సాహో స్వాతంత్ర్యమా (78)
*****************
శ్రీ పింగళి వెంకయ్యచే మంగళ సంకేతముగా
చెక్కబడిన శిల్పమురా మన చక్కనైన పతాక.
అల్లూరి వీరత్వము, ఆనందుని వివేకము
భారత భాగ్య విధానపు సౌభాగ్యము గాగ
"తాకాలనుకుంటే పీకలు కోసేస్తాం" అను
కర్తవ్యదీక్ష సాక్షి" కాషాయపు రంగు."
బాపూజీ ఆశయాలు, అమ్మ థెరెస్సా ఆచరణలు
తేటతెల్ల పరచుచున్న వెలిసిపోని వెల్లరా
"వందేం అహింసా పరమో ధర్మ:" అను
శాంతి కపోత సంకేతం "తెలుపు రంగు".
పంచభూతములు శుచిగ పంచభక్ష్య రుచులుగ
కర్షకునికి కూతురుగా,క్షుత్తునకు మాతగా
"సుజలాం,సుఫలాం,సస్య శ్యామలాం" అను
పచ్చతోరణపు కుచ్చు మెచ్చుకోలు "ఆకుపచ్చ రంగు."
నిరంతర ప్రయత్నమనే నీలివృత్త నృత్యముతో
వ్యాకులత నిర్మూలనమనే ఆకుల సమానతతో
ధర్మపు నడిబొడ్డుయైన అశోక ధర్మ చక్రముతో
జనగణమన గళముతో జనగణముల మంగళముతో
"జై కిసాన్" పొలముగ,"జై జవాన్" బలముతో
కోటలలో పేటలలో కోటి కోటి కాంతులతో
ఎగురుతోంది పతాక- ఎద నిండిన ఏరువాక.
అమ్మలార రండి రండి-అయ్యలార రారండి
పిల్లా పాపలు అందరు పరుగు పరుగున రండి
శ్రీ పింగళి వెంకయ్య,శ్రీ బంకించంద్ర చటర్జీ
శ్రీ రవీంద్ర నాథుడు, శ్రీ మహమ్మద్ ఇక్బాలు
ఎందరో మహనీయులు కొలువుదీరి ఉన్నారు
"70 వ స్వాతంత్ర జెండాను ఎగురవేద్దాము
అజెండాను తిరిగి వ్రాద్దాము
దేశభక్తి గీతాలను ఆలపిస్తుంటే వారు
ఆలకిస్తారు ఆనంద భాష్పాలతో
దేశభక్తి చేతలను ఆచరిస్తుంటే వారు
ఆశీర్వదిస్తారు హర్షాతిరేకముతో.
జైహింద్