శ్రీచక్ర ప్రథమావరణదేవతాః
అణిమాసిద్ధే, లఘిమాసిద్ధే, గరిమాసిద్ధే, మహిమాసిద్ధే, ఈశిత్వసిద్ధే, వశిత్వసిద్ధే, ప్రాకామ్యసిద్ధే, భుక్తిసిద్ధే, ఇచ్ఛాసిద్ధే, ప్రాప్తిసిద్ధే, సర్వకామసిద్ధే, బ్రాహ్మీ, మాహేశ్వరీ, కౌమారి, వైష్ణవీ, వారాహీ, మాహేంద్రీ, చాముండే, మహాలక్ష్మీ, సర్వసంక్షోభిణీ, సర్వవిద్రావిణీ, సర్వాకర్షిణీ, సర్వవశంకరీ, సర్వోన్మాదినీ, సర్వమహాంకుశే, సర్వఖేచరీ, సర్వబీజే, సర్వయోనే, సర్వత్రిఖండే, త్రైలోక్యమోహన చక్రస్వామినీ, ప్రకటయోగినీ,త్రైలోక్యమోహన చక్రము
******************
అతిసుందరమైన అమ్మ శ్రీమన్నగరానికి ప్రయాణం మొదలైనది అమ్మ ఆశీర్వచనముగా.నిక్షిప్తముగా నున్న అమ్మదయను ప్రక్షిప్తము చేఉకొనే స్తుతిమాలగా.అదే భవతిమిరములను తుంచివేసే ఖడ్గమాలగా.
బైందవాసన అయిన అమ్మను చేరాలంటే అన్ని మెలికలు తిరుగుతూ ఒకచోట ఒంగుతూ,మరొకచోట ముడుచుకుంటూ,వేరొక చోట ఆకర్షింపబడుతూ,ఇవి నిజమైనవికావని మనకు మనము గ్రహిస్తూ చేరొకోవాలంటే కొన్ని నియమములు,నిర్ణయములు తప్పనిసరియే.
ఇన్నిదారులు ఇంతకట్టడి అనే సందేహము మనకు రావచ్చును.నది ఒకనిర్ణీత క్రమములో ప్రవహిస్తుంటే భూమి సస్యశ్యామలము.కట్టలు తెగి నిబద్ధతలేకుండా పరవళ్ళుతొక్కితే వరదలుభూమికి సంక్షోభము.అదేవిధముగా మనలో అంతర్లీనముగా నున్న శక్తి ఒక నిర్ణీత మార్గములో,పరిమిత పాళ్ళలో పయనిస్తే ఆత్మసాక్షాత్కారము.అదిలోపిస్తే అయోమయము.
సాధకుని ప్రయాణమునకు ప్రారంభస్థానమే త్రైలోక్యమోహనచక్రము.ఇక్కడ 28 మంది అద్భుత శక్తులు ప్రకటయోగినులుగా ప్రస్తుతింపబడుతున్నారు.ఈ ఆవరము మూడు ఊహా చతురస్ర మార్గములతో వివరించబడుతున్నది.
మొదటనున్న మార్గములో అణిమాది సిద్ధిదేవతలు సాధకుడు పాటించవలసిన నిబంధనలను తెలియచేస్తూ ఎక్కడ సూక్ష్మముగా తగ్గి ఉండాలో,ఎక్కడ తనను తాను విస్తరించుకోవాలో,మార్గములోని ఎత్తుపల్లములను చూసుకుంటూ,తలదించుకుంటూ,అవసరమైనపుడు ఎగిరి ఒడిసిపట్టుకుంటూ ముందుకు పోవాలో తెలియచేస్తూ,రెండవ మార్గము వైపునకు మళ్ళిస్తారు.
రెండవమార్గములో నున్న బ్రాహ్మీ,మాహేశి,కౌమారి మొదలగు అదే సప్త మాతృకాశక్తులు,వాటిని సమన్వయ పరుస్తున్న మహాలక్ష్మి శక్తితో పాటుగా కొలువై సాధకునకు మానసిక పటిష్టను చేకూర్స్తూ,మూడవ మార్గము వైపునకు మళ్ళిస్తారు.ఈ రెండుమార్గములలో పయనించిన సాధకుడు తన శారీరక-మానసిక బలముతో మూడవ మార్గములోనికి ప్రవేశించగలుగుతాడు.
మూడవ మార్గములో నున్నవి అత్యద్భుతమైన ముద్రాశక్తులు.అవే సర్వ నామాంకిత సర్వ సంక్షోభిణి,విద్రాఇణి,ఆకర్షిణి,ఆహ్లాదిని మొదలగునవి.
మాతృకాశక్తులు సిద్ధశక్తులను-ముద్రాశక్తులను అనుసంధానము చేస్తూ ,సాధకుని కార్యోన్ముఖునిగా తీర్చిదిద్దుతున్నవి.
ఈ మూడు మార్గముల ఐకమత్యమే త్రైలోక్యమై సాధకుని మోహమును దాటించే వాత్సల్యము.
త్రైలోక్యమోహన చక్రములోని ప్రకటయోగినుల
వాత్సల్యమును పొందిన సాధకుడు చక్రేశ్వరియైన త్రిపురే దేవికి నమస్కరించి,రెండవ ఆవరణమైన"సర్వాశాపరిపూరక చక్రము"లోనికి గుప్తయోగినుల సహృదయతతో ప్రవేశించుచున్నాడు.
శ్రీమాత్రే నమః.