక్కరి మాటలురా ! ఓ తిక్క శంకరా.
శివునికి తల్లి-తండ్రి,భార్యా-బిడ్డలు,భక్తులు-స్నేహితులు ఉన్నప్పటికిని,నేను ఏ సంబంధము లేనివాడిని అని చెబుతుంటాడు--నింద.
"ఘట కుడ్యాదికం సర్వం-మృత్తికా మాత్ర ఏవచ
తత్వద్ బ్రహ్మ జగత్ సర్వం-ఇతి వేదాంత డిండిమః."
కుండలు-పాత్రలు-గోడలు-ఇటుకలు మొదలగు వానిలోని మూలపదార్థము మట్టియే అయినప్పటికిని,మనకు వివిధ వస్తువులుగా కనిపిస్తాయి.అదే విధముగా మూల పదార్థమైన బ్రహ్మము శుధ్ధ చైతన్యము,శాశ్వతానంద రూపము మాయచే కప్పబడిన వారికి వేరు వేరు రూపములుగా గోచర్మవుతుందని వేదాంత డిండిమ అను మహాగ్రంథము వివరిస్తున్నది.-స్తుతి.
ఏక బిల్వం శివార్పణం.
SIVASANKALPAMU-09
ఓం నమ: శివాయ-09
భక్త పరాధీనతతో బడలిపోయి ఉన్నావని
నక్తపు నియమాలతో నకనకలాడుతున్నావని
భక్ష్యభోజ్య చోహ్యములు,లక్షణమగు లేహ్యములు
చవులూరు చెరకు రసము,ఆహా అను అతిరసములు
నారికేళ జలాలు,నానా తినుబండారాలు
మధురస మామిడిపళ్ళూ,మంచి నేరేడు పళ్ళు
చక్కెరకేళి పళ్ళు,చక్కనైన ద్రాక్షపళ్ళు
ఆరు రుచుల ఆథరువులు ఆత్మీయ సమర్పణలు
పోషణలేక నీవు సోషతో సొక్కిపోతావని
మక్కువతో తినిపించగ గ్రక్కున నేను వస్తే
విషము రుచి నీకంత విపరీతముగా నచ్చిందా
ఒక్కటైన ముట్టవేర ఓ తిక్క శంకరా.
భావము
ఒక్కపూట ఆహారముతో (నక్తము) శివుడు నీరసముగా,చిక్కిపోయి ఉన్నాడని,అనేక మథుర పదార్థాలను సమర్పించుదామని,తినిపించుదామని భక్తుడు వస్తే,శివుడు వాటిని స్వీకరించుటలేదు-నింద.
పరమేశ్వరుడు సర్వజనుల మేలుకొరకు మథురస పదార్థములకన్న విషము స్వీకరిచడానికి సంసిద్ధుడైనాడని స్తుతి.
( ఏక బిల్వం శివార్పణం )
SIVA SANKALPAMU-08
ఓం నమ: శివాయ-08
కాదనలేవుగ పాముని,కాదనలేవుగ చీమని
కాదనలేవుగ లేడిని,కాదనలేవుగ వేడిని
కాదనలేవుగ దండని,కాదనలేవుగ కొండని
కాదనలేవుగ తేటిని,కాదన లేవుగ నీటిని
కాదన లేవుగ బూజుని,కాదనలేవుగ బూదిని
కాదన లేవుగ మేథని,కాదన లేవుగ వ్యాధిని
కాదనలేవుగ గౌరిని,కాదనలేవుగ శౌరిని
కాదనలేవుగ సుతులని,కాదనలేవుగ నుతునులని
కాదన లేవుగ విందుని,కాదనలేవుగ విందుని
కాదనలేవుగ మునులని,కాదనలేవుగ జనులని
ఒకే ఒక్కసారి నిన్ను ఒక్కడినే రమ్మంటే,ఈ
తొక్కిసలాటేమిరా ఓ తిక్క శంకరా
...............
శివా నువ్వెక్కిడికైనా వెళ్ళాళంటే నీతో పాటు పాముని,చీమని,అగ్గిని,లేడిని,పూలదండలుగ మారిన భక్తులని,మంచు కొండని,అమ్మవారి తుమ్మెదలవంటి జుట్టుని(అర్థనారీశ్వరము)నీ జడలలోనున్న గంగని,సాలె పురుగు నీకై నేసిన బూజుని,మన్మథుని శరీరము నుండి వచ్చిన బూడిదని,దక్షిణా మూర్తిగా మేధను,భక్తుల వ్యాధిని,కొడుకులను,పొగడ్తలనుమునులను,జనులను విందుకు పిలిచిన భక్తుని దగ్గరకు తీసుకెళ్తాడని నింద.వాటికి,శివునికి భేదములేదని స్తుతి.
SIVA SANKALPAMU-07
ఓం నమ: శివాయ-07
******************
కృతయుగము వాడివి అనిచెప్పి కృతకృత్యులైన వారు కొందరు
త్రేతాయుగము వాడివని తేల్చేసిన మరికొందరు
ప్రాచీన గోచరుడివి అనిచెప్పే ఆచార్యులు కొందరు
ద్వాపరము వాడివి అని చెప్పిన దార్శనికులు కొందరు
శతాబ్దముల వాడివి అని చెప్పే లబ్ధ ప్రతిష్టులు మరి కొందరు
తరతరాల పురాతనమే అన్న పండితులుకొందరు
పరమ ముసలివాడివి అన్న ప్రళయ సాక్షులు కొందరు
అబ్బో కాలాతీతుడు అని నీ తెలివిని పొగిడే కొందరు
"నమ: శివాభ్యాం నవ యవ్వనాభ్యాం" అని అన్నారే అనుకో
నవ్వుకుంటు విని దానిని నువ్వు చిందులేస్తుంటే
పరుగులు తీసే వయసును నువు మరుగున దాచేస్తున్నావని
ఒక్కటే గుసగుసలు ఓ తిక్క శంకరా.
శ్రీ ఆదిశంకరాచార్యుల వారు ఉమా మహేశ్వర స్తోత్రములో శివుని నవయవ్వనుడు అనగానే,తాను ఎప్పటినుండియో ఉన్నప్పటికి తన వయసును దాచేసి,సంతోషముతో శివుడు నాట్యము చేస్తున్నాడని నింద.
"నమో పూర్వజాయచ-పరజాయచ" శివుని తాపై అభరణమైన చంద్రవంక,చేతిలోని పుర్రె శివుని కాలాతీత తత్త్వానికి సంకేతములుగా సంకీర్తించుచున్నవి.
(ఏక బిల్వం శివార్పణం)
SIVA SANKALPAMU-06
ఓం నమః శివాయ-06
****************
జలచరముల ఎంగిలిజలములు అభిషేకములు
ఝంకారములు వినిన మల్లియలు అలంకారములు
లాలాజలమున తడిసి, మేలైనవి మంత్రములు
గాలివాటమునకు కదిలి గుబాళించు పరిమళములు
హృద్యమో/చోద్యమో చెంచులు పంచుతున్న ప్రసాదములు
ముంతలు-వింతలు-వంతలు-ఇంతే సంగతులు
నీదికానిదేదైనా నీకు నైవేద్యము చేయాలిగా
నిన్ను ధ్యానించమనిన తనపని కాదంటుంది
నిలకడగ ఉండమనిన అటు-ఇటు పరుగిడుతుంది
వద్దన్న పనులుచేస్తు,తనను ముద్దాడమంటుంది
బుధ్ధిలేక ఉంటుంది-హద్దు మీరుతుంది,నా
తైతక్కల మనసు నీది ఓ తిక్కశంకరా.
శివునికి ఎంగిలి నీళ్ళ అభిషేకము,ఎంగిలి పూలమాలల అలంకారము ఇష్టము.మంచి-చెడు వాసనలను సమముగా స్వీకరించు గాలి తెచ్చిన పరిమళములు ఇష్టము.అంతే కాదు చెంచులు అందించు మద్యమాంస సమర్పణము ఇష్టము.నైవేద్యముగా స్వీకరించి వారికి ప్రసాదమును అందిస్తాడు.వారి మాటలకు తాన-తందాన అని వంత పాడుతాడు.అట్తి శివుని నా తైతక్కలమనసే సరియైన నైవేద్యము.-నింద
" నమో విరూపేభ్యో-విశ్వరూపేభ్యశ్చః" నమో నమః.మనము ఏది వికారరూపము అనుకుంటామో-విశిష్ట రూపము అనుకుంటామో-విశ్వము అనుకుంటామో అన్నియును రుద్రుని రూపములే.జలము-జలములోని జలచరము.పూవు-పూవు మీద వాలిన తుమ్మెద,పరిమళము-దానిని వ్యాపింపచేయు వాయువు,చెంచు-చెంచు చేయు పూజ అన్నియును శివస్వరూపములే.స్వామి కరుణయే పదార్థమును ప్రసాదముగా మలచుచున్నది.స్వామి నా తైతక్కల మనసును స్పృశించి,దానికి ఆధ్యాత్మిక అనుభవమును అనుగ్రహించు.నమస్కారములు.-స్తుతి.
ఏక బిల్వం శివార్పణం
SIVA SANKALPAMU-05
ఓం నమః శివాయ-05
******************
తిండిధ్యాస నేర్పావు తినమంటు చీమకి
దాచుకుంటుంది తప్ప దానమేది దానికి
భిక్షాటన నేర్పావు శిక్ష అంటు పుర్రెకి
అడుక్కుంటుంది తప్ప ఆతిధ్యమేది దానికి
పట్టుబడుట నేర్పావు పరుగుతీయు లేడికి
కవి చమక్కులు తప్ప కలిసొచ్చినదేమి దానికి
పొర విడుచుట నేర్పావు కుబుసముల పాముకి
పైపై అందములు తప్ప పరమానందమేది దానికి
పంచుకొనుట నేర్పావు మాతల్లి పార్వతికి
గురుదక్షిణ సగమైతే సగభాగమే మిగిలినది
పరిహాసపు గురువు నీవు పరమగురువుల
లెక్కలోకి రావురా! ఓ తిక్క శంకరా.
శివుని కరుణతో చీమ గింజగింజ పోగుచేసుకొంటున్నది.పుర్రె భిక్షాపాత్రగా మారినది.లేడి పరుగులు ఆపివేసినది.తల్లి స్వామికి తన సగభాగమును అర్పించి అర్థనారీశ్వరిగా మారినది-.నింద
సర్వాంతర్యామి యైన సదాశివుడు ఉపాధులను అనుసరించి ప్రతి జీవికి కొన్ని ప్రత్యేకలక్షణములను ప్రసాదించినాడు.దేని ప్రత్యేకత దానిదే.చీమలో ముందు చూపు,పుర్రెలో కాల సంకేతము,( అవి బ్రహ్మ పుర్రెలు) పాములో సస్వరూపము,లేడిలో స్థిరచిత్తము,తల్లిలో మూలప్రకృతి తత్త్వమును వివరించుచు,ఏ వేదంబు పఠించె లూత"
స్వామి చరణసేవా సన్సక్తియే గాని ఉపాధి కాదని సద్గతికి చాటినాడు.-స్తుతి.
SIVA SANKALPAMU-04
ఓం నమ: శివాయ -04
****************
నెత్తిమీది గంగతప్ప నెత్తుటి బంధము ఏది
పొత్తు నీకు హరికితప్ప పొత్తిళ్ళలో సుఖము ఏది
లలాటమున కన్ను తప్ప బాలానందములు ఏవి
హెచ్చైన ఎద్దు తప్ప అచ్చట ముచ్చటలు ఏది
పిలవని పేరంటము తప్ప పెళ్ళికి సందడి ఏది
దక్షుని నిర్లక్ష్యము తప్ప లక్షణ మర్యాద ఏది
మింగుడుపడని విషము తప్ప మెరుగు అగు సంగతులేవి
పుక్కిటి పురాణములు తప్ప పురుషార్థములు ఏవి
అపాత్ర వరములు తప్ప ఈషణ్మాత్రపు ఈవి ఏది
పరుగుతీయు భయము తప్ప పరమపదము నీకు ఏది
లయముచేయు లయ తప్ప నాకు వలయునది లేదని,నే
నొక్కి చెప్పాలిరా ఓ తిక్క శంకరా.
శివునికి రక్త సంబంధీకులు లేరు .అమ్మ పొత్తిళ్లలో పరుండలేదు.చిన్నపిల్లల ఆటపాటలు లేవు.పెరుగుచున్నప్పుడు జరుగు ముద్దుముచ్చటలు జరుగలేదు.పెళ్ళికి దక్షుని ఆహ్వానము లేదు.కనుక మగపెళ్ళివారి సందడి లేదు.అత్తింటి మర్యాదలు లేవు.మింగక దాచిన విషము తప్ప చెప్పుకోదగ్గ విశేషములు లేవు.కాలక్షేప పురాణములే కాని కైవల్యమును ఈయలేవు.శివుడు అర్హత లేని వారికి వరములు ఇచ్చుటచే కొంచమైనను కీర్తిలేదు.తన వర ప్రభావమునకు తానే భయపడి పరుగులు తీయు శివుడు పరమపదమును ఎలా అందీయ గలడు?లయ ప్రథానముగా ఆడుచు లయముచేయు శివుని వద్ద భక్తునికి కావలిసినది లేదని భక్తుని మాట - నింద.
గిరిజా కళ్యాణము సదాశివుని లీల.మన కొరకు ధరించిన లీలా మానుషరూపము కాని రక్త-మాంస శరీరము కాదు.
జననము,జాడ్యము,జర(ముసలితనము) లేని శివుడు గుణాతీతుడు,కాలాతీతుడు,భక్త పరాధీనుడు.తన వరములద్వారా గ్రహీతలకు తరుణోపాయమును సూచించుటయే చమత్కారము. అని - స్తుతి.
ఏక బిల్వం శివార్పణం.
SIVA SANKALPAMU-03
ఓం నమః శివాయ-03
***************
చక్కదనపు నలుగునిడి స్నానము చేయిద్దామనుకుంటే
పుక్కిలింత నీళ్ళతో సొక్కిపోయి ఉంటావు
పట్టుపుట్టాలు నీకు కట్టాలనుకుంటేను
గట్టిగా విడువనంటు చుట్టుకుంది పులితోలు
కనకభూషణములను కంఠమున వేయాలనుకుంటేను
కాలకూటవిషపు పాము కౌగలించుకుందాయె
ప్రేమతో పరమాన్నమును తినిపిద్దామనుకుంటేను
పచ్చిమాంసపుముక్క పచ్చి అనక ఉందాయె
పక్కింటి వాళ్ళతో ఆడుకోమంటేను
నాకు పక్కిల్లే లేదని వెక్కివెక్కి ఏడుస్తావు
ఎవరు నీకులేరనువారికి ఎరుకచేయి నిజమును
అక్కను నేనున్నానని ! ఓ తిక్క శంకరా!.
శివుడు (కన్నప్ప) నీళ్ళను పుక్కిలించి ఇదే అభిషేకముగా స్వీకరించమంటే సరేనన్నాడు.పచ్చిమాంసమును సమర్పిస్తే నైవేద్యముగా స్వీకరించాడు.బూదిపూతలతో పులితోలును వస్త్రముగా కట్టుకుని ఉంటాడు.ఇల్లు-వాకిలి లేనివానికి పక్క ఇల్లు ఎక్కడినుండి వస్తుంది? మొత్తము మీద శివుడు పధ్ధతి లేనివాడు- నింద.
కర్ణాటక లోని ఉడుతడి గ్రామములో సుమతి-నిర్మలశెట్టి దంపతులకు పార్వతీదేవి అంశతో జన్మించినది మహాదేవి.పరిశుధ్ధయోగిని.మహేశ్వర తత్త్వమును మథించిన మహాదేవి. తన కేశములతో దేహమును కప్పుకొని జీవించిన మహాసాధ్వి.బసవేశ్వరుడు-తక్కిన శివభక్తులు ఆమెను గౌరవముతో అక్క అని భావించి,పూజించెడివారు.స్వామి శ్రీశైల మల్లిఖార్జునునిగా కదళీవనములో నున్న జ్యోతిర్లింగములో ఆమెను ఐక్యము చేసి,తరింపచేసినాడు-కరుణాంతరంగుడు.- స్తుతి.
ఏకబిల్వం శివార్పణం.
SIVA SANKALPAMU-03
ఓం నమః శివాయ-03
***************
చక్కదనపు నలుగునిడి స్నానము చేయిద్దామనుకుంటే
పుక్కిలింత నీళ్ళతో సొక్కిపోయి ఉంటావు
పట్టుపుట్టాలు నీకు కట్టాలనుకుంటేను
గట్టిగా విడువనంటు చుట్టుకుంది పులితోలు
కనకభూషణములను కంఠమున వేయాలనుకుంటేను
కాలకూటవిషపు పాము కౌగలించుకుందాయె
ప్రేమతో పరమాన్నమును తినిపిద్దామనుకుంటేను
పచ్చిమాంసపుముక్క పచ్చి అనక ఉందాయె
పక్కింటి వాళ్ళతో ఆడుకోమంటేను
నాకు పక్కిల్లే లేదని వెక్కివెక్కి ఏడుస్తావు
ఎవరు నీకులేరనువారికి ఎరుకచేయి నిజమును
అక్కను నేనున్నానని ! ఓ తిక్క శంకరా!.
శివుడు (కన్నప్ప) నీళ్ళను పుక్కిలించి ఇదే అభిషేకముగా స్వీకరించమంటే సరేనన్నాడు.పచ్చిమాంసమును సమర్పిస్తే నైవేద్యముగా స్వీకరించాడు.బూదిపూతలతో పులితోలును వస్త్రముగా కట్టుకుని ఉంటాడు.ఇల్లు-వాకిలి లేనివానికి పక్క ఇల్లు ఎక్కడినుండి వస్తుంది? మొత్తము మీద శివుడు పధ్ధతి లేనివాడు- నింద.
కర్ణాటక లోని ఉడుతడి గ్రామములో సుమతి-నిర్మలశెట్టి దంపతులకు పార్వతీదేవి అంశతో జన్మించినది మహాదేవి.పరిశుధ్ధయోగిని.మహేశ్వర తత్త్వమును మథించిన మహాదేవి. తన కేశములతో దేహమును కప్పుకొని జీవించిన మహాసాధ్వి.బసవేశ్వరుడు-తక్కిన శివభక్తులు ఆమెను గౌరవముతో అక్క అని భావించి,పూజించెడివారు.స్వామి శ్రీశైల మల్లిఖార్జునునిగా కదళీవనములో నున్న జ్యోతిర్లింగములో ఆమెను ఐక్యము చేసి,తరింపచేసినాడు-కరుణాంతరంగుడు.- స్తుతి.
ఏకబిల్వం శివార్పణం.
SIVA SANKALPAMU-02
ఓం నమ: శివాయ-02
ధర్మాధర్మములా సకలదేవతలారా! ఇవి
నిర్మితము శివునిచే నిమిత్తమాత్రము నేను
మదముతోటి మాటలని నన్ను మన్మథునిగ చూస్తాడో
వదరుబోతు పదములు అని ఆదరమే చూపుతాడో
పుట్టుట-గిట్టుట నడుమ శివుని తిట్టుట అనుకుంటాడో
కట్టుబాటు నేర్పించగ మెట్టుదిగి వస్తాడో
ప్రమథ గణములకు నన్ను పరిచయమే చేస్తాడో
ప్రమదములో ముంచుతాడో-ప్రమాదమే అంటాడో
కాలకూట విషముకన్న కఠినము తానంటాడో
కన్నతండ్రిని అని క్షమించి వదిలేస్తాడో
మితిమీరిన ప్రేమతో తిక్క శంకరుడని అన్నానంటూ
నా పక్కనే ఉంటాడో ఆ తిక్క శంకరుడు.
ద్వంద్వ భావములు నాలో చేరి,నేనే వ్రాసాను అని కాసేభ్రమపడుతు,మరి కాసేపు శివుడే వ్రాసాడు అనికనిపెడుతు,కాసేపు స్తుతియిస్తు, మరికాసేపు నిందిస్తు మాయామోహితుడనైన నన్ను క్షమించి రక్షించుతాడో-కోపించి శిక్షించుతాడో-అంతా ఈశ్వరేచ్చ.
( ఏక బిల్వం శివార్పణం.)
siva sankalpamu-01
ప్రియ శివస్వరూపులారా!
నమస్కారములు.
శివుని కరుణ అర్థముకానిది.కాని శివుని కరుణ అద్భుతమైనది.సత్య-శివం-సుందరము గా కీర్తింపబడుచున్న పరమాత్మస్వరూపము-స్వభావము ఆనందదాయకములు.అభీష్టఫలప్రదములు.ఆధ్యాత్మికసోపానములు.
పాలు-మీగడ,పెరుగు-వెన్న-నెయ్యి ఇలా రూపాంతరములను చెందుతుంది చిలికినప్పుడు.విచిత్రము నెయ్యి పరుకొని ఉన్నా-కరిగించినా నెయ్యిగానే తన రూపములో-స్వభావముతో ఉంటుంది.అదేవిధముగా సుందర సత్యమైన శివతత్త్వమునకు ఆకర్షింపబడినవారు దానినుండి వెనుతిరగలేరు.అది మనలను మహేశ్వరునితో మమేకము చేస్తుంది.దాసుని తప్పులు దండముతో సరి అంటు మనచే ఆడిస్తుంది-పాడిస్తుంది.మనసును జోకొట్టి-బుధ్ధిని నిద్దురపుచ్చి శువుని నిందించేలా చేస్తుంది.తిరిగి మేల్కొలిపి స్తుతించేలా చేస్తుంది.మనసుతో దాగుడుమూతలు ఆడుకుంటు,బుధ్ధిని అందులో భాగస్వామిని చేస్తూ" శివ సంకల్పము" అను "నిందాస్తుతులను" అందచేస్తుంది.సర్వమును తానే అయిన సదాశివుడు తన డమరుకము నుండి లక్షణ అక్షరధారలను కురిపించదలిచాడు.అక్షయ ముక్తిఫలములను పంచుతు మనలను మురిపించనున్నాడు.కాని మధ్యలో నా అహము దూరి అడ్డుపడుతోంది.కనుక దోసిలొగ్గి ఫలములను స్వీకరించి తరించుదాము.నా దోసములను సవరించుదాము.
ఓం నమః శివాయ-01
**********************
ఓం నమ: శివాయ-01
అర్హత ఉందో-లేదో అసలేనేనెరుగను
అర్చన అవునో-కాదో అదికూడా నేనెరుగను
నమక-చమక అంతర్గత గమకము నేనెరుగను
కోట్ల అపచారములో షోడశోపచారములో
అహంకార గద్యమో అపురూప నైవేద్యమో
అశక్తతా కళంకమో భక్తి నిష్కళంకమో
దు:ఖ నివృత్తియో ఇదిసత్కృతియో నేనెరుగను
దుష్ట పరిహారమో ఇది ఇష్ట పరిచారమో
కుప్పల తప్పులు చేస్తూ నే ఒప్పులుగా భావిస్తే
గొప్పదైన మనసుతో నా తప్పిదములు క్షమియిస్తూ
సకల దేవతలతో పాటు సముచితాసనుడివై
సన్నిహితుడుగ మారరా లోక సన్నుత ఓ శంకరా.
భగవత్ స్వరూపులారా!
నన్ను పరికరముగ మలచి ఆ సదాశివుడు తనకు తాను వ్రాసుకొనిన "శివ సంకల్పము" అను 108 నిందా స్తుతులతో కూడిన స్వేచ్చా స్తుతుల సంకలనములో అహము చొరబడి నేను చేసిన తప్పులను సహృదయతతో సవరిస్తారని ఆశిస్తూ,నమస్కారములు.
( ఏక బిల్వం శివార్పణం.)
Subscribe to:
Posts (Atom)
TANOTU NAH SIVAH SIVAM-12
తనోతు నః శివః శివం-12 ***************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...
-
వందనం =========== అంబ వందనం జగదంబ వందనం సంబరాన కొలువుతీరె శక్తి వందనం భవతారిణి భగవతి భక్తి వందనం. పారిజాత అర్చనల పాదములకు వందనం పాప...
-
శార్దూలము... మాతంగి వర్ణన. ఊతం భద్ర సుభద్ర రుద్రరమణీమ్ ఉచ్చిష్ట చండాలినీమ్ భాతిమ్ రోహిత వస్త్ర సంపుటికరీమ్ ...
-
విబుధజనుల వలన విన్నంత-కన్నంత-తెలియపరచు ప్రయత్నము.తప్పులను సవరించి మరింత సుసంపన్నము చేయగలరని ప్రార్థిస్తూ, శివతాండవ స్తుతి భావము. ****...