కరాలఫాలపట్టికాధగద్ధగద్ధగజ్జ్వల-ద్ధనంజయాధరీ/ హృతీ కృతప్రచండపంచసాయకే |
ధరాధరేంద్రనందినీకుచాగ్రచిత్రపత్రక-
-ప్రకల్పనైకశిల్పిని త్రిలోచనే మతిర్మమ || 7 ||
భాషాపరముగా గమనిస్తే ప్రస్తుత శ్లోకములో రెండు విరుద్ధ విషయములు త్రిలోచనుడు చేసినట్లు కీర్తించబడ్డాయి.
మొదటిది తన మూదవకన్నును యజ్ఞవేదికచేసి తాను ధనంజయుడై/అగ్నిరూపుడై పంచశరములవానిని/మన్మథుని యజ్ఞపురుషునకు హవిస్సుగా అర్పించునాడు.అంటే కాముని దహించివేసినాడు.
రెండవది తన మూడవకన్నును కామప్రకోపితమైన అమ్మవారి వక్షస్థలమును వస్త్రము చేసి తన మనసును కుంచె చేసి తానొక అసమాన శిల్పియై మకరికాపత్ర రచనను చేసినాడు.
అట్టి విరుద్ధస్వభావములు కల స్వామి త్రిలోచనునిపై
నా మనసు లగ్నమై యుండునుగాక అనునది శ్లోక భావము.
సాధకుని దృష్టిలో కాముని దహించినది-కామిని కుచములను సింగారించినది ఒకేఒక లోకాతీత శక్తి.
దానికి ఇంద్రియ లౌల్యము లేదు.సమ్హారము అను పేర అది జీవుని సంస్కరించి తిరిగి పంచకృత్యములను ప్రారంభించినది.
నిజమునకు మన్మథుడు చావలేదు.అహమును తొలగించుకుని,అనంగుడై తన కర్తవ్యమును నెరవేర్చుచున్నాడు.
స్వామి తన త్రిలోచనము ద్వారా జీవుల జ్ఞాననేత్రమును చైతన్యవంతము చేయుచున్నాడు.
రెండవ శ్లోకములో స్వామి లలాటనేత్రము ఎర్రని గుడ్డవలె అలంకరింపబడి ప్రకాశించినది.
ఆరవ శ్లోకములో అదే త్రినేత్రము యజ్ఞవేదికగా మారి మన్మథుని దహించివేసినది.
ప్రస్తుత శ్లోకములో మన్మథుని సంస్కరించి స్థితికార్య నిర్వహణకై స్వామిచే అమ్మ వక్షస్థలముపై మకరికాపత్రరచనను చేయించినది.
అదే విధముగా ప్రకృతి-పురుష సంకేతములుగా ధరణిధరేండ్ర నందిని పర్వతరాజపుత్రి మాతృస్థానములైన తన శరీరభాగములను చిత్రలేఖనమునకు అనుగుణమైన వస్త్రముగా మాఎర్చినది.స్వామి వానిలో సూర్-చంద్ర శక్తులను నిక్షిప్త పరచి సృష్టి కొనసాగుటకు కావలిసిన పోషకత్వమును చిత్రిస్తున్నాడు.
ధనంజయుడై మన్మథుని త్రాగినవాడు-ధరణిధరనందినిని అలంకరించినవాడు విశ్వ శిల్పిగా కీర్తింపబడుచున్న పరమాత్మయే.
అట్టి విలక్షణమైన విచక్షణను కలిగించు వివేకమే నాలో దాగిన మూడవ కన్నై నా మనములో ఎప్పుడు నా మనసును నడిపించును గాక.
ఏక బిల్వం శివార్పణం.